Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజల ప్రాధాన్యతలను విస్మరించి, కార్పొరేట్లకు, సంస్కరణల కొనసాగింపుకు పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో అనేక అంశాలు, కేటాయింపులు బడ్జెట్ ప్రసంగానికి, ప్రభుత్వ ప్రకటిత కార్యాచరణకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు. మొత్తం బడ్జెట్ వ్యయ అంచనా 39,44,909కోట్లు. రెవెన్యూ వసూళ్ల అంచనా 22,04,422కోట్లు. రెవెన్యూ వ్యయం అంచనా 31,94,663 కోట్లు. మూలధనం వసూళ్ళు అంచనా 17,40,487 కోట్లు. మూలధనం వ్యయం అంచనా 7,50,246 కోట్లు. ద్రవ్య లోటు 6.4శాతంగా అంటే 16,61,196 కోట్లుగా ప్రకటించింది. జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరానికి 8-8.5శాతానికి ఉంటుందని, ద్రవ్యోల్బణం 2.6శాతంగా ఉంటుందని పేర్కొంది.
పైన విశదీకరించిన అంశాలు బడ్జెట్ స్వరూపాన్ని బహిర్గతపరిచేందుకు పరిమితమైనవి తప్ప, విశాల ప్రజానీకం యొక్క అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపయుక్తంగా లేవు. విస్తృత పరిమాణం కలిగిన కేంద్ర ప్రభుత్వ ప్రకటిత బడ్జెట్లోని గణాంకాల విశ్లేషణ కన్నా, ప్రజల ప్రాధాన్యతలకు సంబంధించిన కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే ఈ అంశం సుస్పష్టమవుతుంది.
దేశ ఆర్థికవృద్ధిని ప్రధాన మంత్రి 'గతిశక్తి' మాస్టర్ ప్లాన్ సమూలంగా మారుస్తుందని ప్రకటించారు. ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ఏడు చోదక శక్తులను ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. రహదారులు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జల మార్గాలు, రవాణా మౌలిక సదుపాయాలు వీటిలో ముఖ్యమైనవని పేర్కొన్నారు. కానీ బడ్జెట్ ప్రకటన కన్నా ముందే, 'నేషనల్ ఎసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్' పథకం పేరుతో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల కోట్లు సమీకరించటానికి, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను లీజు రూపంలో కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిం చటం బడ్జెట్ ప్రతిపాదనకి విరుద్ధమైన అంశంగా పరిగణించాలి.
దేశంలో యువత ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య నిరుద్యోగం. నిరుద్యోగిత తారాస్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు నిర్థిష్టమైన ప్రణాళికను బడ్జెట్లో రూపొందించలేదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన కోటి ఉద్యోగాల హామీ గురించి సమీక్షించక పోగా, వచ్చే ఐదేండ్లలో 60లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దిశా, నిర్దేశంలేని హామీ ఇవ్వటం హాస్యాస్పదం. 'మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం' క్రింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిధులలో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 73వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. కరోనా కారణంగా వృత్తులు, ఉపాధులు సన్నగిల్లి, గ్రామీణ ఉపాధి దెబ్బతిన్న నేపథ్యంలో మరిన్ని నిధులను కేటాయించాల్సిందిపోయి, గత బడ్జెట్ కన్నా 25 వేల కోట్ల రూపాయిలు తగ్గించటం గమనార్హం. 8శాతం నిరుద్యోగిత కొనసాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో కూడా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, నేషనల్ సాంపిల్ సర్వే ఆఫీసు, నిటి అయోగ్ వంటి సంస్థలు పెరుగుతున్న నిరుద్యోగిత గురించి విశ్లేషించిన నివేదికల సారాంశాన్ని, పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను బడ్జెట్ విస్మరించింది. కరోనా కారణంగా ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణ స్థాయి క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో పన్నులలో కనీస వెసులుబాటు కల్పించకపోవడం, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం తప్ప ఆత్మనిర్భర్ నినాదంలో భాగం కాజాలదు. ప్రభుత్వ ఆదాయం పెద్ద ఎత్తునవృద్ధి చెందడానికి ప్రధాన కారణం తీవ్రమైన పన్ను వసూళ్ళే. మొత్తం పన్నుల రూపంలో ఆదాయం 64.9శాతం మేరకు, వ్యక్తిగత ఆదాయపు పన్ను 47.2శాతం మేరకు, జీఎస్టీ వసూళ్ళు 61.4శాతంకు పెరిగాయి. అయినప్పటికీ వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబులో ఎలాంటి మార్పు ప్రకటించకుండా వేతన జీవులకు ఈ బడ్జెట్ మరోసారి నిరాశను మిగిల్చింది. అనేక నిత్యావసర, అత్యవసర వస్తూత్పత్తుల మీద, సర్వీసుల మీద జీఎస్టీ భారాన్ని తగ్గించాలన్న డిమాండును పరిగణనలోనికి తీసుకోలేదు. మరోవైపు కార్పొరేట్ ట్యాక్సును మాత్రం 12శాతం నుంచి 7శాతానికి తగ్గించారు.
