Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో కాంగ్రెస్ ప్రయాణం ఎటువైపు?
బీజేపీ మీద ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న కేసీఆర్ నికరంగా నిలబడతారా?
రాహుల్‌గాంధీ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీ నేతను కేసీఆర్ నిలదీస్తున్నారు.
అదే సమస్యమీద రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు.
బీజేపీ ముక్త భారత్‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్‌ను గద్దెదించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గర్జిస్తున్నారు.
హుజురాబాద్‌లో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించింది.
బీజేపీని గెలిపించే ఎత్తుగడలు కాంగ్రెస్ వేసింది.
ఇంతకూ... కాంగ్రెస్ ఏమి సాధించదలచింది?
ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆరాటమా? బీజేపీ మీద పోరాటమా?
ఈ మధ్య రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలో బీజేపీ సర్కారు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ సర్కారు విధానాలను తూర్పారబడుతున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నది. రాష్ట్ర రాజకీయాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు మరోసారి తెలంగాణ ప్రజల ముందు పరీక్షకు నిలబడవల్సి వస్తున్నది. గత నెలరోజులలోనే అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ పరీక్షలనెదుర్కొన్నది. పిల్లిమొగ్గలు వేసింది.
రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే తిరగదోడే ప్రయత్నం బీజేపీ ఆరెస్సెస్‌లు చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం రాజ్యాంగం పునాదుల మీదనే దాడి చేస్తున్నది. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, ఫెడరల్ స్వభావం మన రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వంగా వచ్చిన రాజ్యాంగ పునాదులు ఇవి. భారత స్వాతంత్య్రోద్యమంలో అణు మాత్రం సంబంధం కూడాలేని కేంద్ర పాలకులు, రాజ్యాంగంలోని కీలక అంశాల మీద దాడికి పూనుకున్నారు. నిజానికి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే రాజ్యాంగ సమీక్షకు ప్రయత్నించారు. ఒక కమిటీ వేసారు. ఇప్పుడు కేంద్రంలో పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ ప్రత్యక్ష దాడి ప్రారంభించింది. అలాంటి బీజేపీ ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించింది. ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించింది. ప్రజలు, దళిత నేతలు గందరగోళ పడితే అర్థం చేసుకోవచ్చు. జాతీయపార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీతో గొంతుకలిపారు. బీజేపీ ఎత్తుగడలకే తోడ్పడ్డారు. రాజ్యాంగాన్ని ఏయే విషయాలలో మార్చాలని ప్రతిపాదిస్తున్నారో వివరించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది. అప్పుడు విషయాలను బట్టి స్పందించవచ్చు. అదేమీలేకుండానే బీజేపీతో రాష్ట్ర కాంగ్రెస్ కూడా వంతపాడింది.
ఇప్పుడు కేసీఆర్ స్పష్టతనిచ్చారు. దళితుల, గిరిజనుల రిజర్వేషన్ పెంచాలనీ, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా కట్టడి చేయాలనీ, చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలనీ, మహిళల మీద, దళితుల మీద దాడులు నిరోధించాలనీ, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. రాష్ట్రాల హక్కుల మీద దాడిని, కేంద్రం చేతుల్లో అధికారాలు, వనరుల కేంద్రీకరణను అడ్డుకోవాలన్నారు. నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలన్నారు. ఇవన్నీ సాధించడానికి రాజ్యాంగం మార్చాలన్న చర్చ జరగాలన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చెబుతారు? ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఎమర్జెన్సీ నియంతృత్వ పాలన చేసింది కాబట్టి మోడీ నియంతృత్వాన్ని కూడా ప్రశ్నించవద్దంటారా? కాంగ్రెస్ పాలనలో కూడా రాష్ట్రాల హక్కులు హరించారు. గవర్నర్లను కేంద్రం ఏజెంట్లుగా, కాంగ్రెస్ సాధనాలుగా వాడుకున్నారు. అందువల్ల ఇప్పుడు బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారా? కావచ్చు... కనీసం లౌకిక విలువల పరిరక్షణ కోసం, దళితులు, మహిళల మీద దాడులను అరికట్టడం కోసమైనా బీజేపీ పాలనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు కదా! విద్యుత్తు సవరణ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి కదా!
