Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీ, ఏపీ, తెలంగాణలలో పాలక పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లు గత కొద్ది రోజులలోనూ చేస్తున్న విన్యాసాలు వాతావరణాన్ని వివాదగ్రస్తం చేస్తున్నాయి. పాత సమస్యలు పరిష్కారం చేయకపోగా కొత్త పేచీల కోసం పాచికలు వేస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్, ఉద్యోగ ఉపాధ్యాయుల పీఆర్సీ పోరాటం, హైదరాబాద్‌లో రామానుజ విగ్రహ రాజకీయ ప్రవచనాలు, విశాఖపట్టణంలో రాజశ్యామల యాగాలు, రాజధాని కేసు, కొత్త జిల్లాల సన్నాహాలు, సినిమా టికెట్లు ప్రతిదీ వివిధ రకాల వివాదాలకు దారితీస్తున్నది. తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజలను రెచ్చగొట్టడం, ప్రత్యర్థులపై దాడి మాత్రమే లక్ష్యాలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి.
బడ్జెట్లో అన్యాయం
పార్లమెంటు సమావేశాలకు ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం విధానాలపైన ప్రధాని నరేంద్రమోడీ తీరుపైనా తీవ్రభాషలో ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగం సందర్బంలో టీఆర్ఎస్ వాకౌట్ చేసింది. తమ రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తున్నారని నిరసన తెల్పింది. మరోవంక ఏపీకి వచ్చేసరికి పాలక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండు మూడు సార్లు రాష్ట్రసమస్యలు, ప్రత్యేక హోదా వంటి అంశాలు లేవనెత్తే ప్రయత్నం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యంపైనే ఆయన దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. దానికి వారు ఆటంకాలు కల్పించడం, టీడీపీ విమర్శలు చేస్తే వీరు అడ్డుతగలడం ఒక ప్రహసనంగా మారింది. అంతేతప్ప ఉభయులూ కలసి ఒక్కగొంతుతో రాష్ట్రం కోసం మాట్లాడిన దాఖలాలు నాస్తి. ఏపీ పేరు కూడా లేకుండా వచ్చిన బడ్జెట్ పైనా సన్నాయినొక్కులు తప్ప కోర్కెలు సాధించుకోవడానికి ఉమ్మడి వైఖరి తీసుకున్నది లేదు. మరోవంక టీఆర్ఎస్ పార్టీగానూ కేసీఆర్ ముఖ్యమంత్రిగానూ బడ్జెట్‌పై తీవ్రంగా విమర్శ చేశారు. నిరసనలు కూడాచేపట్టారు. వామపక్షాలు ప్రజాసంఘాలు రెండు రాష్ట్రాలలోనూ తీవ్ర నిరసన తెలిపాయి. ఈ సమయంలోనే ఏపీకి అమరావతి రాజధాని అని ఇప్పటికి తమదగ్గర ఉన్న సమాచారమని కేంద్రం చెప్పింది. అయితే ఏది రాజధాని అన్న విషయం రాష్ట్ర పరిధిలోనిదని ముక్తాయించింది. అమరావతికి తమ మద్దతు ఉంటుందని బీజేపీ చెబుతుండగా కేంద్రం బడ్జెట్లో అందుకోసం నయాపైసా విదిలించకపోవడంపై సీపీఐ(ఎం) నిరాహారదీక్షలు చేసింది. ఇదేసమయంలో హైకోర్టులోనూ రాజధాని కేసుల వాదనలు ముగించి తీర్పువాయిదా వేశారు. ఎక్కడ రాజధాని వుండాలో తాము చెప్పబోమని లోగడ వేసిన పిటిషన్లలో ఏవి ఏ మేరకు నిలబడేది తర్వాత చెబుతామని ప్రధాన న్యాయమూర్తి పికె మిశ్రా ప్రకటించారు. మరోవైపున వైసీపీ మంత్రులు మాత్రం తాము మూడు రాజధానులకు కట్టుబడివున్నామని మళ్లీ బిల్లు తెస్తామని పునరుద్ఘాటించడం విశేషం. ఉగాది నాటికి ముఖ్యమంత్రి జగన్ విశాఖకు తరలి వెళతారన అనధికారికగా ప్రచారం జరుగుతున్నది.
విభజన విభేదాలకు ఆజ్యం
ఇదిఇలా ఉండగానే పార్లమెంటులో ప్రధానిమోడీ కాంగ్రెస్‌పై దాడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా చేయలేకపోయారని ఆరోపించారు. తలుపులు మూసి, లైట్లు ఆపేసి. పెప్పర్ స్ప్రేలతో సంప్రదాయాలకు విరుద్దంగా ఆమోదించారని వ్యాఖ్యానించారు. ఆనాటి ఘటనలు అందరికీ తెలిసినవే. బీజేపీ మద్దతు లేకపోతే విభజన అసాధ్యం. తమ ఘనత కూడా గుర్తుంచుకోవాలని నాటి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణను కోరుకున్నారు కూడా. వెంకయ్యనాయుడు వత్తిడి వల్లనే నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి అయిదేళ్ల ప్రత్యేకహోదా ప్రకటించారని బీజేపీ చాలాకాలం గొప్పలు చెప్పుకున్నది. అయితే విభజన అమలులోకి వచ్చాక ఏడేండ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ చట్టంలోని నిబంధనలు అమలు చేయకపోగా ఉన్నవాటికే ఎసరుపెట్టింది. ప్రత్యేకహోదా ప్రత్యేక వంచనగా పరిణమించింది. వెనకబడిన ప్రాంతాల నిధులు, ఏపీ రెవెన్యూలోటు భర్తీ ఏదీ నెరవేర్చింది లేదు. తెలంగాణకు కూడా వరగబెట్టింది లేకపోగా ఇరురాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇప్పటివరకూ నానబెట్టి విభేదాలకు కారణమైంది. ఇటీవలి కాలంలో నదీజలాలపై వచ్చిన భిన్నాభిప్రాయాలను అవకాశంగా తీసుకుని సర్వాధికారాలు తమ చేతుల్లోకి తెచ్చుకునే వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇంత జరుగుతున్నా చాలాకాలం రెండు రాష్ట్రాల పాలకపార్టీలు పెదవి మెదిపింది లేకపోగా, ఉత్సాహంగా బీజేపీని మోశాయి. గత ఎన్నికల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో తెంచుకుని ధర్మయుద్ధం అంటూ హడావుడి చేసినా అందుకే ప్రజలు నమ్మలేదు. అంతకుముందు ఆయన కేంద్రం నుంచి సరిగ్గా సాధించలేపోయారన్న జగన్ తాను ముఖ్యమంత్రి కాకముందే హోదా కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం లేదని తేల్చేశారు. అదొక రాజకీయాస్త్రంగా వినియోగించుకోవడం తప్ప అఖిలపక్ష ఉద్యమంగా సాధించుకోవడం అన్న ప్రసక్తి లేకుండా పోయింది. మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం ఏదో ఏపీకి చాలా అనుకూలమైనట్టు, గతంలో తనపై వచ్చినవిమర్శలు ఆయన ఆమోదించినట్టు చాలామంది చిత్రీకరించారు.. నిజం ఏమిటంటే ఇరురాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఎరబెట్టిన బీజేపీ ఇప్పుడు విభేదాలు ఎగదోయడానికి మరోసారి పాచిక వేసింది. ప్రధాని ఇలా అనగానే తెలంగాణ ఏర్పాటును అవమానించారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు తీసుకోగా బీజేపీ ఎదురు దాడికి దిగింది. పరస్పర దాడులు కూడా చేసుకున్నారు. ఇది రాజకీయంగా ఎవరికి లాభమని కొందరు లెక్కలు వేస్తూ మోడీ వ్యూహం గురి తప్పిందంటున్నారు గాని వాస్తవంలో ఇరు రాష్ట్రాల మద్య వివాదాలకు ఆజ్యం పోయడం, గందరగోళ పర్చడం కూడా మోడీ వ్యూహం. ప్రధాని వ్యాఖ్యలపై ఇంతవరకూ జగన్ స్పందించింది లేకపోగా ఇతరత్రా తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ కూడా వీటిపై మాత్రం మాట్లాడలేదు.
రామానుజ రాజకీయం
ఇదే సమయంలో త్రిదండి చినజీయర్‌స్వామి మైహోం రామేశ్వరరావు సౌజన్యంతో కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో స్థాపించిన రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ స్థాపన కూడా పలు రాజకీయ సంకేతాలిచ్చింది. కేసీఆర్ ముందే దర్శించుకుని మోడీ పర్యటనకు దూరంగా ఉండిపోయారు. మోడీని సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తిగానే జియర్ అభివర్ణించారు. జగన్ మరుసటి రోజు సందర్శించి స్వామీజీ ప్రశంసలు పొందారు. అమిత్ షా ఈ విగ్రహ స్థాపనను అయోధ్య కాశీ తదితర నిర్మాణాలతోనూ హిందూత్వతోనూ కలిపి మాట్లాడారు. ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్ అసలు హిందూమతంలో వెయ్యేళ్లుగా అసమానతలు లేవన్నారు. ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మొత్తం కార్యక్రమంలో పాలుపంచు కుంటుండగా అనధికార అధికార కార్యక్రమంగానే ఇది నడుస్తున్నది. దేెవుడి ముందు అన్ని పార్టీలూ కలసి పనిచేయాలని జియర్ పిలుపునిచ్చారు. వామపక్షాలకు ఈ విగ్రహం చూపిస్తే వాస్తవాలు తెలుస్తాయని రాందేవ్ బాబా అన్నారు. 12వ శతాబ్దంలో విశిష్టాద్వయిత స్థాపకుడుగా రామానుజార్యులు కులమతాలకు అతీతంగా ఉండాలంటూ వైష్ణవభక్తి ఉద్యమం ప్రారంబించిన మాట నిజమే కావచ్చు. కాని ఇప్పుడు ఆ పేరిట రాజకీయ శక్తుల హడావుడి మాత్రం యాధృచ్చికం కాదు. (మజ్లిస్ ఒవైసీ పెరట్లోనే మోడీ ఇంత పెద్ద విగ్రహం స్థాపించారని యూపీలో ప్రచారం జరుగుతున్నట్టు కేసీఆర్ ఒకసారి విమర్శించారు.) జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ విగ్రహ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఆలయాల ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. జగన్ విశాఖవెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతి రాజశ్యామల యాగంలో పాల్గొని వచ్చారు. యాదాద్రిలో భారీ ప్రణాళికతో దాదాపు పునస్థాపించిన ఆలయ ఉద్ఘాటన కార్యక్రమం పరిశీలనకు కేసీఆర్ వెళ్లారు. (గతంలో ఇందుకు మోడీని పిలిచివున్నారు) విడివిడిగా కనిపించే ఈ పరిణామాల వెనక అంతస్సూత్రం ఎవరైనా తెలుసుకోవచ్చు.
పీఆర్సీ, జిల్లాలు, సినిమాలు
ఈ సమయంలోనే ఏపీలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంతో అవగాహనకు వచ్చి సమ్మె పిలుపు వెనక్కు తీసుకోవడంతో ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విభేదించి ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇది సహించలేని ముఖ్యమంత్రి జగన్ టీడీపీని, దాని అనుకూల మీడియాను మరీ ముఖ్యంగా కమ్యూనిస్టులను తిట్టిపోయడం కూడా పాలకుల స్వభావం చాటుకున్నారు. దీనిపై సీపీఐ(ఎం) ఇప్పటికే తీవ్రంగా స్పందించింది కూడా. సమస్యలు విని పరిష్కారం చేసేబదులు ఉద్దేశాలు అంటకట్టడం, ఉక్రోషం వెళ్లగక్కడం అనుచితం.
ఈ మధ్యలోనే జిల్లాల సంఖ్య 13 నుంచి 26 చేస్తూ ప్రతిపాదనలు వచ్చాయి. బ్రిటిష్ వారి కాలం నుంచి ఆంధ్ర ప్రాంతంలో జిల్లాల పునర్విభజన దాదాపు జరగలేదు. ఆరీత్యా ఈ నిర్ణయం మంచిదే అయినా పలుకొత్త జిల్లాలపై పైసమగ్ర చర్చ లేకపోవడం సమస్య. రంపచోడవరం కేంద్రంగా గిరిజన జిల్లా ఉండాలన్నది ఒక ప్రధానకోర్కె సీపీఐ(ఎం) తీసుకున్నది. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపూర్, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట, మదనపల్లిని జిల్లాచేయడం వంటి కోర్కెలు కూడా వచ్చాయి. వీటన్నిటిని మించి విజయవాడను ఎన్టీఆర్ జిల్లాగా చేసి, మచిలీపట్నంను కృష్ణాజిల్లాగా కొనసాగించాలన్న నిర్ణయంపై టీడీపీ వివాదం తీసుకొచ్చింది. విజయవాడకు వంగవీటి రంగాపేరు పెట్టాలంటూ వ్యక్తుల మధ్య కులాల మద్య కొత్త తగాదా తీసుకొచ్చే ప్రయత్నం ఆందోళనకరంగా ఉంది. ఉగాది నాటికి దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో 33 జిల్లాల ఏర్పాటు జరిగి చాలాకాలమైనా కేంద్రం ఇంకా గుర్తించలేదు.
ఈ వివాదాల పరంపరలోనే సినిమా టికెట్ల రేట్ల చర్చ. దాంతోపాటు షోల సంఖ్య, చిన్న పెద్ద సినిమాలకు ప్రోత్సాహం వంటి వివిధ విషయాలపై పరిశ్రమకూ ప్రభుత్వానికి మధ్యనున్న విభేదాలు పరిష్కారమవడం మంచిదే. భారీ ఖర్చుతో తీసిన వాటికి అదనంగా రేట్లు పెంచుకునే అవకాశం విడిగా ఇవ్వాలని మిగిలిన వాటి విషయంలో ఒకేవిధమైన రేట్లు సముచితంగా నిర్ణయించాలన్న ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు పరిశ్రమ అంగీకరించినట్టే కనిపిస్తుంది. చిన్న సినిమాలకు అయిదో షోగా వేసుకునే అవకాశం, థియేటర్ల అందుబాటు కూడా చర్చకు వచ్చాయి. ఇందుకోసం చిరంజీవితో సహా అగ్రనటులు, దర్శకులు రావడం పొరబాటనే వ్యాఖ్యలు పసలేనివి. ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర నిర్మాణం జరగాలని పరిశ్రమ పెంపోందాలని కోరుకోవడం సమంజసమే. ఇందుకు విశాఖను కేంద్రంగా ప్రతిపాదిం చడం ఆసక్తికరం. ఏపీలో థియేటర్ల సంఖ్య వసూళ్లు అధికవాటాలో ఉండటం నిజమే. దీనిపై తదుపరి అడుగులు ఎలా ఉంటాయో రాజకీయ కోణం ఏమిటో చూడాలి
కొత్త భ్రమలా?
ఈ నెల 17న విభజన సమస్యలపై కేంద్రం ఏర్పాటుచేసిన సమావేశం పెద్ద విజయంగా చెప్పుకోవడం దీనికి కొసమెరుపు. తమ పట్టుదలవల్లనే ప్రత్యేక హోదాను ఎజెండాలో చేర్చారని ఏపీ ప్రభుత్వ ప్రచారంగా ఉంది. కేంద్రం ఇవ్వాల్సిన హోదా ఇరురాష్ట్రాల ద్వైపాక్షిక చర్చలోకి ఎలా వస్తుంది? హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించిన బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు అదేమీ లేదని తోసిపుచ్చినా ఈ కథనాలు నడుస్తూనే ఉన్నాయి! ఇది తాజా వంచన అనుకోవచ్చు. కేంద్రం వైఖరి రీత్యానైనా ఇరురాష్ట్రాలు సత్వర పరిష్కారం కుదుర్చుకోవడం శ్రేయస్కరం.
- తెలకపల్లి రవి