Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును డెబ్భై ఎండ్ల నిరీక్షణకు ముగింపు పలికింది ఆ తొమ్మిది రోజుల పోరాటం. ఓ చిన్న మారు మూల ఆదివాసీ గూడెం అది. కానీ రాష్ట్రం మొత్తం తనవైపు తొంగిచూసేల చేసింది. ఇన్నేండ్లుగా కన్నెత్తి కూడా చూడని అధికార గణం ఆఘమేఘాల మీద ఆ గ్రామానికి పరుగులు పెట్టింది. మీడియా తోడై నిలవడంతో పాటు ఆదిలాబాద్ పట్టణ ప్రజలు ఆ అడవి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. ఆ తొమ్మిది రోజులు ఎక్కడ విన్నా వీరి చర్చే. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఈ ఊరి వార్తనే చక్కర్లు కొట్టింది. పోరాడితే పోయేదిలేదు బానిస సంకెళ్లు తప్పా అని కార్ల్‌మార్క్స్ చెప్పినట్టు ఈ ఆదివాసీలు అక్షరాల పాటించి విజయం సొంతం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని మారుమూల చిన్న పల్లె కుండిషేకుగూడ. ఇక్కడ 35నివాసాలు ఉండగా 200మంది జనాభా నివసిస్తున్నారు. పంచాయతీ కేంద్రమైన ఈ పల్లెకు అనుబంధంగా మారుతిగూడ, కొలాంగూడ, చిన్నకుండి గ్రామాలున్నాయి. ఈ గ్రామం ఏర్పడి డెబ్భై ఏండ్లు కావస్తోంది. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు మచ్చుకైన కనిపించవు. తాగేందుకు గుక్కెడు నీటి కోసం కోసెడు దూరంలో ఊట బావి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు కొండెక్కి దిగితే కానీ దాహం తీర్చుకునేందుకు వీలులేని పరిస్థితి. పండు ముసలి మొదలు కొని ఐదేండ్ల చిన్నారులు కూడా బిందె తీసుకొని నీటి కోసం పరుగులు పెట్టాల్సిందే. చదువు పక్కన పెట్టి సగం దినం నీటి కోసం కుస్తీపట్టాల్సిందే. మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఇతర ప్రపంచంలోకి అడుగుపెట్టా లన్నా ఏడు కిలోమీటర్లు రాళ్లురప్పల మద్య నడిస్తే కానీ గమ్యం చేరలేరు. చినుకుపడితే కాలుతీసి కాలు వేయలేరు. దారి సరిగా లేక అనేక మంది మార్గమద్యలోనే ప్రసవం అయిన సందర్భాలున్నాయి. నడిచేందుకు కూడా వీలులేని ఈ మార్గంలో కిందపడి అనేక మంది అంగవైకల్యురుగా మారారు. ఇక గ్రామంలో అంతర్గత రోడ్లు, మురికికాల్వల ఊసే లేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం చేపట్టినా నీటి సరఫరా చేయలేదు. ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చినా నీరు రాకపోవడంతో అలంకార ప్రాయంగా ఉన్నాయి. బడి ఉన్నా ఉపాధ్యాయులు సక్రమంగా రాక విద్యార్థులు ఎక్కువ రోజులు ఆటలోనే గడిపేస్తున్నారు. మధ్యాహ్న భోజనం లేక పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. కనీసం అంగన్వాడీలో లభించే సరుకులు కూడా వీరి దరికి చేరక పిల్లల ఎదుగుదల మందగించింది. గ్రామానికి తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్‌ను అడిగితే ఆమె భర్త అధికార అండతో గ్రామస్తులపై భౌతికదాడికి దిగి బాధితులపైనే కేసు పెట్టించారు. ఐటీడీఏ, ఇతర అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరకు సీపీఐ(ఎం) పార్టీని ఆశ్రయించారు. వారి దీనస్థితిని తెలుసుకున్న పార్టీ నాయకత్వ బృందం నవంబర్ 25న ఆ గ్రామాన్ని సందర్శించింది. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కానీ, నిర్లక్ష్యానికి రోల్‌మోడల్‌గా మారిన అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. పోరాటం తప్ప మరో మార్గం లేదని భావించిన గ్రామస్తులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఎర్రజెండా అండతో ఊరంతా కదిలి పోరు దారి పట్టింది.
ఫిబ్రవరి 6న 'ఆదివాసీ జల్, సడక్ ఆందోళన యాత్ర' పేరిట ఇంటికి తాళం వేసి పిల్లాపాపలతో కదనరంగంలోకి దిగారు. నడవలేని వృద్దులు, గర్బిణీలు మినహా మిగితా అందరూ గ్రామం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కాలినడకన పాదయాత్ర చేపట్టారు. చంకన బిడ్డ, చేతిలో ఎర్రజెండా, భుజాన సంచి, గుండెలో ధైర్యంతో సాధించాలనే సంకల్పంతో ముందుకు కదిలారు. అడవి గుండా పాలకులారా లజ్జామాంట్, అధికారులారా లజ్జామాంట్ (లజ్జమాంట్ అంటే గోండి భాషలో సిగ్గుపడండి) అంటూ దారి పొడవునా నినాదాలు చేస్తూ నడక సాగించారు. వసతి కోసం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లులేకపోవడంతో దారి మద్యలో రాత్రిపూట ఓ ఆలయం ఆవరణలో సేదతీరారు. ఉదయం లేచింది మొదలు మళ్లీ నడక ప్రారంభించి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నారు. వీరి యాత్రకు పార్టీ పట్టణ, రూరల్ కమిటీలు ఘన స్వాగతం పలికాయి. మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆ గ్రామస్తులు ఏడు రోజుల పాటు రిలే నిరహార దీక్షలకు దిగారు. మొదటి రోజే అధికారులు వచ్చి ఉత్త్తుత్తి హామీలు ఇచ్చి విరమింపజేసే ప్రయత్నం చేసినా అధికారుల అసలు రంగు తెలిసిన ఆ ఆదివాసీలు ససేమిరా అన్నారు.
దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన దేశాభివద్ధికి సూచిక. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లకు నోచుకోని గ్రామాలు ఇంకా ఉన్నాయంటే దేశం అభివృద్ధి సాధించిందని ఎలా చెప్పగలం? 75ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలు ఇంకా ఈ గూడేనికి చేరలేదు. ఇదే విషయం పట్టణవాసులనూ ఆలోచన చేసేలా చేసింది. ఆదివాసుల న్యాయమైన పోరాటానికి అండగా నిలిచేలా చేసింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న నేటి తరుణంలో తాగడానికి నీరు.. నడిచేందుకు దారి లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజమని తెలుసుకున్న పట్టణవాసులు అమాయక ఆదివాసుల న్యాయమైన పోరాటానికి సంఘీ భావం తెలుపడమే కాకుండా భోజనం పెట్టారు. సరుకులు అందించారు. వీరి పిల్లలకు పండ్లు, చెప్పులు కొనిచ్చారు. వారిని ఒడిలో ఎత్తుకొని లాలించారు. ప్రభుత్వ అధికారులు, పాలకులు స్పందించి వీరి సమస్య పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు, వైద్యులు, పాత్రికేయులు, పౌరులు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. వీరి సమస్యను వెలుగులోకి తెచ్చి అండగా నిలబడిన సీపీఐ(ఎం)పార్టీని అభినందించారు.
గ్రామస్తులు పట్టు విడవకుండా చేసిన పోరాటం పాతాల గంగను పైకి తీసుకొచ్చేలా చేసింది. ఐటీడీఏ, పంచాయతీరాజ్ నిధులతో మూడు బోర్లు వేశారు. వాటికి మోటార్లు బిగించి పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేపట్టారు. ఇన్నాండ్లు మొరాయించిన మిషన్‌భగీరథ నీళ్లు ఇండ్ల వరకు చేరాయి. గ్రామంలో అంతర్గతరోడ్ల నిర్మాణానికి రూ.4.30లక్షలు మంజూరుచేశారు. పాఠశాలకు రెగ్యూలర్ ఉపాధ్యాయుడిని నియమించారు. పిప్పిరి నుంచి కుండిషేకుగూడ వరకు 7కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇదంతా చూసి గ్రామ యువకుడు భీంరావు ''మా తాతలు, తండ్రుల కాలంలో ఊరిలో తాగునీరు, రోడ్డు చూడలేదు. ఈ పోరాటం కారణంగానే ఏండ్లను కలను నెరవేర్చుకున్నాం''ని సంబరపడుతూ చెప్పాడు. తరాలు మారినా తీరని దాహం తొమ్మిది రోజుల పోరాటం తీర్చిందని పేర్కొన్నాడు. ఈ గ్రామ సమస్యపై గత నాలుగు నెలలుగా పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు నిర్వహించింది. గ్రామంలో 15 మంది యువకులతో ఒక అగ్జలరీ యూనిట్ వేసింది. సస్టేండ్ కార్యక్రమాలు నిర్వహించి, అంతిమంగా పాదయాత్రకు సిద్ధం చేసింది. ఫలితం వచ్చేవరకు పోరాడింది. పాదయాత్ర విజయవంతం, రిలే నిరహార దీక్షల పోరాటాన్ని సమన్వయం చేయడం, సరుకులు సేకరణ, రోజువారీ కార్యాచరణ రూపొందిం చడం, అధికారులతో రాయబారాలు నడపడం కోసం వేసిన కమిటీలు చాలా ఉత్సాహంగా పనిచేసి విజయవంతం చేశాయి. తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దీక్షా శిబిరంలోనే పార్టీ పోరుబడి ఏర్పాటుచేసి పాఠాలు చెప్పింది. పార్టీ మహిళా కార్యకర్తలు ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు అక్షరాలు నేర్పించారు. ఇలా ఒక్క ఊరి పోరాటమే అయినా పార్టీ యావత్తు కష్టించి పనిచేసింది. ఈ పోరాటం పార్టీ కార్యకర్తలందరి లో నూతన ఉత్సాహాన్ని నింపింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం, సమస్యను గుర్తించడం, పరిష్కారమయ్యేంత వరకు పోరాడితే ఇలాంటి విజయాలు సాధించవచ్చు. ఈ పోరాటం పార్టీ జిల్లా ఉద్యమంలో ఒక మైలు రాయిగా మిగిలిపోతుంది.
- డి. మల్లేష్
సెల్:8500700333