Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేనికైనా సమయం రావాలి
మొగ్గలు ముచ్చటైన పూలవ్వడానికైనా
కాయ - పండి రాలడానికైనా ...
నల్ల మబ్బు వర్షించాలి
నదీనదాలు ప్రవహించాలి
అంతటా అన్నం పండి, అందరికీ ఆకలి తీరే
అద్భుత లోకం అవనీ స్థలిపై
ఉదయించడానికి సమయం రావాలి !
కొన్ని సమయాలు
మనిషి బతుకుని విధ్వంసం చేస్తాయి
చిట్లిపోయిన విత్తనంలోనుంచి
మొక్క పుట్టినట్లు
మానవ వక్షం తాజాగా తిరిగి మళ్లీ
పచ్చదనం వెదజల్లాలి.. ఎలా?
ఏ సత్యాన్వేషకుని చేతుల్లోని సుకార్యాన్నైనా
సుక్రియనైనా
ముందుగా ఆ మనిషే కాపాడుకోవాలి
దురలవాట్ల దుర్వాసనా దుష్టుల సాంగత్యమూ
కడు దూరమైపోవాలి చెడు దగ్ధమవ్వాలి
సజ్జనుడైన మనిషిగా ప్రకాశించాలి
సమయం రావాలి దేనికైనా
మత్తు నుంచి మంది విముక్తి కావడానికైనా
హృదయమిచ్చిన మనిషికి ప్రాణమివ్వడానికైనా
నిజం -అగ్ని శిఖై అది శాఖోపశాఖలై
విశాల ప్రపంచంలోకి
విస్తరించడానికైనా
సమయం దేనికైనా రావాలి
చూడదగిన దృశ్యాన్ని దేన్నైనా
చూడాల్సిన కోణంలో చూడగలగాలి
కళ్లు తెరుచుకోవాలి
- రవి నన్నపనేని, సెల్:9182 181390