Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వరంగ కంపెనీలతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలను ప్రయివేటు కంపెనీలకు కల్పించాలని నయా ఉదారవాద విధానాలను ఈ దేశంలో ప్రవేశపెడుతున్న సమయంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్, ప్రధాని పి.వి. నరసింహారావులు చెప్పారు. దీనినే 'లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్' అన్నారు. స్వంత లాభాల కోసమే వ్యాపారం చేసే ప్రయివేటు కంపెనీలను... ప్రజా సంక్షేమం కోసం, దేశ ప్రయోజనాల కోసం నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ఒకే గాటన కట్టడం దుర్మార్గం అని ఆనాడే కార్మిక సంఘాలు, వామపక్షాలు విమర్శించాయి. కానీ ఇప్పుడు మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే అవకాశాలను కల్పిస్తూ, ప్రోత్సాహకాలను, రాయితీలను ఇస్తూ, వాటితో పోటీ పడడానికి వీలులేని విధంగా ప్రభుత్వ రంగానికి గోతులు తవ్వుతున్నారు. ఆనాడు చెప్పిన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయినా కల్పించమని ప్రభుత్వరంగ సంస్థలు కోరుతున్నా, అనేక ఆంక్షల తో వాటి మెడలకు గుదిబండలు బిగిస్తున్నారు.
నూరుశాతం ప్రభుత్వ వాటాలు ఉన్న బిఎస్ఎన్ఎల్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష పూరిత వైఖరిని చూస్తే ఇదేదో మన దేశాన్ని దెబ్బ తీయాలనుకునేవాళ్ళు పన్నిన పన్నాగం అనిపిస్తుంది. కాని ఇది మన మోడీ గారి ''ఆత్మ నిర్భరత'' విధానం అన్నది పచ్చి నిజం! తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో టెలికం రంగంలో ఈ ఏడాది 5-జి సేవలను ప్రారంభించ నున్నట్టు ప్రకటించారు. అయితే ఆ సేవలు కేవలం ప్రయివేటు టెలికం కంపెనీల ద్వారా మాత్రమే అందుతాయని కూడా ఆమె తెలియజేశారు. మరి ప్రభుత్వ స్వంత సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మాటేమిటి?
అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు
2014లో మన దేశంలో 4-జి సేవలను ప్రారంభించారు. కాని కేంద్రం 4-జి స్పెక్ట్రంలో బిఎస్ఎన్ఎల్కు ఏ కేటాయింపూ చేయలేదు. ఉద్యోగ సంఘాలు, అధికారుల సంఘాలు దీర్ఘకాలం పాటు ఆందోళన చేశాక 2019 అక్టోబర్‌లో అనుమతి లభించింది.
బిఎస్ఎన్ఎల్ వద్ద 4-జి టెక్నాలజీకి అనువుగా ఉండే బిటిఎస్‌లు (బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్) 49,300 ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయి 4-జి బిటిఎస్లుగా అప్‌గ్రేడ్ చేస్తే దేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4-జి సేవలను అందించగలుగు తుంది. కానీ ఆ విధంగా అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం అనుమతి నిరాకరించింది. దాని వలన ఇప్పటివరకూ బిఎస్ఎన్ఎల్ 4-జి సేవలను ప్రారంభించలేక పోయింది.
ఉన్న బిటిఎస్లను అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు కనుక మార్చి 2020లో బిఎస్ఎన్ఎల్ 50,000 బిటిఎస్లను కొత్తగా కొనుగోలు చేయడానికి గ్లోబల్ టెండర్లను పిలిచింది. నోకియా, ఎరిక్సన్, సామ్సంగ్ వంటి కంపెనీలు మాత్రమే వీటిని సరఫరా చేయగల సామర్థ్యం కలిగివున్నాయి. కానీ, మోడీ ప్రభుత్వం మళ్ళీ అడ్డుపడింది. భారతదేశంలోని అమ్మకందారుల వద్దనుండి మాత్రమే వాటిని కొనుగోలు చేయాలన్న షరతు పెట్టింది. కాని భారతదేశంలో వాటిని సరఫరా చేయగలిగిన కంపెనీలు ఏవీలేవు!
ఇంకోపక్క ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు గ్లోబల్ టెండర్ల ద్వారా వాటికి కావలసిన పరికరాలని కొనుగోలు చేసుకున్నాయి. ఆ కంపెనీల మీద ప్రభుత్వం ఎటువంటి షరతులనూ పెట్టలేదు. ఆ ప్రయివేటు కంపెనీలకు పోటీగా బిఎస్ఎన్ఎల్ రంగంలోకి దిగకుండా ఉండడానికే కేంద్ర ప్రభుత్వం తన స్వంత సంస్థ కాళ్ళు, చేతులు కట్టివేసింది. ఆ సంస్థలన్నీ ఇప్పుడు మొత్తం మార్కెట్‌ను ఆక్రమించు కుని ఉన్నాయి. ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు 4-జి సేవల కోసం కేంద్రం బిఎస్ఎన్ఎల్కు రూ.44,720 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్టు ప్రకటించింది. తక్కిన కంపెనీలన్నీ 5-జి సర్వీసు ఇవ్వడానికి సిద్ధం అవుతూంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 4-జి కోసం ఇప్పుడు ఖర్చు చేయాలన్నమాట!
