Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యంగా ఇప్పటి వరకూ పనిచేశాయి. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వ రంగం కొంతమేరకు విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వ రంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే మోడీ ప్రభుత్వం విస్మరిస్తోంది. పైగా పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలంటూ ప్రభుత్వం వారికి సాగిలపడుతోంది. దేశంలో 1991 నుంచి ప్రపంచీకరణ విధానాల అమలుతో ప్రయివేటు రంగం పుంజుకోవడం, రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలకు వ్యతిరేక దిశగా పాలన సాగించడం, ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రయివేటును ప్రోత్సహించడం జరిగింది. పెట్టుబడిదార్ల వద్ద పోగుపడ్డ సంపదను నియంత్రణ చేయలేని ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం, సాంకేతిక పరిజ్ఞానం కోసం, వాణిజ్య లోటు చెల్లింపుల కోసం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుండి అవి విధించిన షరతులను అంగీకరించి పెద్ద ఎత్తున రుణం తీసుకోవాల్సి వచ్చింది. వ్యవస్థీకృత సర్దుబాట్లతో మొదలైన ఈ లొంగుబాటు క్రమంగా లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, మార్కెటైజేషన్ ఆ క్రమంలో వచ్చిన గ్లోబలైజేషన్ పేర ఆర్థికరంగంపై రుద్దబడింది. పర్యావ సానంగా వనరులను ప్రజల నుండి లాక్కుని కార్పొరేట్లకు అప్పగించే ఫెసిలిటేటరుగా మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చడానికి సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలకు భారత పాలకులు ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయారు. దేశ స్వావలంబనను సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టి ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తొలి ప్రధాని మన తెలుగువాడైన పివి నరసింహారావు కావడం సిగ్గుపడాల్సిన విషయం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలకు, బహుళజాతి సంస్థలకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పగించిన వారిలో ప్రథములు పివినే. ఆ తర్వాత సుదీర్ఘ కాలం ప్రపంచబ్యాంకులో పనిచేసి ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహించిన మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల ముంగిట్లో పడేశారు. ఆ తర్వాత ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం 1998 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ప్రభుత్వ సంస్థల అమ్మకం కోసం ఒక మంత్రిత్వశాఖనే ఏర్పరిచి ఆ శాఖద్వారా లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను విక్రయించడం మొదలు పెట్టారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రయివేటీకరణనే అనుసరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మరింత దూకుడుగా పెట్టుబడిదార్లు, బహుళజాతి సంస్థలకు ఉపయోగపడే విధానాల ద్వారా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. మోడీ రెండవసారి అధికారం చేపట్టాక ప్రభుత్వ ఆర్థిక విధానాలలో పూర్తిగా ప్రజావ్యతిరేక కార్పొరేట్, ఆశ్రిత పెట్టుబడి అనుకూల ఆర్థిక విధానాలు ప్రజలపై బలవంతంగా రుద్దబడుతున్నాయి. కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్ల క్విడ్ ప్రోకో ఆట యధేచ్చగా సాగిపోతోంది. ఈ ఆటకు ఎలాంటి దాపరికం లేకుండా అన్నీ అమ్మివేయడమే మా విధానమంటూ పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు? అన్న ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు. ప్రయివేటీక రించాలనుకున్నాం అదే చేస్తున్నామంటూ ప్రభుత్వ ఉద్ద్యేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. సమస్త ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంట్ లోపలా, వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. గత రెండున్నర మాసాలుగా వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణ దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఎయిర్ ఇండియాను కూడా టాటా సంస్థలకు అప్పగించింది.
బిపిసిఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, ఐడిబిఐ బ్యాంక్, బిఇఎంఎల్ తదితర సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధమైంది. జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో ఐపివోను కూడా తీసుకొస్తుంది. పారిశ్రామిక రంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని, ఖనిజ తవ్వకం సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. రైతును భూమి నుండి తరిమేసి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్రలు చేస్తున్న సర్కారు... ఉద్యోగ, కార్మిక వర్గాలను బజారుకీడ్చే కుతంత్రాన్ని కూడా కార్మిక చట్టాల సవరణ ద్వారా మరింత వేగవంతం చేసింది. ఇక ప్రభుత్వ రంగమన్నదే లేకుండా పోతే ప్రజా సంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్య, వైద్య రంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లు, బస్సులతో పాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలను కునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతో పాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమ రాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వ రంగమన్నదే లేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా? ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టడం ద్వారా మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే తీవ్ర తప్పిదం చేస్తోందని చెప్పాలి. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు. ఇప్పటి దాకా పీఎస్యూలు సామాజిక న్యాయానికి కూడా ఉపకరణాలుగా వ్యవహరించాయి. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటీకరించడమంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన విధానానికి తూట్లు పొడిచి సామాజిక వివక్షను పునరుద్ధరించడమే అవుతుంది. కాబట్టి ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని తీవ్రతరం చేసే ప్రయివేటీకరణను అనివార్యంగా ప్రతిఘటించాల్సిన చారిత్రక సందర్భం ఇది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడు.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140