Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది యువకులు
పుట్టుకతో వృద్దులు
పేర్లకి, పుకార్లకి, షికార్లకి
నిబద్దులు
తాతగారి నాన్నగారి
భావాలకు దాసులు
నేటి నిజం చూడలేని
కీటక సన్యాసులు - శ్రీశ్రీ
కర్నాటకలో హిజాబ్ ధరించిన 'ముస్కాన్' అనే ముస్లిం కళాశాల విద్యార్థినిని ఒంటరి చేసి, కాషాయ కండువాలు కప్పుకున్న మూక 'జై శ్రీరామ్' అంటూ దౌర్జన్యంగా వెంటాడి వేధించడాన్ని చూస్తే, అర్థశతాబ్దం క్రింద ప్రగతిశీల తెలుగు యువత గుండెల్లో ప్రతిధ్వనించిన ఆ గీతం గుర్తుకు రాక మానదు.
'మత విశ్వాసాల కన్నా మానవ హక్కులు మిన్న' అన్న ఆధునిక వాస్తవిక ప్రాపంచిక జగత్తులో మనం జీవిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దృక్పథం ఇంకా కొంతమంది సనాతనులకు, మత ఛాందసులకు జీర్ణం కావడం లేదు. కనుకనే కళాశాల విద్యార్థుల మెదళ్ళల్లో మత విద్వేషాన్ని నింపేందుకు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. వివేకం లేని రాజకీయ నేతలు వంతపాడటం వింతల్లో వింతకాదు. ప్రమాదభరితమైన తంతుగా గమనించాలి.
మత విద్వేషం నింపుకున్న మూకలు జాతీయ జెండాస్థానంలో కాషాయ జెండాను ఎగురవేశారు. భవిష్యత్తులో ఈ దేశం జెండా 'కాషాయ జెండా' యేనని సాక్షాత్తూ కర్నాటక రాష్ట్రమంత్రి ఈశ్వరప్ప మాట్లాడటం ఇందుకు కారణం కావచ్చు.
ఏది ఏమైనా కర్నాటక కళాశాల విద్యార్థుల వాతావరణం మత విద్వేషంతో నేడు అట్టుడుకు తోంది. 18జిల్లాల్లో, 55 కాలేజీల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ విద్వేషపు సెగలు ఇతరప్రాంతాలకు పాకకముందే తగు చర్యలు చేపట్టమని కమల్‌హసన్ వంటి సినీ ప్రముఖులు, ప్రజాస్వామ్య వాదులు విజ్ఞప్తులు చేస్తున్నారు. 'హిజాబ్'పై అత్యవసర విచారణ చేపట్టేందుకు కర్నాటక హైకోర్టు సిద్ధమైంది. తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించమని అందరినీ కోరింది.
తలవెంట్రుకలు, ఛాతి కనిపించకుండా ముస్లిం బాలికలు, వనితలు కప్పుకునే వస్త్రం హిజాబ్. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. హిందూ మహిళలు ధరించే పయ్యెద, మేలి ముసుగు వంటిదే. దీని మీద ఇప్పుడే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు. తలకు అలా స్కార్ప్‌లు చుట్టుకుని వస్తే మిగతావారికి కలిగే నష్టమేమిటి? కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు వారి వారి సంస్కృతుల్లో భాగమే కదా. ఒకరి సంప్రదాయాలను, సంస్కృతిని మరొకరు గౌరవించుకునే సంస్కారమే మన భారతీయత కదా! మరి కొత్తగా ఈ 'సాంస్కృతిక దాడులే'ంటి?
గత కొద్దికాలంగా కర్నాటక ఉడిపి ప్రభుత్వ కళాశాలలో ముస్లిం విద్యార్థినులు 'హిజాబ్'ను ధరించడం కొందరు హిందూ యువకులు వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రతిగా కాషాయి కండువాలు, టోపీలు ధరించి 'జైశ్రీరామ్' అంటూ నినదించారు. కళాశాలకూ అలాగే హాజరవుతున్నారు. మత ఘర్షణ రాజుకున్నది. ఇతర కళాశాలలకు పాకింది. ఘర్షణల నివారణలో భాగంగా కొన్ని కళాశాలలు సెలవులు ప్రకటించాయి. కొన్ని కళాశాలలు 'హిజాబ్' ధరించిన విద్యార్థినులను వేరుగా కూర్చోబెట్టాయి. ఇదో కొత్త అంటరాని తనమా? అని వారు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు అందరూ విధిగా యూనిఫారం ధరించి రావాలని ఆదేశిస్తూనే ముస్లిం విద్యార్థినులు 'హిజాబ్' ధరించరాదని పేర్కొన్నది. హిజాబ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఇలా ఉత్తర్వులు జారీ చేయడం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25ను ఉల్లంఘించడమేనని న్యాయకోవిదులు చెపుతున్నారు. ముస్లిం విద్యార్థినులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
'నచ్చిన రీతిలో వస్త్రధారణ చేసే స్వేచ్ఛ మహిళలకు ఉంటుంది. ఘాంఘట్, జీన్స్, చీర, హిజాబ్ ఇలాంటి వాటిలో దేన్ని ధరించాలో నిర్ణ యించుకునే హక్కు ఆడవారికి ఉంటుంది. దానిని రాజ్యాంగం కల్పించింది. వేధింపుల్ని ఇక ఆపండి' అన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధి మాటల్లో పురుషాధిక్యతపైగల నిరసన కూడా ధ్వనిస్తున్నది.
