Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో కామన్ ఎరాకు పూర్వమే (క్రీ.పూ) చార్వాకులు ప్రపంచానికి భౌతిక వాదం గురించి చెప్పారు. తర్వాత వచ్చిన బుద్ధుడు ప్రతిదీ కార్యకారణ సంబంధంతో తప్ప, ఏ దేవుడూ ఈ సృష్టికి కారకుడు కాడు - అని చెప్పాడు. ఆ తర్వాత కామన్ ఎరా (క్రీ.శ.)లో 8-13 శతాబ్దాల మధ్యకాలంలో 'త్రి మతాలు' వెలుగులోకి వచ్చాయి. ఇవి వైదిక మతంలోనే మూడు శాఖలు. ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుడు (700-750 సీ.ఈ) కేరళ-కొచ్చిలో పుట్టి, దేశమంతా పర్యటిస్తూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కన్నుమూశాడు. అద్వైతాన్ని (స్మార్తం) ప్రచారం చేశాడు. ఈయన శివభక్తుడు. మరో రెండున్నర శతాబ్దాల తర్వాత 11వ శతాబ్దంలో తమిళనాడు శ్రీ పెరంబుదూర్‌లో రామానుజాచార్యుడు (1017-1137సీ.ఈ) జన్మించాడు. 120ఏండ్లు జీవించి శ్రీరంగంలో కన్నుమూశాడు. ఈయన శ్రీమన్నారాయణుడి భక్తుడు. విశిష్టాద్వైతం (వైష్ణవం) గురించి ప్రచారం చేశాడు. చివరికి 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు (1238-1317సీ.ఈ) కర్నాటకలోని పజకలో పుట్టి ఉడిపిలో కన్ను మూశాడు. ఈ ముగ్గురిని త్రిమతాచార్యులు అని అన్నారు. వీరివి 'త్రిమతాలు'గా గుర్తించబడ్డాయి. శివుడు-విష్ణు అని వీరు కొలిచే దేవుళ్ళు వేరువేరు కానీ, ఈ ముగ్గురికీ భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. దాన్నే వారు వారి వారి కాలాలలో జనానికి ప్రభోదించారు.
ఈ త్రిమతాచార్యులు జనానికి ఏం బోధించారో అది 'ఈకాలానికి' ఏమి అవసరమో బేరీజు వేసుకుందాం! ఆది శంకరాచార్య అద్వైతం గురించి చెపితే, రామానుజుడు విశిష్టాద్వైతం గురించి చెప్పాడు. ఇది అద్వైతం కన్నా కొంత మెరుగు. అలాగే చివరగా వచ్చిన మధ్వాచార్యుల బోధనలు (ద్వైతం) అంతకు ముందొచ్చిన అద్వైతం, విశిష్టాద్వైతం కన్నా మెరుగు. ఆ పరిణతి ఎలా జరిగిందో చూద్దాం. ఆదిశంకరుడు అ-ద్వైతం అన్నాడు. అంటే రెండోది లేదు అని అర్థం. అంటే జీవాత్మ - పరమాత్మల ఏకత్వ భావన. రెండూ ఒకటే అని చెప్పడం. ఒక సర్వ నియామకుడు (శివుడు) ఉన్నాడని విశ్వసించమన్నాడు. అతని శరణువేడాలన్నాడు. ఇకపోతే 'సత్యం' కాలత్రయంలో బాధింపబడదు - అని చెప్పాడు. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తులు మూడు కాలాలు - ఈ కాలత్రయంలో సత్యం మారిపోదు అన్నాడు. పంచ భూతాలున్నాయని, 14లోకాలున్నాయనీ చెప్పాడు. ఆధునిక అంతరిక్ష పరిశోధకులు ఎవరూ ఈ 14లోకాల్ని సమర్థించలేదు. కాబట్టి, అది అతని భావన అని అనుకోవాలి. జీవుల పుట్టుకను గమనించి జరాయువు (గర్భకోశం) వల్ల పుట్టేవి కొన్ని ఉన్నాయని, అండజముల (గుడ్ల) వల్ల