Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే'' అని ఓ సినిమాలో పెద్ద జబ్బు వచ్చిన కథా నాయకుడు... ఉన్నన్ని రోజులు బాగా ఉంటానని ఓ సెంటిమెంటల్ పాట మనకు వినిపిస్తాడు. ఈ జగమంత కుటుంబం అన్న కాన్సెప్టు అంటే భావన కొత్తదేమీ కాదు. చాలా ఏండ్లుగా ఉన్నదే. ఎందరో సమతామూర్తులు ఆ మాట ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అదంతా పోయి విగ్రహాలు వచ్చాయి... సమత మాత్రం కానరావడంలేదు. ఒక అనుమానం కలిగింది... అదేమంటే జగమంత కుటుంబం అన్న వ్యక్తులకు ఇప్పుడు కుటుంబం అన్న పదమే భయం కలిగిస్తోంది.
పెద్దాయన ఈమధ్య నోరు విప్పితే చాలు కుటుంబ పాలన దేశానికి చేటు, అవే ఈ దేశాన్ని ఈ స్థితికి తెచ్చాయి అంటూ గగ్గోలు పెడుతూ ఉన్నాడు. సమతా సమతా అంటూ ఒక పక్క అంటూనే మమత అంటే భయపడుతున్నాడు. తమిళ సీ.ఎం కల్లోకి వస్తున్నాడు. ఇంకో ముఖ్యమంత్రి తాను వేసే వేషాలను వీడియోలో చొపించి మజాక్ చేస్తున్నాడు. అయినా పెళ్లికానివాడికి సంసారం విలువ ఏమి తెలుస్తుంది అని యువ నాయకుణ్ణి తమాషా పట్టిస్తున్నారు అతని పరివార సభ్యులు. మీ నాయకుడికి మాత్రం ఏమి తెలుసు అని ఎదురు ప్రశ్నలూ వస్తున్నాయి. మొత్తం మీద కుటుంబ పాలనలు చూసి తనకూ ఒక కుటుంబం ఉంటే బాగుండేది కదా అని ఆయన కుటుంబంలోని సభ్యులే అనుకుంటున్నారు అనిపిస్తుంది. ఎవరి కుటుంబం వారి ఇష్టం. అది చిన్నదైనా, పెద్దదైనా. కుటుంబ పాలన అంటే వద్దనే వాళ్ళు పరివారమంటే అర్థమేమిటో తెలుసుకోవాలి మొదట. పరివారమన్నా కుటుంబమన్నా ఒకటే కదా ఒక అర్థంలో!! ఇప్పటికీ పెళ్ళి పత్రికల్లో సకుటుంబ, సపరివార సమేతంగా రమ్మని ఆహ్వానిస్తున్నారంటే కుటుంబానికి ఎంతో విలువ ఇస్తున్నట్టు తెలిసిపోతుంది.
ఎనభయ్యవ దశకంలోకి పొతే అన్న రామారావు అక్కడ సినిమాలు చేతినిండా ఉన్నా తెలుగు ఆత్మగౌరవమంటూ పార్టీ పెట్టారు. అది మూడు వేషాలు వేసిన దాన వీర శూర కర్ణ కంటే, ఐదు వేషాలు వేసిన శ్రీమద్విరాట పర్వం కంటే పెద్ద హిట్టుగా కనిపించింది రాజకీయాల్లో ఉన్నవాళ్లకు. అప్పుడు ఢిల్లీ పీఠంపై ఉన్న ఇందిరమ్మ భయపడినట్టు కనిపించింది. ఇదే తరహాలో ఆమె కూడా ప్రాంతీయ పార్టీలు దేశానికి హానికరం, దేశ సమగ్రతకు నష్టం ఇలా ఏ పదాలు నోటికొస్తే ఆ పదాలు గంభీరంగా చెబుతూ పోయారు దేశంలో ఎక్కడ మీటింగు జరిగినా. ఆమె ఎందుకిలా అంటున్నారు అని అన్న రామారావు గురించి తెలిసిన వారికి అర్థమైనా ఇతరులకు అర్థం కాలేదు. ఇటు ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల అర్థం చేసుకున్నవారు ఆమ్మో అన్న బాగానే భయపెట్టాడే అని ఆనందపడి పోయారు. ఆయన రాష్ట్రమంతా తిరిగి తన పని తానూ చేసుకుంటూ పోయాడు. ఇంకో పక్క ఇందిరమ్మ ఖర్చులేని ప్రచారం అన్న రామారావు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది
అయినా పరివారమంటే ఏమిటి అధ్యక్షా అని సూటిగా అడుగుతున్నారు. పరివారమనగా కుటుంబం అన్న సమాధానం దొరుకుతోంది. మరి అలాంటప్పుడు పరివారం పాలన అంటే కుటుంబ పాలన దేశ వినాశనానికి దారి తీస్తుంది అనడం మంచిదా అధ్యక్షా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన వినాశనం చాలును అధ్యక్షా ఇక మీదట దేశాన్ని ఒక కుటుంబంగా చేసుకొని భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదంతో ముందుకు పోదాము, నిజమైన కుటుంబ పాలన చూద్దాము అని ఢిల్లీ పీఠాన్ని కదిలించే పని ఇప్పటికే మొదలయింది. క్షణికావేశాలకు లోను చేసి ఒకే కుటుంబంలా ఉన్న ప్రజలను వేరుచేసే ఏ ''పరివారాన్నీ'' ఇక నమ్మము అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.