ముస్లిం విద్యార్థినులను చదువు నుండి దూరం చేసే కుట్ర ఇందులో దాగి ఉన్నదని ఐద్వా (మహిళా సంఘం) విమర్శించింది. ఇస్లాంలో పురుషులకన్నా మహిళలకు మరిన్ని హక్కు లుంటాయని మహిళా సాధికారిత పై కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త ఫరీదా హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు.
'తండ్రి ఆస్తిలో కూతుర్లకు వాటా ఇవ్వాలని ఖురాన్ చెపుతుంది. ఆమె అంగీకారం మేరకే 'నిఖా' పెళ్ళి నిర్ణయమవు తుంది. విడిపోవా లను కుంటే 'ఖులా' చెప్పే స్వేచ్ఛను ఇచ్చింది. కట్న కానుకలు నిషిద్దం. పైగా వరుడే 'మహర్' పేరుతో కొంత సొమ్ము చెల్లించాలి. భర్త చనిపోతే 130 దినాల (ఇద్దత్) తర్వాత పునర్వివాహం చేసుకోవచ్చు. ఆడపిల్లను చదివించమని కూడా ఖురాన్ చెప్పింది' అయితే మతంలోని పురుషాధిక్య సమాజం వీటిని సక్రమంగా అమలు కాకుండా చేస్తున్నదని ఆమె వాపోయారు.
ఇస్లాం మతం ప్రకారం మద్యం సేవించడం అత్యంత పాపం. కానీ తాగివచ్చి భార్యలను హింసించేవారు ఈ మతంలోనూ ఉన్నారని అన్నారు. ఏతావాతా ఏంటంటే మతాన్ని అడ్డుపెట్టుకుని పురుషులు స్త్రీలపై ఆధిపత్యాన్ని ఛలాయించడం అంతర్లీనంగా సాగుతున్నదే. ఇప్పుడు ఈ ఘటన స్వమతంలో కాకుండా పరమతం స్త్రీలపై దాడులకు కారణమవుతున్నది.
పురుషుల డ్రస్ కోడ్‌కు, బాడీ షేమింగ్‌కు లేని నిబంధనలు స్త్రీలకు మాత్రమే వర్తింప చేసి, స్త్రీలను కించపరిచేలా చేయడం పెట్టుబడిదారీ విష సంస్కృతిలో భాగమే. స్త్రీలను పురుషుల భోగవస్తువుగా దిగజార్చడం, పురుషుడికి స్త్రీ లొంగి ఉండాలని చెప్పే సంస్కృతి ఫ్యూడల్ సంస్కృతి. ఈ రెండు జమిలిగా దాడి చేయడం, అదీ మైనార్టీ మహిళలపై డ్రస్కోడ్ రూపంలో దాడిచేయడం నూతన పరిణామం.
అందుకే ముస్కాన్ది కేవలం యాదృశ్చికంగా బయటకు వచ్చిన ఒంటరి ధిక్కార స్వరం కాదు. యుగయుగాల పురుషాధిక్య, మత అణచివేతకు వ్యతిరేకంగా లావాలా పెల్లుబికిన హక్కుల పోరాటం. కనుకనే కుల, మతాల, రాష్ట్రాల ఎల్లలు దాటి సంఘీభావం పొందగలుగుతున్నది.
'హిందూ విద్యార్థి స్నేహితుల అండతోనే నేను సురక్షితంగా ఉన్నాను. నా మీద దాడికి ప్రయత్నించినవారిలో అధికులు బయటవారే. న్యాయస్థానం తీర్పుకోసం ఎదురుచూస్తున్నాను. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను' అన్న ముస్కాన్ మాటలు సామరస్య జీవన పరణితిని తెలుపుతున్నాయి.
'బేటీ పడావో బేటీ బచావో' అని నినాదమిచ్చారు ప్రధాని మోడి. మరి ఆ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలోనే ఒక మైనార్టీ విద్యార్థిని స్వేచ్ఛగా కళాశాలకు వెళ్ళి చదువుకోలేకపోవడం ఎంతటి దుర్మార్గం? విద్వత్తుతో వికాసం వైపు అడుగులు వేయవలసిన భావి భారత పౌరులు ఇలా విద్వేషపు మంటలకు శలఖాల్లా ఆకర్షితులు కావడం ఏమిటి?
ఇప్పటికే హిజాబ్‌ను సమర్థిస్తూ 2017 కేరళ హైకోర్టు 2018 బాంబే హైకోర్టు తీర్పులున్నాయి. దాదాపు 22శాతం మంది ముస్లిం యువతులు చదువుకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 'హిజాబ్' కారణంగా చదువును ఇంకా దూరం చేసుకోమని, చదువు మా హక్కని మలాలా లాగా ముస్కాన్ తెగేసి చెపుతున్నది. అభ్యుదయ ప్రపంచం అండగా నిలుస్తున్నది.
- కె. శాంతారావు
సెల్: 9959745723