Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది ఒక విశాలమైన గ్రౌండు. ఆ గ్రౌండులోకి బుల్డోజర్లు, జేసీబీలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి అనేక బుల్డోజర్లు, జేసీబీలు వచ్చి చేరుకున్నాయి. ఇంకా అక్కడికి రాని బుల్డోజర్లను వెంటనే రమ్మంటూ సమాచారాలు పంపుతున్నాయి. వస్తున్న జేసీబీ, బుల్డోజర్స్తో అంతా హడావుడిగా, గొడవ గొడవగా ఉంది. మొత్తానికి కాసేపటికి అంతా సద్దు మణిగింది.
ఒక సీనియర్ బుల్డోజర్ ముందుకు వచ్చింది. సోదర బుల్డోజర్లు, జేసీబీలకు స్వాగతం! ఈ సమావేశానికి ఆహ్వానించగానే వచ్చినందుకు సంతోషం! ఇటీవల జరిగిన పరిణామాలు, మన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశాము! అన్నది.
''ఇంతకూ విషయమేమిటో చెప్పండి!'' అన్నది ఓ కొత్త జేసీబీ. దానికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు.
తొందరెందుకూ చెబుతారు కదా!'' అన్నది ఓ పాత బుల్డోజర్.
''అన్నీ చెబుతాము. మీటింగ్‌కు పిలిచింది చెప్పటానికే గదా! ఇటీవలే పువ్వుగుర్తు పార్టీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు మీరంతా విని ఉండొచ్చు. వాళ్ళ పార్టీ ఎంతో గొప్పగా పనిచేస్తోందని, వాళ్ళ పార్టీకి ఓట్లు వెయ్యకపోతే, ఊళ్ళలో నుండి వెళ్ళగొడతామని, ఇళ్ళ మీదికి బుల్డోజర్లు, జేసీబీలను నడిపిస్తామని ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాము'' అన్నది అధ్యక్ష బుల్డోజర్.
''చాలా మంచిది. ఎమ్మెల్యేకు థ్యాంక్స్ చెప్పి మనం పని మొదలు పెడదాం!'' అన్నది కొత్త జేసీబీ ఉత్సాహంగా. వెంటనే దాని తలమీద రెండు మూడు మొట్టికాయలు పడ్డాయి!
''రేరు బుడ్డోడా! నీకు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు! ఎందుకురా హాడావుడి పడతావు. పెద్దవాళ్ళము అంతా ఉన్నాము కదరా!'' అన్నది ఓ ఓల్డ్ బుల్డోజర్.
''సమావేశం అంటారు! అభిప్రాయాలు చెప్పమంటారు! నా అభిప్రాయం చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం కదా! నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేదా!'' అని ఎగిరిపడింది కొత్త జేసీబీ.
''చూశావా! సమావేశం పెట్టి, అభిప్రాయాలు అడగ్గానే నీకు స్వేచ్ఛ ఉందని, మాట్లాడే హక్కు ఉందని, ప్రజాస్వామ్యమని మాట్లాడుతున్నావు! మరి భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశమనీ, ఈ దేశ ప్రజలకూ ఓటు హక్కు ఉందని, నచ్చిన వారికి ఓటేసే స్వేచ్ఛ ఉందనీ మర్చిపోతే ఎలా?'' అన్నది ఓ పాత జేసీబీ.
''గత ఐదేండ్లుగా ఉత్తరప్రదేశ్‌ను యోగి ఎంతో అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధిని చూసి ఓటు వెయ్యమని కాస్త గట్టిగా అడిగే ప్రయత్నంలో ఓ మాట అని ఉండొచ్చు! అది తప్పెలా అవుతుంది!'' ప్రశ్నించింది ఓ నడివయస్సు జేసీబీ.
''తమను, తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందీ, లేనిదీ, ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు! తమకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛ ప్రజలకు ఉంది! కానీ, ఓటు వేయకుంటే ఊళ్ళో నుండి వెళ్ళగొడతామని, ఇళ్ళ మీదికి బుల్డోజర్లు నడిపిస్తామనే స్వేచ్ఛ ఎవరికీ లేదు! అలాంటి మాటలు బెదిరింపులే! ప్రజలను బెదిరించటం నేరం!'' అన్నది మరో వడి వయస్సు జేసీబీ.
''ఉత్తరప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో కొత్త విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్, కొత్త కొత్త గుళ్ళూ, గోపురాలను యోగి నిర్మించారు. అంత గొప్ప అభివృద్ధి కేరళలో కూడా జరగలేదు!'' అందుకే మళ్ళీ యోగి ప్రభుత్వాన్ని గెలిపించాలని అడగటంలో తప్పేముంది?'' మళ్ళీ ప్రశ్నించింది కొత్త జేసీబీ.
