Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం వాక్ స్వాతంత్రపు హక్కును, భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తున్నది. పౌరులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా వెల్లడించేందుకు ప్రోత్సాహిస్తున్నది. అందుకు అవసరమైన సమావేశాలు, సదస్సులను శాంతియుతంగా నిర్వహించుకొనే వెసులుబాటునిస్తున్నది. సమస్యలను నేరుగా పాలకుల సన్నిధికి తీసుకెళ్ళడానికి, ఐక్యతతో గొంతుకు బలం చేకూర్చడానికి అవసరమైన సంఘాలు, సొసైటీలను స్థాపించుకునే హక్కును ప్రసాదిస్తున్నది ఈ ఆర్టికల్. అయితే రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును మన పాలకులు కాలరాస్తున్నారు. వాస్తవాలను నిర్భయంగా వ్యక్తంచేసే వారిపై నిర్బంధ చర్యలకు పూనుకుంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించుకునే సమావేశాలు, సదస్సులకు అనుమతులను నిరాకరిస్తున్నారు. శాంతియుతంగా చేసే పోరాటాలు, ఉద్యమాలను సైతం అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సెంటిమెంటును రగిలిస్తూ ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా, ప్రాంతేతరులుగా ముద్ర వేస్తున్నారు.
ప్రజల బాగు కోసం, సమాజంలో నెలకొన్న దురాగతాలను రూపుమాపడం కోసం ప్రయత్నిస్తున్న అభ్యుదయవాదులు, చరిత్రకారులు, రచయితలు, జర్నలిస్టులు, రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులు, సెలెబ్రిటీలు తదితరులను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. పరాయి పాలనలో కూడా ఎన్నడూ చూడని కఠిన శిక్షలను అనుభవించేలా చేస్తున్నారు. తమ రాజకీయ లక్ష్యాలకు అడ్డుపడే, తమ కుతంత్రాలను బయటపెట్టి వాస్తవాలను తెలిపే, ప్రజలను చైతన్యం చేసే ప్రగతిశీల శక్తులపై దాడులకు, దౌర్జన్యాలకు, దమనకాండకు పాల్పడుతున్నారు. అబద్ధాల పునాదుల మీద నిర్మిస్తున్న తమ భవంతి ఎక్కడ కుప్పకూలి పోతుందోనని బెంబేలెత్తిపోయి.. అమానవీయ చర్యలకు పూనుకుంటున్నారు. 2013 సంవత్సరంలో ''అంధ విశ్వాసాల వ్యతిరేక బిల్లు'' తీసుకురావడానికి జీవితాంతం వరకు కృషి చేసిన మహారాష్ట్ర యోధుడు, నరేంద్ర దబోల్కర్‌ను ఓంకారేశ్వర్ మందిరం సమీపాన కొంతమంది దుండగులు కాల్చిచంపారు. మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం చేసే క్రమంలో చాంధసవాదులు, మతోన్మాదుల దాష్టీకానికి బలైన హేతువాది ఇతను. అభ్యుదయ రచయిత, సామాజిక ఉద్యమకారుడు గోవింద పన్సారేను 2015లో మార్నింగ్ వాక్‌కి వెళ్ళినపుడు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. పరమతాలను గౌరవించిన శివాజీ అసలు చరిత్రను వివరిస్తూ ఆయన రాసిన పుస్తకాన్ని సహించలేని ఉన్మాదులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. మితవాదుల మతోన్మాద చర్యలను బహిర్గతపరచినందుకు ప్రముఖ కన్నడ పత్రిక సంపాదకులు గౌరీలంకేష్‌ను 2017లో తుపాకి తూటాలతో కడతేర్చిన ఘటన భారత చరిత్రలో ఒక రక్తపు మరక. కన్నడనాట వేళ్ళూనుకొన్న మూఢాచారాలు, సమాజంలోని అసమానతలను ప్రశ్నించిన ఆమెకు పాలకులు ఇచ్చిన బహుమతి హత్య. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు పాల్పడుతున్నారనే నెపంతో ప్రొఫెసర్ సాయిబాబు, వరవరరావు తదితరులను జైలు పాలు చేశారు. స్టాన్ స్వామిని బలితీసుకున్నారు. కర్నాటకకు చెందిన మరో రచయిత, చరిత్రకారుడు ఎం.ఎం కల్బుర్గిని ధార్వాడ్ పట్టణంలోని ఆయన స్వగృహంలో అతి దారుణంగా కాల్చి చంపారు. శిష్యులమని అబద్దమాడి, భార్యను నమ్మించి, లోనికి ప్రవేశించి, తుపాకీ గుళ్ళు కురిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ పట్టణంలోని ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి అనేకమంది చిన్నారులు చనిపోతున్న సందర్భంలో, తన సొంత డబ్బులతో ఆక్సిజన్ కొనుగోలు చేసి, కొంతమంది ప్రాణాలైనా కాపాడగలిగిన పిల్లల డాక్టర్ కఫిల్ఖాన్ను అరెస్టు చేశారు విచిత్రంగా. ప్రభుత్వ తప్పిదాన్ని బయట పెట్టినందుకు ఆయనపై కక్ష గట్టి, మానవత్వానికి ప్రతిఫలంగా నిర్దాక్షిణ్యంగా ఖైదు చేసి, చిత్రహింసలు పెట్టారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన బెంగళూరుకు చెందిన విద్యార్థిని, పర్యావరణ ఉద్యమకారిణి దిశారవిని టూల్‌కిట్ వ్యవహారంలో అన్యాయంగా అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా మేధావులు ఆమెకు అండగా నిలవడం, చివరికి ఆమె నిర్దోషిత్వం తేలడంతో వదిలిపెట్టక తప్పలేదు. యూపీలోని హత్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటనను కవర్ చేసేందుకు ఢిల్లీ నుండి యూపీకి వెళ్ళిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌ను పోలీసులు అరెస్టు చేసి, దేశ ద్రోహిగా పేర్కొంటూ మధుర జైలుకు తరలించారు. మొన్న టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఓటమి చెందడంతో సహించలేని కొంతమంది టీమిండియా క్రికెటర్లపై ట్రోలింగ్ మొదలెట్టారు. ఫేస్ బౌలర్ షమీని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టారు. మతపరమైన దూషణలకు దిగారు. ఈ క్రమంలో అతనికి అండగా నిలిచిన విరాట్ కోహ్లీపై నీచమైన కామెంట్లు చేశారు. కోహ్లీ భార్య అనుష్కశర్మను అసభ్యకరంగా దూషించారు. కూతురైన చిన్నారి బాలిక వామికపై అత్యాచారానికి పాల్పడతామంటూ అసాంఘిక కామెంట్లు పెట్టారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమందిపై హింస కొనసాగుతోంది. ప్రశ్నించే వారిపై తూటాలు పేలుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించి గొంతులు నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒరిజినల్ చిత్రాలను అసభ్యకరంగా మార్పింగ్చేసి, వైరల్ చేస్తున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా నీచమైన చర్యలకు ఒడిగడుతున్నారు. ప్రజాబాహుళ్యం సంఘటితం అయ్యే సూచనలు కనబడినప్పుడల్లా వారి మధ్య చిచ్చు పెట్టి విభజన రేఖలు గీస్తూ, ఉద్యమాలను నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రజలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే పరిగణిస్తూ, సంక్షేమ పథకాల నెపంతో మభ్యపెడుతూ గంపగుత్తగా ఓటు బ్యాంకును సష్టించుకుంటున్నారు. గోరంత ప్రయోజనం చేసినా దానికి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. పాలకులుగా నిర్వర్తించాల్సిన కనీస బాధ్యతలను కూడా తమ దయాదాక్షిణ్యాలుగా చూపుతున్నారు. సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకొస్తూ, ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించే తత్వం, పోరాడే బలం పెరగకుండా అస్తిత్వ వాదాలాను రెచ్చగొడుతూ, పెయిడ్ పోరాటాలను ప్రోత్సాహిస్తూ ప్రజాస్వామ్య హననానికి ఒడిగడుతున్నారు. ప్రజలను చిన్న చిన్న సమూహాలకు కుదించి వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా నిర్విరామంగా.. వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయాలని చూస్తున్నా, సంఘటిత శక్తులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నా.. అదే స్థాయిలో నిరసనలు కూడా పెల్లుబుకుతున్నాయి. ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రగతిశీల శక్తుల ప్రయత్నాలతో పోరాటాలు ఐక్యతను సంతరించుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతు ఉద్యమ విజయమే దీనికి ఉదాహరణ. పాలకుల నియంతృత్వాన్ని ఎదురొడ్డి నిలిచి గెలిచిన ఈ రైతు ఉద్యమం భారత పోరాట చరిత్రలో చిరస్మరణీయం. ఈ పోరాట విజయ స్ఫూర్తితో ప్రజలు హక్కుల రక్షణకై ఉద్యమించాలి. ఐక్యపోరాటాలను నిర్మించాలి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సంరక్షించుకోవాలి.
- వరగంటి అశోక్
సెల్:9493001171