Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాదరి భాగ్యరెడ్డివర్మ.. తెలుగునేలపై అంటరానితనం నిర్మూలనకు, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా కృషి చేసిన తొలి చైతన్యస్ఫూర్తి. శతాబ్దాల తరబడి ఘన చరిత్ర గల మన భారత దేశంలో ఒక వర్గపు ప్రజలు పంచములు, అంటరాని వారు అనే పేరుతో అత్యంత హేయమైన అవమానాలకు గురవుతున్న వేళ... తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి, జాతి మొత్తాన్ని మేల్కొల్పిన పోరాటయోధుడు భాగ్యరెడ్డివర్మ.
భాగ్యరెడ్డివర్మ అసలు పేరు భాగయ్య. మాదరి వెంకయ్య, రంగమాంబలకు 1888 మే 22న రెండవ సంతానంగా హైదరాబాద్ నగరంలో జన్మించారు. వీరి పూర్వీకులు వనపర్తివారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆ నాటి చీఫ్ కమాండర్ అయిన వనపర్తి రాజా రామేశ్వర రావు మహర్ ఆర్మీని ఏర్పాటు చేశారు. వనపర్తి సంస్థాన పరిధిలోని మహర్ కులం వారిని సైన్యంలోకి సేనలుగా హైదరాబాద్‌కు పంపారు. ఆ విధంగా వచ్చిన కుటుంబమే భాగ్యరెడ్డివర్మ పూర్వీకులది. అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రెడ్డి అనే పిలుపు రేడు అనే పదం నుంచి వచ్చింది. రేడు అంటే రాజు, పాలకుడు అని అర్థం. భారతదేశానికి ఆర్యులు రాక ముందు నుంచే ఈ నేలపై నివసిస్తున్న దళితులు పంచములు కాదని, పాలకులు అని, వారే ఆది హిందువులని భాగయ్య తన పేరు చివర రెడ్డి అనే పదాన్ని సగర్వంగా ఉంచుకున్నారు. ఒక నగర ప్రాంతంలో పుట్టి, పేదరికంలో పెరిగి, కొందరు సజ్జనుల సాన్నిహిత్యంలో ప్రపంచాన్ని తెలుసుకొని, తనకు కలిగిన అవగాహనతో తన సమాజాన్ని బాగు చేయాలనే తపనతో, ధృడసంకల్పంతో, దీక్షావంతుడైన భాగ్యరెడ్డి తాను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావంతో చేశారు. వీరు కేవలం ఒక్క దళిత జనాల బాగుకోసమే పాటు పడ్డారు అంటే అది అర్థసత్యమే... పారిశుద్ధ్యం, జీవ హింసా నిరోధం, సంఘసేవ, దేవదాసీ, జోగినీ వ్యవస్థ నిర్మూలన, విద్యా వ్యాప్తి ఇలాంటి వాటిలో పని చేయడమే కాదు, వందేండ్ల క్రితమే వాటిని ప్రజలకు చేరువ చేసి, సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారు.
శతాబ్దాల పర్యంతం చావు డప్పుల వెనుక శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనాన్ని, గమ్యాన్ని మార్చిన ఘనత అతనిది. 1913లో మన్య సంఘాన్ని స్థాపించారు. అంటరాని కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలి ఇచ్చే దురాచారాన్ని ధిక్కరించిన ధీరత్వం ఆయనది. అంతేకాదు దేవదాసి, బసివిని, జోగినీవ్యవస్థ లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా అప్పటి నిజాం ప్రభువుతో మాట్లాడి, ఒప్పించి, ప్రత్యేక చట్టాన్ని రూపొందించేలా చేసిన కార్యసాధకుడాయన. దళితుల ఈ దుస్థితికి కారణం అజ్ఞానం, అవిద్య, పేదరికం అని భావించి, 100 ఏండ్ల క్రితం వారికోసం ప్రత్యేకంగా 26 పాఠశాలలను ప్రారంభించారు. వాటి నిర్వహణ నిజాం ప్రభుత్వం చేపడితే... ఉర్దూ భాషలో కాకుండా తెలుగులోనే బోధన ఉండాలి అని ఆంక్ష పెట్టిన తెలుగు భాషాభిమాని ఆయన. చాదర్‌ఘాట్ రోడ్డులోని ఆది హిందూ భవన్లో ఆయన నెలకొల్పిన బాలికల పాఠశాలను ఆయన వారసులు నేటికీ కొనసాగిస్తున్నారు.
