Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్ - రష్యా వివాదం కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్‌లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్, లుహానస్క్ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు సోమవారంనాడు రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్థిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. అంతకు ముందు వివాదం గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, రష్యా అధినేత పుతిన్ అంగీకరించారని, ఫిబ్రవరి 24న సమావేశం జరగవచ్చని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈలోగా రష్యా దాడి జరపకపోతేనే తాను హాజరవుతానని బైడెన్ షరతు పెట్టారు. బైడెన్‌ను ఒప్పించటానికి పదిహేను నిమిషాలు పడితే పుతిన్‌తో మూడు గంటలు మాట్లాడాల్సి వచ్చిందని మక్రాన్ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటన ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశం జరిగేదీ లేనిదీ చెప్పలేం. తాజా పరిణామాల గురించి చర్చించాలని భద్రతా మండలి సభ్యురాలు మెక్సికో, అమెరికా, ఉక్రెయిన్, ఐదు ఐరోపా దేశాలు భద్రతామండలిని కోరగా సోమవారం రాత్రి అత్యవసర భేటీ జరిగింది. పశ్చిమదేశాలన్నీ రష్యా చర్యను ఖండించగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే దాన్ని రష్యా వీటో చేస్తే జరిగేదేమిటి? తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసుకున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు.
ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూనుకుందని నిర్ధారణగా తాము చెబుతున్నామని కొద్ది వారాలుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు భద్రతామండలి ద్వారా సరికొత్త పల్లవి అందుకుంది. డాన్‌టెస్క్, లుహానస్క్ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని, ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలుబాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014లోనే ఉక్రెయిన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లికులుగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు అదే స్ధితి కొనసాగుతోంది. 2014 బెలారస్ రాజధాని మిన్స్క్ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గతవారంలో ఉక్రెయిన్ మిలిటరీ కాల్పులు జరిపింది, ప్రతిగా తిరుగుబాటుదార్లు కూడా స్పందించారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్ల స్వాతంత్య్ర ప్రకటనను సాంకేతికంగా గుర్తించలేదు తప్ప అనేక అంశాలలో గుర్తింపు దేశాలతో మాదిరే రష్యా వ్యహరిస్తోంది. 2014 మే నెలలో జరిపిన డాన్‌టెస్క్ ప్రజాభిప్రాసేకరణలో 75శాతం మంది పాల్గొనగా 89శాతం స్వయం పాలనకు మద్దతు ఇచ్చారు. 2016 నుంచి డాన్‌టెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ పేరుతో పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు. 2019 జూన్ నుంచి డాన్‌టెస్క్, లుహానస్క్ రిపబ్లిక్కులోని జనాలకు రష్యా తన పాస్‌పోర్టులను జారీ చేయటం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరులక్షల మందికి జారీ చేసింది. మానవతా పూర్వకమైన సాయంగా తామీ పని చేస్తున్నట్లు పేర్కొన్నది. ఈ రెండు రిపబ్లిక్కులలో ఉక్రెయిన్ పాస్‌పోర్టులను గుర్తించటంలేదని అదే ఏడాది ప్రకటించారు. ఉక్రెయిన్ రిజిస్ట్రేషన్ ఉన్న మోటారు వాహనాలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని అక్రమం అని డాన్‌టెస్క్ ప్రకటించింది. 2014లో అధికార భాషలుగా ఉక్రేనియన్, రష్యన్ ఉంటాయని ప్రకటించిన డాన్‌టెస్క్ 2020లో రష్యన్ ఒక్కదాన్నే గుర్తిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పుడు ఈ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఇంతకాలం ఈ రిపబ్లిక్లను ఆక్రమించేందుకు రష్యా పధకం వేసినట్లు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ప్రచారం చేశాయి.
తాజాగా వెల్లడైన సమాచారాన్ని బట్టి నాటో విస్తరణ గురించి ఆ కూటమి దేశాలు గతంలో రష్యాకు ఇచ్చిన వాగ్దానం నుంచి వైదొలిగినట్లు జర్మన్ పత్రిక డెర్ స్పీగెల్ ఒక బ్రిటన్ పత్రాన్ని బయట పెట్టింది. నాటోను విస్తరించబోమని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసిన అంశం గురించి చర్చించినట్లు ఆ పత్రంలో ఉంది. 1991 మార్చి 6న బాన్ పట్టణంలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి చర్చించారు. ''అధికార లేదా అనధికారికంగా కూడా నాటోను తూర్పు వైపు విస్తరించకూడదు'' అని ఐరోపా, కెనడాలతో సంబంధాలు నెరిపే అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి రేమాండ్ సెట్జ్ ప్రకటనను దానిలో ఉటంకించారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న సాధారణ ఒప్పందం ఉనికిలో ఉన్న అంశాన్ని బ్రిటన్ ప్రతినిధి చర్చల్లో ప్రస్తావించినట్లు కూడా ఆ పత్రంలో ఉంది. ''2+4 సంభాషణల్లో నాటోను ఎల్బె నది ఆవలకు విస్తరించకూడదని మనం స్పష్టం చేశాం, కనుక పోలాండ్‌తో సహా ఇతరులెవరికీ నాటో సభ్యం ఇవ్వకూడదని'' నాటి పశ్చిమ జర్మనీ ప్రతినిధి జర్జెన్ హ్రౌబోగ్ అన్నాడు.
