Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల గురించి ఈ మధ్య కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. ''చంపుతున్న అసమానతలు'' అన్న పేరుతో ఆక్స్‌ఫామ్ ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన పది మంది సంపద కరోనా మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు మధ్య కాలంలో రెట్టింపు కాగా, ప్రపంచ జనాభాలో 99శాతం ఆదాయాలు అదే కాలంలో తగ్గిపోయాయి. ప్రపంచ జనాభాలో 0.027శాతం మంది దగ్గర (అంటే సుమారు 21 లక్షల 60 వేల మంది) 2020 నాటికి 45 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ఇది మన దేశ జీడీపీ కన్నా 15 రెట్లు ఎక్కువ.
మానవ జాతి చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ప్రస్తుత ఆర్థిక అసమానతలు ఉన్నాయని మంత్లీ రివ్యూ (ఫిబ్రవరి 12) పేర్కొంది. ఇదేమీ అసంబద్ధమైనది కాదు. అన్ని సామాజిక వ్యవస్థలలోనూ ఉత్పత్తి జరగడం అవసరం. ఉత్పత్తి చేసేవాళ్ళు జీవనం కొనసాగించడానికి వారికి కనీసమైన పోషణ అయినా కల్పించాలి. ఆ పోషణ కడు పేదలకు కూడా కల్పించాలి, వారి శ్రమ ఉత్పాదకత ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా సరే. ఇది గత సామాజిక వ్యవస్థలకూ వర్తిస్తుంది. అదే సమయంలో సమాజంలోని ఆర్థిక మిగులులో అదనపు విలువ వాటా పెరుగుతూ ఉంటుంది. మానవ శ్రమ చేసే ఉత్పత్తి యొక్క విలువకి, ఆ ఉత్పత్తి చేసే కార్మికులకు ఇచ్చే వేతనాల విలువకి మధ్య ఉండే తేడాయే అదనపు విలువ.
ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందుతూన్నందువలన కార్మికుల ఉత్పాదకత కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అందువలన అదనపు విలువ కూడా పెరిగిపోతూ ఉంటుంది. పెట్టుబడిదారీ విధానంలోనే ఉత్పత్తి శక్తులు అత్యధిక స్థాయి అభివృద్ధి సాధించాయి. కాబట్టి అదనపు విలువలో పెట్టుబడిదారులకు దక్కే వాటా కూడా ఇదివరకటి సమాజాలు వేటిలోనూ లేనంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
అయితే ఈ వాదనను వ్యతిరేకించేవారు ఈ విధంగా అంటారు... ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందితే ఆ ఉత్పత్తిలో పాల్గొనే కార్మికుల నిజ.వేతనాల రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి అదనపు విలువ రేటు పెరగాలన్న నియమం ఏదీ లేదు. అలాగే ఆర్థిక అసమానతలు కూడా పెరగాలని లేదు. అందుచేత పెట్టుబడిదారీ సమాజం అంతకు పూర్వ సమాజాలలో కన్నా అసమానతలను పెంచుతుందని చెప్పలేం. -ఇదీ వారి వాదన.
కాని పెట్టుబడిదారీ విధానాన్ని ప్రపంచం మొత్తం మీద పరిశీలిస్తే... అది పేద దేశాల్లో ఉన్న పరిశ్రమలు మూతబడేటట్లు చేస్తోంది. దాని ఫలితంగా భారీగా నిరుద్యోగం (రిజర్వు కార్మికులు) పెరుగుతోంది. దాని వలన కనీస వేతనాల స్థాయి బాగా తక్కువగా ఉంటోంది. కార్మిక ఉత్పాదకత స్థాయి పెరుగుతున్నా, కనీస వేతన స్థాయి ఆ మేరకు పెరగడం లేదు. అందుచేత ఉత్పత్తిలో అదనపు విలువ వాటాలో పెట్టుబడిదారులకు దక్కే వాటా అత్యధి కంగా, గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంటుంది.
