Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎం రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు, మోడీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు ఆయా రాజకీయపార్టీల్లో దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలనే సీఎం కేసీఆర్ మనసులోని మాటను అందరూ తప్పుపడుతున్నారు. ఖండిస్తున్నారు. ఇదే క్రమంలో పార్లమెంటులో మోడీచేసిన రాష్ట్ర విభజనపై మాట్లాడిన తీరు పట్ల ఆయా పార్టీలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆక్షేపిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే కానీ మరోవైపు ముచ్చింతల సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం జాతరలా సాగుతున్నది. దేశంలోని అధ్యాత్మిక ప్రవచన కర్తలు, భక్తులు పోటెత్తుతున్నారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరమేలేదు. కానీ చినజీయర్ స్వామి పెద్దల ప్రాపకం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. ఆ ముసుగులో ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు ఎందుకు క్యూ కడుతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రతి రోజు ఒక ప్రహసనంలా వచ్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పాతుకుపోయిన ప్రగతిశీల, ప్రజాస్వామిక, అభ్యుదయ భావజాలాన్ని పలుచన చేయడమే దీని లక్ష్యంగా కనపడుతున్నది. ఆ భావజాలం స్థానాన్ని సమతామూర్తి గొప్పతనం ప్రచారం చేయడంలో భాగంగా భక్తి, విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు విస్తృతం చేసే వేదికగా వాడుకుంటున్నారు. ప్రధానమంత్రి రాకతో మరింత విస్తృత ప్రచారం వచ్చింది. ఆయా రాష్ట్రాల నుంచి జనం పోటెత్తుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు సహితం ఇక్కడికి రాకపోతే ఏదో కోల్పోతామన్న రేంజ్లో పరుగెత్తుకొస్తున్నారు. వీరితోపాటు ధనవంతులు, హీరోలు, కాంట్రాక్లర్లు, రియల్టర్లు, వ్యాపారులు వచ్చి జీయర్‌స్వామిని సందర్శించుకుని పోతున్నారు. ఇక్కడికి చూడాలనే తపన వస్తున్నప్పటకీ వారి రాకతో విపరీతమైన ప్రచారం వస్తున్నది. అందుకే జీయర్ స్వామి వారిని ఎంతో వినయవిదేయులతో ఆహ్వానిస్తున్నారు. మహరాజా కుర్చీలు వేసి సమతా మూర్తి బోధనలు చేస్తున్నారు. ఒక పాఠంలా జీయర్‌స్వామి బోధిస్తున్నారు. చిత్తం శివుని మీద... భక్తి చెప్పుల మీద అన్నట్టు... అక్కడికి వస్తున్న వారంతా భక్తి శ్రద్ధల కంటే, రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకునేందుకేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే దీనిని 'ముచ్చింతల్ స్విస్‌బ్యాంక్' అంటూ సరదాగా చెప్పుకుంటున్నారు.
- గుడిగ రఘు