Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు 'తప్పకుండా' నిరుద్యోగాన్ని మరింత పెంచుతాయి. ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నందువలన ద్రవ్యోల్బణం వచ్చిందని భావించి ప్రభుత్వాలు ఆవిధంగా చేస్తాయా అంటే అటువంటిదేమీ కాదు. ఉద్యోగాలకు, ద్రవ్యోల్బణానికి మధ్య ఆ విధమైన సంబంధాన్ని సూచించే సిద్ధాంతమేదీ లేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడానికి కారణం మార్కెట్లో ఉన్న సరుకులు తక్కువైపోయి, వాటిని కొనుగోలు చేయడానికి ఉన్న డబ్బు ఎక్కువైపోవడమే (మరీ ఎక్కువ సొమ్ము మరీ తక్కువ సరుకులను కొనుగోలు చేయడానికి రంగప్రవేశం చేయడం వలన ద్రవ్యోల్బణం వస్తుంది అన్న సిద్ధాంతం) అని వాదించేవారూ ఉన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే మార్కెట్లో అదనంగా వచ్చిపడుతున్న సొమ్మును అదుపు చేయాలని వారు పరిష్కారంగా సూచిస్తారు. వారు చెప్పినట్టు ద్రవ్యవిధానాన్ని మార్చి ధన ప్రవాహాన్ని గనుక అదుపు చేస్తే అప్పుడు కూడా అది మరింత ఎక్కువ నిరుద్యోగానికే దారి తీస్తుంది.
ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం ఉపాధి కల్పన గరిష్ట స్థాయిలో కొనసాగేట్టు చూస్తూ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రత్యక్షంగా ధరల నియంత్రణను, అవసరమైన సందర్భాల్లో రేషనింగ్ విధానాన్ని ఎందుకు అమలు చేయకూడదు? ఆ విధమైన చర్యల ద్వారా ధరల పెరుగుదలను, అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చును కదా?
పెట్టుబడిదారులు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో అతిగా ప్రత్యక్ష జోక్యం కల్పించుకోడాన్ని కోరుకోరు. ఆ విధంగా జోక్యం కల్పించుకోవడం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క యోగ్యతను దెబ్బతీస్తుంది. ఈ వ్యవస్థలోని లోపాలను సరిచేయడానికి ప్రభుత్వం ఇంతగా జోక్యం చేసుకోవలసివస్తూంటే ఇక ఈ వ్యవస్థ వలన ఉపయోగం ఏమిటి? అన్న ప్రశ్న ప్రభుత్వ జోక్యం వలన తలెత్తుతుంది.
ఇక రెండో ప్రశ్న: నిరుద్యోగం ఉండడం పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఉపయోగపడదు కదా? పెట్టుబడిదారుడు ఎక్కువ లాభాన్ని పొందాలంటే ఎక్కువ మంది కార్మికుల దగ్గర అదనపు విలువను దోచుకోవాలి కదా? మరి ఆ కార్మికుల సంఖ్య తగ్గిపోతూంటే దానివలన పెట్టుబడిదారుడికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటి? పెట్టుబడిదారీ ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని అదుపు చేసేదానికన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే ఎక్కువగా ఎందుకు తాపత్రయపడుతూంటాయి? ద్రవ్యోల్బణం మరీ ఎక్కువగా పెరిగిన సందర్భాలలోనే కాక, ఒక మోతాదులో ద్రవ్యోల్బణం ఉన్నా నిరుద్యోగాన్ని పెంచి తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూంటాయి. అమెరికాలో కరోనా రాకమునుపు ఉద్యోగాలు చేస్తూండిన వారిలో కరోనా కాలంలో ఎంతోమందికి ఉద్యోగాలు పోయాయి. వారందరికీ ఇంకా తిరిగి ఉద్యోగాలు రానేలేదు. కాని, అక్కడి ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచివేయడానికి సిద్ధమైపోయింది. డిసెంబర్లో ద్రవ్యోల్బణం 7శాతం చేరుకోవడమే వడ్డీ రేట్లను పెంచడానికి కారణంగా చూపిస్తోంది. 1982 తర్వాత ఇదే అత్యధిక రేటు. అంటే గత 40సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వచ్చాయని స్పష్టమవుతోంది.