పుట్టినవి కొన్ని ఉన్నాయని, అలాగే ఉధ్బిజ్జములు (భూమిని చీల్చుకుని పుట్టేవి) కొన్ని ఉన్నాయని చెప్పాడు. వీటిని మనం కూడా చూస్తున్నాం. కానీ నల్లి వంటి కీటకాలు స్వేదజములు (చెమట నుండి పుట్టేవని) అన్నాడు. అది తప్పు కదా శంకరా? అది శంకరుడు చెప్పింది మాయావాదంగా ప్రసిద్ధికెక్కింది. అందులో ఏముందని చూస్తే - జీవుడు - బ్రహ్మము వేరు కాదు (అద్వైతం) అన్నాడు. అజ్ఞానం వల్ల అవివేకం కలుగుతుందని - అవివేకం వల్ల అభిమానం - అభిమానం వల్ల రాగాదులు (కోరికలు) రాగాదుల వల్ల కర్మలు - కర్మల వల్ల పునర్జన్మలు... కలుగుతున్నాయని - పునర్జన్మ వల్ల మళ్ళీ శరీరధారణ చేయాల్సి వస్తుందనీ చెప్పాడు. వీటన్నిటి వల్ల జీవుడికి దుఃఖం కలుగుతుందని అందువల్ల సర్వేశ్వరుణ్ణి ప్రార్థించాలని చెప్పాడు.
ఆది శంకరుడి తర్వాత రెండున్నర శతాబ్దాల తర్వాత, మారిన సమాజంలో పుట్టిన రామానుజాచార్యకు మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం దొరికింది. అందుకే ఆయన జీవాత్మ-పరమాత్మలకు పరిమితమై పోకుండా, ఈ రెండింటి మధ్యలో ప్రకృతి ఉందని గ్రహించాడు. మానవుని శరీరంలో జీవుడున్నట్టే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడని చెప్పాడు. దేవుడు ఇటు జీవునితోనూ అటు ప్రకృతితోనూ కలిసి ఉంటాడని అన్నాడు. అజ్ఞానం వల్ల జీవులు సంసార బంధాల్లో చిక్కుకుంటున్నారని, భగవంతుని ప్రార్థించేవారు ఆ అజ్ఞానం నుండి విముక్తులవుతారని - మరణానంతరం మోక్షం పొందుతారని, మోక్షం తర్వాత పునర్జన్మలుండవని అన్నాడు. భగవంతుని ప్రార్థించాలంటే ఎరికి వారు ప్రార్థించుకుంటే సరిపోదని - అది గురు బోధనతో 'సమ్యక్ జ్ఞానం' పొందాలని చెప్పాడు. పనిలో పనిగా తమ వంటి గురువుల ప్రాముఖ్యాన్ని కూడా ప్రచారం చేసుకున్నాడు. భక్తితో మాత్రమే నారాయణుడు కరుణిస్తాడని దిశా నిర్దేశం చేశాడు. ఇకపోతే నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించాలని చెప్పాడు. అవి ఏమిటంటే శమం, దమం, తపస్సు, శౌచం, క్షమ, అర్జవం, భయం, అభయం, స్థానం, వివేకం, అహింస, దయ వంటి ఆధ్యాత్మిక గుణాలు సంపాదించాలి. ఫలితంగానే దైవానుగ్రహం వల్ల కైవల్యం లభిస్తుంది (దేవునిలో లీనమైపోవడం) అని అన్నాడు. ఈయన తొలిసారి ప్రకృతి ప్రసక్తి తీసుకొచ్చాడు. పైగా, జీవుడికీ దేవుడికీ మధ్య గురువుకు ఒక ముఖ్యమైన స్థానం కల్పించాడు. దాన్ని స్థిరపరిచి జనాన్ని ప్రభావితం చేశాడు. దానివల్ల బ్రాహ్మణ వర్గమంతా కాయకష్టానికి దూరంగా పూజార్లుగా, అయ్యవార్లుగా, జియ్యవార్లుగా మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. దేవుడిని చూపెడుతూ, తమ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.
