Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ప్రభుత్వమైనా విధానాల రూపకల్పనలో ముఖ్యం గా బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ప్రజల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుంటుంది. కానీ బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రజలు పడుతున్న బాధలను, వాటిని రూపుమాపేందుకు అవసరమైన చర్యలను విస్మరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్న పేదలు గతంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఆదాయాల తగ్గుదల, అధిక ధరలు, బలహీన ఆరోగ్య వ్యవస్థ, భారీ సబ్సిడీ కోతల లాంటి సమస్యలతో అవస్థలుపడుతున్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోకుండా, తన కార్పోరేట్ మిత్రులకు లక్షల కోట్లతో భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్ల గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలపై ఈ బడ్జెట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
సాధారణంగా ఉపాధి, ఆహారం, ఆరోగ్యం, విద్య, సామాజిక సమానత్వం, భూమి, సామాజిక భద్రతా పెన్షన్లు, ప్రత్యక్ష నగదు మద్దతు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లాంటి అంశాలు వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల జీవితాలపై అనుకూల ప్రభావం చూపుతాయి. వీటిపైన బడ్జెట్లో తగినంతగా కేటాయింపులు లేకపోవడంతో వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
భారత దేశంలో 35కోట్లకు పైగా గ్రామీణ పేదలు, వ్యవసాయం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎమ్మెన్ఆర్ఈజీఏ)పై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రెండింటిపై వచ్చే ఆదాయంలో కోతలు విధించడంలో 2022-23 యూనియన్ బడ్జెట్ మరొక అడుగు ముందుకేసి, ఎమ్మెన్ఆర్ఈజీఏకు 25.5శాతం కోత విధించింది. 2020-21 కరోనా మొదటి దశలో కూడా బడ్జెట్ కేటాయింపుల్లో 41శాతం కోత విధించింది. ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఎమ్మెన్ఆర్ఈజీఏ కింద ప్రతీ కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలంటే సుమారు రూ.2.64లక్షల కోట్లు అవసరమని అంచనా వేసింది. గత సంవత్సరం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎమ్మెన్ఆర్ఈజీఏను కొనసాగించకుండా నిలిపి వేయడంతో అనేక వినాశనకర ప్రభావాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ సంవత్సరం కూడా నిధుల కొరతతో ఉపాధి హామీ పథకం ద్వారా అందే ఆర్థిక మద్దతు లేకుండా పోయింది. గతం కంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ప్రజలను బాగా దెబ్బతిస్తున్న తీరును మనం చూస్తున్నాం.
అనివార్యమైన యాంత్రీకరణ వల్ల వ్యవసాయ రంగంలో పని దినాల సంఖ్య కూడా బాగా తగ్గిపోతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో సగటు పని దినాలు గరిష్ఠంగా 50రోజుల కంటే మించి లేవు. ప్రపంచీకరణ విధానాలు, గ్రామీణ వృత్తిదారుల సాంప్రదాయ పనులను లాగేసిన ఫలితంగా వారంతా కూడా వ్యవసాయ కార్మికులుగా మారారు. కోవిడ్-19 తరువాత పట్టణ, నగర ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలొచ్చిన ఒక కొత్త తిరోగమన విధానాన్ని మనం చూశాం. ఇది కూడా వ్యవసాయ కార్మిక శక్తి అదనంగా పెరగడానికి కారణమైంది.
ఎమ్మెన్ఆర్ఈజీఏ(ఉపాధి హామీ చట్టం) కింద ఎక్కువగా నీటి ట్యాంకుల నిర్మాణం, రోడ్డు రిపైర్లు, సాగుభూమి అభివృద్ధి, అటవీ భూముల అభివృద్ధి, పండ్ల తోటలు లాంటి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఉంటాయి. ఉపాధి హామీకి బడ్జెట్లో కోత విధించడమంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచడమే. ఇది ప్రత్యక్షంగా వ్యవసాయం పై ఆధారపడే వ్యవసాయ కూలీల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 23కోట్లకు పైగా రేషన్ కార్డులతో 85కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రజలకు ఆహారాన్ని అందించే విషయంలో మన దేశం ఆకలి సూచికలో 101వ స్థానంలో ఉన్నది. 75ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా, అవసరానికి మించి రెట్టింపు ఆహార ధాన్యాలను ఎఫ్సీఐ నిలువ చేస్తున్నప్పటికీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార సబ్సిడీలను పెంచాలని మనం కోరుతున్నాం. కానీ 2021-22 సవరించబడిన బడ్జెట్లో రూ.286269 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో అది రూ.2,06,831 కోట్లకు (అంటే 27శాతం) తగ్గించారు. ఈ సంఖ్య రెట్టింపు చేయకపోయినా, లేక ప్రభుత్వ వ్యయం రెట్టింపు చేయకపోయినా కొద్ది నెలల్లో మన గ్రామాలలో ఆకలి నెలకొంటుంది. ఇప్పటికే దిగువనున్న 20శాతం జనాభా ఆదాయం 53శాతానికి పడిపోయింది.
