Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రష్యన్ దళాలు రెండవ రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంవైపు కదులుతున్నాయి. రష్యా పోరుకు తాము దళాలను పంపేది లేదని అమెరికా, నాటో ప్రకటించాయి. అందువలన ఏ క్షణంలోనైనా అది పతనం కావచ్చు. తరువాత ఉక్రెయిన్ పాలకులను అదుపులోకి తీసుకుంటారా, మిలిటరీ లొంగిపోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కీవ్ తరువాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ ప్రకటించాడు. తమను ముందుకు నెట్టి నాటో దేశాలు దూరం నుంచి చూస్తున్నాయని జెలెనెస్కీ అన్నాడు. ఇప్పుడు రష్యా వ్యతిరేక యుద్ధ కూటమిని ఏర్పాటు చేయాలని కూడా అన్నాడు. ప్రపంచంలో శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోంది అని అమెరికానుద్దేశించి వాపోయాడు. పరస్పరం ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి రష్యా ముట్టడి, గగనతలంపై అదుపు సాధించిన కారణంగా అమెరికా, ఇతర నాటో దేశాల నుంచి ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందే అవకాశం లేదని, అందువలన అక్కడి మిలిటరీ పోరాడటమో లొంగిపోవటమో జరుగుతుందని సిఐఏ మాజీనేత పెట్రాస్ చెప్పాడు. పోలాండ్ వైపు నుంచి రోడ్డుద్వారా అందే అవకాశాలున్నా ఇప్పుడు పంపేదెవరు?
ఉక్రెయిన్ అస్త్ర సన్యాసం చేస్తేనే చర్చలు జరుపుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ చెప్పాడు. తాము ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడేందుకు నయా నాజీలం కాదని, అక్కడ ఎవరిని పాలకులుగా ఎన్నుకుంటారన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని అన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆక్రమణకు పాల్పడుతుందని, తనలో విలీనం చేసుకుంటుందని ప్రచారం మొదలెట్టాయి. ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా దళాలు వెళ్లటం లేదు, వెళ్లాలనుకోవటం లేదు, కానీ అమెరికా నాటో మిత్రదేశాలను రక్షించుకుంటామని మరోసారి హామీ ఇస్తున్నట్లు జోబైడెన్ స్పష్టంగా చెప్పాడు. ఆంక్షల విధింపు ఆత్మరక్షణ చర్యలేతప్ప తమకు రష్యాతో పోరుసల్పాలని లేదన్నాడు. ఒకరిపై ఒకరు కాల్చుకొనే ప్రపంచ యుద్ధం ఉండదన్నాడు. నాటో కూటమి కూడా అదే చెప్పింది. అమెరికా లోని 52శాతం మంది ఉక్రెయిన్ వివాదంలో అమెరికా స్వల్ప పాత్ర పోషించాలని చెబితే, 20శాతం మంది అది కూడా వద్దని చెప్పినట్లు ఏపీ-ఎన్‌ఓఆర్‌సి సర్వే వెల్లడించింది. ఇరవైఆరుశాతం మంది మాత్రం చురుకైనా పాత్రపోషించాలని చెప్పారు. బహుశా ఈ కారణంగానే జో బైడెన్ జోరు తగ్గించినట్లు చెప్పవచ్చు.
మనది 138 కోట్ల జనాభాగల దేశం. దానికి నరేంద్రమోడీ ప్రధాని. ప్రపంచ నేతగా, విశ్వగురువుగా ఇంటా బయటా ప్రచారం చేసుకుంటున్న స్థితి. మన దేశం ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలని అధికారానికి వచ్చిన రోజు నుంచీ నరేంద్రమోడీ చెబుతున్నారు, తహతహలాడుతున్నారు. తప్పులేదు, మన దేశానికి గౌరవాన్ని పెంచినా, మన ప్రయోజనాలను కాపాడినా సంతోషమే. ఎవరి చాణక్యమైనా, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేది కీలక పరిణామాలు జరిగినప్పుడే కదా! ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన రష్యా-ఉక్రెయిన్ పరిణామాల్లో నరేంద్రమోడీ నాయకత్వం అలాంటి వాటిని ప్రదర్శించిందా? అనేక దేశాల నేతల మాదిరి నరేంద్రమోడీ ఒక్క ప్రకటన కూడా బహిరంగంగా ఎందుకు చేయలేకపోయారు.
సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన ప్రతినిధి దేశ వైఖరిని వెల్లడించారు. ''అన్ని పక్షాలు'' ''పరిస్ధితి దిగజారకుండా'' ''దౌత్యం ద్వారా'' పరిష్కరించుకోవాలనే ధ్వని, పరిధిలోనే మాట్లాడారు. ఇలా తటస్థంగా ఉన్నందుకు రష్యా స్వాగతం పలికింది. జోబైడెను యంత్రాంగం గుర్రుగా ఉంది. ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది. అమెరికా మన సహజ భాగస్వామి అని పదేపదే చెప్పే మోడీ ఐరోపాలో ఇంత జరుగుతుంటే ముందుగానీ, పోరు ప్రారంభమైన తరువాత గానీ (ఇదిరాసిన సమయానికి) వారితో ఎందుకు సంప్రదింపులు జరపలేదన్నది పెద్ద ప్రశ్న. పోరు మొదలైన తరువాత పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడి దాడులను నివారించాలని కోరారు. కానీ, ఆ సమయంలో మరింతగా ఆజ్యం పోయవద్దు అని జోబైడెనుకు ఒక్క ముక్క చెప్పి ఉంటే మోడీ సర్కార్ నిజంగానే తటస్థంగా ఉంది అనేది మరింతగా వెల్లడై ఉండేది. కానీ అది జరగలేదు, అన్నింటా మనకు మద్దతుగా ఉన్న నరేంద్రమోడీ ఈ అంశంలో మనతో మాట్లాడలేదు, ఏమైందో ఏమో పోనీ మనమే ఫోన్ చేద్దామని జోబైడెన్ కూడా అనుకోలేదు.
తీరా దాడులు మొదలైన తరువాత భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని జోబైడెన్ గురువారంనాడు ప్రకటించారు. ఈ వివాదంలో మీ రక్షణ భాగస్వామి భారత్ పూర్తిగా మీ బృంద సభ్యురాలిగా ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌తో సంప్రదింపులు జరపనున్నాం, ఉక్రెయిన్ సంక్షోభాన్ని మేము పూర్తిగా పరిష్కరించలేదు అని బైడెన్ చెప్పాడు. అందువలన నరేంద్రమోడీ నోరు విప్పి తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా విలేకర్లతో మాట్లాడుతూ.. ''ప్రస్తుతం మేము భారత్ నుంచి అన్ని రకాల రాజకీయ సాయం అందించాలని కోరుకుంటున్నాం. మోడీకి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. కౌటిల్యుడు, చాణక్యుడి వంటివారితో దౌత్యంలో భారత్ ఎప్పుడో అర్హత సాధించింది. ఐరోపాలో నాగరికతలేని కొన్నివేల సంవత్సరాలనాడే భారత్‌లో ఈ స్ధితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఇటీవల భారత్ ప్రభావం చూపే ప్రపంచ పాత్రధారిగా ఉంది. మహాభారతంలో మాదిరి మోడీ దౌత్యాన్ని ప్రదర్శించాలి'' అని కూడా చెప్పారు. అదే రాయబారి భారత వైఖరితో తాము తీవ్ర అసంతృప్తి చెందామని కూడా చెప్పాడు. ఇప్పుడు రష్యాదాడుల్లో 50మంది మరణించినట్లు తెలిసింది, అదే వందలు, వేల మంది మరణించి ఉంటే ఏమై ఉండేది అంటూ భారత్ జోక్యం చేసుకోవాలని అన్నాడు. ఇదేదో కేవలం మా రక్షణ కోసమే కాదు, మీ దేశానికి చెందిన పదిహేనువేలమందికి పైగా ఉన్న విద్యార్థుల రక్షణ కూడా ఇమిడి ఉంది అని కూడా అన్నాడు. దీన్ని మొత్తంగా చూస్తే వారి అసంతృప్తి, అమెరికా అంతరంగాన్ని వెల్లడించటమే. భద్రతా మండలిలో భారత వైఖరిని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు అమెరికన్ అధికారి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కూడా దీన్ని నిర్దారించింది. తెరవెనుక అమెరికా మన వైఖరి మీద అసంతృప్తి ప్రకటించుతున్నట్లు వార్తలు వచ్చాయి.
