Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పాలనలో పాలకులు కాని, ప్రజలు కాని వినాయక్ దామోదర్ సావర్కర్ పేరు ఉచ్చరించటానికే సంకోచించేవారు. సంఫ్‌ుపరివార్ సభ్యులు కూడా సావర్కర్ పేరెత్తడానికి భయపడేవారు. రహస్యంగా ప్రస్తావించు కునేవారు. ఆ కాలంలో లతా మంగేశ్కర్ సావర్కర్‌ను నిర్భయంగా సన్మానించారు. ఆయన తనకు పితృసమానుడని, ఆదర్శమూర్తి అని పొగిడారు. బహిరంగంగా సావర్కర్ చర్యలను సమర్థించారు. సావర్కర్‌ను విరోధించినవారిని గేళి చేశారు. తమ కుటుంబం, సావర్కర్ కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయని చాలా సార్లు చెప్పారు. సావర్కర్ ఆత్మగౌరవం కలవాడు, దేశభక్తుడని పలుమార్లు ప్రశంసించారు. లత తండ్రి దీనానాథ్ నాటకాల కంపెనీకి సావర్కర్ అనేక నాటకాలు, పాటలు రాసిచ్చేవారు.
సావర్కర్ 1915లో హిందువాద సాంస్కృతిక వేదిక హిందు మహాసభను స్థాపించారు. అది 1933లో రాజకీయ పార్టీగా అవతరించింది. 1925లో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు వ్యవస్థాపక సభ్యులయ్యారు. ఇవి తప్పుకాదు. కాని సావర్కర్ 1937లో ద్విజాతి (రెండు దేశాల) సిద్ధాంతం ప్రతిపాదించారు. దేశవిభజనతో ముస్లింలందరూ కొత్త దేశంలోకి వెళతారని, మిగిలిన హిందువులతో దేశం దానంతటదే హిందూదేశంగా మారుతుందని సంఫ్‌ుపరివార్ నాయకుల ఆశ. 1940లో మహమ్మద్ ఆలీ జిన్నా ఆ సిద్ధాంతాన్ని సమర్థించారు. ఆ తీర్మానాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. గాంధీ ఆ సమావేశాన్నే బహిష్కరించారు. సావర్కర్, సంఫ్‌ు ప్రధాన కార్యదర్శి మాధవ్ సదాశివ్ గోల్వాలకర్తో కలిసి సంఫ్‌ు సభ్యుల మనసుల్లో గాంధీ పట్ల విషం నింపారు. దేశ విభజన హింసలో ఆయన ముస్లింలను సమర్థించారని అభాండం వేశారు. హిందువులు అధికంగా ఉన్న చోట్ల ముస్లింల హత్య జరిగింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో హిందువులను చంపారు. గాంధీ ఈ హింసకు బాధపడి స్వాతంత్య్ర వేడుకల్లో కూడా పాల్గొనలేదు. ఢిల్లీకి దూరంగా దేశ సరిహద్దు బెంగాల్ ప్రాంతాల్లో బాధితులను ఓదార్చుతూ ఉన్నారు. సావర్కర్ గాంధీని చంపడానికి రామచంద్ర (నథురామ్) గాడ్సే, నారాయణ ఆప్టే, దిగంబర్ బడ్గె ఇంకా అనేకు లకు శిక్షణ ఇచ్చారు. ఆయుధాల సేకరణలో సహకరించారు. గాడ్సే బృందం గాంధీ హత్యకు ఐదుసార్లు విఫల యత్నం చేసింది. 6వ సారి 30.1.1948న క్రూరంగా, మోసంగా గాంధీని చంపారు. ఇట్టి సావర్కర్‌ను లత తన తండ్రిగా పరిగణించారు.