1925సంవత్సరంలో ప్లేగు, కలరా వంటి అంటువ్యాధులతో భాగ్యనగరంలో ప్రజలు పిట్టల్లా రాలి పోతుంటే స్వస్తి సేవాదళ్‌ను స్థాపించి, వారి ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి, వైద్య సేవలు అందించి, వ్యాధిగ్రస్తులను కాపాడిన దయాగుణం వారిది. యుక్తవయస్సులోనే ఎన్నో పురాణ గ్రంథాల్ని అవలోకించారు. దేశ విదేశీ చరిత్రలను చదివారు. వాటిని లోతుగా అవగాహన చేసుకొని, ఆ వివరాలను తన ఉపన్యాసాలలో ఉదహరిస్తూ, తన జాతి హక్కుల కోసం సమాజాన్ని నిలదీసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళిత జాతి చైతన్యానికి ఆయన ఎన్నో మాధ్యమాలను ఎన్నుకొని పని చేశారు. అవి భజన మండళ్ళు, కబీర్ పంత్ మఠాలు, ఆది-హిందూ ఇంగ్లీష్ పత్రిక, పంచమ అనే పత్రికలను నిర్వహించటం, ఆది హిందువులలో వారసత్వంగా వస్తున్న చేతి కళల నైపుణ్యాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి చేతితో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేయడం, భాగ్యనగరం ముద్రణాలయం స్థాపించి, భాగ్యనగరం పత్రికను ప్రారంభించడం మచ్చుకు కొన్ని. భాగ్యరెడ్డి వర్మ రాసిన ''వెట్టి మాదిగ'' నవలలో చిత్రించిన పాత్రలు పోలీస్ పటేల్ (రామిరెడ్డిదొర) ద్వారా అరాచక పాలన, తలారి, మాదిగ మల్లడు చేసిన వెట్టి, అనంతరం వారు చేసిన తిరుగుబాటు లాంటి కథనం భవిష్యత్ ''తెలంగాణ సాయుధ రైతాంగ'' పోరాటానికి సూచికగా అర్థం చేసుకోవచ్చని సాహితీ విమర్శకులు విశ్లేషించారు.
భాగ్యరెడ్డి వర్మ సామాజిక న్యాయవాదిగా, దళిత జాతిని చైతన్యం చేసిన కృషిని వారి మిత్రుడు, సమకాలీనుడైన ప్రముఖ రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గుర్తించి, తన 'మాల పల్లి' నవలలో వెంకటరెడ్డి పాత్ర ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆనాటి మరో విశిష్ట కవి అయ్యదేవర కాళేశ్వరరావు రాసిన ''నా జీవిత కథ నవ్యాంధ్ర''లో విజయవాడలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన భాగ్యరెడ్డి వర్మని సభకు ఏవిధంగా, ఎంత ఘనంగా తీసుకువెళ్లారో రాసుకున్నారు. 1957లో హైదరాబాద్ నగర తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ తాను రూపొందించిన పిక్టోరియల్ హైదరాబాద్ (1000 పేజీలు) అనే పుస్తకంలో భాగ్యరెడ్డి వర్మ చేసిన విశేష కృషిని గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. సురవరం ప్రతాపరెడ్డి రాసిన తుకారాం నాటకం, మురళి స్త్రీ కథలు, పురాణ చరితము, వీర సుర చరితము మొదలైవి కూడా భాగ్యరెడ్డి వర్మ ఆది ఆంధ్ర ఉద్యమ నేపథ్యాన్ని తెలియజేస్తాయి.
అస్పశ్యతా నివారణకు విశేష కృషి చేసిన సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ. అందుకే హైదరాబాదులోని ఇసామియా బజార్ ప్రధాన రోడ్డుకు 'భాగ్యరెడ్డివర్మ మార్గ్' అని నగరపాలక సంస్థ దేశ స్వాతంత్య్రానికి పూర్వమే నామకరణం చేసింది. వీరికి 'శివశ్రేష్టి', 'సంఘ మాన్య' అనే బిరుదులు ఇచ్చారు. వర్మ బుద్ధ జయంతి ఉత్సవాలు క్రమం తప్పక చేసేవారు. అనేక సభలు, సమావేశాలు, సదస్సులలో పాల్గొని, జాతీయ స్థాయిలో పోరాడి, ప్రముఖులతో తన వాదనలను వినిపించారు. దేశవ్యాప్తంగా ఆది ఆంధ్ర మహాసభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. కొత్త సంస్కరణలకు, వాటి ఆచరణలకు పాటు పడ్డారు. వివిధ సభల్లో సుమారుగా 3,348 ఉపన్యాసాల వరకు ఇచ్చారు. అంటరానివాళ్ళం అనే భావనను తన జాతి మనస్సుల్లోంచి పోగొట్టేందుకు, హిందూ సమాజంలోని మిగతా సామాజిక వర్గాలతో సమానంగా జీవించే హక్కు కోసం వారి బతుకుల్లోని దుర్భర పరిస్థితులు వారికే అర్థమయ్యే విధంగా ఆయన చేపట్టిన సంస్కరణలు తెలుగునాట కొన్ని లక్షల దళిత కుటుంబాల్లో స్ఫూర్తిని కలిగించాయి.
దళిత జనోద్ధరణ కోసం శతాబ్ద కాలం క్రితమే శంఖం పూరించిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ. నిర్విరామ, బహుముఖ కార్య క్రమాలతో ఆరోగ్యం బాగా దెబ్బతిని క్షయ వ్యాధి గ్రస్థమయ్యారు. చివరికి 1939 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా స్మరించుకుంటూ... ఆయన ఆశయాల కోసం అంకితమవుదాం.
- పి. వెంకట రమణ
సెల్:9492351629