Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిజం అంటే శ్రామిక వర్గ విముక్తికి అవసరమైన పరిస్థితులను గురించి తెలియజేసే సిద్ధాంతం. కమ్యూనిస్టు సిద్ధాంతం ఆయుధంగా కలిగిన శ్రామికవర్గ పార్టీ కమ్యూనిస్టు పార్టీ. దానికోసం మార్క్స్-ఏంగెల్స్ రాసిన పత్రమే 'కమ్యూనిస్టు ప్రణాళిక'. కమ్యూనిస్టు ప్రణాళికను మార్క్స్-ఏంగెల్స్ 174 సంవత్సరాల క్రింతం 1848 ఫిబ్రవరి 21 విడుదల చేశారు. ఈ రోజును మనం రెడ్ బుక్స్ డే గా పాటిస్తున్నాం. అసలు కమ్యూనిస్టు ప్రణాళికను మార్క్స్-ఏంగెల్స్ ఎందుకు రాయాల్సి వచ్చింది..? పెట్టుబడిదారీ వర్గానికీ, కార్మిక వర్గానికీ మధ్య జరిగే పోరాటంలో కార్మిక వర్గానికి సరైన, శాస్త్రీయమైన సైద్ధాంతిక ఆయుధాన్ని అందించడానికి వారు 'కమ్యూనిస్టు ప్రణాళిక' రాశారు. 18వ శతాబ్దంలో ఇంగ్లండులో తరువాత యూరప్‌లోని అనేక దేశాల్లో వచ్చిన పారిశ్రామిక విప్లవంలో కార్మికవర్గం పుట్టింది. తమ శ్రమశక్తిని అమ్ముకోవడం మినహా బతకడానికి మరో మార్గంలేని కార్మికుల శ్రమను పెట్టుబడి దారులు దారుణంగా దోచేవారు. వారి పరిస్థితులు దుర్బరంగా తయారయ్యాయి. కార్మికుల పరిస్థితులు మెరుగుపడా లనే కోరికలూ, అందుకోసం ఉద్యమాలూ జరిగాయి. కొంత మంది కార్మికుల కష్టాలు పోవాలంటే వారిపై దోపిడీ పోవాలని ఆశించారు. అందరూ సమానత్వంతో, సుఖసంతోషాలతో జీవించే ఆదర్శ సమాజాలను ఊహించారు. ఊహించి ఊరుకోలేదు. అటువంటి సమాజాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. సెయింట్ సైమన్, చార్లెస్ ఫోరియర్, రాబర్ట్ ఓవెన్ ఇంకా అనేకమంది మానవుల ఆదర్శాలే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయనీ, మనుషుల ఆలోచనా విధానాన్ని మారిస్తే దోపిడీ పోతుందని, అందరూ సమానంగా జీవించ వచ్చనీ భావించారు. మార్క్స్, ఏంగెల్స్‌లు వీరిని ఊహాజనిత సోషలిస్టులు అన్నారు.
1836లో స్థాపించబడిన 'లీగ్ ఆఫ్ జస్ట్' అనే విప్లవ సంస్థ మార్క్స్, ఏంగెల్స్‌ల నాయకత్వంలోని 'కమ్యూనిస్టు కరస్పాండెంట్ కమిటీ'తో 1847లో విలీనమై 'కమ్యూనిస్టు లీగ్' అనే సంస్థగా ఏర్పడింది. 1847 డిసెంబర్లో కమ్యూనిస్టు లీగ్ రెండవ మహాసభ జరిగింది. ఈ సంస్థ మార్క్స్, ఏంగెల్స్‌లకు ఊహాజనిత సిద్ధాంతాలన్నింటినీ పూర్వపక్షం చేస్తూ శాస్త్రీయమైన సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుంచే కర్తవ్యాన్ని అప్పగించింది. ఈ కృషి నుండి ప్రపంచం ముందుకు వచ్చిన శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతంతో కూడిన కార్యాచరణ ప్రణాళికే 'కమ్యూనిస్టు మానిఫెస్టో'. అప్పటికే యూరప్‌లో జరుగుతున్న కార్మికవర్గ పోరాటలనూ, అంతకు ముందు సమాజాల్లో జరిగిన పోరాటాలూ అవి తెచ్చిన మార్పులను పరిశీలించిన మార్క్స్-ఏంగెల్స్... వర్గ పోరాటం ద్వారానే సమాజం మారుతుందని, ఇప్పటి వరకు జరిగిన మానవ జాతి చరిత్ర అంతా (ఆదిమ సమాజం మినహా) వర్గ పోరాటాల చరిత్రేనని గ్రహించారు. పెట్టుబడిదారీ సమాజాన్ని మార్చి ఆ స్థానంలో దోపిడీలేని సమాజాన్ని నిర్మించగలిగేది చైతన్యయుతమైన, సంఘటితమైన కార్మికవర్గం మాత్రమేనని కార్మిక వర్గ విప్లవకర స్వభావాన్ని ఎత్తిచూపారు. కేవలం మంచి ఆశయాలతోనో, గొప్ప వ్యక్తుల వల్లనో, వారి ఆదర్శవంతమైన ప్రవర్తనల వల్లనో సమాజంలో మార్పు రాదని, వర్గపోరాటం అనివార్యం అని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు ప్రణాళికకు గుండెకాయ వంటి ఈ వర్గపోరాట ప్రతిపాదనను మార్క్స్ చేశాడని ఏంగెల్స్ రాశాడు. అయితే ఏంగెల్స్ అంతకు ముందే రాసిన కమ్యూనిస్టు మూల సూత్రాల ఆధారంగానే ప్రణాళికను రూపొందించారు.
కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేది ప్రపంచ కమ్యూనిస్టుల కార్యక్రమం. నేటి వర్గ ప్రపంచాన్ని విశ్లేషించి, శ్రామికవర్గాలకు కార్యాచరణ నిర్దేశించిన దిక్సూచి. ఈ గ్రంథంలోని వర్గపోరాట ప్రతిపాదనలు కార్మికవర్గానికి, శ్రామికప్రజలకు విప్లవ కార్యాచరణను అందించాయి. అందువల్ల సమాజాన్ని మార్చాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యాచరణ ప్రణళికను చదివి, జీర్ణం చేసుకోవాలి.
ఎస్. వెంకట్రావు