Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముస్లిం విద్యార్థినులు హిజాబ్ (తలను కప్పివుంచే వస్త్రం) ధరించడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న అనుకూల - వ్యతిరేక ఆందోళనలు కర్నాటకలో పెరిగిపోయాయి. జనవరి చివరి వారంలో ఉడిపి ఎం.జి.ఎం. కాలేజీలో ప్రారంభమైన ఈ వివాదం క్రమేపీ కర్నాటక, ఇరుగుపొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటక విద్యాచట్టం- 1983లోని సెక్షన్-133ను ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివలన కర్నాటకలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫామ్ తప్పనిసరి అయ్యింది. ఈ చట్టం అమలు వలన మైనారిటీ విద్యార్థినులు హిజాబ్ ధించడంపై నిషేధం విధించినట్టయింది.
మైనారిటీ విద్యార్థినలు హిజాబ్ ధరించి పాఠశాలలు, కళాశాలలకు హాజరు కావడంపట్ల డ్రస్కోడ్ను ఉల్లంఘిస్తున్నారంటూ కొందరు మెజారిటీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాషాయ కండువాలు ధరించి జై శ్రీరామ్ నినాదాలతో నిరసనలు తెలియజేశారు. హిందూత్వ ఆందోళనాకారులను ఎదుర్కొంటూ, హిజాబ్ ధరించి, అల్లాహౌ అక్బర్ అని నినాదాలు చేస్తూ, మాండ్య జిల్లాలోని పి.ఇ.ఎస్. కాలేజీలో ముష్కాన్ఖాన్ అనే యువతి తరగతులకు హాజరయ్యింది. ముష్కాన్ఖాన్ ధైర్యానికి మెచ్చి, జమాతే ఉలేమా హింద్ సంస్థ ఆమెకు ఐదులక్షల రూపాయలు నగదు బహుమానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. అంతేకాదు, ఈ అంశం తాలూకు న్యాయ వివాదాన్ని విచారిస్తున్న కర్నాటక హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం, వ్యక్తిగత, రాజ్యాంగపరమైన అంశాలు ముడిపి ఉన్నందున విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని నిర్ణయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ అంశంపైన ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను, యువతులను పాఠశాలలకు, కళాశాలలకు హిజాబ్ ధరించి వెళ్ళేందుకు అనుమతించాలని భారత్లోని నాయకులకు విజ్ఞప్తి చేశారు.
అనేక మానవ జాతులు, భాషలు, రంగులు, మతాలు, వర్ణాలు, కులాలు, సంస్కృతులు కలిగిన దేశం మనది. ఈ బహుళ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల గౌరవం, సమాదరణ పాటించే లౌకిక రాజ్యాంగ ఉన్నతి మనది. దైవారాధన, మతావలంబన, హేతువాదం, ఆహారం, వస్త్రధారణ, సాంప్రదాయాలలో ప్రతి పౌరుడు / పౌరురాలూ ఎవరికి ఇష్టమొచ్చిన మార్గాన్ని వారు అనుసరించే స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యం మనది. కాగా, దేశంలోని కొన్ని మెజారిటీ రాజకీయ సంస్థలు, శక్తులు 'ఒకే దేశం - ఒకే చట్టం', 'ఉమ్మడి పౌర స్మృతి' అనే పేరిట బహుళ మతాల, జాతుల, భాషల మైనారిటీల పట్ల అసహనం, ద్వేషం వ్యక్తం చేసే ధోరణి సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల్లో ఇటీవల పెరిగిపోయింది. మైనారిటీ ఉగ్రవాదం, నక్సలైట్ తీవ్రవాదం పేర మైనారిటీ వ్యతిరేక, దళిత వ్యతిరేక, బహుజన వ్యతిరేక ద్వేషాలు, అసహనాలు రెచ్చగొట్టడం మెజారిటీ ఆధిపత్య