Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) ఏప్రిల్ 1వ తేదీ నుండి డిజిటల్ కరెన్సీని ప్రారంభించనున్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అధికారిక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్ర బ్యాంకులలో ఒకటైన, దాదాపు 85ఏండ్ల చరిత్ర కలిగిన ఆర్బీఐ...సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిడిసి) వైపు తన మొదటి అడుగు వేసినట్లయింది. ఈ నేపథ్యంలో, సిబిడిసి అంటే ఏమిటి? దీని ప్రభావం బ్యాంకులపై ఎలా వుండబోతోందనేది చర్చనీయాంశం.
సిబిడిసి అంటే ఏమిటి?
సిబిడిసి అనేది రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపేణా జారీ చేసే చట్టపరమైన డబ్బు. లేదా డబ్బు లాంటి ఆస్తి. ఇది సాంప్రదాయ కరెన్సీలా పని చేసినప్పటికీ దీనికి భౌతిక రూపం ఉండదు. సాంప్రదాయ కరెన్సీ లాగే డిజిటల్ కరెన్సీని వస్తుసేవల కొనుగోలుకు లేదా ఇతర వ్యవహారాలకు ఉపయోగించవచ్చు. సిబిడిసిలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, టోకు మార్కెట్ వ్యవహారాల్లో కేంద్ర బ్యాంక్, వాణిజ్య బ్యాంకుల మధ్య ఆర్థిక లావాదేవీల కోసం రూపొందించబడింది. రెండు, రిటైల్ మార్కెట్ వ్యవహారాల్లో సాధారణ ప్రజల కోసం ఉద్దేశించబడింది. సాంప్రదాయ కరెన్సీతో పోల్చుకుంటే సిబిడిసి సురక్షితంగా నిల్వ చేయడానికి, వ్యాపార వ్యవహారాలు సులభంగా నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఎటువంటి భౌతిక రూపం లేకపోవడం వలన ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలనైనా వేగంగా నిర్వహించేందుకు అవకాశం మెండు. నోట్లు, నాణేలులాగా డిజిటల్ కరెన్సీని ముద్రించవలసిన అవసరం లేదు. దీంతో ముద్రణ వ్యయభారం తగ్గుతుంది. అయితే, పైన చెప్పిన ప్రయోజనాలూ ఎంతవరకు చేకూరు తాయనేది దేశ సాంకేతిక అభివద్ధిపై ఆధారపడి ఉంటుంది.
డిజిటల్ కరెన్సీ ఎందుకంటే...
సిబిడిసి ప్రవేశపెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా మూడు కారణాలు పేర్కొంది. ఒకటి పేపర్ కరెన్సీ వినియోగం తగ్గించి డిజిటల్ కరెన్సీని ప్రాచుర్యంలోకి తీసుకురావడం. రెండు, ప్రయివేట్ డిజిటల్ కరెన్సీల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల అవసరాలను తీర్చడానికి కావాల్సిన సురక్షితమైన మరియు సులభతరమైన డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం. దీనిద్వారా ప్రయివేట్ డిజిటల్ కరెన్సీలైన బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీల వలన తలెత్తే దుష్పరిణామాలను నివారిం చడం. మూడు, ప్రజలు భౌతిక నగదుపై ఆధారపడడం తగ్గించడం ద్వారా చౌకైన, వేగవంతమైన జాతీయ, అంతర్జాతీయ చెల్లింపులు సులభంగా చేపట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు డిజిటల్ కరెన్సీ చెల్లింపులను ప్రోత్సహించ డంతో డిజిటల్ కరెన్సీ ప్రాధాన్యత పెరిగింది.
వాణిజ్య బ్యాంకులుపై సిబిడిసి ప్రభావం
దేశంలో డిజిటల్ కరెన్సీ అమలు వలన భౌతిక రూపంలో ఉన్న సాంప్రదాయ నగదుపై తక్కువ ఆధారపడటం, తక్కువ లావాదేవీ ఖర్చలు, ద్రవ్య విధాన సామర్థ్యం మెరుగుపడటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం... వంటి ప్రధాన ప్రయోజనాలు చేకూరే అవకాశముంది. అయినప్పటికీ, దీని అమలు వలన ప్రధానంగా దేశంలో వాణిజ్య బ్యాంకులకు నష్టం కలిగే అవకాశం ఉంది. డిజిటల్ కరెన్సీని ఉపయోగించడం వలన... బ్యాంకుల పరపతి వ్యవస్థకు మూలమైన, తక్కువ వ్యయంతో కూడిన డిమాండ్ డిపాజిట్లను వాణిజ్య బ్యాంకులు క్రమేణా కోల్పోయే అవకాశం ఉంది. దీంతో వాటి పరపతి సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. ఫలితంగా బాహ్య నిధులతో కూడిన వినియోగ, వ్యాపార లావాదేవీలు గణనీయంగా తగ్గి ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. అదే సమయంలో, బ్యాంకులు గణనీయమైన మొత్తంలో తక్కువ వ్యయంతో కూడిన డిమాండ్ డిపాజిట్లను కోల్పోవడంతో, అవి అందించే రుణ వడ్డీ రేట్లు కూడా పెరిగి పరపతి సష్టి తగ్గిపోవచ్చు.
తొందరపాటు తగదు
కేంద్రీకృత సిబిడిసి అమలు అనేది కొన్ని ప్రధానమైన సమస్యలతో ముడిపడి ఉంది. ఒకటి, వ్యక్తుల సమాచార గోప్యత, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. రెండు, వీటిని మెరుగుపరిచే అధునాతన సాంకేతికతను ఎంచుకోవడం. చివరిగా, సమాచార ఉల్లంఘన వంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి కావాల్సిన బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. సిబిడిసిని ప్రవేశపెట్టే ముందు ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాల్సిన అవరసం ఎంతైనా ఉంది. అందువలనే అమెరికా, బ్రిటన్, చైనా లాంటి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం డిజిటల్ కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా ప్రవేశపెట్టడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికి, కేవలం 29శాతం మంది భారతీయులు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించే పరిజ్ఞానం ఉన్నట్లు, 24శాతం మంది భారతీయులకు మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి 100మందిలో కేవలం 24మందికి మాత్రమే దేశంలో ఆర్థికపరమైన వ్యవహారాలను నిర్వహించే పరిజ్ఞానం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టే ముందు దాని సాధ్యాసాధ్యాలను, లాభనష్టాలను బేరీజు వేసుకొని ఎంతో ఆచితూచి అడుగులు ముందుకు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే 2016లో నోట్లు రద్దు, 2017లో లోపభూయిష్టంగా వస్తు సేవల పన్ను అమలు వంటి తొందరపాటు నిర్ణయాల వలన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో నష్టపోయింది. దేశంలో సిబిడిసి అమలుకు సంబంధించి ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యత, సమాచార ఉల్లంఘన లాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పరుచుకోవడం వంటి ప్రధాన సమస్యలను ముందుగా పరిష్కరించాలి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటయిన భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకుగాను సరైన సమయం సందర్భాన్ని గుర్తించి తదనుగుణంగా విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మొదటగా సిబిడిసిని వాణిజ్య బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంకుకు మధ్య టోకు వ్యవహారాల కోసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలి. తద్వారా దాని అమలులో ఎదురైన లోపాలను సరిచేసుకుంటూ క్రమంగా రిటైల్ మార్కెట్ వ్యవహారాలలో కూడా ప్రవేశపెట్టడం వంటి చర్యల గురించి ఆలోచించాలి. ద్రవ్య నియంత్రణ వ్యవస్థలు, నిబంధనలు పకడ్బందీగా ఉండాలి.
- డాక్టర్ డి. సత్య నారాయణమూర్తి