లతా మంగేష్కర్ నిస్సంకోచంగా ప్రపంచస్థాయి మధుర గాయని. ప్రపంచంలో ఏ కళ అయినా శ్రామికులచే శ్రమలో భాగంగా సృష్టించ బడుతుంది. పాడటంలో ముందుకాలపు కళాకారుల శ్రమతో సృష్టించబడ్డ శబ్ద వ్యవస్థ, సంగీత వాయిద్యాలు, తోటి కళాకారులు, సాహిత్యకారులు ప్రధాన పాత్ర పోషిస్తారు. అట్టి కళల ఫలితం శ్రామికవర్గానికి, సమాజానికి చెందాలి. లత విషయంలో అలా జరిగినట్లు రుజువు లేదు. సామాజిక ఫలితాలు అధికంగా ఆమెకే దక్కాయి. వృత్తి అసూయ ఆమె సొంతం. గాయక కళలో ఆమె పోటీతత్వాన్ని ప్రదర్శించారు. వర్ధమాన గాయనీమణుల అవకాశాలను దెబ్బతీశారు. వారిలో సొంత చెల్లెలు ఆశా భోస్లే, దక్షిణ భారత గాయని వాణి జయరాం వంటివారు ఎందరో ఉన్నారు. జన్మత బ్రాహ్మణి అయిన లత హిందూధర్మం, హిందూమతం తనకు శిరోధార్యం అనేవారు. ఆమె తండ్రి దీనానాథ్ మరాఠీ. తల్లి శేవంతి గుజరాతి. తాత గణేశ్ భట్ హర్దీకర్ గోవాలో మంగేషి పట్టణంలో మంగేష్ ఆలయ పూజారి. వారి ఇంటి పేరు ఈ గుడి పేరుతోనే మంగేష్కర్‌గా మారింది. ఆమె తాత (అమ్మ నాన్న) పెద్ద గుజరాతి వ్యాపారి, భూస్వామి. లత వృత్తిలో మతవ్యత్యాసాలు పాటించారని వాదనలున్నాయి. మహమ్మద్ రఫీతో యుగళ గీతాలు పాడటానికి ఎక్కువ డబ్బు వసూలు చేయటం ఇందుకు రుజువు. దీంతో రఫీ అవకాశాలు తగ్గిపోయేవి. లతకు అహంకారం ఎక్కువని అంటారు. అభిమానుల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడావ్యాపారి టెండూల్కర్‌ను భారతరత్నను చేసింది. అదే ప్రయోజనం ఆశించి వాజపేయి బీజేపీ ప్రభుత్వం లతకు భారతరత్నను ఇచ్చింది. ఆ బీజేపీ లతను రాజ్యసభకూ నియమించింది. ఆమె వాజపేయి, ఆడ్వాణీ లకు కృతజ్ఞతలు తెలిపారు. కాని లత సరిగ్గా పార్లమెంటుకు హాజరు అయ్యేవారుకారు. రాజకీయ విధులను ఆశ్రద్ధ చేసేవారు.
లత 2001లో తండ్రి పేరుతో స్థాపించిన సంస్థ తరఫున ఆరుఎకరాల స్థలంలో పూణే ప్రధాన ప్రాంతం ఎరంద్వనెలో 900 మంచాల ఆసుపత్రిని స్థాపించారు. దీని నిర్మాణానికి దేశమంతా పాట కచేరీలు నిర్వహించి డబ్బు సంపాదించారు. పేదలకు, ఆర్థిక స్తోమత లేని వారికి ఉచిత చికిత్స అందించాలన్న షరతుతో మహారాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇచ్చింది. అయితే ఆస్పత్రి రూ.20 సంప్రదింపు రుసుంకు బదులు రూ.600 వసూలు చేస్తోంది. దాతృత్వ ధరలకు వైద్యసేవలను అందించనందుకు పూణే జిల్లా కలెక్టర్ ఈ ఆస్పత్రికి 11.3.2019న రూ.100 కోట్ల జరిమానా విధించారు. లత 2005లో స్వర్ణాంజలి పేరుతో వజ్రాల ఎగుమతి సంస్థను స్థాపించారు. దీని లాభాలలో కొంత సొమ్మును కశ్మీర్ హిందూ సమాజానికి దానం చేసేవారు.
1948-1974 మధ్యలో లత 25,000 పాటలు, మహమ్మద్ రఫీ 28,000 పాటలు పాడారు. తాను ఎక్కువ పాటలు పాడానని లత గిన్నీస్ రికార్డుకు నివేదించారు. రఫీ ఈ రికార్డును విభేదించారు. గిన్నీస్ సంస్థ, రఫీ చనిపోయిన తర్వాత, తన 1984 నివేదికలో లత, రఫీ ఇద్దరి పేర్లను నమోదు చేసింది. 1991 వరకు లత పాటల్లో అధిక సంఖ్యలోనున్న హిందీ పాటలు కేవలం 5,025. నేను పాడిన పాటల సంఖ్యను నమోదు చేయలేదని లత వివరణ ఇచ్చారు. 2011కు ఈ రికార్డు లత చెల్లెలు ఆశా పేరుకు మారింది. నేటి రికార్డు మన తెలుగు గాయని పి. సుశీల పేరుతో నమోదయింది.
దేశ ద్రోహులను దేశ భక్తులని కీర్తించేవారిలో లతా మంగేష్కర్ అగ్రభాగాన ఉన్నారు. ఎన్ని రంగాలలో ఎంత ప్రావీణ్యత ఉన్నా గాంధీ హంతకులను పొగడటం క్షమించరాని నేరం. నేటి పాలకులే ఆ కోవకు చెందినవారు. అందుకే లతకు మరణంలో కూడా చాలా మంది అర్హులకు లభించని గౌరవమర్యాదలు లభించాయి. ఎన్ని లొసుగులున్నా లతా మంగేష్కర్ ప్రతిభను ప్రశంసిద్దాం. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిద్దాం. ప్రజల కష్టంతో తయారయిన కళాకారులు సమాజానికి, దేశానికి ప్రగతిశీలంగా ప్రయోజనం చేకూర్చాలని కోరుకుందాం.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545