Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశాన్ని మితవాద రాజకీయాల చుట్టూ సమీకరించడంలో రామజన్మభూమి వంటి మతపరమైన చిహ్నాలు ఎంతవరకు తోడ్పడతాయి? ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కదా?
దేశంలో రాముడిపై ఉన్న భక్తిని బాహాటంగానే సొమ్ము చేసుకోడానికి రామజన్మభూమి ఉద్యమం తోడ్పడింది. రాముడి గురించి అందరికీ తెలిసిన పురాణగాథను ఉపయోగించుకుని అంతకు పూర్వం ఉండిన రామాలయాన్ని పడగొట్టి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించారనే ఒక కథను అల్లారు. నిజానికి అక్కడ పని చేసిన పురావస్తు శాస్త్రవేత్తలెవరూ అంతకు ముందు అక్కడ ఒక ఆలయం ఉండేదన్న విషయాన్ని రుజువు చేయలేదు.
కాని అక్కడ రామాలయం ఉండేదని, దానిని ధ్వంసం చేసి ముస్లింలు తమ దురాక్రమణ ద్వారా అక్కడ మసీదు నిర్మించారని ఒక అభిప్రాయాన్ని ప్రచారంలో పెట్టారు. నిజానికి రాముడు పురాణ గాథల్లోని ఒక వ్యక్తే తప్ప చారిత్రిక వ్యక్తి కాడు. శిలాన్యాస్ పేరుతో దేశం నలుమూలల నుండీ ఇటుకలు తెచ్చిన దగ్గరి నుంచీ, వివిధ రకాల యాత్రలను నిర్వహించడం వరకూ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలను చూస్తే అవన్నీ ఒక పథకం ప్రకారం జరిగాయని బోధపడుతుంది. భౌగోళికంగా ఇండియా అనేదానిని హిందూయిజం తోటి, హిందూ సంస్కృతి తోటి ముడిపెట్టి రెండూ ఒకటేనన్న భావనను కలిగించడానికి చేసిన ప్రయత్నం అది.
అద్వానీ తన రధయాత్రను సోమనాథ దేవాలయం నుండి ప్రారంభించాడు. అక్కడే ముస్లింలు తొలి విధ్వంసం సాగించారని పరిగణిస్తారు కనుక అక్కడినుంచీ ప్రారంభించారు. ఆ యాత్ర అయోధ్య వరకూ సాగింది. ఆ తర్వాత ఏక్తా యాత్ర నిర్వహించారు. అది కన్యాకుమారి నుండి ప్రారంభమై కాశ్మీర్ వరకూ సాగింది. ఆ చివరి ఘట్టంలో శ్రీనగర్ వరకూ యాత్ర సాగడం సాధ్యపడలేదు. అప్పుడు అటల్ బిహారి వాజ్‌పేయిని హెలికాప్టర్లో శ్రీనగర్ తీసుకెళ్ళారు. ఇక్కడ కూడా ఇండియా భౌగోళిక స్వరూపాన్ని మతం ప్రాతిపదికన ఉండే రాజ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఆ వివాదం మతానికి సంబంధించినదే అయినా, ఒక కొత్త హిందూ రాజ్యం భావనకు ప్రతీకగా అయోధ్యను, హిందూత్వ ఆధారంగానే భారతదేశం ఉనికిలోకి వచ్చిందన్న భావనను ముందుకు తెచ్చారు. ఆ యాత్ర జరిగే సమయంలో నేను ఇండియాలోనే ఉన్నాను. యాత్ర ఆద్యంతమూ వాళ్ళు మతంతో జాతీయతను ముడిబెట్టి ప్రచారం సాగించారు. సాధారణ హిందువులలో తాము దేశం కోసం పాటుపడుతున్నామన్న భావనను వాళ్ళు కలిగించారు. ఆ విధంగా వాళ్ళకి రామజన్మభూమి అంశం తోడ్పడింది.
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు హిందూత్వ ఉద్యమాన్ని ప్రతిఘటించే విషయంలో పాత్ర ఉందా?
తప్పకుండా ఉంది. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. అందుచేత కాంగ్రెస్‌కు పాత్ర తప్పకుండా ఉంది. అయితే అందుకు ఆ పార్టీ బీజేపీ కంటె భిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టాలి. కాంగ్రెస్ ఆర్థిక విధానాలను బీజేపీ స్వాధీనం చేసుకుంది. అందుచేత బీజేపీ కంటే విభిన్నంగా ఉండే స్పష్టమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకోవలసి ఉంటుంది.
