Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాఖ్య స్వభావాన్ని సంరక్షించేందుకు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై మోడీ ప్రభుత్వ దాడిని తిప్పికొట్టేందుకు ఐక్యంగా ఉండాల్సిన అవసరంపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్య వైఖరి తీసుకోవాల్సిన అవసరం గురించి ఎక్కువగా చెప్పనవసరంలేదు. మొత్తం వ్యవస్థను కేంద్రీకతం చేసి, అన్ని అధికారాలను ఒక్క చోటే కేంద్రీకరించేలా మోడీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్రం జరిపే ఈ దోపిడీల నుండి కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు చెందిన ఏ ఒక్క అంశమూ మినహాయింపు కాదు. వీటికి సంబంధించి అత్యంత దారుణమైన, తీవ్రమైన చర్య ఏదంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడమే. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడమే. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే సర్‌చార్జీలు, సెస్సులు వంటి వివిధ మార్గాలను ఉపయోగించడం ద్వారా రాజ్యాంగబద్ధమైన వనరుల పంపిణీని కూడా రాష్ట్రాలు కోల్పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళేలా ఆర్థిక సంఘం విధి విధానాలను నిర్దేశించారు.
మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించడమంటే కూడా (ఇపవిడు రద్దు చేశారు) రాష్ట్రాల పరిధిలోకి చొరబడడమే. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్లు రాష్ట్రానికి సంబంధించిన అంశమని రాజ్యాంగంలో పేర్కొన బడింది. విద్యకి సంబంధించి వివిధ స్థాయిల్లో కేంద్రం చేపడుతున్న కేంద్రీకరణ ధోరణులు కొత్త విద్యా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించడం రానురానూ ఎక్కువైపోతోంది. వారు కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను సవరించాలన్నది కేంద్రం తాజా ప్రతిపాదనగా ఉంది. ఇదే గనుక జరిగితే, రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా కేంద్రమే రాష్ట్రానికి చెందిన అధికారులను వెనక్కి పిలిపించే నియంతృత్వ ధోరణులకు దారి తీస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు.
మొత్తంగా సమాఖ్య సిద్ధాంతంపై దాడి జరుగుతోంది. ఇది రాష్ట్రాల ఆర్థిక, ద్రవ్య, శాసన రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భిన్నమైన రాజకీయ సమీకరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న లేదా కేంద్రం అభీష్టాలను, ఆదేశాలను అనుసరించని నిర్దిష్ట రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు రకాల దాడులను ఎదుర్కొనేందుకు బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క తాటిపైకి రావడం అవసరం.
ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరేనని ప్రకటిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, చట్టసభల అధికారాలను నిర్వీర్యం చేస్తూ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్‌ను గతేడాది ఏప్రిల్‌లో సవరించడమంటే - దాన్ని కేవలం 'ఆప్' ప్రభుత్వంపై దాడిగా చూడలేం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పునాదులపై దాడి చేయడమే అవుతుంది. సమాఖ్య స్వభావానికి, రాష్ట్రాల హక్కులకు మద్దతుగా అన్ని ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఉమ్మడి వైఖరిని తీసుకోవడం అనివార్యమవుతోంది. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు సమావేశమవడం ఈ దిశగా సకాలంలో తీసుకుంటున్న అవసరమైన చర్య.
అయితే అటువంటి ముఖ్యమంత్రుల సమావేశం ప్రధానంగా సమాఖ్య స్వభావంపై, రాష్ట్రాల హక్కులపై మాత్రమే దష్టి కేంద్రీకరించాలి. అలాకాకుండా రాజకీయ పొత్తులను ఏర్పరచు కునేందుకు ఒక వేదికగా ఉపయోగించుకునే ప్రయత్నం జరిగితే ఈ సమాఖ్య తత్వం, రాష్ట్రాల హక్కుల అంశం ప్రాముఖ్యత దెబ్బ తింటుంది. ప్రతికూల ఫలితాలతో ముగుస్తుంది. ప్రతిపాదిత ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రాంతీయ పార్టీల ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ఉపయోగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యోచిస్తున్న తీరు... సమాఖ్య సూత్రాన్ని పరిరక్షించాలన్న కర్తవ్యం నుండి పక్కకు మళ్లించడమే కాగలదు. ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడటం, ప్రత్యామ్నాయ పొత్తు దిశగా ముందుకు సాగేందుకు మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నం వంటివన్నీ కేవలం రాజకీయాంశాలే. వాటిని బీజేపీ యేతర ముఖ్యమంత్రులను ఒక తాటిపైకి తీసుకువచ్చే కర్తవ్యంతో మిళితం చేయరాదు.
బడా బూర్జువా పార్టీల నేతృత్వంలోని పాలక వర్గాలు దశాబ్దాల తరబడి ఈ కేంద్రీకరణ డ్రైవ్‌కు ప్రేరణగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ దశల్లో ఈ కేంద్రీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించిందన్నది వాస్తవం. అయితే, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాష్ట్రాల హక్కులపై కేంద్రం జరుపుతున్న దాడులను చవిచూడాల్సి వస్తోంది. అందువల్ల, బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సంయుక్త వేదికను ఏర్పాటు చేసే దిశగా సమీకృతం కావాలి.
సమాఖ్య స్వభావానికి వ్యతిరేకంగా కేంద్రం సాగిస్తున్న దాడిపై విశాల ఐక్య నిర్మాణానికి సమయం ఆసన్నమైందని సీపీఐ(ఎం) భావిస్తోంది. ఈ ఏకైక ఎజెండాతో బీజేపీ యేతర ముఖ్యమంత్రులు సమావేశం జరపడం తప్పనిసరి.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం