Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణనష్టం, నిరుద్యోగంతో పాటు కోవిడ్-19 మహమ్మారి విద్యారంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. రెండు సంవత్సరాల కాలం విద్యా సంస్థలు మూతపడడంతో మిలియన్ల సంఖ్యలో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులనేకమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు విద్యార్థుల మానసిక ఆరోగ్యం అధ్వాన్నంగా తయారవు తుంది. గంటకొక విద్యార్థిని పోగొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యం తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. చివరికి విద్య చాలా మంది విద్యార్థులకు ఒక పార్ట్ టైం వ్యాపకంగా మారింది.
ఇలాంటి కొత్త వాతావరణంలో, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రయివేటీకరించే దిశగా నూతన జాతీయ విద్యా విధానం-2020ని ప్రవేశపెట్టింది. దీని ఫలితంగా త్రిపురలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రయివేటీకరించ బోతుంది. దాదాపు వంద పాఠశాలలను అక్కడున్న కొన్ని ప్రభుత్వేతర సంస్థలు తమ చేతుల్లోకి తీసుకుంటాయి. అదే విధంగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాలను ప్రయివేటీకరించే చర్యలు చేపడుతున్నాయి. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మినహాయిస్తే, దాదాపు అన్ని రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేశాయి.
పార్ట్ టైం విద్య
కరోనా మహమ్మారి వలన పాఠశాలల్లో చదువు మానేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఒత్తిడితో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను పాక్షికంగా పునఃప్రారంభించాయి. కానీ కరోనా మూడో దశ, విద్యా సంస్థలను మళ్ళీ మూసివేసే అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ విద్యా విధానం విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలను కలిగించిన ఫలితంగా అనేక మంది విద్యార్థులకు ఆన్లైన్ గేమ్స్ బాగా అలవాటయ్యాయి. అదే స్థాయిలో సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడం కూడా బాగా పెరిగింది. ఇప్పుడున్న స్థిరమైన ''అభ్యసన నష్టం''(లెర్నింగ్ లాస్) సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుందని, అభ్యసనంలో, మానసిక ఆరోగ్య స్థితిని పొందడంలో, వ్యాక్సినేషన్, మధ్యాహ్న భోజన పథకాలను ఉపయోగించుకోవడంలో విద్యార్థులకు ఇబ్బందు లుంటాయని ''యునిసెఫ్'' పేర్కొంది. విద్యార్థులు అనేక మంది తమ కుటుంబాలు జీవనాధారాలను కోల్పోవడం వల్ల రోజువారీ కూలీలుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చదువుకునే అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు చేశారు.
విద్యకు కేంద్రీకరణ, ప్రయివేటీకరణలు మూల స్తంభాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం విద్య పౌరులకు హక్కుగా కాకుండా సరుకుగా మారింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్లు అభ్యసనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కునే విద్యను అనుసరించడానికి కేంద్ర ప్రభుత్వానికి సహాయపడ్డాయి. ఇలాంటి విద్యకోసం ప్రవేశించే ప్రతీ దశలో భారీగా ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ రోజువారీ కూలీలుగా పనిచేసి జీవనం సాగించే కుటుంబాలకు చెందిన విద్యార్థులు తరగతి గదులపై ఆధారపడి మాత్రమే అభ్యసనం చేస్తారు. పుండు మీద కారం చల్లిన చందంగా ప్రస్తుత యూనియన్ ప్రభుత్వ బడ్జెట్, జాతీయ విద్యా విధానాన్ని సమర్థిస్తూ, ఆన్లైన్ బోధనా విధానానికి ప్రాధాన్యత ఇచ్చింది. భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యలో అభ్యసనం పొందే అవకాశాలు కల్పించే ''డిజిటల్ యూనివర్సిటీ''ని ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో వాగ్దానం చేశారు. ఈ డిజిటల్ అభ్యసనం ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రయివేటీకరణ, కేంద్రీకరణకు ద్వారాలు తెరిచే అవకాశాలు కల్పిస్తుంది. ఇలాంటి విద్యా వ్యవస్థలలో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రవేశించే అవకాశాలు సన్నగిల్లుతాయి.
