Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే. గూగుల్‌లో కొడితే చాలా పేజీలు, విడియోలు దర్శనమిస్తున్నాయి. 2020, 2021రెడ్ బుక్స్ డే నాడు ఏ పుస్తకాలు చదివారు, ఇప్పుడేం చదువుతున్నారు వంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్‌వర్డ్ నుంచి కేరళ చింతా, తమిళనాడు భారతి, ప్రజాశక్తి, నవతెలంగాణ వంటి అనేక ప్రచురణ సంస్థలతో పాటు పలు ప్రజావేదికలు కూడా ఇదే ఉత్సవం జరుపుతున్నాయి. ప్రపంచీకరణ ప్రసాదించిన వాలంటీన్స్ డే తర్వాత వారం రోజులకే ఈ రెడ్‌బుక్స్ డే రావడం యాదృచ్చికమేమీ కాదు. మహత్తరమైన మానవ ప్రేమ సందేశాన్ని మార్కెట్‌తో ముడిపెట్టే మాయాజాలం అదైతే, సమాజాన్ని సమూలంగా మార్చే విప్లవకారుల విజ్ఞాన ప్రస్థానం ఇది.
కొద్ది రోజుల ముందే ప్రధాని మోడీ ఎఎన్ఐ వార్తాసంస్థ ప్రతినిధికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మామూలుగా మీడియాను ఎదుర్కొని వారు సంధించే ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వడం ఆయనకు నచ్చదు. అందుకే ఏడేండ్లలో ఒక్కసారి కూడా పూర్తిస్థాయి మీడియా గోష్టి జరిపిందేలేదు. ఆ సంగతులు అలా ఉంచితే ఈ ఇంటర్వ్యూలో ఒకప్రశ్న అడిగారు. కాంగ్రెస్ గతంలో ఉన్నంత బలంగా లేదు కదా ఎందుకు మీరెప్పుడూ దానిపై దాడి చేస్తున్నారు అని. సంఖ్యరీత్యా వారు బలహీనపడినా వారి ప్రభావం ఇంకా ఉంది గనక తప్పదు అని మోడీ జవాబిచ్చారు. మరో కీలకవిషయం అడక్కుండానే చెప్పారు. ఆ మాటకొస్తే కమ్యూనిస్టులకు ఎప్పుడూ చట్టసభల్లో పెద్ద బలం లేదు. కానీ వారి భావధార ప్రభావశీలంగా ఉంటుంది గనక మనం విమర్శించడం లేదా.. అని ఎదురు ప్రశ్న వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపైన మోడీపైన విమర్శ చేయడం కోసం చూపిన పుస్తకం ఐయామ్ ఎ ట్రోల్. దీని తెలుగు పాఠం ప్రజాశక్తి ప్రచురణాలయం నుంచి తీసుకుని వారి పత్రికలో ఒక పేజీ మొత్తం వేశారు. ఉపాధ్యాయుల ఉధృత ఆందోళన హెచ్చరిక చూశాక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు.
త్రివేణి, చారిత్రక వాణి
ఈ మూడు కోణాలు కలిపి చూస్తే పాలక పార్టీల నేతల నోటనే కమ్యూనిస్టులంటే ఏమిటో తెలుసుకోగలం. సౖౖెద్ధాంతికంగా ప్రత్యర్థులను ఢకొీనడం, అందుకు అవసరమైన సాహిత్యం ప్రచురించడం, ఆ అవగాహనతో ప్రజలను కదిలించి పోరాడటం ఒక త్రిముఖ కర్తవ్యం. ఇది కమ్యూనిస్టులు మాత్రమే చేసే పని. విధేయత, ఆర్బాటం వంటి వాటిపై ఆధారపడిన పాలకపార్టీల విధానానికి భిన్నంగా సిద్ధాంతం, అధ్యయనం, విమర్శ, ప్రజాచైతన్యం, ప్రతిఘటనపై ఆధారపడి విప్లవ సాధన వరకూ గమనం సాగించే ప్రజాపక్షం వారిది. మిగిలిన వారంతా యథాతథస్థితిని కొనసాగించాలని, తమ పాలనను శాశ్వతం చేసుకుని సంపన్నవర్గాల పంట పండించాలని కోరుకునే వారు మాత్రమే. మోడీ లాంటి వారయితే మరింత వెనక్కు వెనక్కు తీసుకుపోవాలని చూస్తారు. అందుకు ఉపయోగపడే పుస్తకాలు వారూ ప్రచురిస్తారు. ప్రగతిశీల భావజాలంపై దాడి జరుపుతారు. హిట్లర్ కూడా మైన్కాంఫ్ రాశాడు. ''చదవనివాడజ్ఞుండగు, చదువువల్ల సరసద్వివేక చతురత కలుగున్'' అంటూ.. హిరణ్యకశ్యపుడు కూడా కుమారుడు ప్రహ్లాదుడిని చదువుకోమని పంపించాడు. తిరిగివచ్చిన తర్వాత ఏంచదివావని ప్రశ్నిస్తే... చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ అని జవాబిచ్చాడు. అదేంటో తెలిశాక రాక్షసరాజు నిర్ఘాంతపోయాడు.(దీనికి సంబందించిన ఇతర వివరాల్లోకి పోవడం లేదు) అంటే ఏ రాజ్యానికైనా కావలసిన చదువు ఒకటుంటుంది. బొత్తిగా నచ్చని చదువు మరొకటి.