ఆహార సబ్సిడీలలో కోత అంటే రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించదని అర్థం. ఇది రైతులు పండించిన వరి, గోధుమకు కనీస మద్దతు ధర కోసం చేసిన కేటాయింపుల (రూ.1100 వందల కోట్లు)తగ్గుదలలో ప్రతిబింబిస్తున్నది. కేటాయింపుల తగ్గుదల, ద్రవ్యోల్బణం వలన మొత్తంగా 2022-23లో ధాన్య సేకరణ గణనీయంగా తగ్గి, ఆహార ధాన్యాలు, ఇతర ఆహార వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఆహార సబ్సిడీల తగ్గింపు, బలహీన ప్రజాపంపిణీ వ్యవస్థ ఆహార ధాన్యాల మార్కెట్ పై కార్పొరేట్ల అదుపు పెరుగుతుంది.
మెజారిటీ ప్రజలు ప్రజా ఆరోగ్యవ్యవస్థపై ఆధారపడతారు. 80శాతం మించి పేద ప్రజలు ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువ ఖర్చును భరించలేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను రక్షించుకున్న పరిస్థితిని కరోనా రుజువు చేసింది. ఆరోగ్య సంరక్షణకు, వైద్య పరికరాల పరిశ్రమకు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కరోనా రెండో దశలో భారీ మరణాలు నమోదు చేసుకున్న మన దేశానికి ఈ బడ్జెట్ పెద్ద దెబ్బ. నేటికి కూడా జీడీపీలో ఆరోగ్య సంరక్షణకయ్యే ఖర్చు కోసం 3శాతం పక్కకు పెడతామన్న ప్రభుత్వ వాగ్దానాన్ని నెరవేర్చ లేదు. ప్రస్తుతం జీడీపీలో కేవలం 1.3శాతం మాత్రమే కేటాయించారు. 2021-22 ఆరోగ్య రంగానికి బడ్జెట్ అంచనాలు రూ.74602 కోట్లు, సవరించిన అంచనా రూ.85915 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం 0.8శాతం (రూ.86,606 కోట్లు) పెంచారు. కరోనా ఇంకా అంతం కాకుండా ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య రంగానికి చేసిన అరకొర కేటాయింపులు పేదలను ప్రమాదంలోకి నెట్టివేస్తాయి.
కోవిడ్-19 వ్యాప్తి కాలంలో, వరుస లాక్డౌన్లతో విద్యా సంస్థలు మూతపడి, ఆన్లైన్ బోధన సాగింది. ''స్కూల్ చిల్డ్రన్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లెర్నింగ్'' ఆధ్వర్యంలో 15 రాష్ట్రాల్లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు 2021లో చేసిన సర్వే, 8శాతం గ్రామీణ విద్యార్థులు, 24శాతం పట్టణాలకు చెందిన విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారని తెలిపింది. అంటే దేశంలో 3/4 వంతుల మంది విద్యార్థులకు పైగా ఏ విధమైన శిక్షణ అవకాశాలు పొందలేకపోయారు. కాబట్టి, ప్రభుత్వ విద్యకు ఎక్కువ కేటాయింపులు చేసి, ప్రయివేటు మాఫియాను అదుపు చేస్తుందని ప్రజలు ఆశిస్తే, ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ వల్ల విద్యా సంస్థలు మూతపడ్డ రెండు సంవత్సరాల తరువాత విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ కేవలం 3శాతం(రూ.103 కోట్లు) మాత్రమే పాఠశాల, ఉన్నత విద్యలకు కేటాయించారు.
''అంగన్వాడీ'', ''పోషణ్ 2.0''కు 2022-23 బడ్జెట్ కేటాయింపులు రూ.20263.07కోట్లు, గత సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు రూ.20105కోట్లు. మధ్యాహ్న భోజన పథకానికి చేసిన కేటాయింపులు కూడా గణనీయంగా కోతకు గురయ్యాయి. ఈ పథకం అమలులోకి వచ్చిన తరువాత బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల నమోదు బాగా పెరిగింది, కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి తక్కువ కేటాయింపులు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువులకు దూరమవుతారు.
దేశ అవసరాలు తీరాలంటే ప్రభుత్వం ఉపాధి అవకాశాలను సృష్టించి, మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎమ్మెస్ఎమ్ఈలకు మద్దతిచ్చి, బాలికల, మహిళల విద్యపై కేంద్రీకరించాలి. మహిళా శిశు అభివృద్ధికి రూ.25,172.28 కోట్లు, అంటే 2021-22లో కేటాయించిన రూ.24,435 కోట్లు(3శాతం పెరుగుదల) కంటే కొంచెం ఎక్కువ కేటాయించారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన 'సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ', 'నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్', 'నేషనల్ కమిషన్ ఫర్ విమన్'లకు 2021-22లో రూ.188కోట్లు కేటాయిస్తే, 2022-23లో రూ.153 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ పని పైనే ఆధారపడి జీవిస్తారు. మన జీడీపీలో వ్యవసాయ రంగం 16శాతం (కొన్ని రాష్ట్రాలు 20శాతం)వాటాను కలిగి ఉంది. కానీ, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి జీడీపీలో 1.57శాతం మాత్రమే కేటాయించారు. గత సంవత్సరం 'ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన'కు రూ.16 వేల కోట్ల కేటాయిస్తే ఇప్పుడు రూ.15,500 కోట్లకు తగ్గించారు. 2019లో ప్రారంభించిన 'పీఎం-కిసాన్'కు అప్పుడు కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు 9శాతం తగ్గించి, ఫెర్టిలైజర్ సబ్సిడీలను గణనీయంగా 25శాతానికి తగ్గించారు.
మూడు రైతు చట్టాల ద్వారా కార్పోరేట్ సంస్థలకు లాభం చేకూర్చే ప్రభుత్వ ప్రయత్నాలను రైతు పోరాటం తిప్పి కొట్టింది కానీ, ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేసింది. కాబట్టి పండించిన పంటకు కనీస మద్దతు ధర రైతులు పొందలేరు. ఇది బీజేపీ వర్గ దృష్టిని తెలుపుతుంది. ధనిక రైతులు, భూస్వాములు సాధారణంగా వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఉంటూ, వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడున్న కష్టకాలంలో వారు చిన్న, మధ్యతరగతి రైతులకు మద్దతిస్తున్నారు.
ప్రధాన ఉత్పత్తిదారులైన వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలకు భూమి లేదు. వేల ఎకరాల సాగు భూమి ఉన్న భారతదేశంలో 20-25శాతం భూమిని ఒకశాతంగా ఉన్న ధనికులు అదుపు చేస్తున్నారు. 35 కోట్ల మంది దళితులున్న మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు. వారు ఆర్థికంగా దోపిడీకి గురై, సామాజికంగా అణగదొక్కబడు తున్నారు. భారతీయ సమాజంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీరికి బడ్జెట్లో చోటు లేకుండా పోయింది. ఉపాధిహామీ పథకం, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలకు 2021-22లో సవరించిన వ్యయం 3.2శాతం నుండి 2022-23 బడ్జెట్లో 2.5శాతానికి కుదించారు. ఈ బడ్జెట్ ప్రయివేటీకరణను, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సాహిస్తుం దంటే, సామాజికంగా అణగారిన వర్గాలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కూడా లేవు. ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించడంలోనూ ఈ బడ్జెట్ విఫలం చెందింది.
భారతదేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలున్నాయి, ఇవి కరోనా వ్యాప్తి కాలంలో మరింత పెరిగాయి. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 84శాతం కుటుంబాల ఆదాయం సంవత్సర కాలంలో గణనీయంగా తగ్గింది. కానీ, బిలియనీర్లు 102 నుండి 142కు పెరిగారు. భారతదేశంలో మొదటి 100మంది ధనవంతుల సమిష్టి సంపద 2021లో రూ.57.3లక్షల కోట్లు. ప్రభుత్వ విధానాలు కూడా ధనవంతులకే అనుకూలంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నాయి. మరిన్ని అసమానతలను పెంచే ఈ పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకం.
- అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451
- బి. వెంకట్