Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్వం త్యజించిన 'రామానుజుడికి' వందల ఎకరాల్లో 216 అడుగుల భారీ విగ్రహం..! క్రతువుల పేరుతో, యాగాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు..! ఒకవైపు కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే మరోవైపు రూ.20 కోట్లకు పైగా విలువ చేసే నెయ్యిని హోమ గుండాల్లో తగలేశారు..! రామానుజా చార్యులు సమతా ధర్మాన్ని బోధించి ఉండవచ్చు. కుల వివక్షతను నిరసించవచ్చు.. ఆయన గురించి అంబేద్కర్ ప్రశంసించి ఉండవచ్చు.. కానీ రూ.వందల కోట్లను ఇలా విగ్రహాల పేరుతో, ఆలయాల పేరుతో, క్రతువుల పేరుతో ఖర్చు చేయడాన్ని అంబేద్కర్ హర్షించే వాడు కాదేమో..!
చిన జీయర్‌కు కనీస సామాజిక స్పృహలేదు. కులాలను రూపు మాపాలి అని రామానుజులు బోధిస్తే, చినజీయర్ కులాలు ఉండాలి అని విరుద్ధమైన బోధనలు చేస్తున్నాడు. అక్కడి విగ్రహం పేరుకే సమాతామూర్తి. కానీ జరుగుతున్న దంతా వందల ఎకరాల తెలంగాణ భూములను హస్తగతం చేసుకునే కుట్ర..! దాని పేరుతో జరిగే వ్యాపారం. దాని చుట్టూ పెనవేసుకున్న ఒక వర్గ రాజకీయం. ఒక భావజాల విస్తరణ.
గద్దర్ నుంచి జీయర్ దాకా...
ఒకప్పుడు గద్దరన్న పాట ప్రజా సమస్యలకి నోరిచ్చి ఊరేగింపుల్లో మారు మోగింది. నిజానికి ఆ పాట పాటలాగే ఉంది. గద్దరే మారిపోయాడు. అయితే..! ఇక్కడ గద్దర్ నిన్న పాడిన పాటమీద వచ్చిన వ్యతిరేకత ఆగ్రహం కాదు. అది ఆక్రోశం, అయ్యో! మా గొంతుక మారిపోయిందే అనే బాధలోంచి వచ్చిన నిస్సహాయపు నిట్టూర్పు మాత్రమే. నిజానికి గద్దర్ పోరాట జీవితమూ, ఇప్పటి ఆయన బాట పూర్తిగా వ్యక్తిగతం. ఇక్కడ ఒకటి గమనిస్తే.. గద్దర్ మీద వచ్చినన్ని ట్రోల్స్ ఆ ప్రాజెక్ట్ మొత్తానికి సూత్రధారి అయిన జీయర్ స్వామి మీద రాలేదు. వేలకోట్ల రూపాయలని అక్కడ కేటాయించిన ప్రభుత్వం మీద కూడా రాలేదు. అన్నిటికన్నా విచిత్రం రాష్ట్ర అధికార పార్టీ అభిమానులు కూడా గద్దర్ని విమర్శించడం! అసలు అధికారంలో ఉన్న పార్టీనే కదా ఈ కథంతా నడుపుతోంది!! నష్టమేమీ లేదు. ఇప్పుడు ఇంకో పాట వస్తుంది. గద్దర్ తప్పుకున్న చోట మరో పాట మొదలవుతుంది. సఫ్దర్ని నరికితే పాట మూగబోయిందా... అది కొనసాగుతూనే ఉంటుంది. ఒకప్పటి అభిమానం కొద్దీ ''అయ్యో!'' అనుకుంటాం గానీ.. గద్దర్ మొదలూ కాదు, చివరా కాదు.. కానీ ఇప్పటి గద్దర్ని లైట్ తీసుకుంటూ. కొన్ని విషయాలని మాట్లాడుకుందాం.
ఎకరాల కొద్దీ భూమి కేటాయింపు యవ్వారం మనం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మన ఇళ్ళని ఖాళీ చేయించలేదు కదా మనకేం అవసరం అనుకున్నాం.. దళితులకు ఇస్తామన్న మూడెకరాలకే దిక్కు లేదంటున్న ప్రభుత్వం ఆయనకి అంతంత భూమిని ఎందుకు ఇవ్వటం? అన్న ఆలోచన కూడా మనకు రాలేదు. కోవిడ్ విషయంలో అంత దుఃఖాన్ని చూసాకైనా హాస్పిటల్స్ విషయంలో మన చైతన్యం కదలలేదు. విద్యా సంస్థల దోపిడీ చూస్తున్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మన గొంతు పెగల్లేదు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన భూమి, ఆ సమతా ఆశ్రమం వెనుక జరగబోయే దందా, చేతులు మారిన కోట్ల డబ్బు.. ఇవేవీ మన ఆలోచనల్లోకే రాకపోవడం విచారకరమైన నిజం.
అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి? అనేవాళ్ళకి గట్టి సమాధానం ఎదురవుతోంది? ''భక్తులు విరాళాలు ఇచ్చారు అది వాళ్ళ ఇష్టం''. నిజమే! ఇక్కడ వారి వ్యక్తిగత డబ్బుని ఇవ్వొద్దని అనటానికి, ఎందుకు ఇచ్చారు అనటానికి ఎవరికీ హక్కు లేదు. కానీ, ప్రభుత్వాలు కూడా ఇవ్వటమే కదా మనం అడగాల్సిన ప్రశ్న. అది వదిలేసి జీయర్‌ని పట్టుకుంటే ఎలా?
కిలోల కొద్దీ నెయ్యి పారబోస్తున్నారు.. అది కూడా వాళ్ళ ఇష్టం. డబ్బుంది కొంటారు.. పారబోస్తారు. ఆహార వృధాని పట్టించుకునే దశ మనకు ఇంకా రాలేదు. దాన్ని ''ఇప్పుడు'' ఎత్తి చూపినా లాభం లేదు. ఇక్కడ పారబోసే నెయ్యి విషయాన్ని పక్కన పెట్టి.. అసలు అంత ఖర్చుతో ఆ ఏర్పాట్లు, హంగామా వెనుక ఎంత పెద్ద జన సమీకరణ, ఎంత విస్తృత భావజాల వ్యాప్తి జరుగుతుందో చూడాలి. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ జాతర మొదలు.. కొమురవెల్లి మల్లన్న జాతర వరకూ గిరిజన, బహుజన సాంప్రదాయాలను తొక్కిపెట్టి ''బ్రాహ్మణ హిందూత్వ'' పరిధిలోకి తెచ్చి మరీ తమలో కలుపుకుంటున్నారు. కనిపించకుండానే జనంలోకి హిందూత్వ ప్రభావాన్ని తీసుకుపోయే ఎజెండా ఇది. దీన్ని అర్థం చేసుకుంటే తప్ప రాబోయే కాలపు సంక్షోభాన్ని ఆపలేం.
సర్వసంగ పరిత్యాగులకు ఆస్తులు ఎందుకు? అనే ప్రశ్న కేవలం ఆయన కారు, ఫ్లయిట్ జర్నీల దగ్గరే ఆగిపోతోంది.. ప్రభుత్వాలు ఏ లెక్కన ఇన్నిన్ని ఎకరాల భూముల్ని వాళ్ళకి ఇస్తున్నాయి? వందల కోట్ల డబ్బు చేతులు మారి.. నల్ల ధనం అక్కడ కలర్ మారి కుప్పలు పడుతోంటే ఎందుకు చోద్యం చూస్తున్నాయి?
ఇది ముందు ముందు అడవులని ధారాదత్తం చేసేదాకా కూడా వెళ్తుంది. ఇప్పటికే ఇషా ఫౌండేషన్ ఈ పని మొదలు పెట్టింది. అలా ఒక్క ఆశ్రమ, ఆధ్యాత్మిక కేంద్రం కోసం మొదలయ్యే నిర్మాణాలు.. అక్కడికి రోడ్డు, వచ్చిపోయేవాళ్ళ సౌకర్యార్థం హౌటళ్లు, రిసార్టులు, వాళ్ళ అవసరాలకు వెలిసే రకరకాల స్టాళ్లు, వాటి కోసం మనుషులు.. ఇలా క్రమ క్రమంగా ఆ అడవి ప్రాంతం నాగరికుల చేతుల్లో పడుతుంది. ఆ భూములన్నీ ఎవరు ఎలా అమ్ముకుంటారో ఊహకందనిది కాదు. అదే భూమిని ఏ యూనివర్సిటీ కోసమో, మరే సైన్స్ సెంటర్ కోసమో ఇవ్వటానికి లక్ష రూల్స్ అడ్డొస్తాయి.
కోవిడ్ నుంచి రక్షణ కోసం ఫేస్ షీల్డ్ వాడుతూ, వ్యాక్సిన్ కూడా స్వీకరించిన జీయరయ్యవారు ఇప్పుడు ఏదో యాగం చేస్తే కోవిడ్ పోతుంది అంటున్నారు. లక్షల మంది ఆ మాటని సీరియస్‌గా నమ్ముతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎంత ప్రమాదకరమైన స్థితి ఇది..
మనం ప్రశ్నించాల్సింది, విమర్శించాల్సింది.. జీయర్ స్వామినో, గద్దర్నో కాదు. వాళ్ళని ముందు నిలబెట్టి కార్పొరేట్లని విస్తరించే కుట్రలు చేసే ప్రభుత్వాలని. వాళ్ళని ట్రోల్ చేస్తూనే.. అసలు పాయింట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీలు, వ్యక్తిగత అభిమానాలకు బియాండ్గా నిలబడాలి..
- జి. రేణు యాదవ్
సెల్:7075557907