Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబ్రహాం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడు. ఆయన తల్లి నాన్సీ హాన్క్స్ ఆఫ్రికా నీగ్రో వంశస్తురాలు. తాను నల్లవాన్నని లింకన్ ప్రకటించారు. లింకన్ అధ్యక్షుడు అయ్యేనాటికి ఆయన తండ్రి థామస్ చెప్పులు కుట్టేవారు. అబ్రహాంకూ ఆ వృత్తిలో ప్రవేశముంది. మార్క్స్, లింకన్ పరస్పర ప్రభావితులయ్యారు. లింకన్ బానిసత్వరద్దు కార్మికవర్గ నూతనశకానికి, ప్రపంచ సోషలిస్టు పునర్నిర్మాణానికి దారితీసిందని ఐరోపా శ్రామికవర్గం భావించింది. అమెరికా అంతర్యుద్ధం చివర మార్క్స్, లింకన్ ఉత్తరాలు రాసుకున్నారు. బానిసత్వ రద్దు, శ్రామిక స్వేచ్ఛలపై ఇద్దరూ అంగీకరించారు.
అమెరికన్ల హృదయంలో లింకన్‌కు సునిశ్చిత స్థానముంది. లింకన్ తండ్రి నిరక్షరాస్యుడు. భార్య ఒక బానిస-యజమాని కూతురు. ఏకగది చెక్క గుడిసెలో పుట్టిన లింకన్ సొంతంగా న్యాయశాస్త్రం దాకా చదివారు. పోస్ట్ మాస్టర్‌గా, సర్వేయర్‌గా, సైన్యాధికారిగా, న్యాయవాదిగా పనిచేశారు. 1854లో రిపబ్లికన్ పార్టీ స్థాపించే వరకు లింకన్ క్రైస్తవ ప్రొటెస్టాంట్ల విగ్ పార్టీ నిబద్ద సభ్యుడు. అనర్గళ వక్త. భయంకర హత్యకు గురైన దేశాధ్యక్షుడు. గ్రామీణ రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిన్నారు. అంతర్యుద్ధంలో బాధలు భరించారు. బానిసత్వం రద్దుచేసి నల్లజాతి అమెరికన్లను విముక్తిచేశారు. పాఠ్యాంశాల్లోలేని లింకన్ గుణం ఒకటుంది. ఆయన క్రైస్తవాన్ని తిరస్కరించారు. ఒక మతవ్యతిరేక గ్రంథం రాశారు. ఈ విషయాలు అమెరికాలో నిషిద్ధం. లింకన్ ఆరాధనాభావంకల క్రైస్తవుడని ఆయన మరణం తర్వాత మతాచార్యులు ప్రకటించారు. మాథ్యూ బ్రాడీ ఫొటోల పుస్తకాన్ని కొడుకు టాడ్తో కలిసి లింకన్ పరిశీలిస్తున్న ఫొటో చర్చిల్లో ప్రదర్శించారు. ''కొడుక్కు బైబిల్ వినిపిస్తున్న లింకన్'' అన్న తప్పుడు శీర్షికతో దుష్ప్రచారం చేశారు. 1843లో ఓడిపోయిన తర్వాత మద్దతుదారులకు లింకన్ ఉత్తరం రాశారు. ''నేను క్రైస్తవున్ని కాదని, క్రైస్తవ సృష్టివాదాన్ని వ్యతిరేకిస్తానని, క్రైస్తవులు నాకు ఓటు వేయద్దని గట్టి ప్రచారం చేశారు.'' 1846లో ఆయన ప్రత్యర్థి ''లింకన్ అవిశ్వాసి'' అని నిందించారు. దానికి లింకన్ పత్రికా ప్రకటనతో జాగ్రత్తగా స్పందించారు. ''నేను క్రైస్తవున్ని కాదు. అయితే మత గ్రంథాలను తిరస్కరించలేదు. మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. క్రైస్తవులను అవమానించలేదు.'' లింకన్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనప్పుడు ఇల్లినాయిస్లో లింకన్ సహన్యాయవాది లోగన్ హే తన మేనల్లుడు జాన్ హేకు ఉత్తరం రాశారు. జాన్ హే తర్వాత మంత్రి అయ్యారు. ఆ ఉత్తరంలో... ''నా నిష్కపటత్వం ఇలా చెప్పమని ప్రేరేపిస్తోంది. లింకన్ బైబిల్, మతం మీద నమ్మకంలేని వ్యక్తి.'' అమెరికా రచయిత, పాత్రికేయుడు ఓపీ రీడ్, లింకన్‌ను ఇంటర్వ్యూ చేశారు. దేవుని పట్ల మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. ప్రకృతి పట్ల ఉన్న అభిప్రాయమే దేవుని పట్లా ఉందని లింకన్ చెప్పారు.
