Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా టెస్ట్‌లో భాగంగా అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జ్వరమేమైనా వచ్చిందా? శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందీ? అనేది థర్మల్ స్క్రీనింగ్‌లో తేలిపోతుంది. థర్మా మీటర్ అయినా తెలియజేస్తుంది. అలాగే ఈ దేశానికి ఒక ఒక 'బాబామీటర్' అత్యవసరంగా కావాలి! ఏమిటీ ఈ బాబామీటర్ గూర్చి ఎప్పుడూ వినలేదేమని అనుకోవద్దు. ఈ కరోనా వైరస్‌నే కాదు, వైజ్ఞానిక స్పృహ గల వాళ్ళంతా కలిసి మానవాళికి 'హ్యూమన్ వాల్యూ వాక్సిన్' కూడా ఇవ్వాలి. దీన్ని ముందుగా దేశంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవారితో మొదలు పెట్టాలి. ఆ తర్వాత దేశంలోని బాబాల పేరుతో, స్వాముల పేరుతో, యోగుల పేరుతో, ఫాదర్ల పేరుతో, ముల్లాల పేరుతో మౌఢ్యాలను ప్రచారం చేస్తున్న వారికి ఇవ్వాలి. సమాజంలో పెత్తందార్లకు తరువాత వరుసలో ఇస్తూ రావాలి. చివరికి ఎలాగూ సామాన్య పౌరులకు, పిల్లలకూ ఇవ్వాలి. దీని ఫలితం ఏమొస్తుందంటే, దైవాన్ని అడ్డంపెట్టుకుని వ్యాపారాలు చేసే మోసగాళ్ళంతా మంచి వాళ్ళవుతారు. తాము దైవాంశ సంభూతులమని ప్రచారం చేసుకోకుండా బుద్ధిగా ఉంటారు. ఒడ్డూ పొడుగులతో గొప్ప ఆరోగ్యవంతులుగా కనిపించినంత మాత్రాన వారు ఆరోగ్యవంతులు కారు. మానసికంగా ఎంత దిగజారి ఉంటున్నారో, ఎంతటి మనోవైకల్యాలతో ఉంటున్నారో మనం చూస్తున్నాం. పైగా అత్యున్నత పదవుల్లో ఉండి జనాన్ని ఎలా కాల్చుకుతింటున్నారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలంటే వెంటనే మనకు 'బాబా మీటర్' కావాలి!
ఇంతకీ ఆ బాబామీటర్ యేం తెలియజేస్తుందీ? - అంటే ఆ ప్రాంతంలో ఎందరు బాబాలున్నారు? అందులో ఈ సదరు వ్యక్తి ఎంతమందిని నమ్ముతున్నాడు? ఎందరి కాళ్ళమీద పడ్డాడు? ఏఏ విషయాల్లో బాబాలకు సహాయ సహకారాలందిస్తున్నాడు - అనేది 'బాబా మీటర్' నమోదు చేస్తుంది. పెద్దగా చదువుకోని వారు, నల్లడబ్బు కూడాబెట్టు కున్నవారు, అక్రమంగా భూములు ఆక్రమించుకున్న వారు, అత్యాచారాలూ, హత్యలూ చేసిన అనుభవమున్నవారు మాత్రమే ఈ పవిత్ర భారతావనిలో బాబాలుగా, ప్రవచనకారులుగా అవతారమెత్తుతున్నారు. దాదాపు అదే ప్రవృత్తిగల పౌరులు వారికి భక్తులుగా, అనుచరులుగా మారుతున్నారు. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉంది. (బాబా మీటర్ అనే దాన్ని ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. అలాగే 'హ్యూమన్ వాల్యూవాక్సిన్' కూడా బయటికి రాలేదు. కానీ, వెంటనే వీటిని కనిపెట్టాల్సిన తరుణం వచ్చింది.)
ఒకప్పుడు కాషాయం ధరించే వారిని సాధువులని, సన్యాసులని, వారు భవ బంధాలని తెంచుకున్న వారని అనుకునేవారు. కోరికలు లేకుండా సర్వసంగ పరిత్యాగులుగా జీవిస్తారని ఒక అభిప్రాయం ఉండేది. వాళ్ళు నిరంతరం దైవ ధ్యానంలో ఉంటూ, ఆకలయినప్పుడు మాత్రమే ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటారనే అభిప్రాయం ఉండేది. వారి పట్ల ప్రజలకు కొంత జాలి మరికొంత సదభిప్రాయమూ ఉండేది. ఎందుకంటే వారు మోసాలు, కుట్రలు తెలియని అమాయకులని ఒకింత మంచి భావనే ఉండేది. క్రమంగా కాలం మారుతూ వచ్చింది. దానితో పాటు సాధు సన్యాసులు, ఆధ్యాత్మిక గురువులు కూడా మారారు. కాషాయం వదలకుండానే అన్ని రకాల ఆగడాలకు పాలు పడుతున్నారు. నేరాలు చేస్తున్నారు. ఈ రోజు వారిని సర్వసంగ పరిత్యాగులనుకుంటే పొరపాటు - వాళ్ళీ రోజు సంసారుల కంటే - అనేక రెట్లు, భోగ భాగ్యాలు అనుభవిస్తున్న నేరగాళ్ళు! కాషాయం ధరిస్తున్న వారిలో మళ్ళీ అనేక రకాల వారున్నారు. భూ కబ్జాలకు పాలుపడుతున్న వారున్నారు. విలాసవంతమైన భవనాల్ని నిర్మించుకుంటున్న వారున్నారు. లైంగిక అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, హత్యలకు పూనుకుంటున్నవారున్నారు. మరి కొందరు దోపిళ్ళు చేస్తూ రౌడీయిజం, గుండాగిరి ప్రదర్శిస్తున్న వారున్నారు. ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పథకాలు రచిస్తున్న వారున్నారు. మేజిక్‌లు, ట్రిక్కులూ చేస్తూ వాటిని తమ మహిమలుగా ప్రచారం చేసుకుంటున్న వారున్నారు. తమ ఆశ్రమాల్ని నల్లధనం గిడ్డంగులుగా మార్చినవారున్నారు.