నరేంద్రమోడీ చెప్పినట్టుగా జోబైడెన్ - వ్లదిమిర్ పుతిన్ వింటే సమస్య పరిష్కారం అవుతుందంటూ జాతీయ మీడియాలో కొంత మంది మోడీ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారు. అనేక హిందీ, ఆంగ్ల ఛానళ్లు కూడా అమెరికా మీడియా, లీకువార్తలను నిజమే అని నమ్మి ఇంకే ముంది ప్రపంచయుద్ధం వచ్చేస్తోంది అన్నట్లు వార్తలను ప్రసారం చేశాయి. కానీ మోడీ వైపు నుంచి పోరు ప్రారంభానికి ముందు అలాంటి నివారణ చొరవ మనకు కనిపించదు. ఎక్కడా మన ప్రమేయం, పలుకుబడి కనిపించలేదు. తటస్థం అంటే తప్పును తప్పని కూడా చెప్పకపోవటమా?
ఉక్రెయిన్-రష్యా వివాదంలో మన దేశం తటస్థ వైఖరిని వెల్లడించింది. కానీ అంతర్జాతీయ విషయాల్లో అమెరికాకు లొంగిపోయిన అపఖ్యాతిని మోడీ సర్కార్ మన దేశానికి కలిగించింది. అణుపరీక్షల అంశంలో ఇరాన్ - అమెరికాకు, వామపక్ష వ్యతిరేకత కారణంగా లాటిన్ అమెరికాలో వెనెజులాతో అమెరికాకు పంచాయితీ తలెత్తింది. ఆ రెండు దేశాలూ మనకు మిత్రులే, రెండు చోట్ల నుంచీ మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. కానీ వాటి మీద ఆంక్షలు విధిస్తూ ఎవరూ వాటితో లావాదేవీలు జరుపకూడదని బెదిరించింది. మన నరేంద్రమోడీ సర్కార్ వాటికి భయపడి చమురు కొనుగోలు నిలిపివేసింది. అమెరికాకు లొంగుబాటు తప్ప ఈ అంశాల్లో తటస్థత ఎక్కడుంది. హాంకాంగ్ చైనాలో అంతర్భాగం, అక్కడ ఆందోళనలు దాని అంతర్గత అంశం. పశ్చిమదేశాలు దాన్ని రాజకీయం చేశాయి. వాటితో మనం గొంతు కలపకపోయినా అది వారి అంతర్గత వ్యవహారం అని మన దేశం చెప్పకపోగా ఐరాస మానవహక్కుల సంస్థలో పశ్చిమ దేశాలకు సంతోషం కలిగే విధంగా ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్ అణు అంశంలో రాజీకుదుర్చు కోనున్నాయి. మన దేశం ఏముఖం పెట్టుకొని గతంలో ఇరాన్ ఇచ్చిన రాయితీ ధరలకు తిరిగి చమురు సరఫరా గురించి అడుగుతుంది? ప్రపంచంలో మనం పలుచనకావటం లేదా?
ఉక్రెయిన్-రష్యా వివాదం గత కొద్ది నెలలుగా ముదురుతోంది. ఫిబ్రవరి 16న రష్యా దాడికి దిగనుందని అమెరికా ముందుగానే గడువు ప్రకటించింది. ఉక్రెయిన్‌లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. వారి సంక్షేమం, అవసరమైతే స్వదేశానికి రప్పించటం, దానిలో ఇమిడి ఉన్న సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తగినంత ముందుగా పట్టించుకోని కారణంగా వారితో పాటు వారి కుటుంబాలు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకీ వైఫల్యం అంటే సమాధానం చెప్పేవారు లేరు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా గ్రామాలు నిర్మించింది, లడక్‌లో మరొకటి చేసిందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా ఎందుకు ఉక్రెయిన్‌లో పరిస్థితి, పర్యవసానాల గురించి మనకు సమాచారం ఇవ్వలేదు? మన కేంద్ర భద్రతా అధిపతి అజిత్‌దోవల్‌ను ''జేమ్స్‌బాండ్''గా వర్ణిస్తారు! ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు సలాం చేసి అమెరికా పారిపోవటాన్ని దోవల్ పసిగట్టలేదు. ఇప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సంక్షోభం గురించిన సమాచారం సేకరించలేదా, అసలు పట్టించుకోలేదా? పట్టించుకుంటే ఇప్పుడు విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది కాదు కదా? ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచదేశాలకు ఒక పాఠం నేర్పింది. అదేమంటే అమెరికాను నమ్ముకొని మరొక దేశంతో తగాదా పెట్టుకోకూడదు, నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుంది. దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటామా? అమెరికా తోకపట్టుకు పోతామా?
- ఎం.కె.ఆర్.