Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మతవాద, మితవాద నియంతృత్వ పోకడలతో పయనిస్తున్నది. తాము అధికారానికి వస్తే దేశానికి అచ్చేదిన్ వచ్చేస్తుందనీ, ప్రజలు సిరి సంపదలతో వర్థిల్లుతారని నమ్మబలికారు. 2015-16 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో 2022 నాటి కల్లా 6 కోట్లమంది నిరుపేదలకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని, వాటికి 24 గంటలు విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్యం అందరికీ ఉచితంగా అందిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాదు, వారి ఆదాయాలను రెట్టింపు చేస్తామనీ, నిరుద్యోగులకు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి 17లక్షల చొప్పున అందిస్తామని, అసమానతలు తొలగిస్తామని ఇలా ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోగా, వారు చెప్పిన అచ్చేదిన్ బదులు ప్రజలు సచ్చేదిన్ దాపురించింది.
మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటలేదు
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ దేశ ప్రజలను మరోసారి మోసగించి మభ్య పెట్టే విధంగా ఉంది. గత బడ్జెట్లోని అంశాలనే కాస్త అటు ఇటుగా మార్చి 2022-23 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దీనిలో కొత్తదనం ఏమీ లేదు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోయినా ప్రజలు గుర్తుంచుకోలేరని వారి నమ్మకం కాబోలు..! ఈసారి బడ్జెట్‌ను మొత్తంగా పరిశీలిస్తే ప్రజలకు తీరని నష్టంగా కార్పొరేట్లకు అత్యంత లాభంగా ఉంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన గత బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తగ్గించడం వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తిచూపుతోంది. ఎరువుల సబ్సిడీని తగ్గించారు. రైతు పంటకు గిట్టుబాటు ధరల గ్యారెంటీ లేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సాగిన పోరాటంతో వెనక్కి తీసుకున్నప్పటికీ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి కార్పొరేట్ శక్తులకు ఆదాయం పెంచే విధానాలు చేపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభానికి నెట్టి వేస్తున్నారు. పేదల ఆహార సబ్సిడీ సవరించిన అంచనాలతో 27.75 శాతం కోత పెట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే 25వేల కోట్లు తగ్గించారు. ఇది ఉపాధి కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉపాధి కూలీలు 25శాతం పని దినాలు కోల్పోనున్నారు. 2017 బడ్జెట్ ప్రసంగంలో స్కిల్ ఇండియా పథకం కింద 2022 సంవత్సరం నాటికి ఐదు కోట్ల మంది గ్రామీణ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇంతవరకూ దీనికి అతీగతీలేదు. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్లో కూడా రాబోయే ఐదు ఏండ్లలో 60లక్షల మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయని ప్రగల్భాలు పలుకు తున్నారు. ఇది నమ్మ సాధ్యమేనా? విద్యారంగాన్ని మరింత విస్తృతం చేసి అందుబాటులోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తూ తక్కువ నిధులు కేటాయించారు. కొత్తగా విద్యా బోధనలకు టీవీ ఛానళ్లు ఏర్పాటు చేస్తామని గొప్పలు పోతున్నారు. కానీ ఈ టీవీ ఛానళ్ళ ద్వారా అందరికీ విద్యా లక్ష్యం నెరవేరుతుందా..?! ప్రయివేటు రంగంలో విద్యార్జన పేద, మధ్య తరగతి వర్గాలకు అందనంత దూరంలో ఉంది. దీనివల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. కరోనా రెండోదశ సృష్టించిన మృత్యు విలయం నుంచి గుణపాఠాలు తీసుకొని ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయాలి. అందుకు సరిపడే బడ్జెట్ కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో నామమాత్రంగా, స్వల్పంగా ఆరోగ్య మిషన్ కింద కేటాయింపులు చేశారు. అవి మొక్కుబడి కేటాయింపులే తప్ప ప్రజలకు అవసరాలకు ఏ మాత్రం సరిపోవు. మరి పేద ప్రజలు వైద్యం అందక చావవలసిందేనా?
