Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడ్జెట్ అనగానే సహజంగా ప్రతి ఒక్కరికీ ఆశలుంటాయి. సమాజంలో అత్యంత వెనకబడ్డ ఆదివాసీ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే దేశంలో 750పైగా ఉన్న గిరిజన తెగల్లో వందకుపైగా తెగలు తమ మనుగడ సాగించలేక కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. గత రెండేండ్ల కరోనా కాలంలో గిరిజన తెగల జీవన విధానం చిన్నాభిన్నం అయ్యింది. ముఖ్యంగా పౌష్టికాహారలోపం, ఆహారధాన్యాల కొరత, ఉపాధి లేమి వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆకలి చావులు, దారిద్య్రం గతంలో ఎన్నడూలేని విధంగా పెరుగుతున్నాయి. ఆకలి చావుల పెరుగుదలపై స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. మరి వీటన్నిటి నుండి ఊరటనిచ్చే విధంగా 2022-23 బడ్జెట్ ఉన్నదా?
మొత్తం కేంద్ర బడ్జెట్ 39.44లక్షల కోట్లు. ఇందులో 31.94 లక్షల కోట్లు పథకాలకు వ్యయం చేసే రెవెన్యూ పద్దు కాగా మిగిలిన 7.50లక్షల కోట్లు జీతభత్యాల మూలధనం వ్యయం. దీని ప్రకారం రెవెన్యూ పద్దు 31.94 లక్షల కోట్ల నుండి గిరిజన జనాభా నిష్పత్తి 8.6శాతం ప్రకారం 102శాఖల్లో 3.71లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం 89,265 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కూడా 79,741 కోట్లే కేటాయించి అందులో 60శాతమే ఖర్చు చేసి మిగిలిన గిరిజన నిధులను ఇతర పథకాలకు దారి మళ్ళించారు.
గిరిజన సబ్‌ప్లాన్ మార్గదర్శకాల ప్రకారం గిరిజనులకు నేరుగా లబ్ది జరిగే వాటిలోనే ఖర్చు చేయాలి. జనరల్ పథకాలకు కేటాయించి వాటిని సబ్‌ప్లాన్ కింద చూపకూడదు. గతంలో కాంగ్రెస్ ఇలాగే చేసింది. బీజేపీ వాటిని విమర్శించి మేము అలా చేయమని హామీ ఇచ్చింది. కానీ గత 8ఏండ్ల కాలంలో కాంగ్రెస్ అనుసరించిన పద్ధతినే బీజేపీ కూడా అనుసరిస్తోంది. వేల కోట్ల గిరిజన సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్ళించింది. సబ్‌ప్లాన్ స్ఫూర్తినే దెబ్బతీసింది. ఈ ఏడాది గిరిజన సబ్‌ప్లాన్‌కు 102 శాఖల్లోను 89.26 వేల కోట్లను గిరిజనులకు ఉపయోగపడే కీలక శాఖలకు ఎలా కేటాయింపులు చేశారో పరిశీలిద్దాం. దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంలో ఆదివాసీ గిరిజన రైతాంగం 65శాతంగా ఉన్నారు. వీరందరూ సన్న, చిన్నకారు రైతులుగా ఉన్నారు. బ్యాంకుల ద్వారా సబ్సీడీతో రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటివి ఉచితంగా అందించి ప్రోత్సహించాల్సిన కేంద్రం ఈసారి పూర్తిగా కార్పొరేట్లకు దాసోహం అయ్యింది. మోడీ వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్‌భీమా యోజన, కిసాన్ వికాస్ యోజన కింద గిరిజన రైతులకు గతేడాది ఇచ్చిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల సబ్సిడీలలో ఈ ఏడాది 4వేలకోట్లు కోత పెట్టింది. గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్య ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పనక్కర్లేదు. అక్షరాస్యతలో దేశ సగటు 77శాతం ఉండగా గిరిజనుల్లో 59శాతం మించడం లేదు. 45శాతానికి పైగా గిరిజన గ్రామాల్లో పాఠశాలలకు స్వంత భవనాలు, ఉపాధ్యాయులు లేరు. ఇంతటి ప్రాధాన్యతా రంగంలో గిరిజన విద్యకు రూ.6093కోట్లు మాత్రమే కేటాయించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉన్నత విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఎదుగుదలను వ్యతిరేకిస్తూ వచ్చింది. విశ్వవిద్యాలయాలు ఐఐఐటి, ఐఐటి, ఎన్ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీలలో పెరుగుతున్న గిరిజన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గ్రాంటు, నిధులను పెంచడంలేదు. ఉన్నత విద్యారంగంలో గతేడాది 1963కోట్లు ఇవ్వగా ఇప్పుడు 1986 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటులో పూర్తిగా విఫలం అయ్యింది. ఇక ఏర్పాటు చేయలేమని బడ్జెట్ ద్వారా చెప్పేసింది. రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన యూనివర్సిటీలకు కలిపి 2020లో 2లక్షలు, 2021లో 2కోట్లు కేటాయించి సవరించిన అంచనాలో 47 లక్షలకు తగ్గించింది. వాటిని కూడా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది కోటి 50లక్షలు కేటాయించింది. ఈ నిధులతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎలా సాద్యమో కేంద్రమే చెప్పాలి.