ఈ వివక్షత ఈనాటిది కాదు
నయా ఉదారవాద విధానాలు ప్రారంభమై నప్పటి నుంచీ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఈ వివక్షను ఎదుర్కుంటూనే ఉంది. మన దేశంలో 1995లో మొబైల్ సేవలను ప్రారంభించారు. అప్పటికి డిఒటి గానే ప్రభుత్వ టెలికం విభాగం ఉండేది. 2000లో బిఎస్ఎన్ఎల్గా ఏర్పడింది. అక్టోబర్ 2002 నాటికి కాని బిఎస్ఎన్ఎల్కు మొబైల్ సేవలను ప్రారంభించేందుకు అనుమతి రాలేదు. ప్రయివేటు సంస్థలు ఏడేండ్లపాటు మార్కెట్‌ను ఆక్రమించుకున్నాకనే బిఎస్ఎన్ఎల్కు అందులో అడుగు పెట్టడానికి అనుమతి ఇచ్చారు.
మొబైల్ పరికరాలను కొనుగోలు చేయడానికి 2012 వరకూ బిఎస్ఎన్ఎల్కు అనుమతి ఏదోవొక సాకుతో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిరాకరిస్తూనే వచ్చింది. ఆ కాలంలోనే దేశంలో మొబైల్ సేవల వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. కాని దాని ప్రయోజనం బిఎస్ఎన్ఎల్ కు కేంద్రం దక్కనివ్వలేదు. దాని పర్యవసానంగా బిఎస్ఎన్ఎల్ నష్టాలలోకి జారిపోయింది. ఇంకా ఆనాటి నష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి.
2010లో 3-జి స్పెక్ట్రం వేలం వేశారు. కాని అందులో పాల్గొని 3-జి సేవలను ప్రారంభించ డానికి బిఎస్ఎన్ఎల్కు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత బిఎస్ఎన్ఎల్కు 3-జి సేవలను ప్రారంభించే అవకాశం ఇచ్చిన ప్పుడు ప్రయివేటు కంపెనీలు ఏ ధర చెల్లించాయో దానితో సమానంగా చెల్లించమని షరతు పెట్టారు. నిజానికి బిఎస్ఎన్ఎల్ స్వంత కంపెనీ గనుక దానినుంచి ఏ విధమైన రుసుమూ వసూలు చేయకూడదు. కాని కేంద్రం వసూలు చేసింది. దానితో బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న మూల ధనంలో రూ.10,000 కోట్లు తరలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ 5-జి సేవల విషయంలో కూడా ప్రయివేటు కంపెనీలకు మాత్రమే అనుమతినిచ్చారు.
కానివాళ్ళకి కంచాల్లో...
'అయినవాళ్ళకి ఆకుల్లో, కానివాళ్ళకి కంచాల్లో' అని మన సామెత ఉంది. అదేమాదిరిగా కేంద్రం బిఎస్‌ఎన్‌ఎల్‌ను తొక్కిపట్టి వుంచడమే కాకుండా, ప్రయివేటు కంపెనీలను మాత్రం ఉదారంగా ఆదుకుంటోంది. ప్రయివేటు టెలికం కంపెనీలు ప్రభుత్వానికి ఇవ్వవలసిన రెవెన్యూ వాటా కింద బకాయిపడిన మొత్తం రూ.1,69,000 కోట్లను చెల్లించాల్సిందేనని 2019 అక్టోబర్ 24న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అందులో వొడాఫోన్ ఐడియా ఒక్కటే రూ.58,254 కోట్లు చెల్లించాలి. ఆ దెబ్బకి వొడాఫోన్ ఐడియా దివాలా తీసే స్థితికి చేరుకుంది. వెంటనే మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ బకాయిలను నాలుగేండ్లపాటు వాయిదా వేసేసింది. ఆ తర్వాత కూడా వాయిదా ల్లో చెల్లించవచ్చునని అనుమతి నిచ్చేసింది. ఆ వాయిదాలను కూడా ఈక్విటీ కింద మార్చు కోవచ్చునని చెప్పింది. అంటే ఆ కంపెనీలో వాటా లను ప్రభుత్వం తీసుకుందన్నమాట. ఇటుపక్క స్వంత కంపెనీకి నిధులు, అనుమతులు, మార్కెట్టు లేకుండా చేసి అటువైపు వొడాఫోన్‌ను ఆదుకోవ డానికి మాత్రం ఎంతవరకైనా సిద్ధపడిపోయింది.
ప్రభుత్వం నుండి ఇలా అనేక రూపాల్లో రాయితీలు పొందుతూ కూడా ఎయిర్టెల్, వొడాఫోన,్ ఐడియా వంటివి ప్రజలను దోపిడీ చేస్తూనే ఉన్నాయి. 2021 నవంబర్ 26 నుండి తమ టారిఫ్‌ను 25శాతం ఒకేసారి పెంచివేశాయి. రిలయన్స్ జియో డిసెండర్ 1, 2021 నుండి తన టారిఫ్‌ను ఏకంగా 20శాతం పెంచింది.
ఎన్ని ఒడిదుడుకులున్నా...
ఇన్ని విధాలుగా కేంద్రం బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఇక్కట్లపాలు చేస్తూన్నా, 2021 డిసెంబర్ నెలలో బిఎస్ఎన్ఎల్ 23లక్షల కొత్త మొబైల్ కస్టమర్లను చేర్చింది. జనవరి 2022లో 25 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చారు. కేంద్రం తన తప్పుడు వైఖరిని విడనాడి, వివక్షను చూపకుండావుంటే బిఎస్ఎన్ఎల్ ఎంత బలంగా టెలికం మార్కెట్లో దూసుకు పోగలదో ఈ వాస్తవాలు వెల్లడి చేస్తు న్నాయి. మోడీ ఆత్మ నిర్భరత ఎంత మోసపూరిత నినాదమో బిఎస్ఎన్ఎల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కుట్రపూరిత వైఖరి వెల్లడి చేస్తోంది. ఈ తరుణంలో దేశ ప్రజ లంతా బిఎస్ఎన్ఎల్కు అండగా నిలబడి, మన జాతీయ టెలికం రంగాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- సుబ్రమణ్యం