మోడీ చౌకీదార్ కాదు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో నేను దేశానికి చౌకీదార్‌నని చెప్పుకున్నారు. కానీ ఆచరణలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడానికి దళారీ పాత్ర పోషిస్తున్నాడు. 1956లో పార్లమెంట్లో చట్టం ద్వారా 340కి పైగా వివిధ ప్రయివేటు బీమా కంపెనీలను ఒక్కటిగా కలిపి జాతీయం చేయడం జరిగింది. ఇలా ఏర్పడ్డ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ప్రభుత్వ రంగంలో పని చేయడం వల్ల ప్రజలు, ప్రభుత్వం ఎన్నో లాభాలు పొందుతుండటమే గాక ప్రజల సొమ్ముకు భద్రత లభిస్తున్నది. మంచి లాభాలతో పాటు జాతీయ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి ఏటా 4లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే స్థితిలో ఉంది. ఇలాంటి లాభదాయకమైన ప్రభుత్వరంగ సంస్థను 74శాతం వాటా కల్పించి ప్రయివేటుపరం చేయడానికి పూనుకుంటోంది మోడీ ప్రభుత్వం. జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణ మొదలైంది. 1969వ సంవత్సరం ముందు వరకు బ్యాంకులు ప్రయివేటు రంగంలోనే నడిచాయి. ఆ క్రమంలో ప్రజలు దాచుకున్న సొమ్ముకు గ్యారంటీ లేకపోవడం వలన 1969లో బ్యాంకుల జాతీయకరణ చేసారు. అప్పటినుంచి ప్రభుత్వ రంగంలో బ్యాంకులు అంచెలంచెలుగా బ్రాంచీలుగా విస్తరించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి రైతులకు ఉపయోగపడుతూ నడుస్తున్నాయి. వాటిని మళ్ళీ ప్రయివేటీకరించడానికి పూనుకుంటున్నారు. దీని వల్ల సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఎయిర్ ఇండియా, విమాన సర్వీసులు, రైల్వే రంగం, జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్, బొగ్గు గనులు, ఓడరేవులు, విద్యుత్ ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్న వివిధ సంస్థలను, కంపెనీలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి మోడీ ప్రభుత్వం దళారిగా వ్యవహరిస్తున్నది.
ప్రజలపై పన్నుల భారం హద్దు, పద్దు లేకుండా మోపుతున్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువులు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ద్వారా పెంచుతూ పోతున్నారు. అప్పులు పెరుగుతున్నాయి, పన్నులు పెరుగుతున్నాయి. దేశ సంపదను అమ్మేస్తున్నారు. రోజురోజుకు కార్పొరేట్ శక్తుల ఆదాయం మాత్రం పెరుగుతుంది. దీనంతటికీ మోడీ ప్రభుత్వం నిర్వాకమే కారణమనడంలో సందేహమే లేదు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వలన కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. 2020 మార్చిలో ముందస్తు ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించడం వలన ప్రజలు ఆర్థికంగా చితికి పోయారు. లక్షలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు కాలినడకన వెళ్లారు. మధ్యలోనే అనేకమంది తిండిలేక అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆక్సిజన్ కొరత, వైద్యం అందక, ఆహారం దొరకక పేదలు దిక్కులేని చావు చచ్చారు. ఈ నష్టానికి కేంద్రానిదే బాధ్యత. 2021 ప్రపంచ ఆకలి సూచీ సర్వే ప్రకారం 116 దేశాలలో భారత్ 101వ స్థానంలో ఉంది. ఆక్స్‌ఫామ్ సర్వే ప్రకారం భారతదేశంలో 4శాతం మంది ఆదాయం వంద శాతం పెరిగింది. 84శాతం మంది ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి. 10శాతం మంది భారతీయుల దగ్గర 70శాతం దేశ సంపద ఉంది. 60శాతం ప్రజల వద్ద 5శాతం సంపద మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా, సంపద పోగేసుకుంటున్న కార్పొరేట్ల మీద పన్నులు పెంచకపోగా వారికి రాయితీలు కల్పిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులనేమో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా పీల్చి పిప్పి చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ పాలకులు జాతీయ సంపద అనేదే మిగల్చకుండా చేసే పరిస్థితులు కనబడు తున్నాయి. నిజాలు ఇవి కాగా, బీజేపీ, సంఫ్‌ుపరివార్ శక్తులు మతపరమైన భావోద్వేగా లతో ప్రజలను మోసగించి రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. వీరి దివాలాకోరు, మోసపూరిత విధానాలను అర్థం చేసుకొని వారి రాజకీయ కుయుక్తులను తిప్పికొడుతూ దేశ సంపదను, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడానికి ఉద్యమించడమే ఇప్పుడు ప్రజల ముందున్న కర్తవ్యం.
- జూలకంటి రంగారెడ్డి