Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా... కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చాలా ఏండ్లు బ్రహ్మరథం పడుతూ వచ్చారు. నెహ్రూగారి జమానా అంతా పదిహేడేండ్ల పాటు ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆయన తదనంతరం ఇందిరమ్మకు కూడా జనం జేజేలు పలికారు. ఇదే రీతిలో టీఆర్ఎస్ రథసారధి కేసీఆర్ కూడా తెలంగాణ సాధించిన నాయకుడిగా వీరాభిమానాన్ని పొందారు. ఆ పుణ్యం ఇప్పటికీ కొనసాగుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఆయన చేసిన ప్రసంగాలు జనంతో ఈలలేయించాయి. రాష్ట్ర విభజన అనంతరం కూడా కేంద్ర ప్రభుత్వం... తెలంగాణకు చేసిన ద్రోహాన్నీ, విభజన హామీలను అమలు చేయటంలో బీజేపీ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ వివిధ వేదికలపై సీఎం సాబ్ ఇచ్చిన ఉపన్యాసాలు ఉర్రూతలూగించాయి. షరా మామూలుగా సంక్షేమ, అభివృద్ధి ఫలాల ఫలితాలు టీఆర్ఎస్కు కలిసొచ్చాయి. దీంతో ఏడాదికి ముందే ముందస్తుకు పోయిన కేసీఆర్... తన ఛరిష్మాతో రెండోసారి అధికార పీఠమెక్కారు. అది ఏ ఎన్నిక అయినా, ఉప ఎన్నిక అయినా కేసీఆర్ బొమ్మ ముందు పెట్టి, ఆ తర్వాత అభ్యర్థిని ఎవర్ని పెట్టినా... కచ్చితంగా గెలుస్తారనే సీన్‌ను క్రియేట్ చేయగలిగారు (దుబ్బాక, హుజూరాబాద్ గురించి మీరు అడగొద్దు...). ఈ ఊపులో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పవర్‌ను చేజిక్కించుకునేందుకు దళపతి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మోడీ సర్కార్‌పై దంచికొట్టిన స్పీచ్... అదరహో అనిపించింది. దేశంలో కాంగ్రెస్‌ను, బీజేపీని 'పీకి పారేయాలంటూ...' ఆయన పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే... మన పక్కనున్న జగనన్నకు, బెంగాల్లో మమతక్కకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పీ.కే.(ప్రశాంత్ కిశోర్...) ఇప్పుడు టీఆర్ఎస్కు కూడా వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన రహస్య సమావేశాలు, మంతనాలు, ఒప్పందాలు కూడా పూర్తయి.. పీకే ఇప్పటికే రంగంలోకి దిగారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పటి దాకా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్టుగా ప్రచారం చేసుకున్న గులాబీ పార్టీ... ఇప్పుడు రానున్న ఎలక్షన్ల కోసం పీకే మీద ఎందుకు ఆధారపడుతున్నదో అర్థం కావటం లేదు. అంటే కారు సర్కారు అమలు చేస్తున్న పథకాల ప్రభావం తగ్గిందా...? లేక సారు ఛరిష్మా ఎమైనా తగ్గుతున్నదా..? లేదంటే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వస్తున్న మార్పులు, చేర్పులను బట్టి పీకేని ఆహ్వానించారా..? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఆ పీకేను అడగాల్సిందే...
-బి.వి.యన్.పద్మరాజు