లేబర్ పార్టీ తరఫున ప్రధానిగా పని చేసిన టోనీ బ్లెయిర్ కాలంలో అంతకు ముందు ఉన్న టోరీల ప్రభుత్వం 2.5శాతం వద్ద ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నందుకు ఆ పార్టీని విమర్శించాడు. ఆ లక్ష్యం మరీ తక్కువగా ఉందని, ద్రవ్యోల్బణాన్ని ఇంకా దిగువ స్థాయిలోనే అదుపు చేయాలని ప్రకటించాడు. నిరుద్యోగం రేటు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని దాదాపు సున్నా స్థాయికి తీసుకురావడానికి ఆ మూల్యం చెల్లించాల్సిందేనని అతని అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పాడు. దాదాపు పూర్తి స్థాయికి ఉపాధికల్పన సాధించాలన్న లేబర్ పార్టీ లక్ష్యాన్ని పూర్తిగా బ్లెయిర్ రివర్స్ చేశాడు.
ద్రవ్యోల్బణం తక్కువ మోతాదులో ఉన్నా, దానిని అదుపు చేయడానికి, అందుకోసం నిరుద్యోగాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధమవుతుంది ?
టోనీ బ్లెయిర్, ఇతర మితవాద ఆర్థికవేత్తలు దీనికి ఇలా సమాధానం చెప్తారు: 'తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంటే దాని వలన వృద్ధి వేగంగా జరుగుతుంది. వృద్ధి వేగంగా ఉంటే దాని వలన నిలకడైన ఉపాధి కల్పన దీర్ఘకాలంలో జరుగుతుంది.'
అయితే ఈ వాదన సిద్ధాంతంగా చెప్పుకోడానికే పనికొస్తుంది. ద్రవ్య విధానాన్ని, నగదు విధానాన్ని నియంత్రించడంతోబాటు, దానికి హెచ్చు స్థాయిలో ఉన్న నిరుద్యోగం తోడైతే దాని ఫలితంగా పరిశ్రమల స్థాపక సామర్థ్యంలో మరింత ఎక్కువ భాగం నిరుపయోగంగా మిగిలిపోతుంది. దానివలన ఆశించిన లాభం సకాలంలో రాక పెట్టుబడిదారుడు నిరాశ చెందుతాడు. పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపించడు. దాని వలన ఉపాధి కల్పన వేగం తగ్గిపోతుంది.
పెట్టుబడిదారుల లాభాలను పెంచి వారు మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేట్టు ప్రోత్సహించడానికి వారిపై విధించే పన్నులను తగ్గించాలని, అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండేందుకు, ద్రవ్యలోటు పెరగకుండా ఉండేందుకు కార్మికులపై అదనంగా పన్నులు వేయాలని చెప్పే వాదన ఎంత తప్పో బ్లెయిర్ చెప్పే వాదన కూడా ఆ విధంగానే తప్పు. కేవలం సిద్ధాంతపరంగా తప్పు అవడమే కాదు, ఆచరణలో సైతం దానిని సమర్థించేందుకు చిన్నపాటి ఆధారం కూడా లేదు.
ఇక రెండో వాదన కూడా ఉంది. నిరుద్యోగంతోనైనా కార్మికులు బతకగలరు కాని ద్రవ్యోల్బణంతో బతకలేరు అని ఈ వాదన అంటుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలను చేపట్టడం సరైన విధానం అని ఈ వాదన చెపుతుంది. అయితే ఏ పెట్టుబడిదారీ ప్రభుత్వమూ కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోదు. అంతే కాక, మెడమీద కత్తిలాగా నిరుద్యోగ ప్రమాదం ఉన్నప్పుడు కార్మికుడిలో కలిగే అభద్రతాభావం తో పోల్చుకున్నప్పుడు ద్రవ్యోల్బణం ఏ పాటి సమస్య?
