Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి, ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి'' - నోబెల్ కిరీటాన్ని పొందుతూ సివి రామన్ అన్నమాటలివి. కానీ బట్టీ బాపతు విద్యార్థి లోకం దండిగా పెరుగుతున్న భారతావనిలో అధికంగా ఆందోళనకు గురి చేస్తున్న సమస్య-ప్రశ్నించే తత్వం లేకపోవడం, శాస్త్ర సాంకేతిక స్పృహ ఉండకపోవడం. దీనికి తోడు పరిశోధనలు లేక ప్రగతి మందగమనంలో ప్రయాణిస్తుంది. ''ఆకలి, దారిద్య్రం, నిరక్షరాస్యత నుంచి ఈ దేశాన్ని సైన్స్ ఒకటే కాపాడగలదు'' అంటూ తొలి ప్రధాని నెహ్రూ జాతికి స్ఫూర్తి మంత్రం ఉపదేశించినా ఆచరణలో పెట్టేవారు లేక సామాజిక, మానవాభివృద్ధి జాబితాలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. శాస్త్రీయ భావాలతో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, సరికొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటూ, సమస్య పరిష్కార పటిమను ప్రదర్శిస్తూ, సృజనాత్మకంగా పనులు చేయగల, నిర్ణయాలు తీసుకోగల ప్రతిభ నేటి అవసరం. పాఠశాల దశ నుంచి విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ప్రయోగాలు చేసే చొరవ, వాటిని ప్రోత్సహించే ఉపాధ్యాయ వర్గం, సరైన వాతావరణం ఉన్నప్పుడే ఇలాంటి నైపుణ్య ఉద్యోగులను తయారు చేయగలం. విద్యార్థులను సృజనాత్మక పంథాలోకి ఆకర్షించ డానికి సైన్స్ దినోత్సవ సంబరాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
రామన్ ఎఫెక్ట్‌తో భారత పరిశోధనలకు జీవం
భారత భౌతిక శాస్త్రవేత్త సర్.సి.వి.రామన్ రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న ఫిబ్రవరి 28న ఏటా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1928 ఫిబ్రవరి 28న ఆయన ఈ ఘనతను సాధించగా 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. 1987లో తొలి జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. సైన్సు దినోత్సవంలో భాగంగా పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులు పలురకాల విజ్ఞానశాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించడం, సాంకేతిక అంశాలపై సదస్సుల్లో పాల్గొనడం, పరిశోధన ప్రదర్శనలు, ఉపన్యాసాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటన్నిటి వెనుక ముఖ్య ఉద్దేశం బడిపిల్లల్లో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన ఆలోచనలను రేకెత్తించడమే. 2020 జాతీయ సైన్స్ దినోత్సవం ప్రత్యేక అంశంగా విజ్ఞాన శాస్త్రంలో మహిళలు అనే అంశాన్ని నిర్ణయించారు. 2021సంవత్సరంలో విద్యా నైపుణ్యాలు, పనిపై వాటి ప్రభావం అనే ఇతివృత్తం ఆధారంగా సైన్స్ దినోత్సవం జరపగా 2022లో ''సుస్థిర భవిష్యత్తు కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో సమగ్ర విధానం'' అనే అంశం ప్రాతిపదికన సైన్స్ సంబరాలు జరిగాయి. సి.వి.రామన్ పరిశోధనల స్ఫూర్తితో అణు, అంతరిక్ష పరిజ్ఞానాల్లో భారత్ గొప్ప పురోగతి సాధించింది. ఇస్రో, బెంగళూరు ఐఐఎస్సి, డిఆర్డిఓ, వంటి సంస్థలు శాస్త్రసాంకేతిక రంగంలో వినూత్న పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.
పరిశోధనలు లేక ప్రగతి మందగమనం
భారతీయ విద్యారంగంలో1990 నుంచి సైన్స్ విద్యకు ప్రాధాన్యత తగ్గిపోతూ ఇంజనీరింగ్, ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో గిరాకి పెరగసాగింది. పరిశోధకసత్తా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రధానమైన సైన్స్ కోర్సును వదిలి టెక్నాలజీ కోర్సులు వైపు పరుగులు తీస్తున్నారు. తద్వారా పరిశోధనా రంగంలో భారత్ వెనుకబడిపోయింది. ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ పోటీతత్వం-2021 నివేదికలో భారత్ 43వ స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే ప్రపంచ మేధో హక్కుల సంస్థ ప్రతియేటా వెలువరించే అంతర్జాతీయ మేధోసంపత్తి సూచిక -2021 ప్రకారం భారతదేశం 40వ స్థానంలో ఉంది. యువతరం ఉన్నత స్థాయి పరిశోధనలు చేపట్టడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం, తగిన వనరులు కేటాయించక పోవడం వల్ల ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్ అట్టడుగు స్థానంలో నిలుస్తుంది. అలాగే శాస్త్రీయ దృక్పథానికి ఎర్రతివాచీ పరచాల్సిన విశ్వవిద్యాలయాలు కుల, మత, వర్గ విభేదాలకు, అశాస్త్రీయ పోకడలకు మూల బిందువులుగా మారుతున్నాయి.
ప్రయోగాలతో పాఠాలు నేర్పాలి
మానవ సంక్షేమం కోసం సైన్స్ పరిశోధనలు చేపట్టేలా విద్యార్థులను ప్రేరేపించడం సైన్స్ దినోత్సవం లక్ష్యం. శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగాలే ఊపిరి. ప్రయోగాలు, పరిశోధనల ద్వారా విద్యార్థులు తార్కిక శక్తిని, ఆలోచనా పటిమను పెంపొందించుకొని సైన్స్పట్ల లోతైన అవగాహన ఏర్పరచుకుంటారు. నవయుగానికి అవసరమైన నైపుణ్యాలను శ్రద్ధగా ఉత్సాహంగా నేర్చుకుని రాణించే వాతావరణం విద్యాసంస్థల్లో వెల్లివిరియాలి. ఆ దిశగా ఉపాధ్యాయులు తమ విద్యార్ధులను ప్రోత్సహించాలి. పిల్లల్లో విజ్ఞాన అనురక్తిని రగిలించి, విరివిగా ప్రయోగాలు చేయిస్తే శాస్త్ర సాంకేతిక పరిశోధనల వైపు ఆకర్షితులవుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అవసరమైన నిర్వాహణ నిధులను విడుదల చేస్తూ సరైన ప్రయోగాలను విద్యార్థుల చేత చేయిస్తే బావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయవచ్చు. ఈ క్రమంలో జాతీయ సైన్స్ దినోత్సవం మన విద్యా వ్యవస్థపై పునఃసమీక్షకు, దేశీయ అవసరాలకు తగినట్లుగా మెరుగులు దిద్దుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పించే చక్కని సందర్భం.
- అంకం నరేష్
సెల్: 6301650324