Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాగేందుకు నీరు లేదు. నడిచేందుకు దారిలేదు. కరెంటు ఎట్లుంటదో తెలి యదు. వానలు, వరదలు, బురదల్లోనే జీవనం. బడి ఉన్నా పంతుళ్లు రారు. వర్షా కాలంలో విషపురుగులతోనే సహవాసం. ప్రమాదాల బారిన పడ్డా, చిన్న రోగమొచ్చినా ప్రాణాలు ఫణమే. ఆసుపత్రి ఆనవాళ్లే వీళ్లకు తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. మనకు స్వాతంత్రం వచ్చిందన్న సంగతే వారికి తెలియదన్నా అతిశయోక్తి కాదు. స్వాతంత్యానంతరం 75ఏండ్ల తర్వాత కూడా నీళ్లు, రోడ్లు, బడి ఆసుపత్రి వంటి కనీస వసతులకు కూడా నోచుకోని ఈ బాధితులెవరో కాదు. లోకం పోకడలు, కల్మషం ఇంతైనా తెలియని ఆదివాసులు. 'బంగారు తెలంగాణ'లోనే బతుకుతున్న అభాగ్యులు.
ఆదిలాబాద్జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్గూడ పంచాయతీ పరిధిలోని నాలుగు గూడేల్లో నివసిస్తున్న గోండు, కొలాంల సమస్య ఇది. దాదాపు 120కుటుంబాలు, 500కు పైగా జనాబా ఈ ఊర్లళ్లో నివసిస్తున్నారు. కమ్యూనికేషన్ విప్లవం కొత్తపుంతలు తొక్కుతున్న రోజుల్లోనూ వీరికి ఫోన్‌లైన్ కూడా లేదంటే నమ్మాల్సిందే. దట్టమైన అటవీప్రాంతంలో నివసిస్తున్నా సొంత గూడులేదు. 40ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు కూడాలేవు. సంక్షేమ పథకాలు వీరి దరికే చేరలేదు. ఉపాధి హామీ జాబ్ కార్డుల్లేవు. అర్హులెందరికో రేషన్ కార్డుల్లేవు. చివరికి ఐటీడీఏ ద్వారా కూడా వీరికి అందుతున్న సాయమే లేదంటే ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారో అర్థమవుతుంది. అర్హులైన ఎందరికో వృద్దాప్య, వితంతు పింఛన్లు లేవు. రేషన్ బియ్యం కావాలంటే ఏడు కిలోమీటర్లు నడవాలి. నీళ్లకోసం రోజూ రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సిందే. అంతదూరమెళ్లినా చెలిమెల నీళ్లే దిక్కు. ప్రభుత్వం ఎంతో ఊదరగొడుతున్న మిషన్ భగీరథ నీళ్ల రుచీ, వాసన కూడా వీరికి తెలియదు. బయటి ప్రపంచంతో సంబంధం కోసమే కాదు, గ్రామంలోనూ అంతర్గత రోడ్లులేవు. కొందరికి రైతు బీమా కార్డులున్నా.. ఏ ఒక్కరికీ బీమా రాలేదు. కుండిషేక్గూడ.. పంచాయతీనే కానీ గ్రామ పంచాయతీ భవనం లేదు. ఏ దిక్కూ లేకుండా బతుకుతున్న కొందరు అనాధలకు.. అంత్యోదయ కార్డులు కూడా ఇవ్వలేదు. ఎప్పుడో వచ్చిన కొందరి పోడు పట్టాలనూ అటవీ అధికారులే లాక్కున్నారు. ఇన్నింటికీ నోచుకోని ఈ జనానికి ఓటు హక్కు మాత్రం ఉంది. పాలకులు, ప్రజాప్రతినిధులు ఈ ఒక్క విషయంలో మాత్రం ఏనాడూ విస్మరించలేదు. సరిగ్గా ఓట్ల సమయం లో వచ్చి ఓటేయించుకుని పోతున్నారు. ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఆదివాసులే వెళ్లి చెప్పుకున్నా గోడు వినేవారు కరువయ్యారు. ఎండ్లుగా ఐటీడీఏ అధికారులు, పాలకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా, వినతిపత్రాలిచ్చినా, రోజుల తరబడి ప్రత్యక్ష పోరాటం చేసినా ఏ ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోలేదు.
పుట్టిన ప్రతి పౌరునికీ కూడు, గూడు, గుడ్డ రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులు. ఇవి అందించాల్సిన బాధ్యత పాలకులది. ఈ గోండు, కొలాంలకు ఉండేందుకు ఇండ్లు లేవు. చేసేందుకు పనిలేదు. విద్యా వైద్యం సంగతి అటుంచితే కనీస సౌకర్యాలైన నీళ్లు, రోడ్లు కూడా లేవు. స్వాతంత్రం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక ఫలాలు కూడా వీరి దరిచేరలేదంటే మన పాలకులను ఏమనాలి? ఏండ్లుగా, వివిధ రూపాల్లో గోడు వెళ్లబోసుకున్నా నేతలెవరికీ వినిపించలేదు. చివరికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో పోరుబాట సాగుతున్నారు. వీళ్లు సర్కారు కండ్లు తెరిపించేందుకు పాదయాత్ర చేపట్టారు. ఊరుకు తాళం వేసి, ఎర్రజెండా చేతపట్టి కలెక్టరేట్‌కు కదిలారు. పిల్లా, పాపలతో కలిసి 70 కిలోమీటర్లు నడిచారు. ఈ బాధలన్నీ తీరిస్తేనే తిరిగి మా ఊరెళతామని, అప్పటిదాకా ఇక్కడే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నిరవధిక రిలే దీక్షలకు దిగారు. తిండికీ, నిద్రకూ తిప్పలు పడుతున్న వీరికి సీపీఐ(ఎం) అండగా నిలిచింది. వీరి పిల్లలకోసం ఇక్కడే బడి ప్రారంభించింది. ఇప్పుడు హక్కుల సాధన కోసం వారికి ఎర్రజెండా నిచ్చింది. పోరాటం నేర్పుతోంది. ఇప్పటికైనా ఏలేటోళ్లకు వీళ్ల గోడు వినపడుతుందని ఆశిద్దాం.
- లంకా రాఘవులు
సెల్:9490098852