వాస్తవానికి మార్క్స్ ఎంగెల్సులనే కమ్యూనిజానికి లేట్ కమర్స్ అంటాడు ప్రసిద్ధ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్వామ్. ఈ సూత్రాలన్నీ అప్పటికే వివిధ రూపాల్లో ఉన్నాయి. కమ్యూనిజం అనే పదం కూడా ఉంది. అయితే మార్క్స్, ఎంగెల్స్‌లు దాని లోతుపాతులు అధ్యయనం చేసి అసలు సంగతి సమాజాన్ని మార్చడం అనీ, అందుకు శాస్త్రీయ సిద్ధాంతం అవసరమనీ గుర్తించి కమ్యూనిస్టు ప్రణాళికతో శంఖారావం చేశారు. అహరహం బ్రిటిష్ మ్యూజియంలో అధ్యయనంచేసి అమూల్య సిద్ధాంత సంపద సృజించిన మార్క్స్ కోసం వారు గొప్ప స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు ఎంగెల్సు, తర్వాత లెనిన్ ఈ సిద్ధాంతాన్ని సుసంపన్నం చేసే క్రమంలో ఎన్నో గొప్ప పాఠాలు అందించారు. వాటిని జయప్రదంగా అమలు చేయడం ద్వారా నిజంగా మరో ప్రపంచం ఏర్పడింది. మానవాళి విముక్తికి మార్గం తెలిసింది. మట్టి మనుషులు మహావీరులయ్యారు. శ్రమజీవులే నవ జ్ఞానులయ్యారు. పెద్ద బాలశిక్ష ఫెయిల్ ప్రజాశక్తి ప్యాస్ అని పాలకవర్గ పత్రికలు అప్పట్లో అపహాస్యం చేయడం నిజానికి ఒక ప్రశంస. ఇదెలా సాధ్యమైందంటే జనం కోసం పనిచేసే కార్యకర్తలే ఉద్యమకారులుగానూ ఉపాధ్యాయులుగానూ ఉత్తేజం అందించాల్సిన బాధ్యత నిర్వహించారు. ఆ కర్తవ్యసాధనలో అందరికన్నా ముందు విజయం సాధించి తొలి సమసమాజాన్ని స్థాపించిన లెనిన్ ఉద్యమ నిర్మాణాన్ని గురించి చెబుతూ... విప్లవ సిద్దాంతాన్ని సృజనాత్మకంగా అధ్యయనం చేయాలనీ, దాని లోతుల్లోకి వెళ్లాలనీ, కరతలామకం చేసుకోవాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. శాస్త్రీయ కమ్యూనిజం ఊహాత్మకమైంది కాదనీ, ఎవరి బుర్రలోనో పుట్టిన ఊహకాదనీ, మానవ జ్ఞానం అన్ని పార్శ్యాలకూ చెందిన ఖచ్చితమైన శాస్త్రీయ వాస్తవాల మీద ఆధారపడి రూపొందిన సమగ్ర దృక్పథం అనీ నొక్కి చెప్పాడు. మానవజాతి జ్ఞానాగార ఖజానాలన్నిటి నుంచి నీ ఆలోచనాశక్తిని పరిపుష్టం చేసుకుంటేనే నీవు కమ్యూనిస్టువు కాగలవని స్పష్టంచేశాడు. చదవడం అంటే ఊరికే చదవడం కాదు. కేవలం అక్షరాస్యుడు కావడం కమ్యూనిస్టుకు చాలదన్నాడు లెనిన్. ఊరికే విజ్ఞాన శాస్త్రాలు పోగేసుకుని చదివేయడం సరిపోదు. కృషి లేకుండా పోరాటం లేకుండా కమ్యూనిజం గురించిన పుస్తకాల జ్ఞానం అంటూ ఉండదన్నాడు. ఆ విధంగానే బొల్షివిక్ విప్లవం సాధించాడు.
పెరిగిన వేగం, ప్రతికూల భావజాలం
ఇంత అరుదైన తొలి ప్రస్థానం కొన్ని ప్రధానమైన దేశాలలో విచ్చిన్నమై ఉండొచ్చు గానీ ఆ విముక్తి గానం, విప్లవశక్తుల గమనం ఆగేవి కావు. పదండి ముందుకు అంటూ పురోగామి శక్తులు సాగిపోవడానికి అధ్యయనం ఆవశ్యకతా తగ్గదు సరికదా సవాళ్లతో మరింత పెరిగింది. అదే రెడ్‌బుక్స్ డే సందేశం. మార్క్స్ ఎంగెల్సులు మౌలిక సిద్ధాంత సూత్రాలు అందించారే గాని పిల్లలకు గైడ్ రాసిపెట్టినట్టు చేయలేదు. నిర్దిష్ట పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే వారు కొన్ని ఖాళీలు అట్టిపెట్టారు. ముందు వారు రాసింది చదివి తర్వాత మన పరిస్థితులను మధించి ఆ సూత్రాల అన్వయం, మన ఆచరణ సమన్వయం బాధ్యత మనపైనే ఉంటుంది. ఎవరూ పుట్టుకతో చదువరులు కాదు. వందలపుస్తకాలు చదివేవారు కూడా సమకాలీన సమాజ పరిస్థితుల సారం చెప్పే విషయాలు చదువుతున్నారా అనేది ప్రశ్నే. ఎవరో ఎందుకు? మహానాయకుడు సుందరయ్య కూడా దేశబంధు చిత్తరంజన్ దాసు మరణించినప్పుడు ఆయనెవరని ప్రశ్నవేసి స్నేహితుడు మందలించాకే మారిపోయారు. అంతకు ముందూ ఆయన పుస్తకాలు విపరీతంగా చదివేవారు. కాని ఏది చదవాలి ఎలా చదవాలన్నది అప్పుడు తెలుసుకున్నారు. సుందరయ్య మద్రాసులో మొదట హెచ్డీ రాజా తెచ్చి ఇచ్చిన కమ్యూనిస్టు ప్రణాళికతోనే సిద్ధాంత గ్రంథాల అధ్యయనం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఇంగ్లీషు పుస్తకాల అనువాదం అందుబాటు ఒక తొలి కర్తవ్యంగా తీసుకున్నారు. అప్పటికి తీవ్ర నిషేదం ఉన్నా, విదేశాల నుంచి పుస్తకాలు రావడం దుస్సాధ్యమైనా ఎంతో పెనుగులాడుతూ నాటి బృందం అనువాదాలు తీసుకొచ్చింది. తెలుగునాట ప్రజాశక్తి తర్వాత విశాలాంధ్ర ప్రచురణాలయాలు అలాగే నెలకొన్నాయి. అవంతీ, ఆదర్శ గ్రంథమండలి వంటివి కూడా అలాటి సేవలే చేశాయి. ఏమైనా అటు మతవాద మితవాద ఆరెస్సెస్ ఇటు కమ్యూనిస్టులు మాత్రమే సిద్ధాంత పోరాటం కోసం పుస్తక ప్రచురణను ఒక భాగంగా చేసుకున్నాయి. సిద్ధాంత పోరాటంలో జరిగేది అతిభీకరమైన పోరాటమని లెనిన్ అన్నమాట గుర్తు చేసుకుంటే అధ్యయనం అవసరం అర్థమవుతుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పుస్తకాల అందుబాటు పెరిగింది. కంప్యూటర్ల దెబ్బకు ముద్రణ కొంత తగ్గుముఖం పట్టినా వివిధ రూపాలలో సమాచారం ప్రవహిస్తున్నది. అదే సమయంలో కమ్యూనిస్టుసూత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకానికి పది వ్యతిరేక ప్రచురణలు కూడా ఉండొచ్చు. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత వర్గపోరాటానికి భిన్నమైన లేదా వ్యతిరేకమైన భావజాలాలను ప్రోత్సహించడం, ప్రచారంలో పెట్టడం బాగా పెరిగింది. ప్రజలకు జరిగేది కనిపిస్తూనే ఉంటుంది. కాని వాటిని ఆవరించివున్న భ్రమలు పటాపంచలు చేయాలంటే మౌలిక విషయాలతో సోదాహరణంగా చెప్పగలగాలి.
