Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా నేత మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు'... అంటుంటారు! ఈ గొడవ భరించలేక కాసేపు అంగీకరిద్దాం. మరి మోడీని ఆశ్రయించిన వారు అవినీతికి దూరంగా లేరని ఎవరైనా నిర్థారించగలరా? అయినా నేతకున్న మచ్చల సంగతి చరిత్ర చెబుతుంది. మనకు మనం స్వంత సర్టిఫికెట్లు ఇచ్చుకోకూడదు. పాలకుడు అవినీతిపరుడుగాకపోతే అది కొంతకాలం పాలక పార్టీకి పెట్టుబడిగా పని చేస్తుంది తప్ప శాశ్వత పాలనకు పాస్ పోర్టు, వీసా కాదు. దేశాన్ని అవినీతి ఊబి నుంచి వెలికి తీసి కడిగిన ముత్యం అన్న పేరు తీసుకువస్తానని 2014లో నరేంద్ర మోడీ చెబితే చాలా మంది నిజమే అనుకున్నారు. తొలిసారి ఎన్నికైనపుడు అన్ని విదేశీ ప్రయాణాలు ఎందుకంటే విదేశీ పెట్టుబడుల కోసం, ప్రపంచంలో పోయిన భారత ప్రతిష్టను పెంచటం కోసమే అన్నారు. నిజమే కామోసనుకున్నారు జనం!
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (టి.ఐ) అనే సంస్ధ ప్రతి ఏటా అవినీతి గోచరత సూచిక పేరుతో ఒక నివేదికను వెల్లడిస్తుంది. దాన్లో ఎగువన ఉన్న దేశాలు ఛాతీ విరుచుకుంటాయి. దిగువన ఉన్నవి సిగ్గుతో తల దించుకుంటాయి. ఎనిమిదేండ్లుగా మోడీ అధికారంలో ఉన్నా ఒక్క ఏడాదంటే ఒక్కసారి కూడా తల ఎత్తుకోలేని పని తీరును కనపరిచారు. ఈ నివేదికను గీటురాయిగా తీసుకుంటే మోడీ ఏలుబడి ప్రపంచంలో మనల్ని తలెత్తుకొనేట్లు చేసిందో, దించుకొనేట్లు ఉంచిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. లేదూ లెక్కలు తప్పు, చూసిన తీరు సరిగా లేదనుకుంటే ఈ సంస్ధ లెక్కలు, చూపుల నుంచి మమ్మల్ని మినహాయించండి అని ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం టి.ఐ.కి రాసి ఉండాల్సింది. అదేమీ జరగలేదు.
2021 టి.ఐ. సూచిక ప్రకారం 180 దేశాల అవినీతి మార్కుల సగటు 43. మన దేశం 40మార్కులతో 85వ స్థానంలో ఉంది. 2014 సూచిక ప్రకారం 38 మార్కులతో 85వ స్థానంలో ఉన్నాం. ఈ అంకెల తరువాత కూడా మచ్చలేని నరేంద్రమోడీని చూసి ప్రపంచం మెచ్చి మేకతోలు కప్పుతుందా? దేశ మచ్చను చూసి నవ్వుకుంటుందా? ఈ వివరాలను మనం మూసిపెట్టుకోవచ్చు, గోడీ మీడియా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు తప్ప ప్రపంచానికి తెరిచిన పుస్తకమే కదా? ఒక్క ఈ సూచికే కాదు, దేన్లో దేశానికి ఎన్డీఏ సర్కార్ పేరు తెచ్చిందో, ఏమి సాధించిందో ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రశ్న అడిగిన వారి మీద వెంటనే బూతుల క్షిపణులు పేలతాయి. గతంలో కాంగ్రెస్ ఏలుబడి గురించి ఇలాగే మాట్లాడారా? దేశ పరువు తీస్తారా? మీరు ఈ దేశంలో పుట్టలేదా ఈ దేశ తిండి తినలేదా అంటారు. వారి సంగతి తరువాత చూద్దాం. ఇలా అడిగేవారు ముందు తాము తింటున్నది ఏమిటో, తిన్నదానికి గాను దేశానికి వారేం చేశారో, పెంచిన పరువు ప్రతిష్టలేమిటో చెప్పాలి..!
ఇక అవినీతి సూచిక సంగతి చూస్తే దాన్లో అధమ స్థానంలో ఉండటం దేశానికి తలవంపులే. టి.ఐ. నివేదిక చెప్పిందేమిటి? ఇదేమీ కాకతాళీయం కాదు. అవినీతి మానవ హక్కుల దుర్వినియోగానికి వీలు కల్పిస్తుంది. దిగజారే ఒక విష వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. హక్కులు, స్వేచ్ఛలు దిగజారతాయి. ప్రజాస్వామ్యం క్షీణించి దాని స్థానంలో నియంతృత్వం చోటుచేసుకుంటుంది. అది ఉన్నత స్ధాయి అవినీతి పెచ్చరిల్లటానికి దోహదం చేస్తుంది. దీనికి సంబంధించి ఆందోళనకరమైన ఉదాహరణలను గత సంవత్సరం ముందుకు తెచ్చింది. మానవ హక్కుల మద్దతుదార్లను హతమార్చటం, మీడియా సంస్ధలను మూసివేయటం నుంచి ప్రభుత్వాల దొంగ కళ్ల కుంభకోణాలైన పెగాసస్ ప్రాజెక్టు వంటి వాటి వరకు వాటిలో ఉన్నాయి.
వ్యవస్థాపరమైన అవినీతి, బలహీనమైన సంస్థలు ఉన్న దేశాల్లోనే కాదు, స్థిరపడిన ప్రజాస్వామిక దేశాలుగా చెబుతున్నవాటిలో కూడా పెరిగిపోతోంది. హక్కులు దిగజారుతున్నాయి, దుర్వినియోగ నియంత్రణ-నిరోధ నిబంధనావళిని కూడా తుంగలో తొక్కుతున్నారు. మానవ హక్కులను గౌరవించటం అవినీతి అదుపునకు తప్పనిసరి. ఎందుకంటే అన్యాయాన్ని సవాలు చేసేందుకు పౌరులకు వీలు కల్పించే సాధికారతను కల్పిస్తుంది. మౌలిక స్వాతంత్య్రాలు, దుర్వినియోగ నియంత్రణ-నిరోధ నిబంధనావళిని అమలు జరిపే చర్యలను అడ్డుకొనేందుకు కరోనా మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా ఒక సాకుగా చూపారు. ''గుర్తు తెలియని డొల్ల కంపెనీలకు స్వస్తి పలకాలని అంతర్జాతీయంగా కదలిక వచ్చినప్పటికీ మిగతావాటితో పోలిస్తే శుద్ధమైన ప్రభుత్వరంగం ఉండి ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలలో కూడా బహుళజాతి అవినీతి కొనసాగుతూనే ఉంది'' అని నివేదిక పేర్కొన్నది. 2012 వరకు అవినీతి మార్కుల ప్రపంచ సగటు 43గానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 దేశాలు తమ మార్కులను గణనీయంగా మెరుగుపరచుకోగా 23చోట్ల అదే విధంగా దిగజారింది. అత్యధిక మార్కులు తెచ్చుకున్న ప్రజాస్వామిక దేశాల్లో అవినీతి నిరోధక ప్రయత్నాలు దిగజారుతున్నాయి. వీటిలోని అనేక దేశాలు విదేశీ అవినీతి, అక్రమార్కులకు సురక్షిత స్వర్గాలుగా ఉన్నాయని కూడా టి.ఐ. నివేదిక చెప్పింది.
దేశంలో అవినీతి, నల్లధనం ఎలా పెరిగిపోతోందో ఏ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిఘా వేసినా రోజుకు ఎంత మంది నుంచి ఎంత నల్లధనం చేతులు మారుతోందో ఎవరైనా తెలుసుకోవచ్చు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో పెద్ద మొత్తంలో రూ.3-4 లక్షల కోట్ల మేరకు నల్లధనం వెలికి తీస్తామని చెప్పిన సర్కార్ నిర్వాకం ఏమిటి? ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్ల విలువ రూ.15.41లక్షల కోట్లు. తిరిగివచ్చిన నోట్ల విలువ మొత్తం రూ.15.31లక్షల కోట్లు. రానిది రూ.పది వేల కోట్లు మాత్రమే. అనేక మందికి నోట్ల రద్దు తెలియక, బయటపెడితే సంసారాల్లో ఎక్కడ తగాదాలు వస్తాయో అని భయపడి బయటకు రాని సొమ్ము అంతకంటే ఎక్కువే ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే దొంగనోట్లు కూడా మోడీ సర్కార్కు ఇచ్చి అసలైన నోట్లు తీసుకున్న పెద్దలున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సహా తమ సర్కార్ వివిధ పద్ధతుల్లో వెలికి తీసిన మొత్తం రూ.1.3లక్షల కోట్లని 2019 ఫిబ్రవరిలో నాటి ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు.
పెద్దనోట్లు రద్దు చేసిన 2016లో 6.32లక్షల నకిలీ నోట్లను పట్టుకున్నారు. తదుపరి నాలుగు సంవత్సరాల్లో 18.87లక్షల కోట్లకు చేరాయి. అంటే దొంగనోట్లు అచ్చు వేసే ముఠాలు తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత పట్టుబడిన దొంగనోట్లలో వంద విలువగలవి ఎక్కువ ఉన్నాయి. తరువాత పట్టుబడిన వాటిలో కొత్త రెండు వందలు, ఐదు వందల విలువగల నోట్లు గణనీయంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఇప్పటికీ నగదే నడుస్తోంది. 2021 అక్టోబరు 29న రూ.29.17 లక్షల కోట్ల నగదు చెలామణి ఉండగా 2016లో రూ.16.4 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బిఐ సమాచారం వెల్లడించింది. న.మో భక్తులు ఏమంటారో మరి.
- సత్య