Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇల్లేకద స్వర్గసీమ అన్నారు. అంటే ఇంటిని మించిన స్వర్గం లేదని అర్థం. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఎంత రారాజైనా, రాష్ట్రపతైనా, ప్రధానైనా ఉదయం నుండి రాత్రిదాకా ఎంత బిజీ బిజీగా గడిపినా చివరాఖరుకి ఇంటికి పోవలసిందే. ఇంటిని స్వర్గ సీమ చేసుకుంటావో, లేదా నరక కూపం చేసుకుంటావో అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మొదట మనసనే ఇంటిని స్వర్గం చేసుకో ఆ తర్వాత ఇంటిని, ఆ తర్వాత చుట్టూ ఉన్న ఇళ్లను స్వర్గాలుగా చేయొచ్చని మన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఘోషిస్తుంటాయి. నిజంగానే ఇది మంచి విషయమే. అలా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇల్లు ఎక్కడైనా గోడలతోనే తయారవు తుంది కాని దాన్ని స్వర్గం చేయడం మాత్రం లోన ఉండే మనుషుల వల్లే అవుతుంది.
ఇప్పటి మానవులు అపార్టుమెంటుల్లో, ఇళ్ళలో నివశిస్తున్నారు కాని పూర్వం, ఇంకా పూర్వం కొండల కింద ఉండే స్థలంలో, గుహల్లో ఉండేవారు. చెట్ల పైన, కింద కూడా నివాసాలుండేవి. ఆదిమానవుల నివాసాలు అక్కడక్కడా దొరుకుతున్నాయి కూడా. వాటిని చూస్తే మనం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చామో అర్థమవుతుంది. గుహలకు సంబంధించి, అందులో జంతువులకు సంబంధించి కథలు మనం చూసాము, చదివాము. అసలు మానవుడు సీదా ఈ స్థాయికి రాలేదని, ఇక్కడిదాకా రావడానికి ఎన్నో పోరాటాలు చేసాడని, ఎన్నో విజయాలు సాధించాడని తెలుసుకోవాలి. ఇప్పటి పిల్లలు కూడా అవి చదవాలి, తెలుసుకోవాలి. అలాంటి కథల్లో ఒక సింహం బాగా ముసలిదైపోయుంటుంది. వేటాడే ఒపిక లేదు. ఆహారం సంపాదించాలి. లేవడానికే కష్టమైపోతుంటే ఇక వేట విషయం ఏముంటుంది చెప్పండి. లక్కీగా తన దగ్గర ఓ రత్నాల హారం ఉంటుంది. ఎవరైనా మానవులు ఈ దారిలో పోతే బోల్తా కొట్టించవచ్చు అనుకుంటుంది. ఈలోగా ఒక మనిషి వస్తాడు. సింహం మాట కలుపుతుంది. నేను ముసలిదాన్నయిపోయాను హారం తీసుకొమ్మంటుంది. అలా ఉన్నచోటే ఉండి కథ నడిస్తుంటుంది. అదే సింహం అడవిలో ఉంటే భయపడతారు కాని అది గుహలో కూచుంటే కొద్దిగా నమ్మకం ఏర్పడుతుంది. ఇంటిదగ్గర అది రెస్టు తీసుకుంటుంది అనుకునే అవకాశం ఉంది.
ఇంగ్లీషోడికి హౌస్ అని హౌమ్ అని రెండు పదాలున్నాయి. హౌస్ అంటే రాతితో నిర్మించిందని, హౌమ్ అంటే హృదయాలతో నిర్మించిందని చెబుతాడు. అందుకే ఇంటిని ఎప్పుడూ హౌమ్ లాగ ఉంచుకోమంటాడు. మనకూ ఇల్లు, గృహము అని రెండు పదాలున్నాయి అవి మనమూ వాడుకోవచ్చు. పూరి పాక అయినా, చిన్న షెడ్డు అయినా అది ఇల్లే. ఎవరి ఇల్లు వారికి గౌరవసూచకం అంతే. అసలు ఇల్లు ఉందా లేదా అని చూస్తారు కానీ అది ఎలాంటిది అని ఎవరూ చూడరు. చిన్న ఇల్లయినా, పెద్దదైనా, అపార్టుమెంటులో ఒక ఫ్లాట్ అయినా ఎదో ఒకటి ఉండాలి మానవులకు.
సరిగ్గా ఈ పాయింటును ఆధారం చేసుకొని ఎన్నికల సమయంలో మీకు ఇల్లు కట్టించి ఇస్తాము, ఒక బెడ్ రూమ్ ఉంటే వన్ బిహెచ్కె అని, రెండు బెడ్ రూములుంటే టూ బిహెచ్కె అని, మూడుంటే త్రీ బిహెచ్కె అని అవసరాన్నిబట్టి ప్రమాణాలు చేసేస్తుంటారు. మనుషులు కూడా ఈ మాటలన్నీ నిజమవు తాయేమోనని నమ్మేసి ఓట్లు కుమ్మేస్తారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదు. అన్నిచోట్లా ఇదే తంతు. ఇక ఉద్యోగులకు కూడా ఇళ్లు కట్టించి ఇస్తామని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.
క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్ళను పట్టించుకోకపోవడం, వాటిని అలాగే పాడుపడిపోయేలా చేయడం అనే ఓ అరాచక రాజకీయం మనం చూడొచ్చు. అవి వేరే పేర్లతో ఉండడం ఒక కారణమైతే, పూర్తి అయ్యాక పాతవాళ్ళకే పేరొస్తుండడం ఇంకో కారణం. చలికి బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో పడుకునే ఎందరో అభాగ్యులు ఒక పక్క, పూర్తైపోయి నిరుపయోగంగా పడి ఉన్న ఇళ్ళు ఒక పక్క ఉండడం కూడా మనం చూడొచ్చు. ఎలాగూ ఆ ఇచ్చే ఇళ్ళు స్వర్గాన్ని తలపింపకపోయినా కనీసం కొందరికైనా నరకాన్ని తప్పించవచ్చు.
చిన్న ఇళ్లలో ఉన్న అంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలపై కన్ను పడి పెద్ద బంగళాలో ఉండే అంటే కేంద్రంలో ఉండే పెద్ద మనుషులు ఈ చిన్న ఇళ్లను ఆక్రమించడానికి అదీ ప్రజాస్వామ్యయుతంగా వస్తూ పోతూ ఉంటారు. తన ఇల్లు ఢిల్లీలో నిలబడాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇళ్ల సహాయ సహకారాలు ఎప్పటికీ అవసరమే. అవసరం తీరిపోయాక ఈ చిన్న ఇల్లు ఉన్నవారిని నామరూపాలు లేకుండా చేయడం కూడా ఒక కళ. ఒక్కోసారి ఆశ మరీ మితిమీరి పోయి ఇష్టమొచ్చినట్టు వేటాడే పులిలాగ ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రానికి పోయి అక్కడ తమ జెండా, అజెండా పాతుదాం అని ప్రయత్నాలు కూడా చేస్తారు. స్వర్గాల్లా ఉన్న రాష్ట్రాలను అల్లర్లు రాజేసి తమ ఓట్ల పండుగకోసం నరకాన్నే సృష్టిస్తారు. ఇక అక్కడ ఉండే కొన్ని చిన్న పులులు మేమూ పెద్ద పులులమే అని ఎదురు తిరిగి, తమలాంటి ఇంకొన్ని పులులను జత చేసుకొని పెద్ద బంగాళా ఉన్న ఆసామిని చిన్న కొట్టంలోకి పంపవచ్చు కూడా. అప్పుడు ఇంకొన్ని ఇళ్లేమో కానీ ఉన్న ఇల్లు కూడా పోయి లబోదిబోమనాల్సి వస్తుంది. అనుభవించిన స్వర్గం పోయి నరకం మొదలవుతుంది.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298