అవహేళన కాదు, అవగాహన
ఆసక్తితో చదివితేనే అవగాహన కలుగుతుంది. యాంత్రికంగా ఏదో నివేదిక కోసమో పాఠం చెప్పడం కోసమో లేక తప్పనిసరి తంతుగానో చదివితే ప్రయోజనం నాస్తి. వ్యక్తిగత ఆసక్తితో పాటు ఉద్యమ అవసరాలను కూడా ప్రధానంగా గమనంలో ఉంచుకోవాలి. తక్షణ సమస్యలకే పరిమితమైనా మౌలిక సూత్రాలే వల్లెవేస్తున్నా పొరబాటే. రెండింటి మేళవింపు జరగాలి. మన అవగాహన పెంచుకుని జనరాశులకు బోధించడానికి, గందరగోళాలు తొలగించడానికి, శత్రువులను ఖండించడానికి చదవాలి. అవగాహనకూ అవహేళనకూ పొంతన కుదరదు. కొంతమంది సర్వజ్ఞులైన సిద్ధాంత కోవిదులమనుకొని అంతగా చదివే అవకాశం దొరకని వారిని చిన్నబుచ్చడం తగని పని. వారికి కూడా ఎరుకపర్చేలా చెప్పి అధ్యయనం వైపు ఆకర్షించాలి. పురాణం, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, రాజకీయ ఆర్థికాంశాలు, సామాజిక శాస్త్రాలు దేనిని ఎలా చూడాలనే స్పష్టత ఉండాలి. ఉదాహరణకు రామాయణ భారతాల వంటి వాటిని ఇప్పుడు అవహేళన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. వాటి నేపథ్యం, అవి సమాజ గమనంలో ఎలా ఉద్భవించాయి, అందులో అంతర్గర్భితంగా ఉన్న సమాజ పరిణామ సంకేతాలేమిటో తెలుసుకోవాలి గానీ, దేశకాల పరిస్థితులకు అతీతంగా ఇప్పటి కొలతలతో తాము చదివిన పుస్తకాల పరిమితితో హేళన చేయడం ప్రతికూలమే అవుతుంది. నిర్దిష్ట పరిస్థితులలో తీసుకోవాల్సిన నిర్ణయాలుగా మార్క్స్ ఎంగెల్సు వంటివారు వదలిపెట్టిన అంశాలను అప్పటివి మక్కీకి మక్కీగా ఇప్పుడువల్లె వేయడం కూడా శాస్త్రీయం కాదు. అవగాహన పెరిగే కొద్ది కఠినమైన విషయాలను కూడా సరళంగా వివరించే శక్తి పెంచుకోవాలి తప్ప మనకు కలిగిన ప్రాథమిక అవగాహనే అంతిమమన్నట్టు వ్యవహరిస్తే మనం 2022ను అందుకోవడం అసాధ్యమవుతుంది. ప్రజల తరపున పోరాడే శక్తులతో చేతులు కలపకుండా, కార్యచరణను గౌరవించకుండా గట్టుమీద కూచుని పాఠాలు చెబితే వాస్తవాలను అర్థం చేసుకోవడం దుస్సాధ్యం. సిద్ధాంత విజయంపై విశ్వాసంతోపాటే చరిత్రలో ఎదురైన సవాళ్లను, సంక్లిష్టతలను కూడా గుర్తించి సమాధానం చెప్పాలి. మార్క్స్ చెప్పిన కార్మికశక్తి, దోపిడీ వంటి మాటలకు కాలం చెల్లిందన్నవారు కోవిడ్ తర్వాత కోట్లాది మంది శ్రామికులు పనులు కోల్పోడం, పనిగంటల పెంపు వంటి ఆదిమ పద్ధతుల పునరావృతం, నిపుణత గలవారే నిస్పృహపాలవడం చూశారు. వ్యవసాయాన్ని తక్కువ చేసిమాట్లాడిన వారే రైతాంగ పోరాటాలకు తలవంచారు. మతతత్వ రాజకీయాల మంటలు మొదట గమనించలేకపోయిన వారు ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు. ఇందులో ప్రతివిషయం మీద ప్రతిఘట్టంలో ప్రజాశక్తి, నవతెలంగాణ వంటి సంస్థలు పుస్తకాలు ప్రచురించాయి. ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నించాయి. వాటిని లోపలా బయిటా మరింత మందికి చేర్చవలసే ఉంటుంది. ఎందుకంటే సవాలు ఉధృతితో పోలిస్తే ఈ సైద్ధాంతిక కృషి, అధ్యయనం, ప్రచారం చాలవు. పైగా ఎదురుదాడి మరింత తీవ్రంగా ఉంది. కనుక అధ్యయనమే ఆయుధంగా ఆలోచనలకు పదును పెట్టుకోవాలి. ఆచరణకు వేగం పెంచుకోవాలి. అవగాహన విస్తృతపర్చుకోవాలి. చదవడం అంటే మొక్కుబడి కాదు. కట్టుబడి అంతకన్నా కాదు. పుస్తకం హస్త భూషణమో గృహాంతర అలంకారమో కాదని కూడా గుర్తించాలి. అది మానవ చైతన్యంలో భాగం. పురోగమనానికి చిహ్నం. ప్రణాళిక కోసం చదవడమే కాదు, చదవడానికీ ప్రణాళిక ఉండాలి. దానికి ఈ సోమవారం మూడో అడుగుపడాలి.
- తెలకపల్లి రవి