అయినా, నిరుద్యోగాన్ని తగ్గించడం కన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ హిక్స్ వంటివారు వాదించారు. థాచర్ ప్రభుత్వ కాలంలో ఈ విధానాన్నే పాటించారు. కాని, కార్మికులు నిరుద్యోగం కన్నా ద్రవ్యోల్బణాన్నే పెద్ద సమస్యగా పరిగణిస్తారనేదానికి ఎటువంటి ప్రాతిపదికా లేదు.
ఈ విధంగా నిరుద్యోగం కన్నా ద్రవ్యోల్బణాన్నే పెద్ద సమస్యగా పెట్టుబడిదారీవర్గం భావించడం వర్తమాన పెట్టుబడిదారీ ప్రపంచం మీద ద్రవ్య పెట్టుబడికున్న పెత్తనాన్ని సూచిస్తుంది. ప్రస్తుత కాలంలో పెట్టుబడిదారుల సంపదలో ఎక్కువ భాగం ద్రవ్య రూపంలోనే (షేర్లు, బాండ్లు, వగైరా) ఉంటున్నాయి. సరుకుల ధరలు పెరగడం వలన ఈ ద్రవ్య రూపంలోని ఆస్తుల నిజ విలువలు తగ్గిపోతాయి. అందుచేత సరుకుల ధరలు పెరగడాన్ని ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆ ధరలను అదుపు చేయాలన్న ఒత్తిడిని పెట్టుబడిదారీ ప్రభుత్వంపై తీసుకొస్తుంది. దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే అధిక ప్రాధాన్యతనిస్తుంది.
ఆ విధంగా పెత్తనం సాగించే వర్గాల ప్రయోజనాలకు తలొగ్గి నిరుద్యోగాన్ని పెంచడానికైనా సిద్ధపడి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తాయి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. నిరుద్యోగం పెరుగుతున్నకొద్దీ, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయే అదనపు విలువస్థాయి తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయే అదనపు విలువ నుంచే పెట్టుబడి యొక్క అన్ని విభాగాలూ తమ తమ వాటాలను పొందుతాయి. అదనపు విలువ స్థాయి తగ్గిపోతే ఆ మేరకు వాటి వాటాలు కూడా తగ్గిపోతాయి. అటువంటప్పుడు నిరుద్యోగాన్ని తగ్గించాలన్న అంశానికి ప్రాధాన్యతనివ్వకుండా పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని ఎందుకు ఎక్కువగా పట్టుబడతారు?
ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం బాగా పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో వాస్తవ సంపదను ఉత్పత్తిచేసే రంగానికి, ద్రవ్య పెట్టుబడి రంగానికి మధ్య పొంతన లేకుండా పోవడం అనేది చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఒక వైపు వాస్తవ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం బాగా పెరిగిపోయి, మాంద్యం తాండవిస్తోంది. ఇది అమెరికాలో హౌసింగ్ బుడగ పేలిపోయిన అనంతర కాలంలో మరీ స్పష్టంగా కనిసిస్తుంది, కాని ఇంకోవైపు స్టాక్ మార్కెట్లలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం బాగా సాగుతోంది. ఇది వాస్తవ ఆర్థిక రంగానికి, ద్రవ్య పెట్టుబడి రంగానికి మధ్య పొంతన ఏమాత్రమూ లేదన్న వాస్తవాన్ని సూచిస్తోంది. ద్రవ్య పెట్టుబడికి వచ్చిపడే సంపద కేవలం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయే అదనపు విలువ మీద మాత్రమే ఆధారపడిలేదని కూడా మనకి ఈ వాస్తవం తెలుపుతోంది.
స్టాక్ మార్కెట్లో జరిగే వ్యాపారం నడిచేది ఒకానొక సంస్థ ఎంత ఎక్కువ అదనపు విలువను ఉత్పత్తి చేయగలదు అన్న విషయం మీద కాదు. ఒకానొక సంస్థ వాటాలను ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత కొన్నాళ్ళకు అమ్మినప్పుడు ఎంత అదనంగా మనం పెట్టిన పెట్టుబడి పెరుగుతుంది అన్న విషయంమీద ఆధారపడి స్టాక్‌మార్కెట్ స్పెక్యులేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న రావొచ్చు. ఆ స్టాక్‌కు వచ్చే అదనపు ఆర్థిక విలువ ఎక్కడినుంచి వస్తుంది? అది అదనపు విలువ ఉత్పత్తి మీద ఆధారపడినది కాకపోతే బూటకపు విలువ అయివుండాలి. అంటే ఒక స్టాక్‌ను అమ్మిన వ్యక్తికి వచ్చే అదనపు ప్రయోజనం మరో వ్యక్తికి నష్టదాయకంగా మారుతుంది. స్టాక్ మార్కెట్లో చాలామంది జరిపే వరస లావాదేవీల్లో వారికి అదనపు సంపద చేకూరితే, మరి వేరే ఎందరో ఆ మేరకు నష్టపోయి ఉండాలి.
ఈ విధంగా తప్పనిసరిగా జరుగుతుంది. కాని స్టాక్‌మార్కెట్ వ్యాపారంటో నష్టపోయినవారి నష్టాలు కేవలం అందులో పాల్గొన్నవారికే పరిమితం కావు. వాటిని ఇతరులమీద కూడా రుద్దడం జరుగుతుంది. ఇది మూడు విధాలుగా జరుగుతుంది. షేర్లు కొనేవాడు అచ్చంగా తన స్వంత సొమ్ముతోనే ఆ కొనుగోలు చేయడు. రుణాలు తీసుకుని కొంటాడు. అతనికి నేరుగాను, ప్రరోక్షంగాను రుణాలు ఇచ్చినవారిమీద కూడా ఆ నష్టాల భారం పడుతుంది. ఏ ఆర్థిక సంస్థల ద్వారా ఆ షేర్ల కొనుగోలుకు రుణం ఇవ్వడం జరిగిందో, ఆ ఆర్థిక సంస్థలను ఆదుకోడానికి ప్రభుత్వం ముందుకొచ్చి సాయం అందిస్తుంది. అందుకోసం టాక్స్‌పేయర్ల సొమ్మును వినియోగిస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడల్లా ఆ నష్టాన్ని భరించేది ఆ షేర్ వ్యాపారంతో ఏ సంబంధమూ లేని టాక్స్ పేయర్లు! ఒకవేళ టాక్స్‌ల ద్వారా వచ్చే రెవెన్యూ నుండి నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయకపోతే, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో భర్తీ చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ వ్యాపారంలో కొత్త ఆస్తులు అదనంగా వచ్చి చేరుతాయన్నమాట.
ఈ విధంగా సంపద ఒకదగ్గర చేరడాన్ని మార్క్స్ ''ఆదిమ సంచయం'' అన్నాడు. అంటే కొల్లగొట్టి పోగేసుకోవడం. సామాన్య జనాల నుండి లాక్కున్న సొమ్ముతోగాని, ప్రజల ఉమ్మడి ఆస్తుల్ని ప్రయివేటు వ్యక్తుల పరం చేయడం ద్వారా గాని ఈ కొల్లగొట్టి పోగేసుకునే ప్రక్రియ సాగుతుంది.
అంటే కార్మికుల అదనపు విలువను దోచుకోవడం ద్వారా మాత్రమే కాక, ద్రవ్య పెట్టుబడి ప్రజలను కొల్లగొట్టడం ద్వారా ఎక్కువగా చేజిక్కించుకుంటుంది. అందుకే ద్రవ్య పెట్టుబడికి నిరుద్యోగం ఎంత ఉంది, ఎంత పెరిగింది అన్నదానితో నిమిత్తం లేదు. ద్రవ్యోల్బణం మాత్రం పెరగకూడదు. అందుకే ఆ ద్రవ్య పెట్టుబడి పెత్తనం కింద నడిచే ప్రభుత్వాలకూ నిరుద్యోగం ఎంతమాత్రమూ పట్టదు.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్