Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమ యూపీలో తొలి దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఇప్పటివరకూ బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగించిన తీరు చూస్తే... అది కేవలం హిందూత్వ మతోన్మాద ఎజెండాపైనే ఆధారపడి మద్దతు కూడగట్టుకుంటున్నట్టు స్పష్టమైంది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఏ రీతిలో ఉండాలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి అదిత్యనాథ్లు ఒక బెంచ్‌మార్క్ నిర్దేశించారు. దాని ప్రకారం మతోన్మాదం, ముస్లిం వ్యతిరేకతతో కూడిన ప్రచారమే కీలకాంశంగా ఉండాలి. 80శాతం, 20శాతం మధ్య పోరు జరగబోతోందని ప్రకటించడం ద్వారా ఆదిత్యనాథ్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంటే రాష్ట్రంలోని హిందూ, ముస్లింల జనాభా నిష్పత్తి గురించి చెప్పడమే. ఆ తర్వాత ఆదిత్యనాథ్ తన మాటలను సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నించారు. రామ మందిరాన్ని, కాశీ విశ్వనాథ్ ధామ్, మధుర బృందావన్‌లను వ్యతిరేకించేవారు ఆ 20శాతం మంది అంటూ సమర్థించుకో జూశారు. టెర్రరిస్టులను బలపరిచే వారంటూ ముక్తాయించారు.
హిందువులు ఒకవైపు... హిందూ ఆలయాలను వ్యతిరేకించే వారు, తీవ్రవాదులు, నేరస్తులతో సంబంధాలున్నవారు మరొక వైపు... అని చెప్పడం ఆదిత్యనాథ్ తీవ్ర మతోన్మాద ప్రచారానికి కీలకాంశంగా ఉంది. సమాజ్‌వాది పార్టీ వారిని జిన్నా అభిమానులుగా ముద్ర వేయాలని చూస్తున్నారు. వారికి మాఫియాలు, తీవ్రవాదుల మద్దతు ఉందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందేశాన్ని మరింత స్పష్టంగా చెప్పేందుకుగాను ''వారు జిన్నా భక్తులు, మేం సర్దార్ పటేల్ అభిమానులం'' అని ట్వీట్ చేశారు.
ఈ తరహాలో మతోన్మాదాన్ని ప్రచారం చేయడంలో అమిత్ షా ఏమీ తక్కువ తినలేదు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే, అమిత్ షా కైరానా పట్టణంలో మొదటిసారిగా సభను ఏర్పాటు చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వ హయాంలో బెదిరింపుల కారణంగా పెద్ద సంఖ్యలో హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సి వచ్చిందని ఆ సభలో బీజేపీ ఆరోపించింది. బీజేపీ పాలనలో ఇక ప్రజలు సురక్షితంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారు. దేవ్బంద్లో జరిగిన మరోసభలో మాట్లాడుతూ... 2013లో ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో ముస్లింలపై హింసకు పాల్పడిన వారిని సమర్థించారు. బాధితులను నిందితులుగా, నిందితులను బాధితులుగా చేశారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ న్యాయం కోసం వారు పోరు సల్పడాన్ని ప్రశంసించారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ సమయంలో నేరస్తులు స్వేచ్ఛగా సంచరించారని కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ నేరస్తులు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారైనందున వీరికి రక్షణ కల్పించారంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు.
మొదటి మూడు దశల ఎన్నికలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నందున... ఈద్గా ఉన్న మథురలో ఆలయ నిర్మాణ అంశాన్ని బీజేపీ లేవదీస్తోంది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్వయంగా ఈ డిమాండ్ లేవనెత్తారు. కాబట్టి వారి ఎన్నికల మొత్తం ప్రచారంలో అయోధ్య, కాశీ, మథుర ప్రాధాన్యత పొందుతాయి.
