Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నల్లగొండజిల్లా తోపుచర్ల పిర్కా పరిధిలో ఉన్న గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం అమరజీవి కామ్రేడ్ చల్లా సీతారామిరెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన ఉద్యోగానికి రాజీనామ చేసి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో తోపుచర్ల పిర్కాలో భాగమైన ఇందుగుల గ్రామంలో ముదిరెడ్డి లింగారెడ్డి ఆయనతో కలిసి పోరాడారు.
నాటి సాయుధ పోరాటానికి వెన్నుదన్నుగా, తోపుచర్ల పిర్కాలోని 16 గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణానికి కామ్రేడ్ ముదిరెడ్డి లింగారెడ్డి గృహమే కేంద్రంగా ఉండేది. అనేక మంది సాయుధ దళాలలో పని చేసిన నాయకులకు తన ఇల్లును, తన ఊరును, ఒక రహస్య కేంద్రంగా ఉంచుతూ రక్షణ కల్పించాడు. లింగారెడ్డి అనేక నిర్బంధాలను, దాడులను ఎదుర్కొని ఉద్యమాన్ని కాపాడుతూ వచ్చాడు. పోరాట అనంతర కాలంలో తోపుచర్ల పిర్కా గ్రామాలన్నీ నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. కాగా మండల వ్యవస్థకు ముందు పంచాయతి సమితి వ్యవస్థ కొనసాగిన కాలంలో ఆ గ్రామాలన్నీ మిర్యాలగూడ పంచాయతీ సమితి పరిధిలో ఉండేవి.
ముఖ్యంగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నంద్యాల శ్రీనివాసరెడ్డి, ఆ తదుపరి 1972 నుంచి ఐదు సార్లు నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన నర్రా రాఘవరెడ్డిలకు కూడా ముదిరెడ్డి లింగారెడ్డి గృహమే ఆ ప్రాంత పార్టీ కార్యకలాపాల కేంద్రం. ఎప్పుడు ఎంత మంది తన ఇంటికి వచ్చినా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆతిథ్యం ఇవ్వటం లింగారెడ్డికి ఓ ఆనవాయితీగా మారింది. ఆయన సహచరి ముదిరెడ్డి చంద్రమ్మ నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తల ఆకలి తీర్చడం ఆమె ప్రేమాభిమానాలకు నిదర్శనం.
పార్టీ పట్ల రాజీ లేని నిబద్ధత ఆ కుటుంబానిది
సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పని చేసిన మంత్రాల ఆదిరెడ్డి ఉరఫ్ రంగన్నకు ముదిరెడ్డి లింగారెడ్డి కుటుంబానికి బంధుత్వం ఉంది. మంత్రాల ఆదిరెడ్డి పార్టీలో పని చేయడానికి ముందు మాజీ సైనికుడిగా ఉన్నారు. ఆయన ఒకరోజు తన సోదరుడు మంత్రాల చలపతిరెడ్డితో కలిసి సాయుధ పోరాటం జరుగుతున్న దశలో, ముదిరెడ్డి లింగారెడ్డి ఇంటికి రావడం జరిగింది. వారు తనకు బంధువులు అయినప్పటికీ నాటి పోరాట పరిస్థితుల దృష్ట్యా, మంత్రాల ఆదిరెడ్డి సైన్యంలో పనిచేసిన నేపథ్యం వల్ల, వారి రాకని అనుమానించాడు లింగారెడ్డి. ఇరువురు అన్నదమ్ముల్ని బంధించి మిర్యాలగూడ తాలూకా, తోపుచర్ల పిర్కా పార్టీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న చల్లా సీతారాంరెడ్డికి కబురు చేశాడు. ఈ సందర్భంగా ఆయన, మంత్రాల ఆదిరెడ్డితో సుదీర్ఘంగా పార్టీ విధానం గురించి చర్చించడం జరిగింది. ఆ ప్రభావంతో కమ్యూనిస్టుగా మంత్రాల ఆదిరెడ్డి సాయుధ పోరాటంలో అచ్చంపేట నల్లమల ఏరియా దళ కమాండర్‌గా పని చేయడం జరిగింది.