దేశంలో చాలా చోట్ల జరుగుతున్న హింసకు కారకులైనవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ పోలీసు బలగాలను దుర్వినియోగపరుస్తోంది. ముస్లింలకు, దళితులకు, ఇతర నిమ్నకులాల వారికి నిరంతరంగా ముప్పు ఎదురవుతున్నది ఈ పోలీసుల నుంచే. ఇది వాస్తవం.
నేనే గనుక కాంగ్రెస్‌కు చెందిన రాజకీయ నాయకుడిని అయితే, పోలీసు వ్యవస్థను, న్యాయ వ్యవస్థను సంస్కరించడం నా ఎజెండాలో ప్రథమ ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకుంటాను. దేశంలో అందరికీ న్యాయం అమలు జరిగేలా చేయడం అన్నింటికన్నా ముఖ్యం. దేశంలో ఎక్కువమంది సామాన్య ప్రజలు వాక్ స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛగా తిరగగలగడాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టబద్ధమైన పాలనను బాగా ఇష్టపడతారు, కోరుకుంటారు. దేశంలో సంపన్నుల్లో ఎక్కువ మందికి ఇవి ఇష్టం లేదు. పైగా ఈ ఆదర్శాలను దెబ్బతీసి తమ స్వంత ప్రయోజనాలను నెరవేర్చుకోడానికే వారు ఎక్కువగా ప్రయత్నిస్తూంటారు. ప్రతిపక్షాలు ఈ వైరుధ్యం మీదనే ప్రధానంగా కేంద్రీకరించాలి.
గణనీయమైన సంఖ్యలో మైనారిటీలు ఉన్న ఈ దేశంలో హిందూ జాతీయవాదం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది?
భారతదేశం చాలా పెద్ద దేశం. చాలా వైవిధ్యభరితమైన, సంక్లిష్టమైన దేశం. ఇక్కడ బీజేపీ తన అత్యంత కేంద్రీకృత స్వభావంతో నిలదొక్కుకోలేదు.
కాంగ్రెస్ మాదిరిగా ఓ 50ఏండ్లు నిరాఘాటంగా తానూ పరిపాలించగలనని బీజేపీ కలలు కంటోంది. ఇది వారి కలే. అది నెరవేరే అవకాశాలు చాలా తక్కువ. ఇతర రాజకీయ సమీకరణలు ముందుకొస్తాయి. వాటిలో కొన్ని హిందూ జాతీయవాద స్వభావాన్ని కలిగినవి కూడా ఉండొచ్చు. తక్కినవాటిలో ప్రాంతీయ రాజకీయ అస్థిత్వాల ప్రాతిపదికన ఉండేవి ఎక్కువగా ఉంటాయి.
అయితే భారతదేశంలో హిందూ జాతీయవాదం ప్రాధాన్యత చాలాకాలం ఉంటుంది. ఒక రాజకీయపరమైన భావనగానే గాక సాంస్కృతిక విలువల పరంగా కూడా దాని ప్రభావం ఉంటుంది. వాళ్ళు పాఠశాలల్లో సిలబస్‌ను, బోధనాంశాలను మార్చేశారు. కీలకమైన అధికార స్థానాల్లో వారి మనుషుల్ని కూచోబెట్టారు. అధికార యంత్రాంగంలో సైతం ఉన్నారు. దాని ప్రభావం దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. కాని ఈ దేశాన్ని ఒక కేంద్రీకృత పాలన కింద, అగ్రకులాలు నిర్దేశించిన విధంగా దేశమంతా ఒకే తీరుగా నడిపించాలనే వారి కల కేవలం ఒక కలగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలోని వైవిధ్యాన్ని, భిన్న జాతులను, భిన్న ఆకాంక్షలను చూడండి. ఆ భిన్నత్వమే బీజేపీ కల నెరవేకుండా అడ్డుపడుతుంది.
హిందూజాతీయవాద ఉద్యమాలు పెరగం వలన ముస్లిం మత ఉద్యమాల మీద ఎటువంటి ప్రభావం పడింది?
ఆర్.ఎస్.ఎస్, బీజేపీ అమలు చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యూహం భారతీయ ముస్లింలను ఎటూ పోలేని ఓ మూలకి నెట్టివేస్తోంని చెప్పాలి. 20 కోట్లకు పైగా ఉన్న జనాభా విషయంలో అదే విధంగా ఎల్లకాలమూ ఎటువంటి పర్యవసానాలూ లేకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. భారతదేశంలో ముస్లింలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అనేక వైవిధ్య భరితమైన సమూహాలున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం వారిలో పేదరికం పెరిగింది. చదువులో వెనుకబడ్డారు. ఆర్థిక వ్యవస్థలో ఓ పక్కకు నెట్టబడ్డారు. లోక్‌సభలో అతి తక్కువ ప్రాతినిధ్యం వారికి ఉంది. రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి. వారి జీవితాల మీద, వారి హక్కుల మీద ఇంత తీవ్రంగా, నిరంతరాయంగా దాడి జరుగుతున్నా, ముస్లింలలో అత్యధిక మెజారిటీ ప్రశాంతంగా, నిబ్బరాన్ని కోల్పోకుండా హుందాగా వ్యవహరించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. కాని వారి తరఫున నిజమైన ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేకపోవడం చూస్తే గుండెలు బద్దలవుతున్నాయి. ప్రతిపక్షాలలో చాలా ఎక్కువ భాగం ముస్లింల హక్కుల గురించి మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తున్నది. ఆ పని చేయకుండా కేవలం లౌకిక విలువల గురించి, గతంలో అవి ఎంత గొప్పగా అమలు జరిగాయో ఆ జ్ఞాపకాల గురించి ఎంత మాట్లాడినా ఉపయోగం ఏమిటి ?
కేవలం వారి మతపరమైన హక్కుల గురించే కాకుండా, వారి పేదరికాన్ని గురించి, సమాజంలో సముచిత స్థానం లేకపోవడం గురించి లేవనెత్తగల నాయకత్వం కావాలి. సామాజికంగా వెలివేయబడుతున్న పరిస్థితుల గురించి, పోలీసుల వేధింపుల గురించి, లింగ వివక్షత గురించి, కులం పేరుతో, ఉపకులం పేరుతో పెరుగుతున్న విభజనల గురించి లేవనెత్తగల నాయకత్వం కావాలి. అన్ని వైపులా శత్రుమూకలు ఆవరించివున్న స్థితిలో అటువంటి మార్పు రావడం అంత తేలికైన విషయం కాదు.
రైతుల ఉద్యమాన్ని, వారి విజయాన్ని మీరెలా అంచనా వేస్తారు?
వారి ధృఢ దీక్ష పట్ల నేనెంతో ముగ్ధుడనయ్యాను. 2019-20లో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనోద్యమాలు, ఆ తర్వాత ఈ రైతుల ఉద్యమం భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టేందుకు దోహదపడ్డాయి. దేశ గ్రామీణ ఆర్థికవ్యవస్థ చాలా మెరుగుపడవలసి ఉండగా రైతు చట్టాలు అందుకు భిన్నంగా బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందాయి. ఇప్పుడు రైతులు విజయం సాధించారు గనుక బీజేపీ ఒక మెరుగైన విధానంతో ముందుకు రావాలి.
అయితే మంచి, ఆచరణాత్మక విధానాలను రూపొందించడమెలాగో బీజేపీకి ఇంకా తెలిసినట్టు లేదని నేను అనుకుంటున్నాను. నాయకులను గొప్పగా చూపించడం, సిద్ధాంతాలను వల్లించడం ఎంత చేసినా, మంచి పరిపాలనకు అవి ఎన్నడూ సాటిరావు. మంచి పాలన చేయకుండా ఎవరూ అధికారంలో నిలదొక్కుకోలేరు. కోవిడ్-19కి తగిన విధంగా స్పందించడంలో, సీఏఏ విషయంలో, రైతుల ఉద్యమం విషయంలో మోడీ ప్రభుత్వం చాలా దెబ్బ తింది. మోడీ మాయాజాలం ఇప్పుడు పని చేయడంలేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రజలు ఇప్పుడు భయపడడం లేదు. ఇదొక మంచి పరిణామం. సగటు భారతీయుడు అధికారాన్ని, అన్యాయాన్ని ఎదిరించి ప్రశ్నించడానికి చూపే సంసిద్ధత, ధైర్యం చూస్తే నాకెంతో గొప్పగా అనిపిస్తుంది. ఆ స్ఫూర్తి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తోంది. దేశానికి ఇదెంతో శుభపరిణామం.
- డాక్టర్ ధామస్ హాన్సెన్