Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతటి దయనీయ స్థితిలో ఉండడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. నిరుద్యోగం ఎంత ఘోరంగా ఉందంటే బీహార్‌లో, యూపీలో ఉద్యోగాల కోసం అల్లర్లు జరిగాయి. సంపదలో, ఆదాయాల్లో అసమానతలైతే ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి, లాక్డౌన్ల కారణంగా పదుల లక్షలమంది కొత్తగా పేదరికంలోకి నెట్టబడ్డారు. నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోడానికి, అదే సమయంలో పేదలకు ఊరట కల్పించడానికి, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడానికి తోడ్పడే వ్యూహం ఇప్పుడు తక్షణం అవసరం. 2022-23 సంవత్సరపు బడ్జెట్ అటువంటి వ్యూహాన్నే ప్రతిపాదించి ఉండాలి. కానీ, ఆవిధంగా చేయలేదు సరికదా, ఆర్థిక వ్యవస్థలో అటువంటి సమస్యలు ఉన్నాయన్న సంగతిని కూడా బడ్జెట్ గుర్తించలేదు.
2022-23 బడ్జెట్లో మొత్తం ప్రభుత్వ వ్యయం రూ.39.45 లక్షల కోట్లుగా చూపించారు. 2021-22 సంవత్సరానికి సవరించిన అంచనాల కన్నా ఇది కేవలం 4.6శాతం మాత్రమే ఎక్కువ. ఇది ప్రస్తుత ద్రవ్యోల్బణపు రేటు కన్నా తక్కువ. దానర్థం వాస్తవ విలువ ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ వ్యయం గతేడాది కన్నా తగ్గుతుంది. అందుచేత గతేడాది వాస్తవ జీడీపీ వృద్ధి రేటు కన్నా ఈ ఏడాది తగ్గుతుంది. ఆర్థిక సర్వే అంచనా వేసిన 8శాతం- 8.5శాతం కన్నా తక్కువగానే ఉండబో తున్నది. ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని ప్రేరేపించడంలో ప్రభుత్వ వ్యయానికి ఉండే పాత్ర ఎటువంటిదో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. పైగా, ప్రభుత్వ వ్యయం గనుక పెరిగితే, దాని వలన ఆర్థిక వ్యవస్థ మరింత నీరుగారి పోతుందన్నట్టు అనుకుం టోంది. ఈ బడ్టెట్‌లో ప్రభుత్వ పెట్టుబడి వ్యయం 35శాతం పెరగనుంది. అయితే మొత్తం దేశంలో డిమాండ్ పెరగాలంటే కేవలం పెట్టుబడి వ్యయం మాత్రం పెరిగితే చాలదు. మొత్తంగానే, అన్ని రంగాలలోనూ ప్రభుత్వ వ్యయం పెరగాలి.
డిమాండ్‌ను పెంచడానికి అవసరమైన చర్యలను వేటినీ చేపట్టకపోవడమే గాక, ఈ బడ్జెట్ శ్రామిక ప్రజలకు ఊరట కలిగించే చర్యలను కూడా చేపట్టలేదు. వాస్తవానికి పేదలకు లబ్ధి కలిగించే వివిధ పథకాలకు కేటాయింపులు చూస్తే 2021-22 సవరించిన అంచనాల కన్నా వాటిలో కోతలు పడ్డాయి. 2021-22 సవరించిన అంచనాల ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.98,000 కోట్లు, 2020-21 సంవత్సరానికి రూ.1,10,000 కోట్లు వెచ్చిస్తే ఈ ఏడాది కేవలం రూ.73,000 కోట్లు మాత్రమే కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులతో ఈ పథకానికి నిమిత్తం లేదని, ఈ ఏడాది ఎంతమంది పని కావాలని కోరితే అందరికీ పనులు కల్పిస్తారని సర్దిచెప్తున్నారు. అది నిజమే కావచ్చు. కాని బడ్జెట్లో కేటాయింపులు చేయకపోతే, చేసిన పనులకు వేతనాలు చెల్లించడం ఆలస్యం అవుతుంది. అందువల్ల ఆ పనులు కావాలని కోరేవారి సంఖ్య తగ్గిపోతుంది. అదేమాదిరిగా ఆహార సబ్సిడీకి కూడా 2021-22 సవరించిన అంచనాలతో పోల్చితే 28శాతం తగ్గిపోయింది. ఎరువులపై ఇచ్చే సబ్సిడీలు 25శాతం, పెట్రోలియంపై 11శాతం తగ్గిపోయాయి. మధ్యాహ్న భోజన పథకానికి, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి కేటాయింపులలో ఎటువంటి పెరుగుదలా లేదు. అంటే వాస్తవ విలువ ప్రకారం కేటాయింపులు తగ్గిపోయాయి.
మరీ అన్యాయంగా కనిపించే విషయం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పద్దు కింద కేటాయింపులు గతేడాది ఎంత ఉండినాయో, ఈ ఏడాదీ అంతే కేటాయించారు. అంటే వాస్తవ విలువల ప్రకారం తగ్గిపోయింది. ఒక మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయింపులు వాస్తవ విలువల ప్రకారం చూసుకున్నప్పుడు తగ్గిపోయాయి! నిజానికి ఇటువంటి సమయంలో ఈ రంగానికి కనీసం జీడీపీలో 3శాతం వరకూ కేటాయించాల్సి ఉంది.కాని ఇటువంటి విపత్కర సమయంలో కూడా ఆ విధంగా చేయలేదు. అంతే కాదు. జీడీపీతో పోల్చితే ఈ రంగానికి కేటాయింపుల శాతం గతేడాది కన్నా తగ్గిపోయింది! విద్యా రంగానికి కేటాయింపులు గతేడాది కన్నా 18.5శాతం అధికంగా పెంచామని చెపుతున్నారు. నిజమే. అయితే, అందులో అధిక భాగం డిజిటల్ చదువుల కోసం కేటాయించారు. అంతేకాక, జీడీపీతో పోల్చితే గతేడాది ఎంత శాతం విద్య కోసం కేటాయించారో, ఈ ఏడాదీ అంతే శాతం, అంటే 3.1శాతం మాత్రమే కేటాయించారు. సామాజిక సంక్షేమ రంగానికి కేటాయించినదానిలో భారీగా కోతలు పెట్టడమే గాక, రాష్ట్రాలకు కేటాయించే వనరులలోనూ కోతలు పెట్టారు. అంకెల్లో చూస్తే రాష్ట్రాలకు కేటాయింపుల్లో 9.6శాతం గతేడాది కన్నా పెరిగినట్టు ఉంటుంది. కాని, జీడీపీలో శాతంగా చూస్తే అది 6.25శాతంగా ఉంది. అదే గతేడాది మాత్రం 2021-22 సవరించిన అంచనాల ప్రకారం 6.95శాతం ఉంది. అంటే వాస్తవ విలువల ప్రకారం రాష్ట్రాలకు కేటాయింపులు తగ్గిపోయాయి.
బడ్జెట్లో ఈ కేటాయింపులు ఏదో యథాలాపంగా కేటాయించేవి కావు. ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్య వ్యూహం ప్రకారమే ఈ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ రోజు మనకు కనపడుతున్న ద్రవ్యోల్బణం, దానికి తోడైన మాంద్యం వెనుక ప్రధాన కారణం ఈ ద్రవ్య విధానమే. సంపన్నులకు పన్ను రాయితీలు ఇస్తే ఆ ప్రోత్సాహంతో వారు పెట్టుబడులు మరింత ఎక్కువగా పెట్టడానికి ముందుకు వస్తారన్న అంచనా ఇందులో ఉంది. అలా రాయితీలు ఇచ్చినందు వలన ప్రభుత్వం కోల్పోయే పన్ను రాబడిని పూడ్చుకోడానికి పరోక్ష పన్నులను, ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై పన్నులను పెంచడం ఆ వ్యూహంలో భాగమే. ఒకవేళ దానివలన ఆశించిన మేరకు పన్ను రాబడి రాకపోతే ఆ మేరకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తారు. అంటే ప్రజా సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తారు. మన ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా దాని దిశను రివర్స్ చేయాలంటే ఈ వ్యూహాన్ని మార్చాలి. కాని మోడీ ప్రభుత్వానికి తన వంకర వ్యూహపు పరిధిని దాటి ఆలోచించగలిగే సత్తా లేదు. ఓ పక్కన ఎన్ని పన్ను రాయితీలను సంపన్నులకు కల్పించినా, ప్రయివేటు పెట్టుబడి పెరగడంలేదు సరికదా, కుంగిపోతోంది. దానికి కారణం మార్కెట్లో నెలకొన్న మాంద్యం. అయినా మోడీ ప్రభుత్వం తన వ్యూహాన్ని అదే విధంగా ఈ బడ్జెట్లోనూ కొనసాగించింది. ఈ వంకర వ్యూహం పరిధిలో ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి గాని, ప్రజలకు ఏ విధమైన ఊరటా కల్పించడానికి గాని ఎటువంటి ఆస్కారమూ లేదు. మహా అయితే ఒక పద్దు నుంచి ఇంకో పద్దుకి కేటాయింపులు మార్చి తనకు అనుకూలంగా ప్రచారం చేసే మీడియా ద్వారా తామెంత ఉదారంగా వ్యవహరించామో సొల్లు వాగుడు వాగడానికి మాత్రం వీలవుతుంది. మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీ కొత్తగా కల్పించింది ఏమీ లేదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వీలుగా పరోక్ష పన్నులలో తగ్గించింది కూడా ఏమీ లేదు. పైగా సాంఘిక సంక్షేమ పథకాలపై చాలా కోతలు పెట్టారు. ప్రజల ఇక్కట్లు పెరిగినప్పటికీ ఈ విధంగా చేశారు. కొన్ని ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో కూడా ప్రభుత్వం ఈ విధంగా బడ్జెట్లో చేయగలిగిందంటే ఆ ఎన్నికల్లో మత చీలికలను ఉపయోగించుకుని ఎలాగైనా తాను గెలవగలనన్న ధీమాతో ఈ ప్రభుత్వం ఉందని మనకు అర్థం అవుతుంది.
పెరుగుతున్న దారిద్య్రాన్ని తగ్గించడానికి ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రయత్నమూ లేదు. అందువలన దారిద్య్రం మరింత పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. ప్రయివేటు వినిమయం తగ్గిపోతూ ఉంది. ఇప్పటికీ అది 2019-20 నాటి వినియోగ స్థాయి కన్నా తక్కువగానే ఉంది. వినిమయ వస్తువుల తయారీ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 2019-20 నాటి స్థాయిలోనే కొనసాగుతున్నా, వినిమయం తగ్గినందువలన ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం సాధ్యం కాదు. అందువలన స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం నిరుపయోగంగా ఉండిపోతుంది. అందువలన ఈ ఏడాది గత సంవత్సరంలో మాదిరిగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి పెట్టుబడులు వ్యయం చేయరు. అంటే గతేడాది స్థాయిలో కూడా ఈ ఏడాది పెట్టు బడులు ఉండవు. ఇంకా తగ్గుతాయి. అందువలన మాం ద్యం, నిరుద్యోగం మరింత తీవ్ర సమస్యలుగా పెరుగుతాయి.
బాహ్య పరిణామాల వలన ద్రవ్యోల్బణం సైతం పెరగనుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగనున్నాయి. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆ దేశంలో వడ్డీ రేట్లు పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడక్కడ వడ్డీ రేట్లు దాదాపు సున్నాగా ఉన్నాయి. అందకనే భారతదేశానికి విదేశాల నుండి ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. దానివలన మన విదేశీ వ్యాపారంలో చెల్లింపుల లోటు తలెత్తకుండా సర్దుబాటు చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు గనుక అమెరికాలో, ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ ద్రవ్య పెట్టుబడులు వెనక్కి పోయి, విదేశీ మారకద్రవ్యం లోటు ఏర్పడుతుంది. అప్పుడు విదేశీ వ్యాపారంలో చెల్లింపుల లోటు రావడమే గాక, రూపాయి విలువ కూడా పడిపోతుంది. దిగుమతుల కోసం చెల్లించవలసిన సొమ్ము రూపాయిలలో చూసినప్పుడు పెరిగిపోతుంది. అప్పుడు పెట్రో ధరలు మరింత పెరుగుతాయి. ఆ భారం వినియోగదారులపై పడుతుంది. దానివలన దేశీయంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది.
ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాని మోడీ ప్రభుత్వ దృష్టి లోపం కారణంగా వాటిని అది గుర్తించలేకపోతున్నది. ఇలా గుర్తించలేకపోవడం బట్టి రాబోయే కాలంలో మరింత ప్రమాదకర పరిణామాలు జరగనున్నాయని చెప్పవచ్చు. విదేశీ చెల్లింపుల లోటు చేయి దాటిపోయిన పరిస్థితి వస్తే, అప్పుడు మోడీ ప్రభుత్వం ఐఎంఎఫ్ దగ్గరికి పరిగెత్తి తనను ఆదుకోమని అర్థిస్తుంది. అప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చే ప్యాకేజీతోబాటు పొదుపు చర్యలు కూడా మరిన్ని వస్తాయి. భారతదేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిన తక్కిన మూడో ప్రపంచ దేశాల మాదిరిగా దిగజారుతుంది. ఇప్పటికే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా వ్యవహరించాలనే పేరుతో మనదేశం తన స్వయంప్రతిపత్తిని కొంత కోల్పోయింది. ఇప్పుడు దానికి ఐఎంఎఫ్ విషమ షరతులు కూడా తోడైతే ఆ కాస్త మిగిలిన స్వయంప్రతిపత్తి కూడా పూర్తిగా అంతరించిపోతుంది. అదే జరిగితే పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోడానికి గ్రీస్ ఒక ఉదాహరణ. అంతవరకూ రాకుండా మన దేశం ఇంతకాలమూ కాసుకోగలిగింది. కాని ఇప్పటి పరిస్థితుల్లో బొత్తిగా ఆర్థిక విషయాల అవగాహన లేని ప్రభుత్వం అధికారంలో ఉన్నందువలన మన దేశాన్ని కూడా ఆ దిశ వైపే నెట్టే ప్రమాదం ఉంది. బడ్జెట్లో ప్రస్తావించకుండా మౌనం వహించిన ఈ విషయాలు మన ప్రజలకేగాక, మొత్తం దేశానికే ప్రమాదకర సంకేతాలు.
-స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్