సమ్మిళిత విద్యా విధానం కోసం యూజీసీ చేస్తున్న ప్రయత్నం, బీవైజేయూ, అన్ అకాడమీ, ట్యుటోపియా లాంటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సాహిస్తుంది. కరోనా మహమ్మారి, వరుస లాక్డౌన్ల కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడినప్పుడు ఎక్కువగా డిజిటల్ విద్యా విధానంలో అభ్యసనం, బోధనలు జరిగాయి. ఆగస్ట్ 2021లో కూడా ''స్కూల్ చిల్డ్రన్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ లెర్నింగ్'' తరపున ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు 15రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే, కేవలం 8శాతం గ్రామీణ, 24శాతం పట్టణ విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారని తెలిపింది. అంటే భారతదేశంలో 3/4 వంతుల మంది పాఠశాల విద్యార్థులు గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఎటువంటి ఆన్లైన్ తరగతుల ద్వారా అభ్యసనానికి అవకాశాలు పొందలేక పోయారు. అత్యంత పేదరికంలో ఉన్న విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేక పోయారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో అందరికీ విద్య కోసం మౌలిక సదుపాయాలను సమకూర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవానికి ఇప్పుడు వారు, విద్యార్థులు అభ్యసన భారాన్ని ఎత్తేసి, ''ఆత్మ నిర్భర్''గా మారాలని కోరుతున్నారు. భారతీయ విద్యార్థులకు భారీగా పాఠశాల మౌలిక సదుపాయాల ద్వారా నూతన బోధనా శిక్షకులను సమకూర్చడమనేది కలగానే మిగిలిపోతుంది. ఒకవైపు చైనా ప్రయివేటు విద్యకు వ్యతిరేకంగా ముందుకు పోతుంటే, మరోవైపు భారతదేశంలో ఆన్లైన్ విద్యా వేదికలు, విద్యా రంగం ప్రయివేటీకరణ, డిజిటల్ విభజన అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు లేదా ఇంటర్నెట్ కనెక్షన్లేని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ డాటా ధరల పెరుగుదలతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
ఎస్ఎఫ్ఐ పత్రిక ''ఇండియన్ రిసెర్చర్'' ప్రకారం దూర విద్య ప్రోగ్రామ్‌ల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. డిజిటల్ అంతరం బాల కార్మిక వ్యవస్థను అనివార్యం చేసింది. డ్రాపౌట్స్ సంఖ్యను పరిశీలిస్తే, అమ్మాయిలు ఎక్కువగా ఇంటి పనిలో పాలుపంచుకుంటున్నారు. కేవలం 20శాతం విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారని అనేక పరిశోధనా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 37శాతం గ్రామీణ విద్యార్థులు రోజువారీ చదువులకు పూర్తిగా దూరమయ్యారని మరొక సర్వే తెలిపింది. వారిలో చాలా మంది అక్షరాలు, అంకెలు కూడా రాయలేని స్థితిలో ఉన్నారు.
ఇప్పుడు విద్యలో మౌలిక సదుపాయాల గణనీయమైన మెరుగుదల అత్యావశ్యకం కానీ, మోడీ ప్రభుత్వం విద్యా రంగంపై చేసే వ్యయాన్ని 6శాతం తగ్గించింది. రాష్ట్రాలలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది, అయినా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను అలక్ష్యం చేస్తున్నారు. 30 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేయాలని జాతీయ విద్యా విధానం సూచిస్తుంది. కానీ భారతదేశంలో 38శాతం గ్రామాలు 500కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో స్కూల్లు మూసివేసి, ఇలాంటి రెండు, మూడు స్కూళ్ళను విలీనం చేస్తారు. ఇది డ్రాపౌట్స్ (ముఖ్యంగా బాలికలు) సంఖ్యను పెంచడం తప్ప మరొకటి కాదు.
గుడ్డు ఏమైంది?
దేశమంతా ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే ఆలోచిస్తున్నది. ఈ రాష్ట్రంలో ఐదుఏండ్ల లోపున్న ప్రతీ వెయ్యి మంది పిల్లల్లో 60 మంది చనిపోతున్నారు. భారతదేశంలో పిల్లల మరణాల రేటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని పిల్లల మరణాల రేటుకు సమానంగా ఉందని ప్రపంచబ్యాంకు నివేదిక పేర్కొంది. ఇలాంటి సమయంలో, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉండేవి. కానీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన సేవల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య విధానాలను (పీపీపీ) ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుత బడ్జెట్లో ఇంత ముఖ్యమైన రంగానికి చాలా తక్కువ నిధులు కేటాయించారు. ఒకవేళ పీపీపీ విధానం అమలు జరిగితే 'ఇస్కాన్', 'ఆక్షయపాత్ర' లాంటి సంస్థలే ఆ ఒప్పందాన్ని సొంతం చేసుకుంటాయి. ఈ సంస్థలు శాఖాహారానికి ప్రాధాన్యతనిస్తూ, పిల్లల పౌష్టికాహారాన్ని అలక్ష్యం చేస్తాయి.
ప్రాథమిక విద్యనభ్యసించే ప్రతీ విద్యార్థికి రోజుకు 100గ్రా, ప్రాథమికోన్నత తరగతి విద్యార్థికి రోజుకు 150గ్రా. బియ్యాన్ని కేంద్రం సమకూర్చుతుంది. కానీ అవినీతి కారణంగా విద్యార్థులు, కేటాయించిన రేషన్‌ను అప్పుడప్పుడు మాత్రమే పొందుతున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రాథమిక విద్యనభ్యసించే విద్యార్థికి రోజుకు రూ.4.97పై, ప్రాథమికోన్నత విద్యార్థికి రూ.7.45పై కేటాయిస్తున్నారు. ఇంత కొద్దిపాటి కేటాయింపులతో పౌష్టికాహారాన్ని అందించడం చాలా కష్టమైన పని. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని మత సంస్థలతో కలసి నిర్వహిస్తున్నాయి. అక్కడ విద్యార్థులకు కోడిగుడ్డు, ఇతర మాంసాహారాన్ని అందించడం నిలిపి వేశారు.
విద్యా రుణాలు
విద్యా రంగానికి నిధులు కేటాయించడానికి బదులుగా కేంద్రం విద్యార్థులకు విద్యా రుణాల అవకాశాలు కల్పించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విద్యార్థి క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా తమ ఫీజులను పెంచుకునే ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుంది. నేడు విద్య అనేది ఖర్చుతో కూడుకున్న అంశంగా మారుతుంది. ఈ కరోనా మహమ్మారి సృష్టించిన అననుకూల పరిస్థితుల్లో తమ చదువులను కొనసాగించేందుకు అనేకమంది విద్యార్థులు పార్ట్‌టైంగా రకరకాల పనులు చేస్తున్నారు. పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా వివిధ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి రుణ సౌకర్యాల కల్పన అనేది విద్యార్థులను చిక్కుల్లో పడేయడం తప్ప మరొకటి కాదు. రెండు సంవత్సరాలు విద్యా సంస్థలు ఆఫ్‌లైన్ విద్యా విధానాన్ని నిలిపేసిన తరువాత సంభవించిన సంక్షోభాన్ని నివారించే చర్యలు 2022-23 బడ్జెట్లో ప్రతిబింబిస్తాయని ప్రతీ ఒక్కరూ ఊహించారు. కానీ దానికి బదులుగా నూతన జాతీయ విద్యా విధానం ప్రకారమే కేటాయింపులు జరిగాయి. మొత్తం కేటాయింపుల్లో అతి తక్కువగా 3శాతం అంటే మొత్తం రూ.103 కోట్లు పాఠశాల, ఉన్నత విద్యా శాఖలకు కేటాయించారు. ఇది విద్యారంగంపట్ల బాధ్యత గల ప్రభుత్వాలు చేయతగిందేనా..?
అనువాదం:బోడపట్ల రవీందర్
- మయూఖ్ బిస్వాస్
సెల్: 9848412451