Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పైకి కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే... కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్...' అంటూ పోలీస్ స్టోరీ సినిమాలో గర్జించారు డైలాగ్ కింగ్ సాయికుమార్. అదే తరహాలో ప్రజాస్వామ్యానికి శాసన, న్యాయ, పోలీస్ వ్యవస్థలు మూడు మూల స్థంభాలైతే, అతి ముఖ్యమైన నాలుగో స్థంభమే మీడియా అంటూ గొంతెత్తి చెప్పారు సమాజ హితులు. ఇటీవల అధికార టీఆర్ఎస్కు చెందిన ఒక సీనియర్ ఎంపీ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. 'ఇదేంటి బ్రదర్.. మోడీ పాలనలో అసలెవ్వరికీ విలువ లేదు. ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వరు. వినతిపత్రాలు స్వీకరించరు. పార్లమెంటులో ప్రశ్నలడిగితే మైకులు కట్ చేస్తారు. ఆఖరికి మీడియాకు కూడా విలువనివ్వరు...' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'బీజేపీ పాలనతో పోలిస్తే, కాంగ్రెస్ పాలనే చాలా బెటర్‌గా ఉంది. అప్పుడు పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి పాత్రికేయుల్ని సైతం రానిచ్చేవారు. ఆ సందర్భంగా ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ సభ్యులతో కలిసి జర్నలిస్టులు అనేక విషయాలపై ముచ్చటించేవారు. ఇప్పుడు అసలు వారిని లోపలికే రానివ్వటం లేదు... మీడియాపై బీజేపీ నియంతృత్వం రోజురోజుకీ మరీ ఎక్కువవుతోంది...' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 'బహుశా జర్నలిస్టులు పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి వస్తే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటకు పొక్కుతుందనే భయంతోనే మోడీ సర్కారు ఇలా చేస్తోంది కాబోలు...' అని వ్యాఖ్యానించారు. ఆయన వాక్యం పూర్తికాకముందే ఓ సీనియర్ పాత్రికేయుడు అందుకుని... 'అవును మనం (తెలంగాణలో టీఆర్ఎస్) మీడియా పట్ల, ప్రతిపక్షాల పట్లా ఏ విధంగా వ్యవహరిస్తున్నామో, వాళ్లు (ఢిల్లీలో బీజేపీ)... కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు కదా...' అనేసరికి సదరు సీనియర్ ఎంపీ...'వార్నీ...ఎక్కడికెక్కడికి లింకు పెడుతున్నార్రా బాబూ.. నా మాటలకు విపరీతార్థాలు తీయకండ్రా నాయనా...' అంటూ ముందుకు కదిలారు.
-బి.వి.యన్.పద్మరాజు