అడవులు, అటవీ సంపదను
కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రతిపాదనలు
దేశంలో ఆదివాసీ గిరిజనులు అడవులు, అటవీ సంపదపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై కనీస మద్దతు ధర కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. అటవీ భూములను అనాదిగా సాగు చేస్తూ కోట్లాది మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అటువంటి కీలక రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేయడం దుర్మార్గం. అందుకు అటవీ చట్టాలను ఆగమేఘాలపై సవరిస్తూ నూతన అటవీ విధానం 2019ని తీసుకొస్తున్నది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006ను అమలు చేసి 10లక్షల గిరిజన కుటుంబాలకు హక్కులు ఇవ్వాల్సిన దానికి మాత్రం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రతిపాదనలకు మాత్రం ఏకంగా 165కోట్లు కేటాయించింది. వేగంగా అటవీ అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో పాలసీని తీసుకొచ్చింది.
ఒకేదేశం ఒకే రిజిస్టేషన్ పాలసీని బడ్జెట్లో ప్రతిపాదించింది. గిరిజనులకు మరో ప్రమాదకరమైన సంకేతం ఇచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు 1/70, పెసా, సుప్రీంకోర్టు సమతా తీర్పులు వంటి హక్కులున్నాయి. ఈ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములను బదలాయించడం నిషేదం. అటువంటి పరిస్థితుల్లో ఒకే రిజిస్టేషన్ పాలసీ వాటికి భంగకరం. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ పతనావస్థలో ఉన్నది. కరోనా మహామ్మారి కారణంగా మరింత దిగజారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మందులు, డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను గాడిన పెట్టి మెరుగైన వైద్యం అందించేందుకు బడ్జెట్లో నిధులు పెంచాలి. కానీ ఆశ్యర్యంగా గతంకంటే రూ.174కోట్లు తగ్గించి రూ.5400 కోట్లు కేటాయించింది. కరోనా కారణంగా భారతదేశంలో 30కోట్ల మందికి పైగా పేదలు మరింత పేదరికంలోకి దిగజారారని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇందులో ఎక్కువ మంది దళితులు, ఆదివాసీలేనని పేర్కొన్నది. ఇటువంటి తరుణంలో తలకాయలో మెదడున్న వారెవరైనా బడ్జెట్లో నిధులు పెంచి ఆదుకుంటారు. కానీ అందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదు. గిరిజనుల్లో ఆకలిచావుల నివారణకైనా ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతినెల నగదు బదిలీ వంటి పథకాన్ని ప్రకటిస్తుందని అనుకున్నాం. కానీ మోడీ ప్రభుత్వం గతం నుండి పేదలకు బియ్యం, చక్కెర, ఉప్పు వంటి నిత్యవసర సరుకులకు ఇస్తున్న సబ్సిడీలను కూడా తగ్గించి కర్కషత్వాన్ని చాటుకున్నది. కోట్లాది మంది పేదలకు ఆకలి తీరుస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను పూర్తిగా నీరుకార్చే చర్యలు చేపట్టింది. గత బడ్జెట్లో ప్రజా పంపిణీశాఖ ద్వారా గిరిజనులకు 12,683 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 9152 కోట్లు మాత్రమే కేటాయించింది. కరోనా కారణంగా దేశవ్యాపితంగా పట్టణాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఆదివాసీ గిరిజనులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వారు గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేసేందుకు కొత్తగా లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ ఉపాధి కల్పించేందుకు బడ్జెట్లో నిధులు పెంచకపోగా తగ్గించడం దుర్మార్గం. ఉపాధిహామీ పథకంలో గిరిజన ఉపాధికి గతేడాది 12705 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 11,427కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. ప్రతిపేదవాడి ఇంటి కలను సాకారం చేస్తానన్న మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత గిరిజనుల ఇంటి నిర్మాణానికి నిధులు తగ్గించి గిరిజనులులేని పట్టణ నిర్మాణానికి 790 కోట్లు కేటాయించింది. గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రవేశపెట్టిన హార్ఖేత్కో పానీ (ప్రతి పొలంకు నీరు), జల్ జీవన్ వంటి పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కొత్త పథకాలు లేవు. రాజ్యాంగ బద్ధంగా ఆర్టికల్ 275(1) ప్రకారం రాష్ట్రాల్లోని గిరిజనుల అభివృద్ధికి కేటాయింపులను పెంచలేదు. అందుకే 2022-23 బడ్జెట్ గిరిజనుల్లో దారిద్య్రం, ఆకలిచావులను మరింత పెంచేదిగా ఉన్నదని చెప్పక తప్పదు.
- ఆర్. శ్రీరామ్‌నాయక్
సెల్:9440532410