Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మీద కోపాన్ని వెళ్ళగక్కబోయి రాజ్యాంగాన్న్నే మార్చాలంటూ వ్యాఖ్యలు చేసారు. వీటిని ఉపయోగించుకుని బీజేపీ నేతలు చేస్తున్న హడావిడి చూస్తుంటే ''దొంగే దొంగా దొంగా...'' అని అరచినట్టుంది. నిజానికి రాజ్యాంగాన్ని మార్చాలనీ, అంబేద్కర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనీ అనుకుంటున్నది బీజేపీయే. మొన్నటికి మొన్న బీజేపీ పార్లమెంటు సభ్యులు కె.జె. అల్ఫాన్స్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ప్రయివేటు బిల్లు పెట్టిన సంగతి దేశం మర్చిపోలేదు. అంతకు ముందు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇలాంటి ప్రస్తావనే తెచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఏకంగా కమిషన్ వేసిన సంగతీ అందరికి తెలిసిందే. మరి ఇవన్నీ తెలిసి కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రసంగానికి ఢిల్లీలో ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న నిరసన ప్రదర్శనలకు అర్థమేమిటి? అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపకూడదంటున్న దెవరు? దానిని కూడా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారే...! ఇవన్నీ రాజ్యాంగం పట్ల గౌరవమున్నవారు చేయదగినవేనా?
రాజ్యాంగాన్ని గౌరవించడమంటే దాని పీఠికలోని ''న్యాయం, స్వేచ్చ, సమానత్వ, సౌభ్రాతృత్వం (జీబర్ఱషవ శ్రీఱbవత్ీy వనబaశ్రీఱ్y aఅస టతీa్వతీఅఱ్y)'' అన్న వాటిని కాపాడటం. ఈరోజు జస్టిస్ అనేది ఒక పార్లమెంటు రాజ్యసభ పదవికి లొంగిపోతోంది. స్వేచ్ఛ కొందరికే పరిమితం అవుతోంది. ఒక మాట సోషల్ మీడియాలో ప్రస్తావించినా, తనకు నచ్చినది తిన్నా, మెచ్చినది కట్టుకున్నా, నచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకున్నా ప్రజలు ప్రాణ భయంతో భయభ్రాంతులకు గురై బెయిలు కూడా దొరకని దేశ ద్రోహ చట్టాల కింద జైలు గోడల మధ్య మగ్గి పోవాల్సి వస్తోంది. ఇక ఈక్వాలిటీ... అనగా సమానత్వం.... మెజారిటీ మతానికి చెందిన పెద్దలు ''మైనారిటీ మతస్థులను నరకండి చంపండి'' అంటుంటే ఒక సాధారణ నేరం కింద కూడా పరిగణించడం లేదు. కొత్తగా ఏర్పడిన భారతదేశంలో అత్యంత త్వరితంగా సమానత్వాన్ని సాధించాలని పెట్టుకున్న లక్ష్యాలు నేడు పూర్తిగా తలకిందులవు తున్నాయి. ఇప్పటికీ ఒక్క శాతం ప్రజల దగ్గర 22 శాతం దేశ సంపద ఉందని, 10 శాతం ప్రజల దగ్గర 55శాతం సంపద ఉందని ప్రభుత్వ ప్రయివేటు రిపోర్టులు వెలువడుతుంటే దీనిని పాలకవర్గం పట్టించుకుంటున్నదే లేదు. ఇక సౌభాతృత్వం ఎలా ఉంది? ఇరుగు పొరుగున పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సత్సంబంధాలు దారుణంగా పడిపోయాయి. సౌభ్రాతృత్వం అంటే ప్రతిపక్ష పార్టీల తోనూ కలిసి మెలిసి మెలగాలి. కానీ ప్రతిరోజూ ఒకరిపై మరొకరు కక్షపూరితంగా మెలగుతుంటే సౌభ్రాతృత్వం ఎలా ఏర్పడుతుంది. కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే ఆగ్రహావేశాలు రోజూ శత్రుత్వాన్ని నూరిపోసు కుంటూ కత్తులు దూసుకుంటుంటే వారించడానికి ఒక్క మాటైనా పెద్దలు పలకరు. ఒకవైపు ఇలాంటి పోకడలకు పదునుపెడుతూ మరొకవైపు రాజ్యాంగ పరిరక్షణ అనటం అర్థరహితం. ఈ రాజ్యాంగాన్ని సరైనవారి చేతిలో పెట్టకుంటే మహా ప్రమాదని చెప్పిన డా. అంబేద్కర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యమవుతున్నాయి.
బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా ప్రాణత్యాగాలు చేసిన భారత వీర జవానుల స్మృత్యర్థం అమర జవాన్ జ్యోతిని నిర్మించారు. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్‌లో మిళితం చేశారు. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సంబంధించిన హలోగ్రామ్ ఆవిష్కరించారు. కానీ ఈ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకర మైనవి. బ్రహ్మ కుమారీల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ''ఈ దేశం వెనుకబడటానికి కారణం పౌరులకు ఇచ్చిన హక్కులే'' అన్నారు. ఆంగ్లేయుల పాలనలో కరువైనవి ప్రజల హక్కులే. బానిస బతుకుల నుండి విముక్తి గావించి ప్రజలకు హక్కులు కల్పించాలనేది స్వాతంత్ర సంగ్రామ లక్ష్యం. అలాంటి హక్కులు పోరాడి సాధించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ హక్కులు ఉండరాదు అంటూ మాట్లాడుతున్నారు. నాడు ఆంగ్లేయులు, నేడు నరేంద్ర మోడీల ఈ ఏకపక్ష అణచివేత ధోరణికి ఏమిటి ఈ సారూప్యత? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మోడీ ఎప్పుడూ ప్రధాన మంత్రిగా కాకుండా ఒక పార్టీ ప్రతినిధిగానే ప్రసంగించినట్టు ఉంటుంది. కాంగ్రెస్ పాలనలో కన్నా ప్రస్తుతం సాగుతున్న పాలనలోనే రాజ్యాంగ విలువలను ఒక్కొక్కటిగా సమూలంగా చెరిపేస్తూ గతం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నారు. అనవసరపు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చి దేశంలో 700మందికి పైగా మరణాలకు కారకులైంది ఎవరు? రైతులా లేక నల్ల చట్టాలను తెచ్చి సంవత్సరం తర్వాత రద్దు చేసుకున్న ప్రభుత్వమా? దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాల సమాఖ్యకు విరుద్ధంగా రాష్ట్రాల అనుమతి గాని లేదా సంప్రదింపులు గాని లేకుండా ఏకపక్షంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది కేంద్రం. విద్యుత్ సవరణలు, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఏకపక్షంగా తీసుకువచ్చి బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది అమలు జరుపుతున్నారు. ఈ దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇ.డి) సి.బి.ఐ, ఎలక్షన్ కమిషన్ వంటివన్నీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలయ్యాయనడంలో నిజం లేదా? ఎంతో కష్టపడి సాధించుకున్న సమాచార హక్కు చట్టానికి ఏకపక్ష సవరణలు చేసి నీరుగార్చారు. దేశంలో ఉన్న అన్ని రకాల చిన్న చిన్న ఓడరేవులన్నిటిని కూడా కేంద్రం పరిధిలోకి తీసుకున్నారు. తాజాగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో కూడా రాష్ట్రాలకు ఏమాత్రం హక్కులు లేకుండాచేసి ఐఏఎస్ అధికారులను, అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకోజూ స్తున్నారు. ఇదా గణతంత్ర రాజ్యంలో సమాఖ్య ప్రభుత్వానికి ఉండవలసిన లక్షణం?
ఇతరులను విమర్శించే ముందు బీజేపీ పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఈ కాలంలో సమాఖ్య స్ఫూర్తి తీవ్రంగా దెబ్బ తిన్నది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ అంశాన్ని నిర్వహాకులు ప్రస్తావిస్తూ ''భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల్లో కొన్ని తేడాలు మాత్రమే కాదు, అంతర్ రాష్ట్రాల మధ్య కూడా విపరీతమైన బేధాభిప్రాయాలు ఏర్పడు తున్నాయి, అందువల్ల ఒక రాష్ట్ర వ్యవహారాలు ఇతర రాష్ట్రాల రాజకీయ దృక్పధాల వల్ల దెబ్బతింటున్నాయి'' అని వ్యాఖ్యానించారు. ఈ కాలంలోనే మతపరమైన విద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒక మతానికి సంబంధించిన ధర్మ సంసద్ పెద్దలు వేరే మతాన్ని అంతమొందించండి అని పిలుపు నిస్తున్నారంటే ఇది ఎంత ముదిరిపోయిందో చూడండి. తెలియకుండానే ప్రతి మెదడులోకి మెజారిటీ మత వాదాన్ని చొప్పిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం మెజారిటీ మత వాదాన్ని ఎక్కుపెట్టిన చోటే మెజారిటీ మతంలోని కుల రక్కసి బయటపడి, విభిన్న కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఒక కులంపై మరో కులం నెరపిన ఆధిపత్య భావజాలం అంతా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు బహిర్గత మవుతున్నది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భం గా ఇది మరోసారి స్పష్టమైంది. అందుకే, పరస్పర సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఆధిపత్య భావజాలమున్నదేదీ సుపరిపాలన కాజాలదు. అలాంటి దానికి మన రాజ్యాంగంలో తావు లేదు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు రాజ్యాంగ రక్షణ పేరిట జరగుతున్నవన్నీ రాజకీయ లబ్దికోసం జరుగుతున్న ప్రవాసనాలే... ప్రజలను వంచించే ప్రయత్నాలే...
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016