Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్క్స్-ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను తయారు చేయకముందే కమ్యూనిస్టు భూతం యూరప్‌లోని అధికార శక్తులను ఆవహించింది. 1830-40దశకాల్లో యూరప్‌ను కుదిపేసిన తీవ్రమైన విప్లవ పోరాటాలు, అందులో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర అధికార వర్గాలను బెంబేలెత్తించింది. వారికి ఉమ్మడి శత్రువైంది. వారు తమలో తాము విమర్శించుకునేటప్పుడు కూడా ఎదుటివారిని కమ్యూనిస్టులు అని విమర్శించడం ప్రారంభించారు. అందుకనే కమ్యూనిస్టు ప్రణాళికను ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలియజేస్తూ మార్క్స్-ఏంగెల్స్ ''యూరప్‌ను ఒక దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం పేరు కమ్యూనిజం'' అన్న వాక్యాలతో ప్రారంభించారు. 'కమ్యూనిస్టు దెయ్యం'పై వర్గ శత్రువులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ప్రణాళికా రచన చేసినట్లు చెప్పారు. ''కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలనూ, లక్ష్యాలనూ, తమ ధోరణులనూ బహిరంగంగా మొత్తం ప్రపంచం ఎదుట ప్రకటించాల్సిన సమయం వచ్చింది'' అని వారు పేర్కొన్నారు. కమ్యూనిస్టు ప్రణాళికను నాలుగు భాగాలుగా ప్రతిపాదించారు. మొదటి భాగానికి బూర్జు వాలూ, కార్మికులు అని పేరుపెట్టారు.
''ఇంతవరకు సాగిన సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అన్న ప్రకటనతో ఇది ప్రాంరభమవుతుంది. నిజానికి మానవజాతి చరిత్రలో వర్గపోరాటాలు లేని ఆదిమ కమ్యూనిస్టు సమాజమే అత్యథిక భాగం నడిచింది. అయితే ఈ సమాజం గురించి మార్క్స్-ఏంగెల్స్ కాలానికి తెలియదు. అందువల్ల ప్రణాళికలో చెప్పిన చరిత్ర 'లిఖిత చరిత్ర' అని మనం అర్ధం చేసుకోవాలి.
మానవ సమాజంలోని ఆయా దశల్లో పీడకులూ, పీడితులూ శత్రు వర్గాలుగా ఎదురుబొదురు నిలబడి ఒకరితో మరొకరు పోరాడ్డం వల్లనే సమాజం ఒక దశ నుండి మరో దశకు పురోగమించింది. ఈ క్రమంలోనే ఫ్యూడల్ సమాజం నుండి ఆధునిక బూర్జువా వర్గం ఎలా ఆవిర్భవించిందో కమ్యూనిస్టు ప్రణాళికలో వివరించారు. ''ఫ్యూడల్ సమాజపు శిథిలాల నుండే ఆధునిక బూర్జువా వర్గం ఆవిర్భవించింది. అది వర్గ వైరుధ్యాలను రద్దు చేయలేదు. కాకపోతే పాత వాటి స్థానంలో కొత్త వైరుధ్యాలనూ, దోపిడీ పద్ధతులనూ, పోరాట రూపాలనూ తెచ్చిపెట్టింది. అంతే''. బూర్జువా యుగంలో సమాజం అంతకంతకూ రెండు మహా శత్రు శిబిరాలుగా - ఒకవైపు బూర్జువా వర్గం రెండోవైపు కార్మిక వర్గంగా విడిపోతున్నది. మిగిలిన వర్గాలన్నీ అటు బూర్జువా వర్గంలోనో, ఇటు కార్మిక వర్గంలోనో కలిసిపోయి కనుమరుగవుతాయి. ఈ యుగంలో ''బూర్జువా వర్గమూ, శ్రామిక వర్గమూ అనే రెండు మహా వర్గాలు ఒకదానికి సవాలుగా మరొకటి ఎదురు నిలిచాయి'' అని మార్క్స్-ఏంగెల్స్ వివరించారు.
బూర్జువా వర్గం ఓ సుదీర్ఘమైన అభివృద్ధి క్రమంలో పుట్టింది అని చెబుతూ ఒకనాడు పీడిత వర్గంగా ఉన్న అది క్రమంగా పాలక వర్గంగా అభివృద్ధి చెందిన తీరును వివరించారు. ''బూర్జువా వర్గం తన అభివృద్ధిలో అడుగు ముందుకు వేసిన ప్రతి సందర్భం లోనూ రాజకీయంగా కూడా పురోగమించింది.'' ఒకనాడది ఫ్యూడల్ ప్రభుత్వం పెత్తనం కింద పీడిత వర్గం. అటువంటిది దాని శక్తి పెరుగుతున్న కొద్దీ ఒక్కో మెట్టుగా రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుంటూ చివరికి ఆధునిక ప్రజా ప్రాతినిధ్యం ఉన్న రాజ్యంలో ఏకైక రాజకీయ పెత్తందారుగా మారింది. ''ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బూర్జువా వర్గపు సమిష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే'' అని వారు ప్రకటించారు.
- ఎస్. వెంకట్రావు