దేశమంతా ఒక కుటుంబమని ముందే అనుకున్నాం. ఆ కుటుంబానికి మేలు చేస్తున్న జీవిత బీమా, సాధారణ బీమా, ప్రభుత్వరంగ బ్యాంకులు, విశాఖ ఉక్కు ఇలా ఎన్నో సంస్థల్ని దేశమనే కుటుంబం నుండి వేరు చేసి వాటిని తమ మిత్రుల కుటుంబాలకు కట్టపెట్టి వారిని ప్రపంచ కుబేరులుగా చేసి రాజకీయాల కొచ్చేటప్పటికి కుటుంబ పాలన మంచిది కాదు, మంచిది కాదు అని గగ్గోలు పెట్టడం చాలా తమాషా అయిన అంశం. ఎన్నో రైతు కుటుంబాలు రాత్రనకా, పగలనకా ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరమంతా రైతు బిల్లులు వెనక్కి తీసుకోమంటుంటే పట్టించుకోని పరివారం హఠాత్తుగా తమ చాణక్య నీతిని ప్రయోగించి తమ నాయకుడి చేతే రైతులకు క్షమాపణ చెప్పించి బిల్లులు రద్దు చేసుకుంటున్నాము అని ప్రకటించి మూడు రోజులు తిరగకుండానే ఆ బిల్లులు మళ్ళీ తీసుకొస్తామని మరో మంత్రితో చెప్పించడం ఏ పరివారానికి ఏ కుటుంబానికి పనికొచ్చే అంశమో ప్రజలు బాగా దగ్గరనుండి గమనిస్తున్నారు.
హాయిగా ప్రభుత్వ విమానాల్లో, హెలీకాఫ్టర్లలో దేశమంతా తిరిగి పరివార్ పాలన మంచిది కాదు అంటే కుటుంబ పాలన మంచిది కాదు అని నోరు చించుకుని అరవడం భలేగా అనిపిస్తోంది అందరికి. నోట్లరద్దు జరిగినప్పుడు, కరోనా సమయంలో వలస కూలీలు రాలిపోతున్నప్పుడు, ఆక్సిజను దొరకక అమాయక ప్రజలు చనిపోయినప్పుడు, రైతుల ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళంతా నీ కుటుంబ సభ్యులు కాదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నోరు మెదపని నాయకుడు ఇప్పుడు కుటుంబపాలన మంచిది కాదు అని తన రాజకీయ కుటుంబానికి నచ్చేలా, వారు మెచ్చేలా ఉపన్యాసాలు రకరకాల భాషల్లో, వేషాల్లో చెప్పడం వ్యంగ్యంగా చూసినందుకే వేషాల వీడియో వైరల్ అయిపోయింది. దానికి ఆ ముఖ్యమంతి వేషాలే చూపించి తిరుగు వీడియోలు పెట్టొచ్చు కానీ అవి అంత హిట్ కావడం లేదు. ఎప్పుడైనా అసలు సినిమా ఆడినట్టు డబ్బింగు సినిమా ఆడదు. ఇదీ అంతే. మొత్తం మీద ఆ కుటుంబ పాలనలు చేసేటోళ్లే, తండ్రి నుండి అధికారం అందుకున్నోళ్ళే తమనంటే ఊరుకుంటారా, చిన్న చీమనే తనకు నష్టం కలిగితే కుడుతుంది. చీమా చీమా ఎందుకు నీవు కుట్టావంటే అది సమాధానమూ చెబుతుంది. అదే విధంగా దేశమనే కుటుంబం తమ పాలన తమకు కావాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది. పైకి పోయిన గడియారం ముల్లు కిందికి రాక తప్పదు అనుకుంటున్నారు. అది అక్కడే ఉందామన్నా దాన్ని కిందికి దింపే పనిలో ఉన్నారు కూడా.
''మల్లెల దారిలొ మంచు ఎడారిలొ'' అని ఆ పాటలో అన్నట్టు ఎన్నికలప్పుడు సైనికులను దర్శించి వచ్చేవారిని అందరూ ఒకే ప్రశ్న వేస్తున్నారు... కుటుంబమంటే ఏమిటి? అని. జగమంత కుటుంబం కాకపోయినా ఈ దేశాన్నంతా ఒక కుటుంబంగా చూడమం టున్నారు. కొందరికి ఓట్లు వేసే హక్కు లేదంటున్న మీ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోమనీ చెబుతున్నారు. ఒకే కుటుంబంలా ఉన్నవాళ్ళ మధ్య విబేధాలు పెట్టొద్దనీ అంటున్నారు.
- జె. రఘుబాబు
సెల్:9849753298