బీజేపీ ముక్త భారత్‌కు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సర్వశక్తులూ ఒడ్డాలన్నారు. ఈ విషయం మాట్లాడకుండా కేసీఆర్ మోసగాడని అన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీని గద్దెదించాలా లేదా? దానికి కాంగ్రెస్ ఏం చేయబోతున్నది? వీటికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జవాబు దాటవేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు చూపాలని కేంద్రాన్ని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేసారు. ఈ విషయంలో అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు జుగుప్సాకరంగా స్పందించారు. మహిళల పట్ల కనీస గౌరవం లేదు. సంస్కారం లేదు. అయినా అసోం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ మాటలు ప్రధాని మోడీకి తప్పుగా అనిపించటం లేదు. ఇది దేశానికే అవమానకరం కదా! దీనినే వామపక్షాలు, ఇతర పార్టీలతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించారు. భారతీయులంతా ప్రశ్నించాల్సిందే కదా! తమ నాయకుడిని నిందించిన బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిచినప్పుడు, ఈ మద్దతును స్వీకరించాలి కదా! ఇందుకు భిన్నంగా... ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యుద్ధం ప్రకటించారు. వందలాది పోలీస్ స్టేషన్లలో అసోం ముఖ్యమంత్రి మీద కేసులు పెడుతున్నారు. అఖిల భారత నాయకత్వం పిలుపు మేరకు దేశమంతా చేస్తున్నట్టే, ఇక్కడ కూడా ఫిర్యాదులు చేయటం తప్పుకాదు. బీజేపీ సంస్కారహీనంగా మాట్లాడటాన్ని ఎండగట్టడానికి ఇది కూడా ఒక ఎత్తుగడగా భావించవచ్చు. కానీ, అసోం ముఖ్యమంత్రిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేయాలట. చేయకపోతే పోలీసు స్టేషన్లు ముట్టడిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నాయకత్వం అల్టిమేటం జారీ చేసింది. అంటే... రాహుల్‌గాంధీని అంత నీచంగా నిందించిన బీజేపీని వదిలిపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరిని కాపాడటానికి? హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపుకే తోడ్పడే ఎత్తుగడలు వేసారు.
ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు చేసినప్పుడు పోరాడవచ్చు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయవచ్చు. ధాన్యం కొనుగోలు విషయంలోనో, నిరుద్యోగ భృతి కోసమో, కౌలురైతుల సమస్యల మీదనో, కార్మికుల కనీస వేతనాల సమస్య మీదనో పోరాడవచ్చు. ఎవరూ తప్పు పట్టనవసరం లేదు. కానీ రాజకీయ సమస్యల మీద బీజేపీకి ఉపయోగపడే వైఖరి ప్రదర్శించటమే ఇక్కడ సమస్య. ఎంతసేపూ ముఖ్యమంత్రి కుర్చీమీదనే ధ్యాస తప్ప బీజేపీ ప్రమాదాన్ని గుర్తించే స్థితిలో కాంగ్రెసు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాలన్నా జాతీయ స్థాయిలో పుంజుకోకుండా సాధ్యం కాదు. కేంద్రంలో బీజేపీని ఓడించకుండా ఇక్కడ కుర్చీ దొరకటం అంత సులభం కాదు. ఈ మాత్రం సోయికూడా లేకుండా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరించటమే ఆశ్చర్యకరం. ఒకసారి రాష్ట్రంలో బీజేపీ బలపడితే ఇక కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పునరుజ్జీవనం కలలోని మాట. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను చూసిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు అర్థమవుతున్నట్టు లేదు. కీలకమైన ఆర్థిక విధానాలలోనూ, నియంతృత్వ పోకడలలోనూ కాంగ్రెస్‌కూ, బీజేపీకీ తేడాలేదు. ఈ పరిస్థితి వల్లనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవకాశవాదం పరాకాష్టకు చేరుతున్నది. కాంగ్రెస్ పదవీ దాహమే దానిని దిక్కుతోచని స్థితికి నెట్టుతున్నది. లౌకికపార్టీగా చెప్పుకునే కాంగ్రెస్, లౌకిక విలువల విషయంలో కూడా అవకాశవాదమే ప్రదర్శిస్తున్నది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా గత ఎన్నికలలో లౌకిక వాదం మాటే ఉచ్ఛరించలేదు. కర్నాటకలో బీజేపీ మీద పోరాడకుండా, రాహుల్ గాంధీ వెళ్ళి కేరళలో కమ్యూనిస్టుల మీద పోటీ చేసారు. ఈ అవకాశవాదమే రాష్ట్ర నేతలకు కూడా అబ్బింది.
కేంద్రంలో బీజేపీ సర్కారుతో ఇంతకాలం టీఆర్ఎస్ నాయకత్వం దాగుడుమూతలు ఆడింది. తనకు అవసరమైనప్పుడు మోడీ సర్కారును విమర్శించటం, వెంటనే రాజీపడటం అలవాటుగా మారింది. ఈ లాలూచీ కుస్తీని అందరూ విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వంగానీ, టీఆర్ఎస్గానీ పోరాడాలని డిమాండ్ చేసారు. అది సరైంది. ఇప్పుడు కేంద్రంతో పోరాడతానని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ పాలన మీద నిప్పులు చెరుగుతున్నారు. నిర్దిష్ట సమస్యలు ప్రజల ముందుంచుతున్నారు. పైగా కేంద్రంలో బీజేపీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ఊగిసలాటలు వదిలి, చిత్తశుద్ధితో బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా నిలబడతారా లేదా అన్నది కేసీఆర్ తేల్చుకోవాలి. ఈ మార్పును ఆహ్వానించవల్సింది పోయి, బీజేపీ తప్పులను కూడా కప్పిపుచ్చే విధంగా కాంగ్రెస్ వ్యవహరించటం బాధ్యతా రాహిత్యం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు హానికరం.
- ఎస్. వీరయ్య