ఈ విషయంలో వీరికి కింది నుండి పైదాకా రాజకీయ నాయకుల అండదండలు లభిస్తున్నాయి. మత గురువులు, రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. వీరేగాక, బలహీన మనస్కులైన ఉన్నతాధికారులంతా మత గురువుల చుట్టు తిరుగుతున్నారు. అదంతా ఒక బలమైన 'నెట్వర్క్' అయిపోయింది. అందుకే ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని భూములు ఆక్రమించినా, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసినా సమాజంలోని వివిఐపిలంతా వీరిని మహానుభావులుగా ''పవిత్రులు''గా పరిగణిస్తున్నారు. గౌరవిస్తున్నారు. లోపాయకారిగా వారి మధ్య నెలకొని ఉన్న సంబంధ బాంధవ్యాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి బాగోతాలన్నీ సామాన్య జనానికి తెలిసినా... వివిఐపిలు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు ప్రవర్తిస్తుంటారు. అందువల్ల దోషులు మతాధిపతులే కాదు, వారి తప్పిదాల్ని కప్పిపుచ్చుతున్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కూడా!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ సన్యాసుల, యోగుల గోల ఎక్కువైంది. వారంతా రాజకీయంగా ఎదుగుతున్నారు. రాజభోగాలు అనుభవిస్తున్నారు. అందుకే చూడండి. ఈ యోగులు, సన్యాసులంతా శాసనసభల్లో పార్లమెంటులో కనిపిస్తున్నారు. ఒకాయన ఏకంగా ముఖ్యమంత్రి సీటే ఆక్రమించాడు ఉత్తరప్రదేశ్‌లో. ఇక మధ్యప్రదేశ్‌లో నైతే, నలుగురు సహాయ మంత్రులయ్యారు. ఆ నలుగురు సన్యాసులూ నర్మదా నదీ పరిరక్షణ సమితిలో సభ్యులు. ఆయా విషయాలపై వారికున్న పరిజ్ఞానం కాకుండా, వారు కేవలం సాధువులయినందుకే ఆ పదవులు వారిని వరించాయని తెలుస్తోంది. ఇలాంటి హాస్యాస్పదమైన అంశాలు కేవలం మన పవిత్ర భారతావనిలోనే కనిపిస్తాయి. సాధు సన్యాసులకు రాజకీయాలతో, పదవులతో, పరిపాలనతో ఏం పనోనన్నది ఎవరికీ అర్థం కాదు. అంటే మతాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాధికారం చేపడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అంతర్గతంగా మతవ్యాప్తి వారి ఎజెండా అన్నది కూడా అర్థమవుతూనే ఉంది. ఇలా వీరి ప్రభుత్వమే గనక కొనసాగితే, అన్ని చట్టసభల్లో కాషాయ వస్త్రధారులే అగ్రభాగం లేదా సింహభాగం ఆక్రమిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి వారి గురించే ప్రజాకవి వేమన ఎప్పుడో చెప్పిన పద్యాలు.. నేటి ఈ సాధు సన్యాసులకు, బాబాలకు సరిగ్గా సరిపోతాయి. ఒకసారి వెతుక్కుని చదవండి... ఉదాహరణకు ఒకటి, రెండు ఇస్తున్నాను.
కావిబట్ట కట్టి కడు యోగి వలె నుండి
వెలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి
తొడరి తిరుగువాడు దొంగ సన్యాసయా!
విశ్వదాభిరామ వినురవేమ
మనసు నిలుపలేని మాయా విరక్తులు
మనసు పడుదురేల మగువ కొరకు
సంతాపాప పొత్తు సన్యాసి జేరడా?
విశ్వదాభిరామ వినురవేమ
బారెడేసి జడలు భస్మంపు పూతలు
మరుని తోడ మారుమలయ గలరు
ఎప్పుడో కవి వేమన చెప్పింది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం!