క్షేత్ర స్థాయిలో వాస్తవిక పరిస్థితులు మారాయని బీజేపీ గ్రహించినందునే, ఆ నిరాశా నిస్పృహలతో మతోన్మాద ఎజెండాను పదే పదే నొక్కి చెప్పడం, మతోన్మాద పోకడలను రెచ్చగొట్టడం ప్రధాన పనిగా పెట్టుకుంది. 2013 సెప్టెంబరులో ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత జాట్-ముస్లింల మధ్య సృష్టించబడిన విభేదాలను చారిత్రక రీతిలో సాగిన రైతాంగ ఉద్యమం చాలా వరకు సమసిపోయేలా చేసింది. రైతుల ఆగ్రహం (ముఖ్యంగా నలుగురు రైతులు చనిపోవడానికి దారి తీసిన లఖింపూర్ ఖేరి ఘటన తర్వాత) పలు గ్రామాల్లో ప్రదర్శితమైంది. బీజేపీ అభ్యర్థులు ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు వారికి సరైన ఆదరణ లభించలేదు. పైగా తమ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా నిలువరించారు. ఈ పరిస్థితుల్లో ుుస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం, పాత సంఘటనలన్నింటినీ తవ్వి తీయడం వంటివన్నీ మత విభజనను రెచ్చగొట్టే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు.
ఇటీవల పలువురు ఒబీసీ మంత్రులు, ఎంఎల్ఎలు బీజేపీని వీడి, సమాజ్‌వాది పార్టీలో చేరడం (2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగినట్లుగా) యాదవేతర వెనుకబడిన వర్గాలను తమ వైపుకు లాక్కునేందుకు బీజేపీకి అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న విషయం స్పష్టంచేసింది.
ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో 'వికాస్' గురించి గొప్పలు చెప్పుకోవడం, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయని చూపించుకోవడానికి గణాంకాలను తారుమారు చేయడం, మహిళలు శాంతి భద్రతలతో జీవిస్తున్నారని చెప్పేందుకు నేరాల గణాంకాలను తగ్గించడం-వంటి చర్యలన్నీ ప్రజల నుండి ఆశించిన స్పందన రాబట్టుకోవడంలో విఫలమయ్యాయి.
2016 డిసెంబరులో ఉత్తరప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5శాతంగా ఉంటే 2021 డిసెంబరులో 32.8శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) గణాంకాలు తెలియచేస్తున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షల తీరు తెన్నులను నిరసిస్తూ వేలాదిమంది యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు దిగడం, వారిపై పోలీసులు దారుణంగా దాడులకు పాల్పడిన సంఘటనలతో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్న గొప్పలన్నీ పటాపంచలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిన్నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం, బీజేపీని వ్యతిరేకించివారినందరినీ జిన్నా అనుచరులుగా ముద్ర వేయడం సులభం, సురక్షితమని బీజేపీ భావిస్తోంది.
కోవిడ్ సెకండ్ వేవ్‌లో గంగానదిలో శవాలు తేలియాడడాన్ని యూపీ మాత్రమే కాదు. యావత్ ప్రపంచం వీక్షించింది. గంగానది ఒడ్డున వందలాది మందిని ఖననం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచామని, విస్తరించామని బూటకపు గొప్పలు చెప్పుకున్నప్పటికీ... నిటి అయోగ్ జారీ చేసిన ఆరోగ్య సూచీలో-పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య రక్షణ రంగంలో యూపీ అట్టడుగున ఉందనేది వాస్తవం. నిటి ఆయోగ్ జారీ చేసిన బహుముఖ దారిద్య్ర సూచీకి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ కింది నుండి మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో 38శాతం మంది పేదలుగా ఉన్నారు.
ప్రజా సేవకు సంబంధించిన రికార్డు ఇంత దారుణంగా ఉన్నందునే... హిందువుల కోసం, హిందూ మతం కోసం, అయోధ్యలో గొప్పగా రామమందిరాన్ని నిర్మిస్తామని, కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను, మథురలో ఆలయాన్ని నిర్మిస్తామంటూ మోడీ-అమిత్‌షా-ఆదిత్యనాథ్ త్రయం ఘనంగా చెప్పుకుంటున్నారు. ముస్లింలను పణంగా పెట్టి వీటన్నింటినీ సాధించుకున్నారన్నదే ఈ సందేశం లోని కీలకాంశం.
అమిత్ షా మాటల్లో చెప్పాలంటే, బీజేపీకి సంబంధించి ఇవి కేవలం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాదు. మొత్తంగా భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు. హిందూత్వ భవిష్యత్ కూడా ఇందులో ఇమిడి ఉన్నందున అంచనాలు చాలా అధికంగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వ నిరాశా నిస్పృహలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం )