Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా వైఖరిని గమనిస్తే దొంగే దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. ఒక దేశంపై మరో దేశం సైనిక దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరుకానీ, సామ్రాజ్యవాద విస్తరణ కోసం 'నాటో' పేరుతో అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్న అటవీక ఆటను ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తుండటం గమనార్హం. నాటి వార్సా కూటమి నిర్వీర్యమైన తర్వాత నాటోను రద్దుచేయకుండా తన ప్రపంచపోలీస్ పాత్రకు తెరతీసిన అమెరికాకు రష్యా చర్య మింగుడు పడటం లేదు. ఆర్థిక ఆంక్షలతో రష్యాను కోలుకోకుండా చేస్తామన్న జోబైడెన్ బెదిరింపు ఏనుగు పిత్తులాంటిదేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధకాంక్ష, సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేకుండా నాటోను ఎందుకు కొనసాగిస్తున్నట్టో అని వంగ్యంగా అడుగుతున్న వారూ ఉన్నారు. అండగా ఉంటామని చెప్పిన అమెరికా, యూరోపియన్ దేశాలు నేడు ఉక్రెయిన్ను నట్టేట ముంచాయి. రష్యా చర్చలకు సిద్ధమని ప్రకటించడం శుభపరిణామమే అయినా, మానవ హననం ఎవరూ సమర్థించలేనిదే. అయితే తొలి నుంచి వ్యాపార దృక్పథంతో వ్యవహరించే అమెరికా... ఆఫ్ఘనిస్తాన్, క్యూబా, వియత్నాం, ఇరాక్ అనుభవాలను మరిచిపోయినట్టుంది. యుద్ధం మొదలు కాకుండా చూడటంలో ఇటు అమెరికా, అటు నాటో దేశాలు విఫలమవడం పట్ల తటస్థదేశాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడం సాధారణమే అయినా, ఉక్రెయిన్ను సంక్షోభంలోకి నెట్టి దూరం నుంచి చూస్తుండటం అమెరికాకు చెంపపెట్టే. చైనా జోక్యంతో చర్చలకు పుతిన్ ఒకింత తగ్గి సందివ్వడం ఆహ్వానించ తగ్గదే.
-బి.బసవపున్నయ్య