''ఓరేరు బుడ్డోడా! నీవు వాట్సప్ చూడటం తగ్గించురా అంటే వినకపోతివి! చూడు ఎట్లా తయారయ్యావో! ఆ ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్స్ అన్నీ ఫేక్రా! ఎక్కడెక్కడి దేశాల్లోని ఫొటోలు తెచ్చి వాట్సప్‌లో గుమ్మరించి అవి ఉత్తరప్రదేశ్‌లోనే కట్టినట్టు క్రియేట్ చేస్తున్నారు! వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు!'' అన్నది మరో మధ్య వయస్సు జేసీబీ.
''ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి ఏమిటో గంగానదిలో కొట్టుకుని పోయిన శవాలు చెబుతాయి!'' అన్నది మరో కొత్త జేసీబీ.
''అధికారంలోకి రాకముందు రాములవారి గుడి, హిందువుల అభివృద్ధి, చైనా దాడులు, పాకిస్థాన్ పేరు చెప్పి ఓట్లడిగారు! అప్పుడు కూడా మాకు ఓట్లేయ్యకపోతే మీ ఇళ్ళమీదికి బుల్డోజర్లు నడుపుతామని అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చేవారా? అంటే అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చాక మరొకలా ఉంటారా? ఇదేమి పద్ధతి?'' ప్రశ్నించింది మరో బుల్డోజరు.
''ఓట్లేయమని అడుక్కోవాలి గాని, బెదిరిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? లేక నిరంకుశమా?'' అన్నది మరో జేసీబీ.
''ఐనా! ప్రజలను బెదిరించటానికి ఇంతకు ముందు రౌడీలను, గూండాలను వాడుకునేవారు! ఇప్పుడేమో మనలను ప్రజలకు మీదికి నడిపిస్తానంటారా? మనలను వాడుకునే హక్కు వారికెవరు ఇచ్చారు?'' గట్టిగా ప్రశ్నించింది మరో జేసీబీ.
''మన ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా మనలను ప్రజలపైకి నడిపిస్తామని ఆ ఎమ్మెల్యే ఎలా చెబుతాడు? అసలు ఈ పాలకులు మనలను ఎప్పుడూ ప్రజలకు వ్యతిరేకంగా వాడుకుందామని చూస్తారెందుకు? రోడ్ల విస్తరణ పేరిట రోడ్డు మీద చిన్న డబ్బాలు వేసుకుని బతికేవారి మీదకు మనల్ని పంపిస్తారు!'' అన్నది ఓ బుల్డోజర్.
''అక్రమ కట్టడాలు అంటూ, పేద గుడిసెలు కూలుస్తారు గాని, పెద్ద పెద్ద బిల్డింగులు ఎప్పుడైనా కూల్చమన్నారా? పేదల గుడిసెలు మనతో కూల్పించేసి, పెద్దల బంగళాలు రెగ్యులైజు చేస్తారు? ఇదే ప్రజాస్వామ్యమా?'' ప్రశ్నించింది మరో సీనియర్ జేసీబీ.
''సమాజంలో తయారయ్యే ఏ సరుకైనా ప్రజల మేలుకు ఉపయోగపడాలి గాని, ప్రజల నాశనానికి కాదు! మనం కూడా అంతే! ప్రజల మేలుకు పనికి వచ్చే మనలను ప్రజలపైకే నడిపిస్తామని అంటే మనం సహించే ప్రశ్నే లేదు! అందుకే అవసరమైతే మనలను ప్రజల ఇండ్లపైకి నడిపిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే ఇంటిమీదికే పోదాము. అతడినే ఊళ్ళో నుండి వెళ్ళగొట్టి శాంతిభద్రతలు కాపాడుదాం! ఇదే ఈ సమావేశంలో నేను పెడుతున్న తీర్మానం!'' అని తీర్మానం పెట్టింది అధ్యక్ష బుల్డోజర్.
''ఈ తీర్మానానికి ఓటింగ్ అవసరం లేదు! అంతా ఏకగ్రీవమే! తక్షణమే ఈ తీర్మానం అమలు చేద్దాం!'' అంటూ ముందుకు కదిలింది! రిజిస్ట్రేషన్ కాని కొత్త జేసీబీ.
''పదండి ముందుకు! పదండి తోసుకు'' అని నినాదాలుచేస్తూ బుల్డోజర్లు, జేసీబీలు ముందుకు కదిలాయి.
- ఉషాకిరణ్, సెల్: 9490403545