Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని అవుతారా? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకురాలు అవుతారా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్భవ్ఠాక్రే తమ రాష్ట్ర పాలక నమూనాను జాతీయంగా పెంపొందించాలను కుంటున్నారా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం అవుతారా? బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ వచ్చేదఫా రాష్ట్రపతి అభ్యర్థి అవుతారా లేక ఎన్సీపీ సీనియర్‌నేత శరద్‌పవార్‌కు ఆ అవకాశం దక్కుతుందా? ఇవీ ఇలాంటివే అనేక ప్రశ్నలు వూహాగానాలు మీడియాలో నిరంతరాయంగా సాగుతున్నాయి. రాష్ట్రాల హక్కులపై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ దాడి గురించి కూడా చర్చ వస్తున్నా రాజకీయ కలయికలు పొందికల గురించిన కథనాలే సింహభాగం ఆక్రమి స్తున్నాయి. కేసీఆర్ ఇటీవల ముంబై వెళ్లి ఉద్భవ్ ఠాక్రేతో, శరద్‌పవార్‌తో చర్చలు జరిపి వచ్చాక కథనాలు మరింత పెరిగాయి. వాస్తవానికి ఆ సమావేశం రోజునే సీపీఐ(ఎం) అధికార పత్రిక పీపుల్స్డెమోక్రసీలో రాసిన సంపాదకీయం రాజకీయ పొత్తులు రాష్ట్రాల హక్కుల పోరాటం మధ్య తేడాను సూటిగా పేర్కొంది.(నవతెలంగాణ, ఫిబ్రవరి 22.2.22) కానీ, దానిపై ముంబై సమావేశాన్ని వ్యతిరేకించి నట్టు కొందరు, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటాన్ని బలపర్చినట్టు మరికొందరు మీడియాలో వార్తలిచ్చారు. ఆసమావేశంలో జరిగిందేమిటనే దానిపై మాత్రమే గాక ఆతిథ్యమిచ్చిన శివసేన నాయకులు చెప్పిన మాటలు కూడా పాక్షిక కోణంలోనే వెలువడ్డాయి.
కేసీఆర్ మమత ఆశలు
గతంలో లేనంత తీవ్రంగా కేసీఆర్ బీజేపీ విధానాలపై, ప్రధాని మోడీ తీరుపై విమర్శ చేయడం మంచి పరిణామమే. ఇందుకు కారణాలేమిటనేదానిపై రకరకాల అంచనాలు, అభిప్రాయాలు ఎవరికెన్ని ఉన్నా మతతత్వ రాజకీయాలను ఖండించడం, రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఐక్యంగా పోరాడటం నేటి అవసరం. తెలంగాణను సాధించి అభివృద్ధి చేసినట్టే దేశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు కేసీఆర్ పదేపదే చెబుతున్నారు.. సీపీఐ(ఎం), సీపీఐ జాతీయ నాయకుల తోనూ, ఇతరులతోనూ కూడా చర్చలు జరిపారు. ముంబై పర్యటనకు వెళ్లడానికి ముందు మమతాబెనర్జీ నుంచి ఫోన్వచ్చినట్టు కూడా చెప్పారు. బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటివారితోనూ వివిధ రూపాల్లో సంప్రదింపులు జరిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని సభల్లోనూ పదేపదే ప్రశ్నిస్తూ వారి మద్దతు పొందినట్టు చూపిస్తున్నారు. వీటన్నిటి సారాంశంగా కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో గొప్ప స్పందన వచ్చినట్టు, ఆయన నాయకత్వం వహించాలన్న పిలుపు వస్తున్నట్టు చెబుతున్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడిన మమతా బెనర్జీ వంటివారు తామే ప్రతిపక్ష కూటమిని నిర్మిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటు న్నారు. అంతేగాక బీజేపీకి వ్యతిరేకంగా తనతో కలసి రమ్మంటే సీపీఐ(ఎం), కాంగ్రెస్ అంగీకరించ లేదని కూడా మమత విమర్శించారు. మమత పాలనలో బెంగాల్లో సీపీఐ(ఎం)పై ఎంత తీవ్ర నిర్బంధం సాగుతున్నదీ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వయంగా వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో కాంగ్రెస్ స్థానమేమిటనేది ఆయారాష్ట్రాలలో పరిస్థితినిబట్టి నిర్ణయమవాల్సిందే. బీజేపీని ఎదుర్కొవడం కోసం కాంగ్రెస్‌తో రాజకీయ సంఘటన కట్టే అవకాశంలేదని కూడా సీపీఐ(ఎం) ప్రకటించింది. కాంగ్రెస్ బలహీనపడుతున్న మాట, లౌకికతత్వం కోసం ఖచ్చితంగా నిలవలేకపోతున్న మాట కూడా నిజమైనా బీజేపీ, కాంగ్రెస్‌లను ఒకే విధంగా చూడటానికి లేదనేది వాస్తవం. (కాంగ్రెస్, ప్రాంతీయ పాలకపార్టీల ఆర్థిక విధానాలు బీజేపీకి పెద్ద భిన్నంగా ఉండవనేది కూడా అనుభవం చెపుతున్న సత్యం.)
ముంబై భేటీ, హిందూత్వ, కాంగ్రెస్ స్థానం
కేసీఆర్ ప్రయత్నమంతా తమను దూరంగా పెట్టడానికేనని ఆ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ గురించిన ప్రశ్నలకు ఇది ప్రారంభం మాత్రమేనంటూ కేసీఆర్ సమాధానం దాటేశారు. ఆయన తిరిగివచ్చిన మరుసటిరోజునే శివసేన ప్రధాన ప్రతినిధి ఎంపీ సంజరురౌత్ కాంగ్రెస్ లేకుండా కూటమి గురించి తామెక్కడా మాట్లాడలేదని స్పష్టంగా చెప్పారు. అయితే అందరినీ కలుపుకొని పోగల సత్తా కేసీఆర్‌కు ఉందని సన్నాయి నొక్కులు నొక్కారు. నమస్తే తెలంగాణ పత్రిక ఇందులో కేసీఆర్ సమర్థత గురించిన భాగం మాత్రం ప్రచురించి కాంగ్రెస్ గురించిన ప్రస్తావనలు ఎత్తివేసింది! మరోవంక కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలను గమనంలోకి తీసుకొకుండా కాంగ్రెస్ ఆయనపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. శివసేన విషయానికి వస్తే బీజేపీ కూటమిని మొదట గండి కొట్టింది తామే గనక జాతీయ స్థాయిలోనూ ఉద్భవ్కే పెద్దపీట వేసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఆ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. గతంలో శివసేనను బీజేపీ సహజ నేస్తంగా చెప్పేవారు. మౌలిక సిద్ధాంతాల నుంచి(అంటే అసలైన హిందూత్వ నుంచి) బీజేపీ వైదొలగింది గనకే తాము దూరమైనామని ఉద్భవ్ ఉవాచ. కేసీఆర్‌తో భేటీ సందర్భంలోనూ బీజేపీ అనుసరించేది హిందూత్వం కాదని ఆయన అనడం యాదృచ్చికం కాదు. ముంబై సమావేశానికి ముందు హైదరాబాదులో అంగరంగ వైభోగంగా జరిగిన రామానుజ విగ్రహావిష్కరణ దాదాపు బీజేపీ క్రతువులాగే నడిచింది. మోడీతో సహా హాజరై హిందూత్వ రాజకీయాలు వల్లించి వెళ్లారు. విగ్రహ స్థాపకులైన చినజీయర్ స్వామి మోడీపై ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత స్థాయిలో కేసీఆర్ ప్రధానితో రాష్ట్రపతితో కలసి పాల్గొనకపోయినా వారికన్నా ముందు వెళ్లి వచ్చారు. ఆయన ప్రభుత్వ పూర్తి అండతోనే తాము ఇదంతా చేయగలిగామని చినజీయర్ స్వామి పలుసార్లు చెప్పారు. అంతకు ముందు యాదాద్రి ఉద్ఘాటనకు మోడీని పిలిచి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు కొంత వ్యవధి తీసుకుంటున్నా, ఆహ్వానించే విషయం ఆలోచిస్తామని అంటున్నారే గాని తోసిపుచ్చటంలేదు.
ప్రత్యామ్నాయాలు, విఘాతాలు
ప్రాంతీయ పార్టీల నేతలు చాలామందికి జాతీయ నాయకత్వం, ప్రధాని పదవి గురించిన ఆశలు, వ్యూహాలు ఉండవచ్చు గాని దానికి ప్రాతిపదిక ఏమిటి? యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ, ఐకెగుజ్రాల్ వంటివారి ఉదాహరణలు చెబుతుంటారు. అప్పుడు జనతాదళ్ జాతీయ పార్టీగా ఉండటం, వందకు పైగా స్థానాలు గల కాంగ్రెస్ వామపక్షాలు బలపర్చడం వల్లనే అది సాధ్యపడింది. హరికిషన్‌సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, విపిసింగ్ వంటి హేమాహేమీలు దాని వెనక ఉన్నారు. ఓడిపోయిన ప్రధాని పివి నరసింహారావు కూడా దేవగౌడను బలపర్చారు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు భక్తులు దీనంతటిని విస్మరించి ఆయనే కింగ్ మేకర్ అని పొగిడి పరవశిస్తుంటారు. చంద్రబాబును ఫ్రంట్ కన్వీనర్‌గా ప్రతిపాదించింది సూర్జిత్. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి చంద్రబాబు 1998లో బీజేపీ ఎన్డీఏ వాజ్‌పేయి ప్రభుత్వంవైపు దూకడం చరిత్రలో అతిపెద్ద పిల్లిమొగ్గ. 2009లో వామపక్షాలతో పనిచేసి 2014లో మళ్లీ బీజేపీ కూటమిలో చేరడం, అధికారం పంచుకుని అభాసు పాలు కావడం చెరిగిపోని సత్యాలు. 