Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్జువా వర్గం చారిత్ర కంగా అత్యంత విప్లవకరమైన పాత్ర పోషించిందని చెబుతూ అది ఉత్పత్తి సంబంధాల్లో ఎంతటి మహత్తరమైన మార్పులు తీసుకు వచ్చిందో, అదే సమయంలో మొత్తం మానవ సంబంధా లన్నిటినీ డబ్బు సంబంధాలుగా ఎలా మార్చివేసిందో మార్క్స్- ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో వివరించారు. ''బూర్జువా వర్గం పైచేయి సాధించిన ప్రతి చోటా మొత్తం పితృస్వామిక, ఫ్యూడల్, ప్రశాంత సంబంధాలన్నిటినీ నాశనం చేసింది. కొందరు ''పుట్టుకతోనే అధికులు'' అనే అమాంబాపతు సంబంధాలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా ఛిన్నాభిన్నం చేసింది'' అని చెబుతూ మనిషికీ మనిషికీ మధ్య స్వలాభం, డబ్బు చెల్లింపులు తప్ప ఇక ఏ సంబంధాన్నీ అది మిగల్చలేదు అని వారు విశ్లేషించారు.
బూర్జువా వర్గం మనిషి విలువను మార్పిడి విలువగా లెక్క కట్టింది. అంతకు ముందు సమాజాల్లో మనుషులకు ఉన్న శాశ్వత హక్కులన్నిటినీ అది రద్దు చేసి వ్యాపారం అనే ఒకే ఒక స్వేచ్ఛను నెలకొల్పింది. ''మత రాజకీయ భ్రమల మాటున సాగే దోపిడీని తొలగించి దాని స్థానంలో నేరుగా బాహాటంగా సిగ్గూ ఎగ్గూ లేని పాశవిక దోపిడీని అది ప్రవేశపెట్టింది.''
బూర్జువా వర్గం తనలాంటి ప్రపంచాన్నే సృష్టిస్తుంది అని మార్క్స్-ఏంగెల్స్ ప్రకటించారు. అంతకు ముందు ఎంతో గౌరవంగా చూడబడిన వృత్తులను చులకన చేసింది. మేధావులైనా, శాస్త్రవేత్తలైనా అందరినీ తన జీతగాళ్లుగా మార్చుకుంది. కుటుంబ సంబంధాలను కూడా కేవలం డబ్బు సంబంధాలుగా కుదించి వేసింది అని వివరించారు.
నేడు ఆర్ఎస్ఎస్ వాళ్లు, మార్క్సిస్టు వ్యతిరేకులు మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధాలే అని మార్క్స్ చెప్పినట్లు వక్రీకరిస్తుంటారు. కానీ బూర్జువా వర్గమే మానవ సంబంధాలను ఆ విధంగా కుదించివేసిందని ఆయన చెప్పారన్న విషయాన్ని మనం గ్రహించాలి.
ఉత్పత్తి సంబంధాల్లో నిరంతరాయంగా విప్లవం తేవడమూ, సకల సామాజిక పరిస్థితులను నిరంతరాయంగా కల్లోల పరచడమూ బూర్జువా యుగపు లక్షణాలని మార్క్స్, ఏంగెల్స్ చెబుతూ గడ్డకట్టుకుపోయిన అన్ని రకాల పాత సంబంధాలతోపాటు వాటిని అంటిపెట్టుకుని ఉండే పరమపావనమనుకున్న అభిప్రాయాలు కూడా ఈ యుగంలో తుడిచి పెట్టుకు పోతాయని తెలిపారు. కొత్తగా ఉన్న సంబంధాలు సైతం ఇంకా స్థిరపడక ముందే పాతబడి పక్కకుపోతాయి. పాత పరిశ్రమలు రోజూ నాశనం అవుతూ కొత్తవి, మరింత ఆధునికమైనవి పుడుతుంటాయి. విస్తారంగా పెరిగే తన ఉత్పత్తుల అమ్మకాల కోసం బూర్జువా వర్గం జాతీయ పరిధులను ఛేదించుకుని మొత్తం ప్రపంచాన్ని తన మార్కెట్టుగా మార్చుకుంటుందనీ, అన్ని దేశాలకూ, అన్ని జాతుల ప్రజలకూ బూర్జువా ఉత్పత్తి విధానాన్ని అనుసరించక తప్పని పరిస్థితులు సృష్టిస్తుందనీ, ఉత్పత్తి సాధనాలనూ, జనాభానూ, ఆస్తినీ కేంద్రీకరిస్తుందని వారు వివరించారు. దీని పర్యవసానంగా రాజకీయ కేంద్రీకరణ కూడా జరుగుతుందని చెప్పారు.
అయితే ఇంతటి బ్రహ్మాండమైన ఉత్పత్తి సాధనాలను సృష్టించిన బూర్జువా సమాజం ఈరోజు తను సృష్టించిన దయ్యాలను తానే అదుపుచేయలేని మాంత్రికునిలా తయారైందని, బ్రహ్మాండంగా పెరిగి ఉత్పత్తి శక్తులు బూర్జువా ఉత్పత్తి సంబంధాల్లో ఇమడ లేక ప్రతినిత్యం తిరుగుబాటు చేస్తున్నాయనీ, బూర్జువా సమాజ చరిత్ర అంతా ఈ తిరుగుబాటు చరిత్రేనని మార్క్స్-ఏంగెల్స్ వివరించారు. దీనికి ఉదాహరణే పదేపదే వస్తున్న సంక్షోభాలని చెప్పారు. ఈ సంక్షోభాల నుండి బయటపడేందుకు అది చేసే ప్రయత్నాలు మరింత వినాశకరమైన సంక్షోభాల్లోకి నెడుతుందని చెప్పారు.
కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్-ఏంగెల్స్ చెప్పిన ఈ అంశాలు నేటి నయా-ఉదారవాద శకంలో మరింత చిక్కగానూ, స్పష్టంగానూ వ్యక్తమవుతున్నవి. నిజానికి కమ్యూనిస్టు ప్రణాళికను మనం చదువుతుంటే వారు ఇప్పటి పరిస్థితులను గురించే చెప్పారా అనిపిస్తుంది.
- ఎస్. వెంకట్రావు