Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యూడలిజాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన బూర్జువా వర్గం బ్రహ్మాండమైన ఉత్పత్తి సాధనాలను సృష్టించింది. ఉత్పత్తి సాధనాలు ఈవేళ ఎంతగా పెరిగాయంటే అవి బూర్జువా ఉత్పత్తి సంబంధాల్లో ఇమడలేక ఆ సంబంధాలను తెంచుకోడానికి నిత్యం తిరుగుబాటు చేస్తున్నాయి. ఆ తిరుగుబాట్ల వల్ల పెట్టుబడిదారీ సమాజం నిరంతరం ఒక దానికి మించి మరొకటిగా సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభాల నుండి మానవాళికి విముక్తి ఉందా? ఉందనీ, విముక్తి చేసే శక్తులను మరెవరో కాదు బూర్జువా వర్గమే సృష్టించిందనీ కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పారు మార్క్స్-ఏంగెల్స్.
''ఫ్యూడలిజాన్ని బూర్జువా వర్గం నేలకూల్చడానికి వాడిన ఆయుధాలే ఇప్పుడు బూర్జువా వర్గాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి'' అని వారు పేర్కొన్నారు. ''ఆయుధాలనే కాదు వాటిని పట్టుకునే మనుషుల్ని కూడా బూర్జువా వర్గం సష్టించింది. వారే శ్రామికులు. ఆ వర్గమే ఆధునిక కార్మిక వర్గం'' అని చెప్పారు.
కార్మిక వర్గమే బూర్జువా వర్గానికి గోరీ కట్టే వర్గం అని వారు ఎందుకు చెప్పారు ?
కార్మికుల శ్రమశక్తిని పెట్టుబడిగా మార్చు కుని బూర్జువా వర్గం పెరుగుతుంది. అదొక పరాన్న భుక్కు. బూర్జువా వర్గమూ, దాని పెట్టుబడీ పెరిగితే కార్మికులూ పెరుగుతారు. కార్మికులు ఏరోజుకారోజు తమని తాము అమ్ముకుంటే తప్ప బతకలేరు. పని దొరికినంత కాలమే వారు బతుకుతారు. అంటే బూర్జువా సమాజంలో అన్ని అమ్మకపు సరుకుల్లాగే కార్మికులూ ఒక సరుకే. వేగంగా పనిచేసే ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారానూ, పని గంటలు పెంచడం ద్వారానూ, వేతనాలకు కోతలు పెట్టడం ద్వారానూ బూర్జువా వర్గం రానురాను మరింతగా కార్మికుల శ్రమను దోచుకుని బలుస్తుంది. ఈ పెట్టుబడి పోటీకి తట్టుకోలేక మధ్యతరగతి వ్యాపారులూ, వృత్తిదారులూ దివాళా తీసి కార్మికవర్గంలో కలుస్తారు. ఈ విధంగా కార్మికవర్గం సంఖ్యలో పెరగడంతోపాటు బూర్జువా వర్గంతో తలపడే క్రమంలో వారు వివిధ దశల్లో ఎలా సంఘటిత పడతారో మార్క్స్-ఏంగెల్స్ వివరించారు.
చరిత్రలో జరిగిన పోరాటాలన్నిటిలోనూ అధికారంలోకి వచ్చిన వర్గాలు స్వంత ఆస్తులు అనుభవించడంతోపాటు, ఆ విధానాన్నే సమాజం మీద రుద్దాయి. కానీ కార్మిక వర్గం అలాంటిది కాదనీ, మొత్తం సమాజాన్ని విముక్తి చేయడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం విముక్తి చెందగలుగు తుందనీ, అందువల్లనే అది ఆధునిక విప్లవకర వర్గం అయిందనీ మార్క్స్-ఏంగెల్స్ విశ్లేషిం చారు. ఇంతవరకు జరిగిన ఉద్యమాలన్నీ అల్ప సంఖ్యా కులు తమ ప్రయోజనాల కోసం జరిపిన ఉద్యమాలు. కానీ కార్మికవర్గ ఉద్యమం అలాంటిది కాదు. ''అది అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాల కోసం, అత్యధిక సంఖ్యాకులు బుద్ధిపూర్వకంగా, స్వతంత్రంగా నడిపే ఉద్యమం'' అని చెబుతూ ''శ్రామిక వర్గం ఈ సమాజంలో అట్టడుగు పొరలో ఉంది. అది కదలాలన్నా లేచి నిలబడాలన్నా తనపై ఉన్న పొరలన్నిటినీ పైకి గాలి లోకి విసరాల్సిందే'' అని స్పష్టం చేశారు.
గతంలో పాలక వర్గాలు పీడిత వర్గాలకు కనీసం బానిసగానైనా బతకడానికి గ్యారంటీ ఇచ్చాయి. కానీ బూర్జువాల కింద బానిసలుగా బతుకుతున్న కార్మికులకు కనీసం ఆ బానిస బతుకులనైనా నమ్మకంగా చూపగల సత్తా నేటి బూర్జువా సమాజానికి లేకుండా పోయింది. బూర్జువా వర్గం మనుగడ సాగాలంటే పెట్టుబడి అభివృద్ధి కావాలి. అలా జరగాలంటే కార్మికులకు పని ఉండాలి. బూర్జువా సమాజం వారికి ఆ పనినే కల్పించలేని స్థితిలో ఉన్నప్పుడు ''ఏ పునాదిపై ఆధారపడి బూర్జువా వర్గం సంపదలను సృష్టించి వాటిని స్వాహా చేస్తోందో ఆ పునాదులనే ఈ పారిశ్రామిక అభివృద్ధి కూల్చివేస్తుంది. కనుక బూర్జువా వర్గం ప్రధానంగా ఉత్పత్తి చేసేది తనకు గోరీ కట్టే శక్తులనే'' అని మార్క్స్-ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో వివరించారు.
''బూర్జువావర్గ పతనమూ తప్పదు, కార్మికవర్గ విజయమూ తప్పుదు'' అన్న నిశ్చయమైన ప్రకటనతో వారు తొలి అధ్యాయాన్ని ముగించారు.
- ఎస్. వెంకట్రావు