2019 ఎన్నికలకు ముందు బయిటకు వచ్చి కాంగ్రెస్‌తో చేతులు కలపడం, తెలంగాణలో మాత్రమే పొత్తుపెట్టుకోవడం దారుణమైన ఫలితాలకు కారణమైనాయి. ఆ సమయంలో చంద్రబాబు ప్రధాని కావడం గురించి తెలుగుదేశం నాయకులు వారి అనుకూలమీడియా వండివార్చిన కథనాలు ఇన్నీ అన్నీ కావు. తీరా 2019లో మోడీ తిరిగివచ్చాక బీజేపీపై టీడీపీ పూర్తిగా మౌనం వహిస్తూ దాదాపు అనుకూలత పాటిస్తున్నది. అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో జట్టు కట్టి తిరుగుతున్నది. వీరివురూ కూడా బీజేపీ మార్కు ఆలయాలు మతాల ఎజెండానే మాట్లాడుతున్నారు. ఇక కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమైనారని నిరంతరం ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తను ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాతో సహా అన్నిటిపై గప్చిప్. రాష్ట్ర ప్రజలనూ ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రంపై వత్తిడి తెచ్చి రావలసింది సాధించుకునే బదులు మోడీ సర్కారు వత్తిడికి బెదిరింపులకు తాను లోబడిపోయిన స్థితి. పార్లమెంటులో చాలా వరకూ కేంద్రానికి అనుకూలంగానే ఓటు చేస్తున్నారు. జగన్ కేసీఆర్‌ల సాన్నిహిత్యం గురించి గతంలో వినిపించినా టీఆర్ఎస్ నేతలు ఇటీవల బీజేపీకి ఆయన లొంగిపోవడం గురించి చెబుతున్నారు. తనపై బీజేపీ చేసే మతపరమైన విమర్శలకు జవాబుగా తానూ హిందూత్వలో వెనకబడలేదని చూపించుకోవడానికి జగన్ తంటాలు పడుతుంటారు.
ఏదైనా ఎన్నికల తర్వాతే!
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాలావరకూ బీజేపీకి అనుకూలంగానో తటస్థంగానో ఉంటున్నారు. రాష్ట్రాల హక్కులకోసం జరిగే పోరాటంలో కూడా పెద్దగా గొంతు కలుపుతున్నది లేదు. తమిళనాడు డీఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రల హక్కుల కోసమూ బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడుతుంటారు. ఎస్పీ, ఆర్జేడీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. బిఎస్పి నాయకురాలు మాయావతి ఎస్పిపైనే ఎక్కువగా దాడి ఎక్కుపెడుతూ బీజేపీకి పరోక్షంగా మేలు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కేజ్రీవాల్ బీజేపీతో రాజకీయ ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. బీజేపీ భాగస్వామి నితిశ్‌కుమార్ గురించీ అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. ఆయన గతంలో ఒకసారి ఎన్డీఏకు దూరమై గెలిచిన తర్వాత మళ్లీ జట్టు కట్టిన తీరు మర్చిపోలేము. తాను ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అవుతారనే ప్రస్తుత కథనాలను ఆయన కావాలనే సాగనిస్తున్నారు. వీరందరి మధ్యనా ఎన్నిలక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచరిస్తుంటారు. ఆయన ఎవరికి దూరం ఎవరికి దగ్గర అనేది మరో పెద్ద ప్రహేళిక. బీజేపీని ఓడించడం అసంభవం కాదుగాని కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడం సమస్య అని ఆయన చెబుతుంటారు. కాని కాంగ్రెస్‌లో చేరాలని విఫలయత్నం చేశారు! జాతీయ దృశ్యం ఎంత గజిబిజిగానూ అవకాశవాద పోకడలతోనూ నిండివుందో అర్థం కావడానికి ఈ ఉదాహరణలు చాలు. గతంలో ఎప్పుడైనా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే కేంద్రంలో ఏ సంఘటనలు కూటములైనా ఏర్పడ్డాయి. అప్పుడే ఎవరి కోణంలో కూటముల గురించీ, వాటి నాయకత్వాల గురించీ మాట్లాడటం ప్రచారానికి మాత్రమే పనికివస్తుంది. బీజేపీ బలం పెరగడం, కాంగ్రెస్ బాగా బలహీనపడటం, ప్రాంతీయ పార్టీలకు మరింత ప్రాధాన్యత కొత్త పరిణామాలు కావచ్చు. కానీ మరోవైపున మోడీ నిరంకుశ పోకడలపై మత రాజకీయాలపె ప్రజలౖ నిరసనలు, రైతాంగ ఉద్యమాల వంటివి విజయాలు సాధించడం కూడా చూస్తున్నాం. గతం కన్నా నగంగా కార్పొరేట్ ప్రయివేటీకరణ అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించే ప్రతిఘటన పెంపొందించడమే నేటి తక్షణావసరమవుతుంది. అందులో ఎవరు ఏమేరకు పాలుపంచుకుంటారు, ఎన్నికల పోరాటం ఎలా ఉంటుంది అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే. ఆ క్రమంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా బలీయమైన ప్రభావం చూపించవచ్చు.
- తెలకపల్లి రవి