Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిరోజు ఉదయం పూట గ్రామీణ, పట్టణ ప్రయాణ ప్రాంగణాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థుల వీపులపై బియ్యం బస్తాల్లాంటి పుస్తకాల సంచులను చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగకమానదు. ముఖ్యంగా ప్రయివేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.పుస్తకాలు, గైడ్లు, నోట్ పుస్తకాలు, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా.. అన్నింటినీ బ్యాగు ద్వారా మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని దశాబ్దాల తరబడి వేధిస్తున్న ఈ సమస్యను తగ్గించాలంటూ ఎన్నో కమిటీలు సిఫార్సులు చేసాయి. న్యాయస్థానాలు సైతం పలుమార్లు తీర్పులు ఇచ్చాయి. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. విద్యా రంగంలో ప్రయివేటు సంస్థల ఆధిపత్యం పెరగడం, కార్పొరేట్ సంస్కృతి విస్తరించిన నేపథ్యంలో విద్యార్థుల పుస్తకాల సంఖ్య పెరుగుతూ బడి సంచి మోత పెనుభారమవుతుంది. విద్యార్థుల శారీరక మానసిక ఒత్తిడిని పెంచుతున్నది.
ఆదేశాల అమలు ఏది?
అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, ప్రాన్స్, నార్వే, వంటి దేశాల్లో బడి సంచుల బరువుపై నియంత్రణ ఎప్పటినుంచో అమలవుతున్నది. కానీ మనదేశంలో బడి సంచి బరువును తగ్గించాలంటూ ఎన్నో కమిటీలు కమిషన్లు సిఫార్సు చేసినా అమలు జరగడం లేదు. ఇప్పటివరకు ప్రతిపాదించిన మూడు జాతీయ విద్యా విధానాలు, 1964లో కొఠారి కమిషన్, 1991-92 లో యస్ పాల్ కమిటీ సైతం సంచుల బరువు తగ్గించాలని నొక్కి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 18న పుస్తకాల బరువు తగ్గించడం కోసం ఉత్తర్వు నెంబర్ 22 తీసుకువచ్చి తగిన మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ మార్గదర్శకాల అమలుపై విద్యాశాఖ తగిన శ్రద్ధ తీసుకోలేదు. మద్రాస్ హైకోర్టు తీర్పు, ఎన్సీఈఆర్టీ, సిబిఎస్ఈ తదితర విద్యాసంస్థల నిపుణులు సూచనలు చేసినా వాటిని అమలు పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. విద్యార్థి బరువులో పుస్తకాల బరువు 10శాతం మించకూడదని పరిశోధనలు చెపుతున్నా కొన్ని ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలలు బేఖాతర్ చేస్తున్నాయి. చాలా పాఠశాలల్లో తరగతులు పై అంతస్తులో ఉండడం, పుస్తకాల సంచులను విద్యార్థులు మోసుకెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. ప్రయివేటు పాఠశాలలు చెప్పే పుస్తకాల సంఖ్య అధికంగా ఉండటం, మధ్యాహ్న భోజనం లేకపోవడం వల్ల లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అదనపు భారంగా మారుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సిసిఈ) విద్యావిధానం ప్రస్తుతం అమలవుతున్నది. మరుసటి విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన జరగనున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్టుల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠ్యాంశాలు ఒకే పుస్తకంలో ఉండేవిధంగా ముద్రించమని విద్యాశాఖ ముద్రణ యంత్రాల సంస్థలకు సిఫార్సు చేసింది. దీనివల్ల భవిష్యత్తులో పుస్తకాల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీ-2020 పేరిట కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రీ ప్రైమరీకి అసలు పుస్తకాలు ఉండకూడదు. అలాగే పిల్లల సగటు బరువు ఆధారంగా పుస్తకాల బరువును శాస్త్రీయంగా నిర్ధారించాలి. తరగతుల్లో విద్యార్థుల మానసిక స్థితిని బట్టి పుస్తకాల సంఖ్య లెక్క కట్టాలని చెప్పింది. కానీ మార్గదర్శకాల అమలు లేక స్కూల్ బ్యాగులను మోయడం వల్ల పిల్లలకు చిన్నతనం నుండే వెన్ను నొప్పి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ బరువులు మోయడం వల్ల నడుము, మోకాళ్ళ పై తీవ్ర ప్రభావం పడుతున్నది.
బడి సంచి బరువు తగ్గాలి...
బడి సంచి బరువు తగ్గుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలను, యశ్పాల్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి. ప్రయివేటు పాఠశాలలో విద్యార్థులకు శుద్ధజలం అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఇంటి నుండి వాటర్ బాటిల్ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ప్రాథమిక తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటిపని ఇవ్వకుండా చేయాలి. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన నాలుగు పుస్తకాలు మాత్రమే వినియోగించాలి. నెలలో ఒక శనివారం ''నో బ్యాగ్ డే''ను అమలు పరచాలి. పుస్తకాల బరువు విద్యార్థుల బరువులో 10శాతానికి మించకుండా విద్యాశాఖ తగిన పర్యవేక్షణ చేయాలి. ఏ తరగతిలోకి ఎన్ని పుస్తకాలు ఉండాలో వాటి బరువు ఎంత ఉండాలో సూచనలు చేసిన స్కూల్ బ్యాగ్ పాలసీ-2020 మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు పరచాలి. ప్రయివేటు పాఠశాలలో పుస్తకాల బ్యాగులో గైడ్లు, టెస్ట్ పేపర్లు, ప్రాజెక్ట్ పుస్తకాలు ఉండకుండా పాఠ్య బోధన జరిగే విధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయాలి.
- అంకం నరేష్
సెల్: 6301650324