Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో హిజాబ్ రగడ... ఎవరి ప్రయోజనాల కోసం కొనసాగుతోంది...?
హిజాబ్ అంటే ఏమిటి?
హిజాబ్ అంటే తెర...
జుట్టును, జుట్టుతో పాటు తల, మెడ చుట్టూ కప్పివుంచే హెడ్‌స్కార్ఫ్.
హిజాబ్ గురించి కురాన్‌లో ఇలా చెప్పబడింది. సూరV్‌ా అల్ నూర్‌లోని 33:1:59లో ఖురాన్ విశ్వాసకులు అయిన స్త్రీలు దుపట్టా కొంగులను తల మీద నుంచి వ్రేలాడతీసుకోవాలని చెప్పింది.
కురాన్ మాత్రమే కాక ఇతర మత గ్రంథాల్లో కూడా స్త్రీల యొక్క శరీరం కనబడకుండా ఉండే దానికి ముసుగులు ధరించడం గురించి చెప్పడం జరిగింది.
సనాతన వైదిక ధర్మంలో రుగ్వేదం 8:33:19లో స్త్రీలు తమ శరీరాన్ని రక్షించుకోవడానికి మేలిమీ రంగు ముసుగును ధరించాలని చెప్పబడింది.
బైబిల్లో 1:11:6 లో స్త్రీలు తప్పనిసరిగా ముసుగు ధరించాలి అని రాయబడింది.
అన్ని మత గ్రంథాలూ స్త్రీలు ముసుగు ధరించాలని చెపు తున్నాయి.
మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 26, 27, 28 లో మతస్వాతంత్రపు హక్కును కల్పించడం జరిగింది.
ఆర్టికల్ 15లో జాతి, కులం, మతం, లింగం ప్రాంత వివక్షలకు వ్యతిరేకంగా హక్కు కల్పించడం జరిగింది.
ఆర్టికల్ 14, 25 ప్రకారం విద్యా సంస్థల్లో సైతం విద్యార్థినులు తమ మత ఆచారాల ప్రకారం దుస్తులు ధరించే విషయంలో నిర్బంధం కలుగజేయ కూడదు అని చెప్పింది.
మతాల గ్రంథాలు, రాజ్యాంగం దేశంలో అన్ని మతాల సాంప్రదాయ దుస్తులను ధరించే స్వేచ్ఛను మనకు కల్పించాయి. సిక్కు మత ఆచారంగా ఉన్న తలపాగాను పెట్టుకుని దేశ ప్రధానిగా పరిపాలించారు. కాషాయ దుస్తులు ధరించి అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులుగా సమావేశాల్లో పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. కాషాయ దుస్తులతో అనేకమంది మత పెద్దలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు సైతం కాషాయ దుస్తులు ధరించి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఇస్లాం మతానికి చిహ్నంగా ఉన్న టోపీలు ధరించి ఇస్లాం సాంప్రదాయ దుస్తులు ధరించి అసెంబ్లీ, పార్లమెంటు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డిఫెన్స్‌లో సైతం ప్రధాన అధికారులుగా ఉన్న సిక్కు సైన్యాధిపతులు తమ తలపాగాను ధరించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
క్రిస్టియన్స్ నన్స్ తమ సాంప్రదాయ దుస్తుల్లో స్కూల్, కాలేజీలో విద్యా బోధన చేస్తున్నారు.
జంధ్యం ధరించే వారు, మాలలు, దీక్షల పేరుతో రంగుల దుస్తులు ధరించేవారు, ఇతర మత ఆచారాలతో తిరిగే వాళ్ల స్వేచ్ఛను మనం చూస్తున్నాం. ఈ భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా ఈ మిశ్రమ సంస్కృతిలో, అందరూ కలిసి వివాదాలు లేకుండా కలిసి మెలసి ఉండడం మనం చూస్తున్నాం.
ఇప్పుడు ఈ విషయాల్లో కూడా రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, మత సంస్థలు పూనుకోవడం విచారకరం. ప్రస్తుతం వారి దృష్టి విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, విద్యార్థులపై పడింది. అందుకే ఇప్పుడు హిజాబ్ వివాదం ముందుకు వచ్చింది.
ఇప్పుడు హిజాబ్ గొడవ, అంతకుముందు గోమాంసం, లవ్ జిహాద్.. వివాదాలు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగ పడుతున్నాయి..? దేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చినప్పుడే ఎందుకు ఇలాంటి వివాదాలు ముందుకు వస్తున్నాయి? ఎందుకు ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి? రెండు వర్గాలుగా ప్రజల మధ్యలో చిలుకలు తీసుకువచ్చి మైనార్టీల బూచిని చూపెట్టి మెజార్టీ ప్రజల ఓట్లు దండుకునే పథకం ఎవరిది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగానే కనిపిస్తాయి. దేశంలో లౌకికత్వాన్ని నాశనం చేసి, భారత రాజ్యాంగాన్ని మార్చివేసి, త్రివర్ణ పతాకానికి బదులు కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యం దీని వెనకాల కనబడుతుంది. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు బయటకు తెచ్చి, వివాదాలు సృష్టించి మతోన్మాదంతో మెజార్టీ ప్రజల ఓట్లు దండుకుని అధికారంలోకి వస్తున్నారు. మరలా తిరిగి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావతం చేస్తున్నారు.
ఈ మెజార్టీ మతోన్మాదానికి మైనారిటీ మతోన్మాదం కూడా తోడవుతున్నది. మెజార్టీ మతోన్మాద అవకాశాన్ని ఉపయోగించు కుని మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందుతూ అధికారాన్ని సాగిస్తున్నారు. తమ సొంత లాభం కోసం మెజార్టీ మతోన్మాదానికి పావులుగా మారి రాజకీయ బేరసారాలూ, అవసరం వచ్చినప్పుడల్లా చెదురుమదురు హింసాత్మక సంఘటనలూ సృష్టిస్తూ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.
దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలను తమ అదుపు ఆజ్ఞలలో పెట్టుకొని, వారికి కావాల్సిన ఎజెండా చుట్టూ ప్రజల దృష్టిని మళ్లించి, తప్పుడు ప్రచారాలు చేస్తూ, గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనేకం ఉండగా వాటిని పరిష్కారం చూపకుండా, ప్రజలు రాజకీయల పట్ల ఆలోచనలు చేయకుండా ఉండేందుకు ఈ మతోన్మాద రాజకీయాలు ఉపయోగిస్తున్నారు.
భారతదేశంలో మొదటి నుంచీ హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా, లౌకిక రాజ్యంగా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సామరస్యాన్ని దెబ్బతీసే వివాదాలతో దేశం అట్టుడుకుతోంది. ఈ రాజకీయాలపై సామాజిక, అభ్యుదయ, వామపక్ష, లౌకిక శక్తులు కలిసి పోరాడినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- షేక్ బషీరుద్దీన్
సెల్: 9704816603