అయితే, మూడు దశాబ్దాల క్రితం మానవజాతి చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో అసమానతలు ఉన్న సమాజాలు ఉండేవి. నేనిక్కడ సోవియట్ యూనియన్ గురించి, తక్కిన సోషలిస్టు దేశాల గురించి ప్రస్తావిస్తున్నాను. ఆ దేశాల్లో సోషలిజం పడిపోయిన తరవాత, వాటి గురించి మాట్లాడేవారు వాటికి, తక్కిన పెట్టుబడిదారీ దేశాలకు పెద్ద తేడా ఏదీ లేదని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే, పెట్టుబడిదారీ దేశాల్లో అదనపు విలువ వాటా పెట్టుబడిదారులకు దక్కితే, ఆ సోషలిస్టు దేశాల్లో అది అక్కడి పాలక వర్గ నాయకులకు దక్కేది అన్నట్టు చెప్తూంటారు. ఆ విధంగా సోషలిజానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి వీలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూంటారు. ఇది సైద్ధాంతికంగా ఒక నీతిమాలిన వ్యవహారం. అంతే కాక, అది వాస్తవ విరుద్ధం కూడా. నిజానికి ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న తేడా ఊహకందనంత ఎక్కువగా ఉంటుంది.
సోషలిజం తూర్పు యూరప్‌లో ఉన్న కాలంలో యుగోస్లావియాలో ఆర్థిక అసమానతలు పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉండేవని యుగోస్లావియాకు చెందిన ఆర్థిక వేత్త బ్రాంకో మిలనోవిచ్ తెలియజేసినదాన్ని ఆక్స్‌ఫామ్ నివేదిక ఉటంకించింది. అదే అమెరికాతో పోల్చితే ఈ తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఆర్థిక అసమానతలు తక్కువగా యుగోస్లావియాలో ఆ కాలంలో ఉండడానికి మూడు కారణాలున్నాయని మిలనోవిచ్ చెప్పాడు. ప్రయివేటు ఆస్తిని, ముఖ్యంగా భూస్వాముల ఆస్తిని స్వాధీనపరచుకుని దానిని రైతుల మధ్య పంపిణీ చేశారు. ఇది బోల్షివిక్ విప్లవం అనంతరం రష్యాలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అదే మాదిరిగా తూర్పు యూరప్ దేశాలలో జరిగింది. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందంచడం రెండో కారణం అని మిలనోవిచ్ చెప్పాడు. ప్రతీ విద్యార్థికీ ఉచితంగా చదువు అందడంతోబాటు చదువుకోడానికి స్టైపెండ్ కూడా ఇచ్చేవారు. ప్రయివేటు కాలేజీలు, ప్రయివేటు విశ్వ విద్యాలయాలు లేనందువలన అందరికీ ఒకే విధమైన చదువు అందేది. అభివృద్ధి చెందడానికి అందరికీ ఒకే విధమైన అవకాశాలు ఉండేవి. సంపన్న కుటుంబాల నుండి వచ్చిన కొందరు విద్యార్థులకు తక్కిన వారికన్నా మెరుగైన చదువు పొందే అవకాశాలు లేవు. ఇక అందరికీ ఉపాధి గ్యారంటీ చేయడం మూడో కారణం. నిరుద్యోగులు అనేవారు లేనందున పెట్టుబడిదారీ సమాజాల్లో ఉన్నట్టు రిజర్వు సైన్యం లేకుండా పోయింది.
అయితే సోషలిజంలో సమానత్వం ఎక్కువగా ఉండడానికి కేవలం ఈ మూడు విధానాలు మాత్రమే కారణం కాదు. సోషలిస్టు సమాజం నడిచే తీరులోనే అసమానతలు పెరగకుండా నిరోధించే విధానం ఇమిడివుంది. అందరికీ ఉపాధి గ్యారంటీ చేయడం అనేది సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నడకను పెట్టుబడిదారీ సమాజానికి పూర్తి భిన్నంగా ఉండేలా చేస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం రిజర్వు సైన్యంగా ఉండటం వలన కార్మికులు తమ తమ యజమానులతో వేతనాల కోసం బేరమాడే శక్తి తగ్గిపోతుంది. నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉంటే ఈ బేరమాడే శక్తి అంతగా తగ్గిపోతుంది.
ఉత్పత్తిలో కార్మికులకు వేరుగా, యజమానులకు వేరుగా వాటాలను పంచడం వలన పెట్టుబడిదారీ విధానంలో అధికోత్పత్తి సంక్షోభాలు వస్తాయి. కార్మికుల వాస్తవ వేతనాలను వారి ఉత్పాదకతతో భాగిస్తే వారి వాటా ఎంతో నిర్థారణ అవుతుంది. ఉదాహరణకు, కార్మికుల వాటా 50శాతం అనుకుందాం. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తి స్థాయిలో 100 అయితే, కార్మికుల వాటా 50, పెట్టుబడిదారుల వాటా 50 అవుతుంది. కార్మికులు తమ వాటాగా వచ్చిన దానిని పూర్తిగా వినిమయం కోసం ఖర్చు చేస్తారు. అదే పెట్టుబడిదారులు తమ వాటాను పూర్తిగా వినిమయం కోసం ఖర్చు చేయలేరు. కొద్ది భాగం వినిమయం కోసం ఖర్చు చేసి, తక్కినదానిని పెట్టుబడిగా పెడతారు. ఈ మారు వారు పెట్టుబడి పెట్టేది 40 అని అనుకుంటే కార్మికుల వాటా కూడా (మొత్తంలో సగం గనుక) 40 అవుతుంది. మొత్తం మీద ఉత్పత్తి సామర్ధ్యం 100 లో ఈ మారు 80 మాత్రమే ఉత్పత్తి అవుతుంది. పర్యవసానంగా 20శాతం కార్మికులకు పని ఉండదు. అప్పటికే నిరుద్యోగులుగా ఉన్నవారితో బాటు మరో 20శాతం అదనంగా నిరుద్యోగులుగా తయారౌతారు.
అదే సోషలిజంలో ఉత్పత్తి పూర్తి సామర్థ్యం మేరకు జరుగుతుంది. ఒకవేళ నిర్వాహకులు, కొందరు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో తమ ఆదాయాన్ని వినియోగించకపోయినా, ఉత్పత్తి 100శాతం మేరకు జరుగుతుంది. మార్కెట్లో వినిమయం కాకుండా కొన్ని సరుకులు గనుక ఉండిపోతే, ఆ మేరకు మొత్తం సరుకుల ధరలు తగ్గుతాయి. దానివలన కార్మికులు మరింత ఎక్కువ వినయోగించగలుగుతారు. ఆవిధంగా కార్మికుల వాటా పెరుగుతుంది.
సరుకుల కొనుగోలు తగ్గినందువలన పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం పెరుగుతుంది. అదే సోషలిస్టు సమాజంలో ఉద్యోగం అందరికీ గ్యారంటీ చేయబడింది కనుక పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. సరుకుల ధరలు తగ్గి, ఆ మేరకు కార్మికుల వాటా పెరుగుతూ ఉంటుంది. అందువలన సోషలిస్టు సమాజంలో ఎప్పుడూ డిమాండ్ పడిపోవడం అనేది ఉండదు. పైగా ఉత్పత్తి అయిన సంపదలో కార్మికుల వాటా నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అయినా ఇంకా మిగులు ఉంటే అది ప్రభుత్వానికే వస్తుంది తప్ప ఏ ప్రయివేటు వ్యక్తికీ చెందదు. కనుక ఆదాయాల్లో అసమానతలు పెరిగిపోవడమన్న ప్రసక్తే ఉండదు.
సోషలిస్టు సమాజంలో అధికోత్పత్తి సమస్య, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల పెరుగుదల అనేవి ఉండవు. చాలా ఎక్కువ స్థాయిలో అసమానతలు ఉన్న సమాజం నుండి సోషలిజానికి మారినందువలన ఆ మార్పు ప్రభావం సమానత్వ సాధన దిశగా చాలా ప్రస్ఫుటంగా కానవస్తుంది. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులైనప్పటికీ, వారి బిడ్డలు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇలా సమానత్వం ఉన్న సమాజంలో సృజనాత్మకత కొరవడుతుందని, అందరికీ సమానత్వం ఉంటే అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రోత్సాహకం ఏదీ ఉండదని కొందరు వాదిస్తుంటారు. ఈ వాదన రెండు విధాలుగా తప్పు. కేవలం ఆర్థిక ప్రయోజనం ఉన్నప్పుడే సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది అని అనుకోవడం వక్రదృష్టి. పెట్టుబడిదారులు తమ లాభాల కోసం సృజనాత్మకంగా వ్యవహరిస్తారన్న ప్రాతిపదిక నుండి ఈ ఆలోచన వస్తుంది. మానవ స్వభావాన్ని బూర్జువా దృక్పధం పరిమితులలోనే చూడడం దీనికి కారణం. ఇక రెండవది: పెట్టుబడిదారీ సమాజంలో భారీ నిరుద్యోగం, అవిద్య, పోషకాహార లేమి, అనారోగ్యం ఉండగా వారందరి లోను నిబిడీకృతమైవున్న సృజనాత్మకతను ఏ విధంగా ఆ సమాజం ఉపయోగించు కోగలదో ఈ బూర్జువా వాదులు వివరించలేరు.
- స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్