లింకన్ హత్య తర్వాత ఆయన న్యాయవాద వృత్తి పూర్వ భాగస్వామి విలియం హార్నన్ బహిరంగ ప్రకటన చేశారు. ''లింకన్ అవిశ్వాసి. నాస్తికుడు. మానవాతీత భావజాల వెక్కిరింత, ద్వేషణకు తప్ప ఎప్పుడూ క్రీస్తు పేరు ఉచ్ఛరించలేదు. 1835-36లో అవిశ్వాసంపై పుస్తకం రాశారు. ఈ భావనలను ఆయన ఎప్పుడూ విరమించుకోలేదు. అయితే అవిశ్వాసం తప్పు కాదు.'' హార్నన్ వ్యాఖ్యలు మతాధికారుల్లో తుఫాను లేపాయి. 'గొప్ప జీవితపు వాస్తవ కథ' అన్న ఆత్మకథలో హార్నన్, లింకన్ మతాభిప్రాయాలను విస్తృతంగా చర్చించారు. వాటి సారాంశం... ''1834లో న్యాయవాది కాకమునుపు న్యూసాలెంలో నివసించేటప్పుడు మత ఉదార వాదులు లింకన్ చుట్టూ ఉండేవారు. వోల్నీ గ్రంథం రూయిన్స్, పెయిన్ గ్రంథం ఏజ్ ఆఫ్ రీజన్లను అధ్యయనం చేసేవారు. ఈ పుస్తకాలను లింకన్ సమగ్రంగా అవగాహన చేసుకొని తనకు ఆపాదించుకున్నారు. ఒక పుస్తకం తయారు చేశారు. అందులో క్రైస్తవమతానికి వ్యతిరేకంగా చర్చించారు. బైబిల్ స్ఫూర్తిదాయకం కాదని, దైవ గ్రంథం కాదని, క్రీస్తు దైవసుతుడు కాదని నిరూపించటానికి తీవ్రంగా పోరాడారు. ఈ సాహసోపేత సమగ్ర ప్రతిపాదనల రాతప్రతిని ప్రచురించాలనుకున్నారు. దీన్ని గిడ్డంగిలో స్వేచ్ఛగా చర్చించేవారు. లింకన్ మిత్రుడు, గిడ్డంగి యజమాని శామ్యూల్ హిల్ శ్రోతల్లో ఒకరు. ప్రజాదరణలేని ప్రకటనలు చేయటంలో లింకన్ యోగ్యతను హిల్ ప్రశ్నించాడు. రాతప్రతి లాక్కొని పొయ్యిలో పడేశాడు. పుస్తకం కాలిపోయింది కాని లింకన్ రాజకీయ భవితవ్యం సురక్షితమైంది. ఆయన మతరాహిత్యం, దైవాంశ సంశయాలు తగ్గలేదు.'' లింకన్ మతరాహిత్యాన్ని, దైవభావ తిరస్కారాన్ని ఆయన సహచరులు పలువురు ధృవపరిచారు. ఆయన న్యాయవాద వృత్తి భాగస్వామి స్టూవర్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి డేవిడ్ డేవిస్, లింకన్ రచనల పర్యవేక్షకుడు జెస్సే ఫెల్ వారిలో ముఖ్యులు. ''ఆయన అవిశ్వాసి. మా అబ్బాయి విల్లీ చనిపోయినప్పుడు తొలిసారి చర్చికి వచ్చారు. ఆయన ఎప్పుడూ సాంకేతిక క్రైస్తవుడు కాదు.'' లింకన్ భార్య మేరీ టాడ్ లింకన్ అన్నారు.
లింకన్ రాజీలేని మతాభిప్రాయాలు: ''క్రైస్తవ విముక్తి ప్రబోధాలు, మతగ్రంథాల మానవజన్మ ఉదంతాలపై నా ఆలోచనలు కాలక్రమేణా స్ఫష్టమయ్యాయి. గట్టిపడ్డాయి. వాటిని మార్చుకోవలసిన కారణం కంపించటంలేదు.'' అంటూ కొడుకు విల్లీ మరణం తర్వాత న్యాయమూర్తి జె.ఎస్. వేక్‌ఫీల్డ్‌కు ఉత్తరంలో రాశారు. 1924 న్యూ యార్క్ ఉపన్యాసంలో బైబిల్ నా పుస్తకం కాదు, క్రైస్తవం నా వృత్తి కాదన్నారు. ''చాలామంది మతాధికారులు దైవసందేశంతో నా వద్దకు వచ్చారు. వారికి తన కోరికలు చెప్పే దేవుడు నాకే ప్రత్యక్షంగా ఎందుకు చెప్పడు? మతంపై పరిశోధన చేయడం కంటే మతరహితంగా బతకటం మేలు.'' ఎన్నికల్లో పోటీచేసేవాళ్ళు దైవాభీష్టం మేరకు నడుచుకుంటా మంటారు. దేవుడు ఒకే అంశంపై, ఏకకాలంలో అనుకూలంగా, వ్యతిరేకంగా ఎలా ఉంటాడు? మనలను గెలిపించమని మనం, తమను గెలిపించమని ప్రత్యర్థులు దేవుని ప్రార్థిస్తారు. దేవుడు ఎలా నిర్ణయిస్తాడు?'' 1862 ఎన్నికల ప్రణాళికలో ప్రశ్నించారు. ''ఇద్దరం ఒకే బైబిల్ చదువుతాం. ఒకే దేవున్ని ప్రార్థిస్తాం. ప్రతిపక్షాన్ని ఓడించడానికి ఇద్దరం దైవసహాయం కోరుతాం. జీవితాన్ని ప్రార్థనలు నిర్ణయించలేవు. కష్టాలు తీర్చమని ఎప్పుడూ చర్చికెళ్ళలేదు. మానసిక స్థిరత్వం లేకుండా దేనికీ తలొగ్గను. క్రైస్తవ సూత్రాల క్లిష్ట వ్యాఖ్యలు మానవ మనుగడకు అవసరం లేదు.'' 1865 ఎన్నికల సభలో అన్నారు.
1837లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభ సభ్యునిగా లింకన్ తొలి ఉపన్యాసంలో నేడు ప్రతి వ్యక్తీ దాదాపు సోషలిస్టే అన్నారు. ''పేదలు నమ్మకస్తులు. తాము సంపాదించనిదాన్ని తాకరు. రాజకీయాధికారం పెట్టుబడికి లొంగకుండా శ్రామికులు కాపాడాలి. మానవులంతా సమానంగా జన్మించారు. ప్రజల కొరకు, ప్రజల చేత పాలించబడే ప్రజల ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.'' ఇవి లింకన్ అభిప్రాయాలు. లింకన్ న్యాయవాదిగా అమెరికా ఆర్థికాభివద్ధికి, అధ్యక్షునిగా అమెరికా ఐక్యతకు, బానిసత్వ నిర్మూలనకు, శ్రామికసంక్షేమానికి కృషి చేశారు. నేటి ఆర్థిక మాంద్య సందర్భంగా లింకన్ ఆర్థిక కార్యక్రమాలను గుర్తుచేస్తూ బ్రిటిష్ పూర్వ సైన్యాధికారి, రాజకీయవేత్త వాన్ ఆర్డెన్, అమెరికా వ్యాపారి, రాజకీయ కార్యకర్త డేవిడ్ కోచ్, ''లింకన్ సంపూర్ణ సోషలిస్టు, కమ్యూనిస్టు'' అని వ్యాఖ్యానించారు.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545