కేంద్ర బడ్జెట్ మొత్తం నిధులలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు గతంలో 3.97శాతం కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో దానిని 3.51శాతానికి తగ్గించారు. 'ఆత్మ నిర్భర్ భారత్' క్రింద వ్యవసాయానికి లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కనీస ప్రయత్నం కానరాలేదు. ఇటీవలే దేశంలో అతిపెద్ద రైతాంగ ఉద్యమం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వందలాది రైతు సంఘాలు లేవనెత్తిన అనేక కీలక డిమాండ్లకు సంబంధించి రేఖామాత్ర ప్రస్తావన కూడా బడ్జెట్లో లేకపోవడం ఉద్దేశపూర్వకమే. కనీస మద్దతు ధర అందించటానికి నిధులు కేటాయించక పోగా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గత బడ్జెట్లలో ఇచ్చిన హామీని మరిచి, ప్రస్తుతం అమలులో ఉన్న పలు వ్యవసాయ అభివృద్ధి పథకాల బడ్జెట్లో కూడా కోత విధించారు.
సంస్కరణలు ఆదాయ అంతరాలను పెంచుతున్నాయని, సంపద కేంద్రీకరణకు దారి తీస్తున్నాయని, ప్రభుత్వాలు పేదరికంలోకి నెట్టబడి, ప్రయివేటు వ్యక్తులు సంపన్నులవుతున్నారని అనేక అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఎయిరిండియా వ్యూహాత్మక అమ్మకపు ప్రక్రియ టాటా గ్రూపు యాజమాన్యానికి బదిలీ చేయడం ద్వారా ముగిసిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 65వేల కోట్లుగా నిర్దేశించామని, ఎల్ఐసీలో ఐపిఓ ప్రక్రియను త్వరలోనే చేపడతామని, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను అమ్మడానికి వ్యూహాత్మక భాగస్వామిని ఎంపిక చేసామనే బడ్జెట్ ప్రకటనలు, సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల వాటాలను, ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే కార్యాచరణకు కొనసాగింపే.
ప్రజల కొనుగోలు శక్తి పేంచే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం, దీనికి భిన్నంగా ఎరువుల రాయితీలో 25శాతం, ఆహార సబ్సిడీలో 28శాతం, పెట్రోలియం సబ్సిడీలో 11శాతం కోతలు విధించి తద్వారా ప్రజలపై మరింత భారం మోపింది. టోకు ధరల సూచీ ప్రకారం ప్రైస్ ఇండెక్స్ 13.56శాతం, వినిమయ ధరల సూచీ ప్రకారం 5.6 ఉన్న ద్రవ్యోల్బణం స్థాయిని భవిష్యత్తులో 2.6స్థాయికి కట్టడిచేయడం ఆచరణ సాధ్యంకాని అంశం. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారాలు తగ్గించడానికి, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి కనీస ప్రత్యామ్నాయాలకు కూడా బడ్జెట్లో స్థానమేలేదు.
పేదల పలుకే లేకుండా, మధ్యతరగతి మాటే రాకుండా, రాబోయే 25 సంవత్సరాలకు జరిగే ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొనటం, వర్తమానాన్ని విస్మరించి భవిష్యత్‌ను ఊహించటమే. మానవ వనరులను, మేథను విస్తారంగా వినియోగించుకునే విధానానికి వీడ్కోలు పలికి, అన్ని రంగాలలో డిజిటల్ వినియోగమే కేంద్ర బిందువుగా డిజిటల్ భవిష్యత్తును ఆవిష్కరించటం ఆచరణలో ఎంత మేరకు సాధ్యమో వేచి చూడాలి.
దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబరాలను జరుపుకుంటున్న ఈ 'అమృత్ మహౌత్సవం' నుంచి 'అమృత కాలం'లోకి అడుగుపెడుతున్న భారత్‌ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ తొలి అడుగు అన్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా, దేశంలో స్వాతంత్య్రానంతరం పెద్ద ఎత్తున జరిగిన రైతాంగ పోరాటం ఒక ప్రక్క, కోట్లాదిమంది కార్మికులు సమ్మెలకు సిద్ధమవుతున్న పరిస్థితులు మరోప్రక్క చూసినప్పుడు ఈ ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదన్న సంగతి అర్థంమవుతుంది. ఈ ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయాల అవసరం కనిపిస్తుంది. భారమవుతున్న ప్రభుత్వ విధానాలకి ప్రత్యామ్నాయం కోసంగానే భావించాలి.
- జి. కిషోర్ కుమార్
సెల్:9440905501