1975 నాటికి పెద్ద కుమారుడు ముదిరెడ్డి రాంరెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, చిన్న కుమారుడు ముదిరెడ్డి సుధాకర రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. ఇరువురు కుమారులు సీపీఐ(ఎం) పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం ముదిరెడ్డి లింగారెడ్డి కుటుంబం ఎరుగదు. ఆ పరిస్థితుల్లో కూడా తన కుటుంబంలో విద్యాధికులైన ఇద్దరు కుమారులు ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించడం పట్ల ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పెద్ద కుమారుడు ముదిరెడ్డి రాంరెడ్డి తమకున్న వ్యవసాయంలో శాస్త్రీయ మెలుకువలు, నూతన సేద్య విధానాలు ఆ ప్రాంతానికి పరిచయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. చిన్న కుమారుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.
ఇద్దరు కుమారులు విద్యాధికులు అయినప్పటికీ ఉద్యోగాలు లేదా ఇతర వ్యాపకాల ద్వారా ఆర్జన గురించి ముదిరెడ్డి లింగారెడ్డి ఏనాడు తన కుమారులతో ప్రస్తావించిన సందర్భాలు లేవు. తమ భూముల్లో వ్యవసాయం, సాగుకు సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడటం జరిగేది. తనతో బాగా సాన్నిహిత్యం ఉన్న ప్రముఖుడు ఒకరు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారులకు అందిస్తున్న స్వాతంత్ర సమరయోధుల పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోమని సూచించినా ఆయన సున్నితంగా నాకు వద్దని తిరస్కరించారు.
పార్టీకి వెన్నుదన్నుగా అభివృద్ధి కార్యక్రమాలకి చేయూత...
అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తన ఇందుగుల గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో పార్టీ కార్యాలయం నిర్మించి, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బి.వి.రాఘవులుతో ప్రారంభోత్సవం చేయించారు. తనతో పాటు నగిరె నర్సింహ్మా, మజ్జిగపు లింగారెడ్డి, కట్టా లింగారెడ్డి తదితరులకు సాయుధ పోరాట కాలంలో ప్రేరణగా నిలిచిన అమరజీవి కామ్రేడ్ చల్లా సీతారాంరెడ్డి భవనంగా పార్టీ కార్యాలయానికి నామకరణం చేశారు. అమరుడు ముదిరెడ్డి లింగారెడ్డి నిరక్షరాస్యులే అయినప్పటికీ ప్రజాశక్తి వారపత్రిక చందాదారుడిగా చేరి, స్కూల్ విద్యార్థిగా ఉన్న చిన్న కుమారుడు ముదిరెడ్డి సుధాకరరెడ్డితో (ప్రస్తుత నల్లగొండ జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి) పార్టీ వార్తలు, వ్యాసాలు చదివించుకునేవాడు.
పార్టీజెండా పట్టుకున్న నాటి నుండి చనిపోయే వరకు రాజకీయంగా అనేక నిర్బంధాలు, ఆటుపోట్లు ఎదురైనా తను ఏమాత్రం చలించలేదు. అవకాశవాద రాజకీయాలకు తావు ఇవ్వలేదు. తన ఆశయాన్ని మార్చుకోలేదు. వందేండ్ల తన జీవన యానంలో 74ఏండ్లు శ్రామికవర్గం తరపునే పోరాడి నిలిచారు. కామ్రేడ్ ముదిరెడ్డి లింగారెడ్డి జీవితం శ్రామిక ప్రజలకే అంకితం కాగా, ఆయన భౌతిక కాయం సైతం ప్రజలకే అంకితం అయ్యింది. తన శరీరాన్ని వైద్యుల పరిశోధనల కోసం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందించిన కామ్రేడ్ ముదిరెడ్డి లింగారెడ్డికి విప్లవ జోహార్లు..
(నేడు ఆయన సంస్మరణ సభ సందర్భంగా)
- జే.ఆర్.