శక్తులకు అలవాటుగా మారింది. ఇది అణచివేతలను సాధారణీకరించే స్థాయికి చేరింది. మెజారిటీ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునే రాజకీయాలు పెచ్చుమీరిపో తున్నాయి. విద్యాలయాల్లో కొన్నిసార్లు కమ్మలు, ముక్కుపుడక, గాజులు, కంకణాలు, కాళ్ళకు గొలుసులు, కాశీదారాలు, ఫ్యాషన్ బాండ్లు, పసుపూ, పారాణీ, మట్టెలు, మెడలో పూసలు, గొలుసులు, బొట్టూ, కుంకుమలు పెట్టుకున్న వారు తిరుగుతున్నప్పుడు మైనారిటీ విద్యార్థినులు ఆహ్వానించి, ఆదరించారే గానీ, ఎటువంటి అభ్యంతరాలూ పెట్టలేదు. ఓం నమశ్శివాయలు, సరస్వతి, గణపతి పూజలు, దేవీ, దేవతల బొమ్మలు, కొలువులు జరిగినప్పుడు మైనారిటీలు ఎన్నడూ అభ్యంతరాలు తెలపలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికార ప్రారంభోత్సవాల్లో అయ్యప్ప, బాలజీ, భవానీ భక్తులు దీక్షా దుస్తుల యూనిఫారాలు ధరించి విధులకు హాజరవుతున్నప్పుడు మైనారిటీలు గౌరవించి ఆదరించారే తప్ప, అభ్యంతర పెట్టలేదు. మెజారిటీలకు చెందిన పూజారులు ఎక్కువ సందర్భాల్లో పూజలు, క్రతువులు, కర్మకాండలు చొక్కాలు ధరించకుండా అర్థనగ రూపాల్లో నిర్వహిస్తున్నప్పుడు ఏ మైనారిటీల నుంచీ, ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదు. మరి ముస్లిం బాలికలు, యువతులు నిండుగా వారి సాంప్రదాయక హిజాబ్ దుస్తుల్లో చదువు కోవడానికి విద్యాలయాలకు వెళ్ళడం దేశంలో కొత్తకాదు. కొత్తగా వారి సాంప్రదాయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని అనేక ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
హిజాబ్ ధరించడం, ధరించకపోవడం అనేది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రతి ముస్లిం బాలికకూ, యువతికీ, మహిళకూ ఉంటుంది. ఉండాలి. అది వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజికమైన కట్టుబాటుకు చెందిన అంశం. హిజాబ్ ధరించాలా, వద్దా అనేది పూర్తిగా వారికి సంబంధించిన అంశం. కానీ, ఇవ్వాళ హిజాబ్ ధరించకూడదు అంటున్న మూకలు, వారి నాయకుల ఉద్దేశ్యం హిజాబ్ నిషేధం మాటున ముస్లిం మహిళల అభివృద్ధిని అడ్డుకోవడం, తద్వారా మైనారిటీల అభివృద్ధినీ అడ్డుకోవడంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జైన, హిందూ, కొన్ని తెగలలోని కొన్ని కుటుంబాల్లో మహిళలు తలలపై వస్త్రాలు ధరించే ఆచారాలను పాటించడాన్ని మనం గౌరవించుకుంటున్నాం. అది వారి వ్యక్తిగత, కుటుంబ, సాంప్రదాయం కింద అర్థం చేసుకుంటున్నాం. హిందువుల సినిమా సంస్కృతిలో కూడా ఇది అప్పుడప్పుడూ ప్రతిబింబిస్తున్నది. హిందూ ఆధిపత్య కులాల రాజకీయ మహిళా సంఘాలు, రచయిత్రులు, బహుజన ప్రజా సంఘాలు, బహుజన రచయిత్రులు మైనారిటీ మహిళల హక్కులకు సంఘీభావం వ్యక్తం చేయడం ఈ సందర్భంలో మనం గమనించవచ్చు. బహుళ రూపాలు, స్వభావాలు కలిగిన గొప్ప భారతదేశ ప్రజాస్వామ్యాన్ని చిదిమేసి, చట్టాల అమలు పేరుతో కర్నాటక ప్రభుత్వం సాధించ దలుచుకున్న ''ఏకరూపత'' ఆయా మైనారిటీ బహుజన సంస్కృతులకు గొడ్డలిపెట్టుగా మారరాదు.
- కృపాకర్ పొనుగంటి