త్రిమతాచార్యులలో చివరివాడు మధ్వాచార్యులు. ఇతను ద్వైతాన్ని - బోధించాడు. శంకరాచార్య రెండోది లేదంటే మధ్వాచార్యులు రెండోది ఉందన్నాడు. అదే 'మధ్వమతం' అయ్యింది. జీవుడు-దేవుడు ఒకటి కాదు. జీవుడు వేరు - దేవుడు వేరు అన్నాడు మధ్వాచార్యుడు. దీన్ని జీవ-దేవ భేదం అన్నాడు. జీవుడికీ ఈ జడ జగత్తుకీ భేదం ఉంది గనుక దాన్ని జీవ-జడ భేదం అని అన్నాడు. జడ జగత్తు వేరు - దేవుడు వేరు గనక, దాన్ని జడ-దేవ భేదం అన్నాడు. అలాగే ఈ జడ జగత్తులో ఒక వస్తువుకీ మరో వస్తువుకీ భేదం ఉంది కాబట్టి దాన్ని జడ-జడ భేదం అని అన్నాడు. ఈ భేదాలు 'నిత్యం-శాశ్వతం' అని కూడా అన్నాడు. జీవుడు ముక్తిని పొందిన తర్వాత కూడా ఈ భేదాలు అలాగే కొనసాగుతాయన్నాడు. శంకరా చార్య మాయావాదానికి భిన్నంగా మధ్యా చార్యులు జగత్తు మిధ్య కాదు. అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా? అని ప్రశ్నించాడు. సర్వజ్ఞుడు, సర్వ స్వతంత్రుడు ఆ దేవ దేవుడేనని అంటూ... ఆయన మాత్రమే కర్త అని - జీవుడు నిమిత్తమాత్రుడని - భక్తి ఒక్కటే ముక్తిదాయకమని - జీవుడు ఆ భగవంతుడికి తనను తాను సమర్పించుకోవాలనీ బోధించాడు. సృష్టికి ముందు జగత్తు అంతా సూక్ష్మ రూపంలో అవ్యక్తంగా బ్రహ్మంలో ఉంటుందని - సృష్టి సమయంలో అది స్థూల రూపం పొంది వ్యక్తమవుతుందనీ అన్నాడు మధ్యా చార్యుడు.
మగ్గురు మతాచార్యుల బోధనల సారాంశం ఇది! ఈ విషయాలు ప్రజలకు చిన జియ్యరు చెప్పలేదు. భయంకరంగా కవర్ చేసిన టెలివిజన్ ఛానళ్ళూ చెప్పలేదు. అతిధులుగా వచ్చిన ఈ దేశ మహానాయకులూ చెప్పలేదు. ఊరికే సమతా-మమతా అని ఊదరగొట్టారు. అందుకే జనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆలోచించాలి. ఈ మతాచార్యుల బోధనలు ఈ 21వ శతాబ్దపు ప్రజాస్వామిక, వైజ్ఞానిక ప్రపంచానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? విశ్లేషించుకోవాలి. వారు తమలో తాము కుంచించుకు పోయి చెప్పిన విషయాలే తప్ప, కాలానికీ, దేశానికీ, మతాలకూ అతీతంగా ఆలోచించి చెప్పింది ఏమీ లేదు. వీళ్ళు సమతా మూర్తులు కారు. విశ్వమానవులు అసలే కాదు. అలా ఆలోచించడానికి బహుశా వారికి ఆ కాలంలో అవకాశం కూడా ఉండి ఉండదు. సహృదయంతో మనం ఆ విషయం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మతాచార్యులు 8, 11, 13 అంతస్థులలో (శతాబ్దాలలో) నిలబడి ప్రపంచాన్ని చూస్తే, మనం ఇప్పుడు 21వ అంతస్థు (శతాబ్దం) నుండి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఈ కాలం వారికి ఉన్న అవగాహన పరిధితో పోలిస్తే, వారి అవగాహనా పరిధి చాలా చిన్నది. ఎనిమిదో తరగతి చదివిన వాడు పీహెచ్డీ చేసిన వాడికి పాఠాలు ఎలాగైతే చెప్పలేడో, ఈ మతాచార్యుల బోధనలు కూడా నేటి సగటు మనిషికి పనికిరావు. కారణం - నేటి సగటు మనిషి చదివినా, చదవక పోయినా దేశ కాల పరిస్థితులు వారికి ఎన్నో విషయాలు బోధిస్తూనే ఉన్నాయి.
ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహం దర్శించుకుని, అక్కడ నెలకొల్పిన ఇతర దేవతా విగ్రహాల్ని దర్శించుకుంటే... దేశంలోని వందకు పైగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే కలిగే పుణ్యం ఈ ఒక్కచోటు నుంచే వస్తుందనుకుంటే... ఇక ఎవరూ ముచ్చింతల్ కూడా పోనక్కరలేదు. వాటిని టీవీ తెరమీద దర్శించుకున్నా ఆన్లైన్లో దర్శించుకున్నా 'ఆ పుణ్యం' రావాలి మరి! ఉచ్చులో పడే మూర్ఖజనం ఉన్నారు కాబట్టి, వాళ్ళు అలాంటి ప్రకటనలు చేస్తారు. ఇక ఆ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మార్టిన్ లూథర్‌కింగ్, అబ్రహం లింకన్ల పటాలు, ప్రతిమలు పెట్టారని చెపుతున్నారు. అవి అక్కడ ఎందుకూ? వీరు చేసిన సంఘర్షణలకు రామానుజుడి బోధనలకు సంబంధమే లేదు. కుల వివక్ష, జాతివివక్ష ఉండకూడదని పోరాడిన మహనీయులు వాళ్ళు. వైదిక మతంలోనే తమ దాయాదులైన శివభక్తులతో యుద్ధాలు చేసిన ఘనచరిత్ర వీరవైష్ణవులది. వారి మతంలోనే ఇలా మరో శాఖ వారితో పోట్లాడిన వారూ - ప్రపంచంలో కుల, మత, జాతి వివక్షలుండగూడదని పోరాడిన వారూ - ఒకటే ఎలా అవుతారు? మోకాలికి బోడిగుండుకు సంబంధాన్ని స్థిరపరచడమే ప్రస్థుత గురువర్యుల ఎజెండా అని అనిపిస్తోంది!
చదువూ అవగాహనా లేని మూర్ఖులు మతం పేరుతో జనాన్ని శాసించాలని చూస్తారు. చదువులేక పోయినా కొందరు రాజకీయంగా ఉన్నత పదవులు ఆక్రమించి జనాన్ని శాసించాలని చూస్తారు. ఇవన్నీ సగటు భారతీయుడికి అర్థమవుతున్నాయి. చెడును గుర్తించి, లోతైన అవగాహన పెంచుకున్న వారే, మంచిని రక్షించుకోగలరు. దాన్ని పెంచి పోషించుకోగలరు. రాబోయే తరాలకు మంచిని అందించగలరు. అందువల్ల ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. అయోధ్యలో రామమందిరమే కావచ్చు, ఉత్తరాన శంకరాచార్య విగ్రహ ప్రతిష్టాపనే కావచ్చు, ఇక్కడ హైదరాబాదులో రామానుజాచార్య విగ్రహమే కావచ్చు. వీటితో సమాజం ఒక మిల్లీ మీటరు కూడా ముందుకు పోయేదేమీ ఉండదు. మూర్ఖత్వం పెరుగుతుంది. వ్యాపారం సాగుతుంది. గుళ్ళలో మరో గుడి - లింగాలలో మరో లింగం అన్నట్టు ఉండాల్సిందే తప్ప - భవిష్యత్తులో వీటికి ప్రాముఖ్యమేమీ ఉండదు. వేల కోట్లు ధారపోసి చైనా వారితో తయారుచేయించిన సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అదే చైనావారు చేసిన రామానుజ విగ్రహం గురించి కూడా నాలుగు రోజుల తర్వాత ఎవరూ మాట్లాడరు. మహా అయితే టూరిస్ట్ స్పాట్‌గా మిగులుతుంది. విగ్రహ ప్రతిష్టాపనలు, మత ప్రచారాలు చూసి భారతీయ యువత బెంబేలెత్తిపోవడం లేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టడానికి వారు సంసిద్ధులవుతున్నారు. ఇంతకూ రామానుజుడి బోధనలు ఇప్పుడు ఎందుకు అవసరం అంటే... తిరస్కరించడానికి అవసరం - అని చెప్పాల్సి ఉంటుంది.
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు