Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ పరిస్థితి, ఆర్టీసీ కార్మికోద్యమంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నది. ప్రధానంగా పని పరిస్థితులు, వేధింపులు, పని గంటలు కుదింపు, ఓవర్‌టైమ్ కుదింపు వంటి వాటితో పాటు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పేస్కేలు, డీఏలు, ఇతర బకాయిలు చెల్లిం పు చేయకపోవడంపై చర్చ జరుగుతున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ఆర్టీసీలో ఈ పరిస్థితికి కారణం. నిజానికి 1996-97 నాటికి ఆర్టీసీ తనకు ఉన్న అప్పులన్నీ తీర్చింది. ఇక అక్కడ నుండి వెనుకపట్టు పట్టింది. ఎం.వి.యాక్ట్ -1988లో ప్రయివేటు ఆపరేటర్లకు పర్మిట్స్ ఇవ్వాలని మార్చారు. ఒక కొత్త రూట్ ప్రతిపాదన వస్తే ముందు ప్రయివేటు ఆపరేటర్స్‌ను సంప్రదించి, వారు ముందుకు రానిచోట మాత్రమే ఆర్టీసీ బస్‌ను నడపాలని ప్లానింగ్ కమిషన్ సిఫారసు చేసింది. ఆర్టీసీలో ఉన్న బస్‌ల సంఖ్యనుపెంచవద్దని 1992 మార్చి 31న కేంద్ర ప్లానింగ్ కమిషన్ అన్ని ఆర్టీసీలకు లేఖలు రాసింది. ఆర్టీసీ యాక్ట్ -1950 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఇవ్వాల్సిన మూలధన పెట్టుబడిని నిలిపివేసి, ఆర్టీసీలను ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టాయి. ప్రపంచ బ్యాంకు విధానాలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపై 'ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్' పేరుతో నివేదికను తయారు చేసారు. ఆ నివేదికలో ఆర్టీసీకి సంబంధించి ఉన్న కొన్ని ముఖ్యమైనవి.
ఏపీఎస్ ఆర్టీసీని (7) ఏడు కార్పొరేషన్స్గా విడగొట్టాలి. దీనివల్ల 20శాతం సిబ్బందిని తగ్గించవచ్చు. ఈ అదనపు సిబ్బందిని బయటకు పంపడానికి విఆర్ఎస్ను ముందుకు తేవాలి. రూట్ల నిర్వహణలో ఆర్టీసీకి గుత్తాధిపత్యం ఉండకూడదు. పర్మిట్ విధానాన్ని సరళీకరించి స్టేజి క్యారేజీలుగా ఇతరులను అనుమతించాలి. బస్ స్టేషన్స్ వినియోగంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేసి వీటిని ఒక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలి. ఖర్చు తగ్గింపుకు సిబ్బందిని కుదించడం తప్ప మరో మార్గం లేదు. సింగిల్ క్రూ డ్యూటీలు, డ్రైవర్ల టిమ్ డ్యూటీలో ప్రవేశ పెట్టాలి. ప్రయివేటు మిని బస్‌లను నడపాలి. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆర్టీసీని మూసివేయాలి. దీనికి ఆర్టీసీ కార్మిక సంఘాలు అంగీకరించవు. కాబట్టి కొన్ని రాయితీలను కార్మికులకు ఇచ్చి తమవైపు తెచ్చుకోవాలి. అనేవి మొత్తం నివేదికలో ముఖ్యమైనవి.
2001 సంవత్సరం నుండి మన రాష్ట్రంలో (అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం) పాలకులు ఎవరైనా, పాలక పార్టీ ఏదైనా కూడా ఆర్టీసీలో ప్రపంచ బ్యాంకు విధానాలనే అమలు చేస్తున్నారు. అయితే చైతన్యయుతమైన ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ పరిరక్షణ కోసం చేసిన సమ్మెలు, ఆందోళనలు పాలకుల వేగానికి అడ్డుకట్ట వేశాయి. పై ప్రణాళికను 24 నెలల్లో అమలు చేయాలని నిర్ణయించుకొన్నా దాదాపు 22ఏండ్లు అయినా పాలకులు పూర్తిగా అమలు చేయలేకపోయారు అంటే అది కార్మికవర్గం నిర్వహించిన పోరాటాల వల్లనే.
సరిగ్గా ఈ అంచనా తోటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 2019లో 55 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిర్బంధం ప్రయోగించింది. కార్మికులలో ఉన్న ఐక్యతను విచ్ఛిన్న చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసింది. కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నా చలించకుండా, ఆర్టీసీ పరిస్థితి పట్ల, కార్మికోద్యమం పట్ల తప్పుడు సమాచారం ఇచ్చి రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర హైకోర్టును తప్పుదోవ పట్టించింది. ఇన్ని చేసినా కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయలేకపోయినందునే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకొని, సమ్మె విరమణ చేయడానికి కావలసిన భౌతిక పరిస్థితులను కల్పించింది. సమ్మె విరమణ జరిగింది. 2019 డిశంబర్ 1న ఎంపిక చేయబడ్డ కార్మికులను పిలిపించుకొని ప్రగతిభవన్‌లో మీటింగ్ జరిపారు. జేఏసీ లేవనెత్తిన సమస్యలలో అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కార్మిక సంఘ కార్యకలాపాలను రెండేండ్ల పాటు నిషేధిస్తున్నట్లు కార్మికుల సాక్షిగా ప్రకటన చేశారు. రెండు సంవత్స రాలు దాటినా ఆ ఆంక్షలను తొలగించలేదు.
నేరుగా ఆర్టీసీని ప్రయివేటీకరించేందుకు చేసే ప్రయత్నాలలో వేగం తగ్గినా, ఆర్టీసీని ''ఏనుగు తిన్న వెలగపండులా'' తయారు చేస్తున్నారు. అన్ని అంశాలలో ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నారు. గ్యారేజీలో చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు మినహా మిగతావన్నీ ప్రయివేటు ఏజెన్సీలకు ఇచ్చి వేశారు. ఆర్టీసీలో ఉన్న స్వీపర్స్ / రికార్డ్ ట్రెసరా పోస్టులను ఎత్తివేసి ఆ స్థానంలో థర్డ్ పార్టీ కాంట్రాక్టు కార్మికులను తీసుకొచ్చారు. ఆర్టీసీలో 1988లో 350 అద్దె బస్‌లు ఉంటే 2014-15లో 1478, 2020-21లో 3134కు పెంచారు. 1988లో ఒక బస్ వెనుక 8.5 సిబ్బంది / ఉద్యోగులు పని చేస్తే ఇప్పుడు కేవలం 5.69 మాత్రమే పని చేస్తున్నారు. దీనిని ఇంకా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. 2015 జూన్ 3 నుండి టీఎస్ ఆర్టీసీ విడిగా పని చేస్తున్నది. 2016లో 55,993 మంది పని చేస్తే, 2021 నాటికి 47,592 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఐదేండ్లలో 8401 మందికి తగ్గిపోయారు.
2001 తర్వాత సింగిల్ క్రూ డ్యూటీలు డ్రైవర్ టిమ్స్ డ్యూటీలు పెరుగుతూ వచ్చాయి. 2021 మార్చి నాటికి సింగిల్ క్రూ డ్యూటీలు 2091 ఉన్నాయి. అలాగే డ్రైవర్ టిమ్స్ సర్వీసులు 1500 వరకు చేరాయి. డ్రైవర్ చేత టిమ్స్ ఇచ్చి కండక్టర్ పని కూడా చేయించడం సరైంది కాదని రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులను కాదని, రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ వినియోగంపై ఉన్న ఆంక్షల నుండి ఆర్టీసీకి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చి కోర్టు తీర్పును తుంగలో తొక్కింది.
ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులకు వర్తించే ఎం.వి. యాక్ట్, ఎంటిడబ్ల్యు యాక్టులను అమలు చేయడం లేదు. చట్ట ప్రకారం రోజుకి 8గంటల పని ఉండాలి. ఆ తర్వాత 4గంటలు అదనంగా డ్యూటీ చేస్తే రెట్టింపు వేతనం చెల్లించాలి. అలాగే డబుల్ డ్యూటీ చేస్తే కూడా రెట్టింపు వేతనం ఇవ్వాలి. ఆఫ్‌లో పని చేస్తే సింగిల్ వేజ్‌తో పాటు మరో రోజు కాంపెన్సేటరీ ఆఫ్ ఇవ్వాలి. వాటన్నింటిని తుంగలో తొక్కి కేవలం గుండు గుత్తగా రూ.450లు చేతిలో పెట్టి కార్మికులను దోపిడీ చేస్తున్నారు. మరోవైపున రోడ్లు బాగున్నాయనే పేరుతో రన్నింగ్ టైమ్ కుదిస్తూ, పని దినాలను కుదిస్తున్నారు. ఇంతకుముందు నాలుగు రోజులు డ్యూటీకి ఇప్పుడు రెండు రోజులే మస్టర్ ఇస్తున్నారు. ఫలితంగా కార్మికులు ఏకధాటిగా 16గంటలు కూడా పని చేయవలసి వస్తున్నది. కార్మికుల సంక్షేమం గాలికొదిలేశారు. చట్టబద్ధంగా రావలసిన వాటిని కూడా ఇవ్వడం లేదు. 2014 నుండి లీవు ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వలేదు. 2017, 2021 వేతన ఒప్పందాలు చేయలేదు. 6డీఏలు ఇవ్వలేదు. 2013 పీఆర్సీ అరియర్స్‌లో 50శాతం చెల్లించలేదు. గత ఐదేండ్లుగా యూనిఫారమ్ ఇవ్వలేదు. పీఎఫ్ నిధులు, సీసీఎస్ నిధులు యాజమాన్యం వాడుకొంటున్నది. సర్వీసులో చనిపోయిన కార్మికుల కుటుంబాలలోని వారికి ఉద్యోగం ఇవ్వడం లేదు. పైగా కనీసం వారికి రావలసిన ఇడిఎల్ఐఎస్, ఎన్బిటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. రిటైరైన వారి బెనిఫిట్స్ చెల్లించడం లేదు. నష్టాల పేరుతో కార్మిక ప్రయోజనాలపైన దాడి చేయడం పెరుగుతూ వస్తున్నది. మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి రావలసిన సౌకర్యాలు, ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇవ్వడం లేదు.
అటు సంస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తూ, అన్ని విభాగాలలో ప్రయివేటును ప్రోత్సహి స్తున్నారు. ఇటు కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదు. కార్మికవర్గం నుండి ప్రతిఘటన రాకుండా వుండటానికి కార్మికోద్యమంపై నిర్బంధం కొనసాగిస్తున్నారు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం అని చెప్పకుండానే, ఆ విధానంలోని సారాన్ని పాలకులు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను అర్థం చేసుకోవాలి. ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.
- పుష్పా శ్రీనివాస్