డెర్ స్పీగల్ ప్రచురించిన పత్రాన్ని తొలుత అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాషువా షిఫ్రిన్స్‌న్ బ్రిటన్ నేషనల్ ఆర్కైవ్స్‌లో కనుగొన్నాడు. దాని మీద రహస్యం అనే ముద్ర ఉంది, తరువాత దాన్ని బహిర్గతం చేశారు. నాటోను విస్తరించకూడదనే వాగ్దానం లేదని సీనియర్ విధాన నిర్ణేతలు చెప్పవచ్చు కానీ ఈ పత్రం వాస్తవాన్ని చెబుతున్నదని షిఫ్రిన్స్‌న్ పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత నాటో విస్తరణ జరిగింది. ఒక్క అంగుళం మేరకు కూడా తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్ పుతిన్ పత్రికా గోష్టిలో చెప్పారు. అలాంటిదేమీ లేదని, తెరవెనుక ఒప్పందాలేమీ లేవని నాటో సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నాడు. 1999లో పోలాండ్, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యాలోని సెంట్ పీటర్స్బర్గ్ నగరానికి 135 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే ఉద్రిక్తతలకు మూలం.
ఉక్రెయిన్ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్థిక లబ్ది పొందేందుకు అమెరికా పధకం వేసిందనే తర్కం కూడా వినిపిస్తోంది. అక్కడి మిలిటరీ-పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చు. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది అదే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్ధాలు మరొక దేశం వైపు నుంచి లేవు. రేథియాన్ అనే అమెరికన్ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. జనవరి చివరిలో దాని సీఈఓ గ్రెగ్ హేస్ మాట్లాడుతూ ఉక్రెయిన్ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పాడు. అమెరికాకు ఉద్రిక్తతలు కొనసాగినా లాభమే. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది, బాండ్ల రేటు స్థిరపడుతుంది, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి.
తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్ మీద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంలో అది చేసే తీర్మానం లేదా నిర్ణయం గురించి (ఇది రాస్తున్న సమయానికి) ఇంకా తెలియదు. ఏ తీర్మానం చేసినా రష్యా వీటో చేస్తే వీగిపోతుంది. ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఆసక్తికలిగించే అంశం. రష్యా గుర్తింపుతో నిమిత్తం లేకుండానే అంతకు ముందునుంచే డాంటెస్క్, లుహానస్క్ రిపబ్లిక్‌లపై ఉక్రెయిన్ దళాలు దాడులను ప్రారంభించాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ రిపబ్లిక్ల తిరుగుబాటుదార్లకు రష్యా మద్దతు బహిరంగ రహస్యమే. 2015లో కుదిరిన మిన్స్క్ ఒప్పందం ప్రకారం ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్‌లో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉండవచ్చు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. 2008లో రష్యా-.జార్జియా యుద్ధానంతరం జార్జియాలోని అబ్కాజియా, దక్షిణ ఒసెటియా ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా, వెనెజులా, నికరాగువా, సిరియా, నౌరు గుర్తించాయి. ఆ రెండు ప్రాంతాలూ పరస్పరం గుర్తించుకున్నాయి. వాటికి ఇంతవరకు ఐరాస సభ్యత్వం లేదు.
ఐరాసలో చేరాలంటే ఐరాస నిబంధనలను అంగీకరిస్తున్నట్లు సంస్థ సెక్రటరీ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును భద్రతామండలికి నివేదిస్తారు. పదిహేను మంది సభ్యులున్న మండలిలో కనీసం తొమ్మిది మంది దాన్ని ఆమోదించాలి. శాశ్వతసభ్య దేశాలైన చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీకి నివేదిస్తారు. అక్కడ మూడింట రెండువంతుల దేశాలు ఆమోదించాలి. ఆ రోజు నుంచి సభ్యత్వం వస్తుంది. సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అర్హతలను తొమ్మిది మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. సదరు ప్రతినిధిని పంపిన ప్రభుత్వం చట్టబద్దమైనదా కాదా అని ఎవరైనా ప్రశ్నించినపుడు మెజారిటీ ఓటుతో నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో స్వాతం త్య్రం ప్రకటించుకున్న దేశాలన్నీ ఐరాసలో చేరే అవకాశం లేదు. ఐరాసతో నిమిత్తం లేకుండా ఏ దేశమైనా గుర్తించి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు.
డాంటెస్క్, లుహనస్క్ రిపబ్లిక్లను గుర్తించిన వెంటనే రష్యావాటితో స్నేహ ఒప్పందాలు కూడా చేసుకుంది. దాని మేరకు శాంతిపరిరక్షణకు కొన్ని దళాలను పంపింది. ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడి అని పశ్చిమ దేశాలు వర్ణిస్తున్నాయి. రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటిస్తామని చెప్పాయి. తిరుగుబాటు రిపబ్లిక్‌లపై మిలిటరీతో పాటు కిరాయి మూకలను కూడా ఉక్రెయిన్ ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్ పూర్తి స్ధాయి దాడులకు దిగితే ఏం జరుగుతుందన్నది చెప్పలేం.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288