భార్యను చంపి, అక్రమంగా ఆదివాసుల భూములు ఆక్రమించిన ఓ క్రిమినల్, తను జగద్గురువునని ప్రచారం చేసుకుంటే... అధికారులు, మంత్రులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పైగా దేశ ప్రధానితో పాటు, కొంతమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా అతణ్ణి ప్రశంసిస్తున్నారే? ఇలాంటి దొంగబాబాలంతా తమకు తాము చేసుకుంటున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వీరేమైనా ఏదైనా ఒక విషయంలో క్వాలిఫికేషన్ ఉన్నవారా? బయాలజీ, స్పేస్ సైన్స్, కామర్స్, ఆస్ట్రానమి, ఫిజిక్స్, హ్యూమానిటీస్, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మెడిసిన్, మేనేజ్మెంట్ ఎందులో వీరికి నైపుణ్యం ఉంది? రీసర్చ్ చేసి ఫలితాలేమైనా పబ్లిష్ చేశారా? ఇండియాలో ఉన్నంత మంది మూర్ఖ సద్గురువులు ప్రపంచంలో మరెక్కడా లేరు. కొందరు తమ సొళ్ళువాగుడుతో, తప్పుడు సమాచారాలతో అనైతిక, అశాస్త్రీయ అంశాలతో యూట్యూబ్ నింపుతున్నారు. గోబెల్స్ కంటే ఎక్కువ బాకా ఊదుకుంటున్నారు. చదువులేని అమాయకులైతే పోనీ అనుకోవచ్చు... కానీ, కొందరు చదువుకున్న మూర్ఖులెందుకు వారికి భజనలు చేస్తున్నట్టూ?
ఆధ్యాత్మికత పేరుతో దొంగ సన్యాసులు, దొంగబాబాలు వారికి మహిమలున్నాయని ప్రచారం చేయించుకోవడమే తప్ప, ఇంత వరకు ఎవరి మహిమలూ రుజువుకాలేదు. దేనికీ ఉపయోగపడలేదు. వారికి వారు పూట గడుపుకోవడానికి తప్ప, ఎందుకూ పనికిరాలేదు. అవన్నీ వృథా! మతం ముసుగులో పవిత్రులమై పోయామని చెప్పుకునే వాళ్ళంతా నేరగాళ్ళే! వారిని అనుసరిస్తున్న వారు కూడా అలాంటి నేర ప్రవృత్తి గలవారే - అందుకే చూడండి.. విచారణలో జాప్యం జరిగినా... చాలామంది దొంగ బాబాలకు శిక్షలు పడుతున్నాయి. ఘరానా బాబా లెందరో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఇటీవల పెరోల్‌పై వచ్చిన డేరా బాబాకు కేంద్ర ప్రభుత్వం 'జడ్' కేటగిరి భద్రత కట్పించింది. నేరగాళ్ళకు భద్రతా?
ఇంతకూ 'బాబా మీటర్' ఏదో పరికరం కాదు. అలాగే, 'హ్యూమన్ వాల్యూవాక్సిన్' - వైజ్ఞానిక పరిశోధనా ఫలితం కాదు. ఇవి హేతువాదం అందించే ఉత్పత్తులు. ఎక్కడా దొరకవు. ఎవరికి వారే ప్రయత్నించి వారి వారి మెదళ్ళలో ఉత్పత్తి చేసుకోవాల్సినవి. 'బాబా మీటర్'తో చెక్ చేయించుకుని, 'హ్యూమన్ వాల్యూవాక్సిన్' వేయించుకుంటే ఏం జరుగుతుందీ అంటే... ఈ భూమి మీద ఉన్న వారందరూ మనుషులే అని తెలుసుకుంటారు. తోటి మనుషుల్ని మనుషులుగా ప్రేమిస్తారు. ఎవరు ఎక్కువా కాదు, ఎవరు తక్కువా కాదు - అని.. అందరూ ఆ మిశ్రమ సంతతిలోంచి వచ్చిన వారమేనన్న విషయం గ్రహిస్తారు. కళ్ళపొరలు తొలగిపోతాయి. అడ్డుగోడలు పగిలిపోతాయి. కొందరిలో గూడుకట్టుకున్న మదం, అహంకారం చెదిరిపోతుంది. కులాల, మతాల, ప్రాంతాల, రంగుభేదాల ఆధిక్యతలు అంతరిస్తాయి. ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ పర్యావరణం అందరి బాధ్యత - అని కళ్ళు తెరుచుకుంటాయి. ఈ ప్రయత్నంలో సనాతన ధర్మాలు అడ్డుపడతాయి. సంప్రదాయాలు, చాదస్తాలు అరిచి గీ పెడతాయి. మనోభావాల్ని దెబ్బతిస్తాయి. వాటన్నిటిని బేఖాతర్ చేస్తూ, ఎదుర్కొని ధైర్యంగా ముందుకు దూసుకు వచ్చిన వారినే... విజయం వరిస్తుంది! ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు మా'నవ'వాద, వైజ్ఞానిక యుగం మనసారా ఆహ్వానిస్తుంది!!
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు